Manipur Horror: Sakshi Guest Column Special Story On Women Paraded Naked In Manipur - Sakshi
Sakshi News home page

కనీస స్పందన కరవైందా?

Published Mon, Jul 24 2023 12:01 AM | Last Updated on Mon, Jul 24 2023 7:42 PM

Sakshi Guest Column On Women paraded naked in Manipur

మణిపురలో మహిళలను నగ్నంగా ఊరేగించి, తర్వాత వారిపై అత్యాచారం జరిపిన ఘటన తాలూకు వీడియో దేశాన్ని దిగ్భ్రాంతికి లోనుచేసింది. దశాబ్దం క్రితం జరిగిన భయంకరమైన ఘటన ‘నిర్భయ’ లాగా ఇదీ మన అంతరాత్మలోకి చొచ్చుకుపోయింది. మే 4న జరిగినట్టు చెబుతున్న ఈ ఘోరమైన ఘటన తాలూకు వీడియో రెండు నెలల తర్వాత బయటికి రావడం ఒకటైతే, ఆ ఘటన పట్ల ప్రభుత్వం, అధికారులు, పోలీసుల స్పందన ఆందోళన కలిగిస్తోంది. దాన్ని కనీస స్పందన అని కూడా అనలేం. అది మిన్నకుండటమా? పట్టించుకోకపోవడమా? బాధ్యతారాహిత్యమా? వారి వివరణలను బట్టి చూసినా ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవి కూడా మనలో ఆందోళన రేకెత్తించేవే!

మణిపురలో జరిగిన హింసాత్మక ఘటన లను ఏ విశేషణాలతోనూ వివరించడం సాధ్యం కాదు. అది ఏ వర్ణనకూ లొంగనిది. దశాబ్దం క్రితం జరిగిన మరో భయంకరమైన ఘటన ‘నిర్భయ’ లాగా ఇదీ మన అంత రాత్మలోకి చొచ్చుకుపోయింది. అయితే మే 4వ తేదీన జరిగిన అత్యాచారాలు గర్హనీయమైన ఒక సంఘటన మాత్రమే. రెండు వేర్వేరు వర్గాల నుంచి సేకరించిన సమాచారాన్ని బట్టి చూస్తే, కనీసం ఇంకో ఐదు ఇలాంటివి చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

రానున్న రోజుల్లో మన దృష్టి మొత్తం ఆ ఘటనల తాలూకూ బాధాకరమైన వివరాల వైపు వెళుతుంది. నా భయం ఏమిటంటే... మణిపుర ఘోరాలు ఇంకా ఎన్నో మనం చూడాల్సి వస్తుందన్నది! అయితే ప్రస్తుతానికి మే 4వ తేదీ ఘటనలపై అధికారిక వివరణలు లేవనెత్తుతున్న ప్రశ్నలకే పరిమితమవుదాం. ఇవి కూడా మనలో ఆందోళన రేకెత్తించేవే!

బాధిత మహిళల్లో చిన్న వయసు మహిళ ‘ది ఇండియన్  ఎక్స్‌ ప్రెస్‌’ పత్రిక ప్రతినిధితో, ‘‘దుండగుల గుంపు మా ఊరిపై దాడి చేస్తున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు’’ అని చెప్పింది. దీనర్థం మనల్ని రక్షించాల్సిన వాళ్లే అక్కడ నిలబడి మౌన ప్రేక్షకులయ్యారా? ‘‘పోలీసులే మమ్మల్ని వారికి (దుండగులకు) అప్పగించారు’’ అని కూడా ఆ అమ్మాయి వాపోయింది. అంటే, తక్కువ సంఖ్యలో ఉన్నా సరే, పోలీసులు బలహీనంగా చేతులెత్తేశారు అని అర్థమా? అరాచక శక్తుల దాడి నుంచి పోలీసులు మహిళలను రక్షించలేదు సరికదా, వారు వారి భద్రత, ప్రాణాల సంగతి మాత్రమే చూసుకున్నారు. మనం వారి నుంచి ఆశించేది అది కాదు కదా?

మహిళలను దుండగులకు అప్పగించిన తరువాతైనా పోలీసులు అదనపు బలగాలను ఎందుకు రప్పించలేదు? అలాంటి ఘటనలు జరిగినప్పుడు పోలీసుల తక్షణ తప్పనిసరి ప్రతిస్పందన ఇలాగే కదా ఉండాలి? ఇది కూడా జరగలేదు. పైగా ఆ బాధిత మహిళలు దగ్గర లోని ఆసుపత్రిని చేరేందుకు దాదాపు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చింది! కనీసం ఇప్పుడైనా పోలీసులు తిరిగివచ్చి, ఆ మహిళలకు కాస్తంత చేయూతనివ్వాల్సింది కదా?

మే నాలుగున జరిగిన ఘటనలకు సంబంధించి తొలి జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది ఆ నెల 18వ తేదీన. రెండోది జూన్  21వ తేదీన. కానీ దాడులకు పాల్పడిందెవరో తెలియని కారణంగా తాము ఏ చర్య కూడా తీసుకోలేకపోయామని పోలీసులు అంటున్నారు.

నిజంగానా? తాము ఎవరికి ఆ మహిళలను అప్పగించామో కూడా గుర్తు పట్టలేక పోయారా? వారి ముఖాలు మరచిపోయారా? దుండగుల గుంపులో కొందరిని తాను గుర్తుపట్టగలనని బాధిత యువ మహిళ ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌’కు తెలిపింది.

అందులో తన సోదరుడి స్నేహితుడూ ఉన్నాడని పేర్కొంది. పోలీసులు చర్య తీసుకునేందుకు ఈ సమాచారమూ సరిపోలేదా? నిజమేమిటంటే... పోలీసులు ఆ బాధిత మహిళ వాఙ్మూలాన్ని ఇప్పటివరకూ రికార్డే చేయలేదు. 

సరే... ఇదంతా జరిగిన తరువాత కనీసం ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ అయినా తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేశారా? వీడియో చూసిన వెంటనే తనకు తానుగా సూమోటో కేసుగా దీన్ని తీసు కున్నానని ఆయన చెప్పారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన రెండు నెలలకు ‘సూమోటో’ కేసుగా తీసుకోవడం ఏమిటి?

మే నాలుగు నాటి ఘటనల గురించి తాను జూన్  19న మణిపుర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(డీజీపీ)లకు సమా చారం ఇచ్చానని జాతీయ మహిళా కమిషన్  ఛైర్‌పర్సన్  వెల్లడించారు. మరి, ముఖ్యమంత్రికి ఎవరూ చెప్పలేదా? ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఎందుకు ఏ రకమైన చర్యా తీసుకోలేదు?

ఇంకో విషయం. దాడులకు పాల్పడిందెవరో గుర్తించలేని కారణంగా తాము రెండు నెలలుగా ఏ చర్యా తీసుకోలేకపోయామని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ (వీడియో బయటికి వచ్చిన) కేవలం 24 గంటల్లోనే నలుగురిని అరెస్ట్‌ చేశారు. రెండు నెలలుగా సాధ్యం కానిది 24 గంటల్లో మెరుపువేగంతో ఎలా చేయగలిగారు? ఈ ప్రశ్నకూ సమాధానం కావాలి.

చివరగా... జాతీయ మహిళా కమిషన్  విషయానికి వద్దాం. జూన్‌ 12న నార్త్‌ అమెరికన్  మణిపుర ట్రైబల్‌ అసోసియేషన్, ఇద్దరు మణిపుర మహిళా కార్యకర్తలు రాసిన లేఖ ఒకటి కమిషన్ కు చేరింది. ‘‘మే నెల నాలుగవ తేదీన కాంగ్పోకీ జిల్లాలోని బి. ఫైనామ్‌ గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలను వివస్త్రలను చేశారు. నగ్నంగా ఊరేగించారు. కొట్టడం మాత్రమే కాకుండా చుట్టుముట్టిన మైతేయ్‌ మూక బహిరంగంగా మానభంగానికి పాల్పడింది. రాష్ట్రానికి చెందిన పోలీ సులు ప్రేక్షకుల్లా ఉండిపోయారు.

ఇద్దరు బాధితులు చురాచాంద్‌పూర్‌ జిల్లా శరణార్థి శిబిరాల్లో ఉన్నారు’’ అని ఆ ఘటనలకు సంబంధించి నిర్దుష్టంగా, వివరంగా తెలిపారు. అయినాసరే... జాతీయ మహిళ కమిషన్  ఛైర్‌పర్సన్  రేఖా శర్మ తాను ఎలాంటి చర్య తీసుకోలేక పోయానని చెబుతూ, అందుకు కారణం అది సాధారణ సమాచారం కావడమనీ, నిర్దిష్టంగా ఫలానా ఘటన గురించిన సమాచారం లేదనీ అన్నారు. మణిపురలోని పరిస్థితుల దృష్ట్యా కమిషన్  తన ప్రతినిధి బృందాన్ని అక్కడకు పంపలేకపోయిందని కూడా ఆమె చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మణిపురను సందర్శించగలిగారు. సామాజిక కార్యకర్త అన్నీ రాజా వెళ్లగలిగారు. కానీ శౌర్య గల కమిషన్‌ మాత్రం వెళ్లలేకపోయింది!

అయితే రేఖా శర్మకు ఇవ్వాల్సిన క్రెడిట్‌ ఇద్దాం. ఆమె మణిపుర ప్రధాన కార్యదర్శి, డీజీపీలకు లేఖనైతే రాశారు. వాళ్లేం చేయలేదు. ఈమె కూడా పట్టించుకోలేదు. దీనర్థం తాను చేయాల్సిన పని కనీస మాత్రంగానే చేశారనా? అది కూడా సంశయాస్పదమా?

తమ కామెంట్లు తమపైకే తిరగబడే సందర్భం వస్తుందని ఊహించని కొందరు రాజకీయ నేతలు చేసిన వ్యాఖ్యతో ముగిస్తాను. 2017లో కాంగ్రస్‌ ప్రభుత్వం అధికారంలో ఉండగా... ప్రధానమంత్రి ఓ ట్వీట్‌ చేస్తూ...‘‘రాష్ట్రంలో శాంతిని కాపాడలేని వారికి మణిపురను పాలించే అర్హత లేదు’’ అన్నారు. ఈ వ్యాఖ్యతో నాకు ఎలాంటి విభేదాలూ లేవు!


       కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement