కామెంట్
టేబుల్‌కు ఎదురుగా ఉన్న వ్యక్తులు ఇద్దరూ సమానమే అన్న అంచనాతో (భ్రమతో?) ఇంటర్వ్యూ మొదలవుతుంది. అప్పుడు మాత్రమే, ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని అనుకున్నప్పుడే, అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకు సందేహించాల్సిన అవసరం ఉండదు. అందుకే ఎంపీలు, మంత్రులు, అధికారులను... మిస్టర్, మిసెస్, మిస్ అనో... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అనో సంబోధించడం ఉచితంగా ఉంటుంది. అదే సెలబ్రిటీలను చేసే ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారిపోతాయి. వాళ్లను ‘మిస్టర్’ అంటే దూరం జరిగినట్టు అవుతుంది. అప్పుడు పేరు పెట్టి పిలవడం ఉత్తమం.
ఆ మధ్య నాకు ఒక లేఖ అందింది.అందులో చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఒకటుంది. సమాధానం ఇలా బహిరంగంగానే ఇస్తే మేలు అనిపించింది. ‘‘ఇంటర్వ్యూ చేసే వారిని మీరు రకరకాలుగా సంబోధించడాన్ని గమనించాను’’ అంటూ మొదలైంది ఈ లేఖ. ‘‘కొంతమందిని మిస్టర్ ఎక్స్ అంటారు.. ఇంకొంతమందిని ‘మినిస్టర్’ అంటూ వారి పదవితో సంబోధించారు. మరికొన్ని సందర్భాల్లో వాళ్ల పేరుతో పిలిచారు. కానీ ఎప్పుడూ ‘సర్’ అని పిలవడం మాత్రం చూడలేదు. ఎందుకలా? అసలు ఎవరిని ఎలా పిలవాలో మీరు ఎలా నిర్ణయిస్తారు?’’
సర్ అంటే వేరే!
ఈ ప్రశ్నలు చూసిన వెంటనే నా ఆలోచనలు రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లాయి. ఆ రోజు జీవితంలో మొట్టమొదటిసారి ఓ ప్రము ఖుడిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. తర్వాత బ్రిటన్ హోమ్ శాఖ మంత్రి అయిన డేవిడ్ వాడింగ్టన్ ఇంటర్వ్యూ అది. 1983లో మార్గరెట్ థాచర్ మంత్రివర్గంలో ఇమ్మిగ్రేషన్ శాఖల మంత్రిగా ఆయన పని చేశారు. ప్రస్తుత ‘బీబీసీ’ ఛైర్మన్ సమీర్ షా అప్పట్లో నా బాస్. బీబీసీ కార్యక్రమం ‘ఐ విట్‌నెస్’ ప్రొడ్యూసర్ ఆయన.
ఇంటర్వ్యూ కోసం స్టూడియోలోకి వెళుతూండగా సమీర్ మాట్లా డుతూ, ‘‘ఒక్క విషయం గుర్తుంచుకో కరణ్’’ అన్నారు. ‘‘ఆయన్ని మిస్టర్ వాడింగ్టన్ అనైనా పిలువు. లేదా మినిస్టర్ అను. సర్ అని మాత్రం పిలవొద్దు’’ అని సలహా ఇచ్చారు. బ్రిటిష్ ఇంగ్లీషులో ‘సర్’కు ఉన్న అర్థం వేరు కావడమే దీనికి కారణం. దానివల్ల ఇంటర్వ్యూలో వాడింగ్టన్ హోదాను ఇంటర్వ్యూ చేసేవాడికన్నా ఎక్కువ అనుకునేలా చేస్తుంది.
ఇంటర్వ్యూ చేసేవాడు, ఇచ్చే మనిషి ఇద్దరూ సమానమే అన్న అంచనాతో(లేదా భ్రమ?) ఈ ఏర్పాటు అన్నమాట. ఇంటర్వ్యూ చేసేవాళ్లకు శోధించేందుకు, అవసరమైతే వ్యతిరేకించేందుకు ఇరువురి సమానత్వం ఒక హక్కును కల్పిస్తుంది. అలాగే అవతలి వ్యక్తి నీ కంటే పెద్ద స్థాయివాడు కాదని తెలిస్తే అవసరమైనప్పుడు వారి మాటలను అడ్డుకునేందుకూ సందేహించాల్సిన అవసరం ఉండదు.
వాస్తవానికి ఆ ఇంటర్వ్యూ బ్రిటిష్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల అంశంపై సాగింది. ఆనాటి నిబంధలు ఆసియా ప్రాంత వాసులకు ఇబ్బందికరంగా ఉండేవి. హాట్ టాపిక్ కాబట్టి ఇంటర్వ్యూ కూడా అదే స్థాయిలో ఉండటం సహజం. వాడింగ్టన్ సమాధానాలు నాకు సంతృప్తి కలిగించే అవకాశమే లేదు. అందుకే సమీర్ నన్ను పరోక్షంగా హెచ్చ రిస్తూ ఆ మాటలు అన్నారు. ఆయన్ని నేను సంబోధించే విధానం నా స్థితిని బలహీనం చేయకూడదన్నది సమీర్ ఉద్దేశం. కాబట్టి... సర్ అన్న సంబోధన లేకుండా పోయింది.
అప్పటి నుంచి ఇప్పటివరకూ నాకు సమీర్ మాటలే పరమ ధర్మంలా మిగిలాయి. అధికారంలో ఉన్న వ్యక్తి ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నా... ఎంపీలు, మంత్రులు, పారిశ్రామికవేత్తలు, అధికారులు, ప్రముఖులు ఎవరైనా సరే... మిస్టర్, మిసెస్, మిస్ అని కానీ... ప్రభుత్వంలో ఉంటే మినిస్టర్ అని కానీ సంబోధించడాన్ని ఒక నియమంగా పెట్టుకున్నాను. ఇలా ఎందుకో చెబుతాను.
‘‘సర్... మీరు చెబుతున్నది కరెక్ట్ కాదు’’ అని ప్రతిసారీ చెప్ప లేం. ‘సర్’ అని సంబోధిస్తూంటే... ఇలా చెప్పే అవకాశం గట్టిగా చెప్పలేకపోవచ్చు. అదే ‘మినిస్టర్’ అని సంబోధిస్తున్నాం అనుకోండి... ఎప్పుడు కావాలంటే అప్పుడు ‘‘సారీ, మీరు తప్పు చెబుతున్నారు’’ అనేయవచ్చు. ‘సర్’ అంటే ఒకపక్క ఉన్నత స్థానం కల్పిస్తూ... ఇంకో పక్క తప్పు అంటున్నాం. పరస్పర విరుద్ధం ఇవి. ‘మినిస్టర్’అంటున్నప్పుడు మీరు చెబుతున్నది తప్పు అనేందుకు పెద్దగా ఇబ్బంది పడనక్కరలేదు.
సన్నిహిత సంభాషణల్లో... పేరుతో!
అయితే... ఛాట్ షో ఇంటర్వ్యూల విషయానికి వస్తే ఇవన్నీ మారి పోతాయి. అవతలి వ్యక్తి గ్లామర్, సెలిబ్రిటీ స్థాయిని బట్టి కదా ఇంటర్వ్యూకు ఎంచుకున్నాను. అది వర్తమాన అంశాలకు సంబంధించిన ఇంటర్వ్యూ కాదు. విధాన నిర్ణయాల గురించి గుచ్చిగుచ్చి అడిగేది కాదు. వారి జీవిత ఘట్టాలు, జ్ఞాపకాలకు సంబంధించినది కాబట్టి, వారి వ్యక్తిత్వాన్ని పరిచయం చేసే షో కాబట్టి... ‘మిస్టర్’, ‘మిస్’ అంటే వారికి దూరం జరిగినట్టు అవుతుంది. ఇది చర్చను ముందుకు పోనీయదు. అలాంటి సందర్భాల్లో వారిని పేరుతో పిలుస్తూంటాను. అందుకే జావేద్(అఖ్తర్), షారుఖ్(ఖాన్ ), మాధురీ (దీక్షిత్), షర్మిలా (ఠాగూర్), విక్రమ్(సేథ్), సచిన్ (టెండూల్కర్) అన్న పేర్లతో సంబోధన ఉంటుంది.
ఒక్కోసారి పరిస్థితి వికటించే అవకాశం కూడా ఉంది. నేను ఇంటర్వ్యూ చేసేవాళ్లలో కొంతమంది నాకు బాగా పరిచయమైన రాజకీయ నేతలు కూడా ఉంటూంటారు. ఉదాహరణగా చెబు తున్నా... అలాంటి వారిని ‘మిస్టర్ థరూర్’ అని సంబోధించాల్సి వస్తుంది. నాకు వ్యక్తిగతంగా ఆయన శశిగానే తెలిసినప్పుడు ‘మిస్టర్ థరూర్’ అని పిలవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. వీలైనంత వరకూ పేరు పెట్టి పిలవకుండా, ఇంటిపేరుతో కలిపి పిలవడం ద్వారా బ్యాలెన్ ్స చేస్తూంటాను. ఇది ఫార్మల్‌గానూ ఉంటుంది, అలాగే వ్యక్తిగత సాన్ని హిత్యాన్ని సూచించేందుకూ ఇబ్బందిగా ఉండదు.
నేను చేయని పనల్లా ఒక్కటే! మంత్రిని పేరు పెట్టి పిలవను. వాళ్లు నాకు తెలిసినప్పటికీ పీయూశ్, కపిల్ అంటూ పేర్లతో పిలవను. ఫార్మల్ ఇంటర్వ్యూలో ఇలా పిలవడం అంత మంచిది కాదు. వీక్షకులు వెంటనే సాన్నిహిత్యాన్ని పసిగట్టేస్తారు.
నాకు వచ్చిన ప్రశ్నకు సమాధానం దక్కిందనే అనుకుంటున్నాను. ఇదెంత అర్థవంతంగా ఉందో నిర్ణయించుకోవాల్సింది మాత్రం మీరే!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, రాజకీయాంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment