బహుశా నేను రోగభ్రమగ్రస్తుడిని కావచ్చు కాబట్టి నాకు ఔషధాలపై గొప్ప నమ్మకం ఉంటోంది. నేను ఒక మాత్రను తీసుకున్నప్పుడల్లా, అది పనిచేస్తుందనే పూర్తి నమ్మకంతోనే తీసుకుంటాను. కానీ ఒక విషయంలో నేను భయకంపితుడినవుతున్నాను. ప్రత్యేకించి భారతదేశంలో తయారవుతున్న అనేక జనరిక్ మందుల విషయంలో నా నమ్మకం ఘోరంగా వమ్ము అయిందని నేను కనుగొన్నాను. వీటిలో చాలావరకు వాస్తవానికి పనిచేయడం లేదు. కొన్ని జనరిక్ మందులైతే ప్రమాదకరంగా ఉంటున్నాయి. వచ్చే వారం ప్రచురించనున్న ‘బాటిల్ ఆఫ్ లైస్: రాన్ బాక్సీ అండ్ ది డార్క్ సైడ్ ఆఫ్ ఇండియన్ ఫార్మా’ అనే పుస్తకం ఇస్తున్న కీలక సందేశం ఇదే. ఈ పుస్తక రచయిత్రి కేథరీన్ ఎబాన్.. ‘అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన దాదాపు 20 వేల డాక్యుమెంట్లు, 240 మందితో నిర్వహించిన ఇంటర్వూ్యలు, భారతదేశంలోని జనరిక్ డ్రగ్స్ పరి శ్రమ ఎంతో వంచనాత్మకంగా, విశ్వాసఘాతుకంతో ఉంటోం దనీ, వోక్‌హార్ట్, డాక్టర్ రెడ్డీస్, గ్లెన్‌మార్క్ అండ్ ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ వంటి బడా సంస్థలు ఉత్పత్తులు తీవ్ర ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయ’ని పేర్కొన్నట్లు దాని కవర్ పేజీ చెబుతోంది.
ఈ పుస్తకం ప్రధాన భాగం ప్రముఖ ఔషధ తయారీ సంస్థ రాన్‌బాక్సీ సిగ్గుమాలిన వ్యవహారంపై చేసిన పరిశోధనతో కూడి ఉంది. అమెరికాలో 2013లో బాగా ప్రాచుర్యం పొందిన ఒక కోర్టు కేసులో కల్తీమందులను అమ్మిన ఏడు ఆరోపణలపై విచారణ సందర్భంగా మన్నించమని కోర్టును వేడుకోవడమే కాకుండా 500 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించిన విషయాన్ని ఇది వెల్లడిస్తోంది. ఔషధాలను అమ్మడానికి ముందుగా రాన్‌బాక్సీ వైఖరి తీరుతెన్నులను రచయిత్రి ఎబాన్ ఇలా ముగించారు – ‘మీరు తయారు చేసిన మందులను సమర్థంగా, మన్నికతో ఉండేలా రూపొందించారా అనే కోణంలో పరీక్షించాల్సి ఉంది. ఈ విషయంపై కంపెనీ ప్రకటించే డేటా తన ఔషధాలు రోగులను చంపడానికి బదులుగా కాపాడతాయన్న వాస్తవాన్ని రుజువు చేయాలి. కానీ రాన్‌బాక్సీ మాత్రం తన డేటాను పూర్తిగా మార్కెటింగ్ సాధనంగా మాత్రమే చూస్తోంది. ఇది చావు బతుకుల మధ్య వ్యత్యాసాన్ని తేల్చేసే సంపూర్ణ వంచన.
ఈ కంపెనీ దాని ఉత్పత్తి ప్రక్రియలోని ప్రతి దశనూ తారుమారు చేసి తనకు ఉపయోగపడే డేటాను శరవేగంగా రూపొందించి మార్కెట్లో విడుదల చేసిపడేసింది. ఒక రాన్‌బాక్సీ మాత్రమే కాదు జనరిక్ మందుల తయారీ సంస్థలన్నీ క్రమబద్దీకరణ చట్టాలు కఠినంగా ఉండే యూరోపియన్, అమెరికన్ మార్కెట్ల కోసం అత్యున్నత నాణ్యత కలిగిన ఔషధాలను తయారు చేస్తూనే మరోవైపున భారత్ వంటి దేశాల్లో తక్కువ స్థాయి కలిగిన, పెద్దగా పనిచేయని మందులను ఉద్దేశపూర్వకంగానే అమ్ముతుంటాయి. ఇలాంటి వ్యవహారాలపై రాన్‌బాక్సీపై తీవ్రంగా దాడి చేసిన దినేష్ ఠాకూర్ ఈ పుస్తక రచయిత్రి కేథరిన్ ఎబాన్‌తో చెప్పారు: ‘భారత్‌లో ఔషధాలను పరీక్షించడం అనేది వ్యర్థ కలాపం మాత్రమే... కంపెనీలు తమ సొంత డోస్‌లను కనిపెట్టి వాటినే నేరుగా భారతీయ డ్రగ్ కంట్రోలర్ జనరల్ (డీసీజీఐ)కి అమ్మేస్తుంటాయి. డీసీజీఐకి అమ్మే విషయంలో వీటికి అవసరమైనది మంచి, నమ్మకమైన డేటా కాదు.. మంచి సంబంధాలు ఉంటే చాలు’. భారతదేశంలో పేలవమైన ప్రమాణాలను ఉద్దేశపూర్వకంగా పాటిస్తూ అనారోగ్యకరమైన పరిస్థితుల్లో మోసపూరితంగా మందులను తయారు చేస్తున్నారని ఈ పుస్తకం స్పష్టం చేసింది. ఒక ప్లాంట్‌లో మైక్రోబయాలజీ ల్యాబరేటరీ ఉంది. ఇక్కడ వారు మైక్రోబ్‌లు, బాక్టీరియాలపై పరీక్షలు చేస్తుం టారు. కానీ వాస్తవమైన శాంపిల్స్ మాత్రం కలికానిక్కూడా ఇక్కడ కనబడవు.
‘ఈ నేపథ్యంలో వాళ్లు అక్కడ పరీక్షించేది అంటూ ఏమీ లేదు. మొత్తం ల్యాబరేటరీ స్థాపనే ఒక బూటకపు వ్యవహారంగా ఉంటోంది’. తన పుస్తకంలో కేథరీన్ ఎబాన్ వెల్లడించిన వివరాల్లో పావు శాతం మాత్రమే నిజం ఉన్నదనుకున్నా, అది కూడా భీతిల్లజేస్తోంది. అంటే, భారతీయ జనరిక్ మందులపై మన విశ్వాసం పక్కదోవలు పట్టిందనే దీని అర్థం. చాలా తరచుగానే ఇవి పనిచేయవు. కొన్ని సందర్భాల్లో మీరు ఎన్ని మాత్రలు తీసుకున్నప్పటికీ అవి వ్యాధిని లేక ఇన్ఫెక్షన్లను నివారించవు. ఒకవేళ ఏ మందైనా పనిచేసిందంటే అది చైనీస్ జనరిక్ మందులవల్లే అనేది వాస్తవం. ఎబాన్ తన పుస్తకానికి ప్రధాన ఆధారంగా తీసుకున్న దినేష్ ఠాకూర్ 2014 సెప్టెంబర్‌లో కూడా కేంద్రంలో ఆరోగ్యమంత్రిగా వ్యవహరిస్తున్న హర్షవర్ధన్‌తో సమావేశమై ఈ సమస్య తీవ్రత గురించి ఆయన్ని హెచ్చరించారు. ఈ భేటీకి గాను ఠాకూర్‌కి మంత్రి కేటాయించిన సమయం అయిదు నిమిషాలు మాత్రమే. ఆ సమయంలో కూడా మంత్రి ఠాకూర్ మాటలు పట్టించుకోకుండా కశ్మీర్‌పై వార్తలు ప్రసారం చేస్తున్న టీవీని చూడటంపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారట. చివరకు ఠాకూర్ తానేం
కోరుకుంటున్నారో దాన్నంతటినీ రాతపూర్వకంగా తనకు పంపించాలని మంత్రి కోరారు.
ఆవిధంగానే ఠాకూర్ సమాచారాన్ని రాతపూర్వకంగా పంపారు కానీ దానికి స్పందన మంత్రినుంచి ఎన్నడూ రాలేదు. దీంతో విసిగిపోయిన ఠాకూర్, చివరి ప్రయత్నంగా 2016లో సుప్రీంకోర్టుకు పిటిషన్ వేశారు. అయన ఈ విషయమై పీఐఎల్ లేక ప్రజాప్రయోజన వాజ్యాన్ని వేశారు. ఈ సందర్భంగా భారతీయ క్రమబద్ధీకరణ చట్టం నిర్వీర్యమైపోవడమే కాకుండా రాజ్యాంగ విరుద్ధంగా కూడా తయారైందని ఆయన వాదించారు.
అంటే దీనర్థం ఏమిటి? ఈ దయనీయ స్థితి పట్ల పార్లమెంటు కానీ న్యాయవ్యవస్థ కానీ స్పందించిన పాపానపోలేదు. మీరూ, నేనూ జనరిక్ డ్రగ్స్‌ని అవి సమర్థంగా పనిచేస్తాయని విశ్వసిస్తూ, తీసుకుంటూ ఉంటాం కానీ, మందుల కంపెనీలు మనల్ని మూర్ఖులను చేస్తున్నాయి. అదేసమయంలో అధికారులు జరుగుతున్న తతంగాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మన దేశంలో ప్రజారోగ్యం ఏ గంగలో కలుస్తున్నట్లు?
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
కరణ్ థాపర్
Comments
Please login to add a commentAdd a comment