కామెంట్
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చు. ఒక విషయం మీద వారి దృక్పథం ఏమిటి, వివరణ ఏమిటి, వారి పాత్ర ఏమిటి... ఇలా ఏదో స్పష్టత కోసమే ఆ సంభాషణ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేయడమంటేనే, అతిథి చెప్పేది వినడానికి సిద్ధపడటం! అదే సమయంలో అతిథి తనకిష్టమొచ్చింది మాట్లాడేందుకు ఇంటర్వ్యూ చేయరన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా టీవీ సంభాషణలకైతే ఒక సమయ పరిమితి ఉంటుంది. ఆ సమయంలోనే కావాల్సింది రాబట్టుకోవాలి. అతిథి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నా, విషయాన్ని సాగదీస్తున్నా వారి మాటలను అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అడ్డు తగలడం సరైన సమయంలో జరగాలి. అడ్డుకోవడం అవసరమేనన్న భావన వీక్షకులకూ కల్పించాలి.
ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను అవతలి వాళ్ల మాటలకు తరచూ అడ్డుపడుతూంటా ననీ, ఇది చాలామంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందనీ చాలామంది నాతో చెబుతుంటారు. నువ్వు తలదూర్చే ముందు నీ అతిథి ఏం చెబు తున్నాడో వినాలని అనుకుంటున్నామన్న వాళ్లూ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న. అడ్డుకోవడాన్ని ఎప్పుడు తప్పించవచ్చు? అతిథిని అస్సలు అడ్డుకోరాదా? అతడు మాట్లాడటం ఆపేంతవరకూ ఓపికగా ఎదురు చూడాలా? దీనికి ఎంత సమయం పట్టినా ఫరవాలేదా?
వాస్తవానికి ఇదంతా అవతలి వ్యక్తి నేను అడిగిన ప్రశ్నకు బదు లుగా ఏం చెబుతున్నాడన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే... అతిథి తనకిష్టమొచ్చింది చెప్పేందుకు కాదు ఇంటర్వ్యూ అన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు, జవాబుల ఆధారమైన చర్చ ఇంటర్వ్యూ అంటే! అడిగే ప్రశ్నకు తగ్గట్టు సమాధానం ఉండాలి.
కాబట్టి... అడిగిన ప్రశ్నతో సంబంధం లేని సమాధానం వచ్చి నప్పుడు అడ్డుకోవడం అన్నది అత్యవసరం. తప్పించలేనిది కూడా! తనేం చెబుతున్నాడో తనకే తెలియని స్థితిలో అతిథి ఉన్నా... లేదా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒకటి చెబుతున్నా, కాలయాపన చేస్తున్నా అడ్డుకోవాల్సిందే. ఈ ఇంటర్వ్యూలన్నీ నిర్దిష్ట సమయం లోపల జరగాల్సినవి. కాబట్టి వ్యూహాత్మకంగా కాలయాపన చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూంటారు. లేదా మరిన్ని ప్రశ్నలను నివారించేందుకూ ప్రశ్నతో సంబంధం లేని సమాధానాలు చెబుతూంటారు.
అలాగే అడ్డుతగలడం అనేది స్పష్టత కోసం గందరగోళాన్ని తొలగించేందుకూ అవసరమే. అంతగా తెలియని సంక్షిప్తనామాలు ఉపయోగిస్తూంటే... మనం అడ్డుకుని వాటి అర్థమేమిటో వివరించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా... అతిథి చెప్పాలనుకున్న విషయం మాటల్లో తప్పిపోతే అతడిని మళ్లీ చర్చిస్తున్న అంశానికి తీసుకురావడం కోసం కూడా అడ్డుకోవడం అవసరమవుతుంది.
చెప్పే విషయం ఏమిటన్న దానిపై అతిథికి స్పష్టత ఉండవచ్చు కానీ... వీక్షకులకు స్పష్టత లేదని అనిపిస్తే అడ్డుకుని వివరణ తీసు కోవాల్సిందే. విషయం అర్థమైనప్పుడు వీక్షకులకు ఈ అడ్డుకోవడం అన్నది చికాకుగానే ఉంటుంది కానీ అర్థం కాని వాళ్లు కూడా ఉంటా రన్నది మనం గుర్తుంచుకోవాలి. వివరణ తీసుకునేందుకు, స్పష్టత కోసం సమయానుకులంగా అడ్డు తగలాల్సిందే!
అయితే, అతిథి వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నాడు అనుకోండి... అప్పుడు కూడా అడ్డుకోవాల్సిన అవసరముంటుంది. వీక్షకులకు అందే సమాచారం కచ్చితమైనదిగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత ఇంటర్వ్యూ చేసే వ్యక్తిది. లేదంటే, మర్యాదగానైనా లేదా నిశ్చయంతోనైనా అతిథిని అడ్డుకోవాలి. అతిథి దురుసుగా లేదా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అడ్డుకోవడం అవసరం. ఒక్కో సారి, విచక్షణ మీద ఉద్వేగానిది పైచేయి అయినప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అడ్డుకోవాల్సి ఉంటుంది.
చివరగా... వాగ్వాదం జోరుగా సాగుతున్నప్పుడూ అడ్డుకోవడం జరుగుతూంటుంది. వివాదాస్పదమైన, శక్తిమంతమైన వాదన జరుగు తున్నప్పుడు ఒకరిపై ఒకరు కేకలు పెట్టుకోవడం సహజం. ఇది సాధారణంగా జరుగుతూంటుంది. అయితే ఇలాంటి స్థితిలో ఏదో అడ్డుకోవాలి కాబట్టి అడ్డుకోరాదు. ఉద్వేగపూరిత వాతావరణంలోనే చర్చలు జరుగు తాయన్నది తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిపై అతిథి సవాళ్లు గట్రా విసురుతూంటారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నిగ్రహంతో ఉండాల్సింది కూడా ఇక్కడే!
ఇంటర్వ్యూలు చేసే వారికి ప్రధానంగా మూడు హెచ్చరికలు చేయాలి. మొదటిది–అడ్డుకోవడం దూకు డుగా ఉండకూడదు. సంయమనం కోల్పోరాదు. మన్నించమంటూ అడ్డుకోవడం మేలైన పద్ధతి. మన్నించమనడం వేడిని కొంతవరకూ చల్లారుస్తుంది. రెండోది–అడ్డుకోవడం అన్నది విజయవంతంగా పూర్తి చేయాలి. సగం సగం ప్రయత్నాలు చేయరాదు. మరీ తరచుగా అడ్డుకోకపోవడం మంచి పద్ధతి. అడ్డుకోలేక పోతే దానికి సార్థకతే ఉండదు. పదే పదే అడ్డుకుంటూవుంటే, చికాకు కలగడం సహజం.
చివరగా... అతి ముఖ్యమైన అంశం... అడ్డుకోవడం అన్నది సరైన సమయంలో జరగాలి. సమర్థుడైన ప్రెజెంటర్ వీక్షకుల కంటే చాలా ముందుగానే ఎప్పుడు అడ్డుకోవాలో నిర్ణయించుకోగలడు. అయితే అనుకున్న వెంటనే అడ్డుకున్నాడనుకోండి, అది కొంచెం తొందరపాటు అవుతుంది. వీక్షకులు హర్షించరు. చూసేవాళ్లు కూడా అతిథి మాటలింకా కొనసాగితే బాగోదు అనుకునేంత వరకూ వేచి చూసి అప్పుడు అడ్డుకోవాలి.
వాస్తవానికి అడ్డు తగలడానికి ఇదే కీలకం. అడ్డుకోవడం అవస రమైందన్న ఫీలింగ్ వీక్షకులకూ కల్పించాలి. ఎందుకంటే... వాళ్లకు ఇంటర్వ్యూ అనేది ఒక ‘ప్రదర్శన’ లాంటిది. అతిథికీ, ఇంటర్వ్యూ చేసేవాళ్లకూ ఇద్దరికీ వీక్షకుల మెప్పు కావాలి. అదే జరగకపోతే ఇంటర్వ్యూకు అర్థమే లేదు. అది ఇద్దరికీ వర్తిస్తుంది.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment