TV interviews
-
మాటలకు అడ్డు తగలకూడదా?
ఒక మనిషిని ఇంటర్వ్యూ చేయడానికి రకరకాల కారణాలుండొచ్చు. ఒక విషయం మీద వారి దృక్పథం ఏమిటి, వివరణ ఏమిటి, వారి పాత్ర ఏమిటి... ఇలా ఏదో స్పష్టత కోసమే ఆ సంభాషణ జరుగుతుంది. ఇంటర్వ్యూ చేయడమంటేనే, అతిథి చెప్పేది వినడానికి సిద్ధపడటం! అదే సమయంలో అతిథి తనకిష్టమొచ్చింది మాట్లాడేందుకు ఇంటర్వ్యూ చేయరన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా టీవీ సంభాషణలకైతే ఒక సమయ పరిమితి ఉంటుంది. ఆ సమయంలోనే కావాల్సింది రాబట్టుకోవాలి. అతిథి విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నా, విషయాన్ని సాగదీస్తున్నా వారి మాటలను అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ అడ్డు తగలడం సరైన సమయంలో జరగాలి. అడ్డుకోవడం అవసరమేనన్న భావన వీక్షకులకూ కల్పించాలి.ఇంటర్వ్యూలు చేసేటప్పుడు నేను అవతలి వాళ్ల మాటలకు తరచూ అడ్డుపడుతూంటా ననీ, ఇది చాలామంది ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుందనీ చాలామంది నాతో చెబుతుంటారు. నువ్వు తలదూర్చే ముందు నీ అతిథి ఏం చెబు తున్నాడో వినాలని అనుకుంటున్నామన్న వాళ్లూ ఉన్నారు. అయితే ఒక ప్రశ్న. అడ్డుకోవడాన్ని ఎప్పుడు తప్పించవచ్చు? అతిథిని అస్సలు అడ్డుకోరాదా? అతడు మాట్లాడటం ఆపేంతవరకూ ఓపికగా ఎదురు చూడాలా? దీనికి ఎంత సమయం పట్టినా ఫరవాలేదా?వాస్తవానికి ఇదంతా అవతలి వ్యక్తి నేను అడిగిన ప్రశ్నకు బదు లుగా ఏం చెబుతున్నాడన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే... అతిథి తనకిష్టమొచ్చింది చెప్పేందుకు కాదు ఇంటర్వ్యూ అన్న సంగతినీ గుర్తుంచుకోవాలి. ప్రశ్నలు, జవాబుల ఆధారమైన చర్చ ఇంటర్వ్యూ అంటే! అడిగే ప్రశ్నకు తగ్గట్టు సమాధానం ఉండాలి. కాబట్టి... అడిగిన ప్రశ్నతో సంబంధం లేని సమాధానం వచ్చి నప్పుడు అడ్డుకోవడం అన్నది అత్యవసరం. తప్పించలేనిది కూడా! తనేం చెబుతున్నాడో తనకే తెలియని స్థితిలో అతిథి ఉన్నా... లేదా విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఏదో ఒకటి చెబుతున్నా, కాలయాపన చేస్తున్నా అడ్డుకోవాల్సిందే. ఈ ఇంటర్వ్యూలన్నీ నిర్దిష్ట సమయం లోపల జరగాల్సినవి. కాబట్టి వ్యూహాత్మకంగా కాలయాపన చేసేందుకు కొందరు ప్రయత్నిస్తూంటారు. లేదా మరిన్ని ప్రశ్నలను నివారించేందుకూ ప్రశ్నతో సంబంధం లేని సమాధానాలు చెబుతూంటారు.అలాగే అడ్డుతగలడం అనేది స్పష్టత కోసం గందరగోళాన్ని తొలగించేందుకూ అవసరమే. అంతగా తెలియని సంక్షిప్తనామాలు ఉపయోగిస్తూంటే... మనం అడ్డుకుని వాటి అర్థమేమిటో వివరించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా... అతిథి చెప్పాలనుకున్న విషయం మాటల్లో తప్పిపోతే అతడిని మళ్లీ చర్చిస్తున్న అంశానికి తీసుకురావడం కోసం కూడా అడ్డుకోవడం అవసరమవుతుంది. చెప్పే విషయం ఏమిటన్న దానిపై అతిథికి స్పష్టత ఉండవచ్చు కానీ... వీక్షకులకు స్పష్టత లేదని అనిపిస్తే అడ్డుకుని వివరణ తీసు కోవాల్సిందే. విషయం అర్థమైనప్పుడు వీక్షకులకు ఈ అడ్డుకోవడం అన్నది చికాకుగానే ఉంటుంది కానీ అర్థం కాని వాళ్లు కూడా ఉంటా రన్నది మనం గుర్తుంచుకోవాలి. వివరణ తీసుకునేందుకు, స్పష్టత కోసం సమయానుకులంగా అడ్డు తగలాల్సిందే! అయితే, అతిథి వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నాడు అనుకోండి... అప్పుడు కూడా అడ్డుకోవాల్సిన అవసరముంటుంది. వీక్షకులకు అందే సమాచారం కచ్చితమైనదిగా ఉండేలా చూసుకోవా ల్సిన బాధ్యత ఇంటర్వ్యూ చేసే వ్యక్తిది. లేదంటే, మర్యాదగానైనా లేదా నిశ్చయంతోనైనా అతిథిని అడ్డుకోవాలి. అతిథి దురుసుగా లేదా అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా అడ్డుకోవడం అవసరం. ఒక్కో సారి, విచక్షణ మీద ఉద్వేగానిది పైచేయి అయినప్పుడు కూడా ముందు జాగ్రత్తగా అడ్డుకోవాల్సి ఉంటుంది.చివరగా... వాగ్వాదం జోరుగా సాగుతున్నప్పుడూ అడ్డుకోవడం జరుగుతూంటుంది. వివాదాస్పదమైన, శక్తిమంతమైన వాదన జరుగు తున్నప్పుడు ఒకరిపై ఒకరు కేకలు పెట్టుకోవడం సహజం. ఇది సాధారణంగా జరుగుతూంటుంది. అయితే ఇలాంటి స్థితిలో ఏదో అడ్డుకోవాలి కాబట్టి అడ్డుకోరాదు. ఉద్వేగపూరిత వాతావరణంలోనే చర్చలు జరుగు తాయన్నది తెలిసిందే. ఇలాంటి సందర్భాల్లోనే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తిపై అతిథి సవాళ్లు గట్రా విసురుతూంటారు. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి నిగ్రహంతో ఉండాల్సింది కూడా ఇక్కడే! ఇంటర్వ్యూలు చేసే వారికి ప్రధానంగా మూడు హెచ్చరికలు చేయాలి. మొదటిది–అడ్డుకోవడం దూకు డుగా ఉండకూడదు. సంయమనం కోల్పోరాదు. మన్నించమంటూ అడ్డుకోవడం మేలైన పద్ధతి. మన్నించమనడం వేడిని కొంతవరకూ చల్లారుస్తుంది. రెండోది–అడ్డుకోవడం అన్నది విజయవంతంగా పూర్తి చేయాలి. సగం సగం ప్రయత్నాలు చేయరాదు. మరీ తరచుగా అడ్డుకోకపోవడం మంచి పద్ధతి. అడ్డుకోలేక పోతే దానికి సార్థకతే ఉండదు. పదే పదే అడ్డుకుంటూవుంటే, చికాకు కలగడం సహజం.చివరగా... అతి ముఖ్యమైన అంశం... అడ్డుకోవడం అన్నది సరైన సమయంలో జరగాలి. సమర్థుడైన ప్రెజెంటర్ వీక్షకుల కంటే చాలా ముందుగానే ఎప్పుడు అడ్డుకోవాలో నిర్ణయించుకోగలడు. అయితే అనుకున్న వెంటనే అడ్డుకున్నాడనుకోండి, అది కొంచెం తొందరపాటు అవుతుంది. వీక్షకులు హర్షించరు. చూసేవాళ్లు కూడా అతిథి మాటలింకా కొనసాగితే బాగోదు అనుకునేంత వరకూ వేచి చూసి అప్పుడు అడ్డుకోవాలి. వాస్తవానికి అడ్డు తగలడానికి ఇదే కీలకం. అడ్డుకోవడం అవస రమైందన్న ఫీలింగ్ వీక్షకులకూ కల్పించాలి. ఎందుకంటే... వాళ్లకు ఇంటర్వ్యూ అనేది ఒక ‘ప్రదర్శన’ లాంటిది. అతిథికీ, ఇంటర్వ్యూ చేసేవాళ్లకూ ఇద్దరికీ వీక్షకుల మెప్పు కావాలి. అదే జరగకపోతే ఇంటర్వ్యూకు అర్థమే లేదు. అది ఇద్దరికీ వర్తిస్తుంది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కొత్త నిర్ణయాలు తీసుకుందాం!
కొత్త సంవత్సరంలో వ్యక్తులుగా మనం కొన్ని తీర్మానాలు చేసుకుంటాం. అదే విధంగా మనమంతా ఒక దేశంగా కూడా కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. పార్లమెంటులో సభా సమయాన్ని దుర్వినియోగం చేయబోమని ఎంపీలూ, చర్చల పేరుతో జనాల మధ్య గొడవలు సృష్టించబోమని టీవీ యాంకర్లూ తీర్మానించుకోవాలి. ట్రాఫిక్ నియమాలను అతిక్రమించకుండా వాహనాలను ధ్యాసగా, జాగ్రత్తగా నడుపుతామని మనం సంకల్పం చెప్పుకోవాలి. కానీ మూణ్ణాళ్లకే ఈ తీర్మానాలన్నీ వట్టి ముచ్చటగా మారిపోతే? అసలీ తీర్మానాలు తీర్చేవా, మార్చేవా? దీనికి ఒకటే జవాబు. తీర్చడం, మార్చడం కళ్లకు కనిపించపోవచ్చు. కానీ, అసలంటూ కొత్త నిర్ణయం తీసుకోవటం అన్నదే సంకల్ప సాధనలోని నిబద్ధతకు మొదటి మెట్టు అని గుర్తించాలి. పూతకొచ్చే తీర్మానాలకు కొత్త సంవత్సరం ప్రియమైన రుతువు అయినప్పటికీ, వాటిల్లో చాలా వరకు ఎక్కువ కాలం జీవించి ఉండవు. గొప్ప ఉత్సాహపు ధ్వనితో మొగ్గ తొడిగి, చప్పుడే కాని పరిహాసపు గాలివానలతో టప్పున నేల రాలేందుకే అవి చిగురిస్తాయి. అయినప్పటికీ, మనమంతా ఒక దేశంగా కొన్ని తీర్మానాలను స్వీకరించాలని నేనిప్పుడు సూచించబోవడం మీకొక ప్రశ్నార్థకం అవొచ్చు. దీనికి చాలా సులభమైన జవాబే ఉంది. చేయాలని అనుకున్న దానిలో నిబద్ధత కొరవడినా, ఏం చేయవలసిన అవసరం ఉన్నదో దానిని ఒక సంకల్పంలా తీసుకోవడమే అసలొక తీర్మానం. కనుక ఈ కొత్త సంవత్సర ఆరంభంలో ఆ మొదటి అడుగు వేద్దాం. ‘సంకల్పం’ అనే అడుగు. మొదటిది, ఒకటేంటంటే మన రాజకీయ నాయకులు చేయ వలసినది. పార్లమెంటులో ఎంతో విలువైన ప్రజాసమయ దుర్విని యోగానికి పాల్పడే విధంగా తమ ప్రవర్తన ఉండకూడదని వారు తీర్మానం చేసుకోవాలి. వాళ్లు అక్కడ కూర్చున్నందుకు మీకు, నాకు అవుతున్న ఖర్చు నిమిషానికి 2 లక్షల 50 వేల రూపాయలు. ఈ ఖర్చును మనం సంతోషంగానే భరిస్తున్నాం. ఎందుకంటే, నిజాలను నిగ్గు తేల్చేందుకు, ప్రభుత్వ పనితీరును ఎత్తిచూపేందుకు, నిశిత పరిశీలనకు; అవినీతిని, అసమర్థతను బహిర్గతం చేయడానికి... ప్రశ్నలు, చర్చలు తప్పనిసరి అని మనం విశ్వసిస్తాం. అటువంటిది... సభ ‘వెల్’లోకి దూసుకెళ్లే, స్పీకర్‌పై రంకెలు వేసే, సభకు గైర్హాజరు అయ్యే ఎంపీలకు మన కష్టార్జితాన్ని ఎందుకు ఖర్చుపెట్టాలి? 16వ లోక్‌సభ (2014–19) సభా సమయం 1,615 గంటలు కాగా,అందులో 16 శాతం సమయాన్ని అంతరాయాలు, వాయిదాల కారణంగా కోల్పోయాం. ఆ కోల్పోయిన సమయానికి అయిన ఖర్చు రూ. 39 కోట్లు. మన ప్రజాప్రతినిధులుగా, మనం వారికి నిధులు సమ కూరుస్తున్నాం కనుక, ఆ విలువకు సమానమైన సేవలను మన ఎంపీలు మనకు అందించాలి. అందుకు మనం అడుగుతున్నదల్లా పార్లమెంటు సమర్థంగా, అర్థవంతంగా పనిచేయాలని! వారి నుండి ఈ కొత్త సంవత్సరం మనకు ఇలాంటి హామీ లభిస్తుందా? తర్వాత, ప్రెస్! ఇక్కడ నా ఉద్దేశం ప్రెస్ అంటే ప్రధానంగా టెలివి జన్ న్యూస్ చానెళ్లు. టీవీ వీక్షకులు డబ్బు చెల్లిస్తారు కనుక ముఖ్యమైన వార్తల్ని ఆశించే హక్కు వారికి ఉంటుంది. ఏది ముఖ్యమైన వార్తో నిర్ణయించడానికి అనేకమైన ప్రామాణికాలు ఉంటాయన్న దాంట్లో సందేహమేమీ లేదు కానీ, చివరికొచ్చేటప్పటికి ప్రధానంగా ప్రాముఖ్యం, ఔచిత్యం, సమతౌల్యం అనేవి లెక్కలోకి వస్తాయి. కనుక టీవీ వాళ్లకు నేను చెప్పేదేమిటంటే, దయచేసి మీరు సినిమా తారలు, క్రికెటర్ల పట్ల మీకున్న మక్కువను వదులుకోండి. ‘బ్రేకింగ్ న్యూస్’ కోసం మీ పరుగులను ముగించండి; బదులుగా కచ్చితత్వం పైన, విశ్లేషణ మీద దృష్టి పెట్టండి; మరీ ముఖ్యంగా... సాగతీతల్ని ఆపేయండి. ఏ వార్తా కథనానికైనా తన సహజమైన నిడివి ఉంటుంది. కేవలం ప్రసార సమయాన్ని భర్తీ చేయడానికి ఆ నిడివిని పొడిగించుకుంటూ పోకండి. గుర్తుంచుకోండి. మేము పెద్దవాళ్లం; మమ్మల్ని పిల్లల్లా చూడకండి; మేము తరచు పిల్లల్లా స్పందిస్తున్నా కూడా అలాగే, మన యాంకర్లకు ఎవరైనా చర్చల లక్ష్యం జనం మధ్య గొడవలు సృష్టించడం కాదని చెప్పగలరా... ఆ జనం ఒకవేళ గొడవలకు సిద్ధంగా ఉన్నప్పటికీ! చర్చ అనేది ప్రజాభిప్రాయాన్ని రాబట్టేందుకు... అది కూడా ఒక వివేచనతో, వీలైతే తక్కినవారికి భిన్నంగా, పూర్తిగా తమదైన ప్రత్యేకతతో ఉండాలనీ... చర్చకు వచ్చిన అతిథులు తమతో ఏకీభవించేలా యాంకర్లు వారిపై మాటల బల ప్రయోగం చేయకూడదనీ వీక్షకులుగా ఈ కొత్త సంవత్సరంలో మనం ఆశపడదాం. చివరిగా, మనమంతా ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉన్న విషయం – సురక్షితంగా వాహనం నడపడం. పద్ధతిగా, తెలివిడిగా నడపాలి. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రద్దీని దాటేందుకు వేరే వైపు మళ్లకండి. ఎర్ర రంగు పడటానికి ముందు ఆరెంజి రంగులోకి సిగ్నల్ మారినప్పుడు మీ అదృష్టంపై నమ్మకంతో జంక్షన్లో మీ వాహనాన్ని ముందుకు దూకించకండి. ఇంకొక సంగతి, మీరు మీ కారును పార్క్ చేస్తున్నప్పుడు వేరొకరి గేటుకు కానీ, తోవకు కానీ అడ్డంగా నిలుపుతున్నారేమో గమనించండి. ఇక మన డ్రైవింగ్ ఎలా ఉండాలనే దానికి ఎల్ల వేళలా వర్తించే సాధారణ నియమం – రోడ్డుపై మీరే కాకుండా ఇంకా చాలామంది వాహనం నడు పుతూ ఉంటారు కనక – రోడ్డుపై మీకున్నంత హక్కే వారికీ ఉంటుందని గ్రహించడం! మరీ పాత సంగతి కాదు కానీ, సిగరెట్ తాగడం మొదలుపెట్టాలని నాకొక కొత్త సంవత్సర తీర్మానం ఉండేది. గడియారం సరిగ్గా రాత్రి పన్నెండు కొట్టగానే నా వేళ్ల మధ్య సిగరెట్ వెలుగు తుండేది. మర్నాడు సాయంత్రమంతా ఉమ్మడం, దగ్గడం! ‘సిగరెట్ తాగకపోవడం’ అనే వ్యసనాన్ని దూరం చేసుకోడానికి నేను ఎంచుకున్న మార్గం అది. అయితే జనవరి చివరినాటికి నా తీర్మానం పట్టు సడలిపోయేది. అది వ్యసనంగా మారుతుందేమోనన్న భయం నా చేత సంతోషంగా సిగరెట్ మాన్పించేది. అలా నేను దానికి దూరంగా ఉండటం జరిగేది. ఈ సంవత్సరం నేను మరింత పెద్ద సవాలును స్వీకరిస్తున్నాను. టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వచ్చే నా అతిథులకు అంతరాయం కలిగించడాన్ని మానుకోవాలని నిర్ణయించుకున్నాను. బదులుగా, వారిని తమ ఊకదంపుడుకు, అదే పనిగా మాట్లాడేందుకు అనుమ తిస్తాను. వాళ్లేం మాట్లాడినా, మాట్లాడవలసిన దానిని వాళ్లసలే మాట్లాడకపోతున్నా – మీరు, మిగతా వీక్షకులు అరచి నిరసన తెలియజేసే వరకు వాళ్లకు అడ్డుతగలనే తగలను. ‘వద్దు కరణ్, మీరు మీ పాత భౌభౌమనే రాట్వైలర్ జాతి శునకం స్టెయిల్‌కి వచ్చేయండి’ అంటూ తొలి విజ్ఞాపన పత్రం నాకు అందినప్పుడు మాత్రమే నేను ఎప్పటిలా నా పాత శైలికి వచ్చేస్తాను. మరి అలాంటి విజ్ఞాపన పత్రం ఒకటి ఎప్పటికీ రాకపోతే? మా ప్రియమైన పోస్ట్‌మ్యాన్ నేను ఎదురు చూసే క్రిస్మస్, న్యూ ఇయర్ కార్డులన్నిటినీ ఎక్కడో తారుమారు చేసి ఉండొచ్చని అనుకోవాలి. ఏ సంగతీ ఏదో ఒక విధంగా త్వరలోనే మీకు తెలుస్తుంది. కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
కొంప ముంచిన టీవీ ఇంటర్వ్యూలు
ఊడిన పదవి తన గోతిని తానే తవ్వుకున్న వైనం కొంపముంచిన టీవీ ఇంటర్వ్యూలు సాక్షి, చెన్నై :అన్నాడీఎంకే సిద్ధాంతాల ప్ర చార ఉప కార్యదర్శి నాంజిల్ సంపత్‌కు ఆ పార్టీ అధినేత్రి జయలలిత షాక్ ఇచ్చారు. పదవి నుంచి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, టీవీ ఇంటర్వ్యూల రూపంలో తన గోతిని తానే నాంజిల్ తవ్వుకుని ఉండడం గమనార్హం. ‘నాంజిల్ సంపత్’ రాజకీయ అవగాహన కల్గిన పటిష్ట నేత, పరిస్థితులకు అనుకూలంగా అనర్గళంగా ప్రసంగించే వ్యాఖ్యాత. వైగో నేతృత్వంలోని ఎండీఎంకేకు వెన్నెముకగాఉన్న ఆయన ఇటీవలే అన్నాడీఎంకే గూటికి చేరారు. అన్నాడీఎంకేలోకి రాగానే, సీఎం, ఆ పార్టీ అధినేత్రి జయలలిత నాంజిల్‌కు మంచి గుర్తింపునే ఇచ్చారు. పార్టీ సిద్ధాం తాల ప్రచార ఉప కార్యదర్శి పదవిని అప్పగించారు. ఓ ఇన్నోవా కారును సైతం అందించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార పర్యటన సాగించేందుకు అవకాశం ఇచ్చారు. నాంజిల్ లేనిదే అన్నాడీఎంకే బహిరంగ సభలు లేదన్నట్టుగా ఎదిగారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ప్రచారాలకు నాంజిల్ కీలకంగా మారారని చెప్పవచ్చు. ఈ పరిస్థితుల్లో నాంజిల్‌కు పెద్ద షాక్ ఇస్తూ జయలలిత నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. పార్టీ నుంచి పొమ్మని పొగ పెట్టకున్నా, నాంజిల్ చేతిలో ఉన్న పదవిని మాత్రం లాక్కోవడం గమనార్హం. ప్రచార ఉప కార్యదర్శి పదవిని నుంచి ఆయన్ను తొలగించడంతో సోషల్ మీడియాల్లో సెటైర్లు బయలు దేరాయి. పదవి ఊడింది...మిగిలింది ఇన్నోవానే, తన గోతిని తానే తవ్వుకున్న వ్యాఖ్యాత... అన్న చమత్కారాలు, వ్యంగ్యాస్త్రాలను నాంజిల్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీ ఇంటర్వ్యూలు : తన అనుమతి లేనిదే ఎవరైనా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కన్నెర్ర చేయడం జయలలితకు అలవాటే. ఆ దిశగా ఇటీవల టీవీలో సర్కారుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటూ మాజీ డీజీపీ ఆర్ నటరాజ్‌కు ఉద్వాసన పలికారు. అయితే, ఆ ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చింది తాను కాదంటూ నటరాజ్ వివరణ ఇచ్చుకుని మళ్లీ చడి చప్పుడు కాకుండా పార్టీలోకి వచ్చారు. ఈ సమయంలో, పార్టీ సిద్ధాంతాల ప్రచార ఉప కార్యదర్శిగా తనకు జయలలిత ఇచ్చిన అధికారాల్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో తన గోతిని తానే నాంజిల్ తవ్వుకున్నారని చెప్పవచ్చు. పార్టీ తరపున టీవీల్లో చర్చా కార్యక్రమాల్లో చురుగ్గానే నాంజిల్ రాణించారు. అదే సమయంలో శనివారం ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాంజిల్ వ్యాఖ్యలు వ్యంగ్యాస్త్రాలకు, ప్రజల్లో ఆగ్రహానికి దారి తీశాయని చెప్పవచ్చు. ఆ ప్రశ్నల్లో కొన్ని..వరద బాధితుల్ని అమ్మ పరామర్శించ లేదే అన్న ప్రశ్నకు, అమ్మకు రాలేని పరిస్థితి అని సమాధానం ఇవ్వడంతో జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అనుమానాల్ని రెకెత్తించేలా చేశారు. వరదల వేళ అన్నాడీఎంకే సర్వ సభ్యంలో హంగులు అవసరామా.? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే క్రమంలో కాస్త దూకుడును నాంజిల్ ప్రదర్శించారు. ఓ గ్రామంలోని ఓ ఇంట్లో విషాదం ఉంటే, మరో ఇంట్లో పెళ్లి జరగకూడదా, వరదల నుంచి ప్రజలు ఎప్పుడో కోలుకున్నారని, కొందరు మాత్రమే కోలుకావాల్సి ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం జయలలితలో ఆగ్రహాన్ని రేపాయి. అన్నాడీఎంకే సర్కారు అప్పుల ఊబిలో ఉన్నట్టుందే..? అన్న ప్రశ్నకు, అప్పులు తీసుకోవడం సహజమే, దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కొట్టి పారేశారు. అన్నాడీఎంకేకు ఎదురుగా ఇది వరకు ప్రతి పక్షం లేదని, ఇప్పుడు ప్రతి పక్షం అన్నది బలంగానే అవతరించి ఉన్నదంటూ పరోక్షంగా డీఎంకే బలం పెరిగినట్టు స్పందించారు. ఇక, ఇన్నోవా ఇచ్చారు సరే, తనకు ఇళ్లు ఎక్కడ..? వరద బాధిత గుడిసె వాసులకు ఇస్తున్నట్టుగానే, తనకు ఇవ్వొచ్చుగా..! అని వ్యాఖ్యలు చేసిన తాను తవ్వుకున్న గోతిలోనే నాంజిల్ పడి ఉండటం గమనించాల్సిన విషయం. అలాగే, మరో టీవీ ఛానల్‌కు తమకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఆధారంగా పదే పదే నాంజిల్ స్పందించిన కొన్ని అంశాలను ఎత్తి చూపుతూ ప్రత్యేకంగా ప్రొమో ఇస్తూ, చూస్తూ ఉండండి..చూస్తూ ఉండండి అని పబ్లిసిటీ ఇవ్వడం జయలలితకు మరింత ఆగ్రహాన్ని తెప్పించి, పార్టీ నుంచి సాగనంప కుండా , పదవి నుంచి తొలగించి పొమ్మని చెప్పకనే పొగ పెట్టినట్టుగా వ్యవహరించి ఉండడం గమనార్హం. అయితే, తదుపరి నాంజిల్ అడుగులు ఎలా ఉంటాయో అన్న ఎదురు చూపుల్లో ఆయన మద్దతు దారులు ఉన్నారు. ఇక, ద్రవిడ సిద్ధాంతాలను అనుసరించే నాంజిల్‌కు దిక్కు డీఎంకే మాత్రమే.