కేంద్ర ప్రభుత్వానికి అన్నీ తప్పుడు సలహాలే అందుతు న్నాయా? లేక ఆహార ద్రవ్యోల్బ ణానికి అసలు కారణాలేమిటన్నది అర్థం చేసుకునే విషయంలో పూర్తిగా విఫలమైందా? ఇవేవీ కాకుండా, ప్రజలపై సానుకూల ముద్ర పడేలా నాటకీయ ఫక్కీలో ఒక నిర్ణయం తీసుకోవాలని యోచిస్తోందా? ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి గోధుమల ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించినట్లు? సమస్యపై విపరీతమైన సాను భూతి వ్యక్తం చేసి, ఎన్నికల్లో తమకు లబ్ధి కలిగేలా చూసుకోవడమే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్దేశమా?
2021 –22 సంవత్సరానికి గానూ దేశం మొత్తమ్మీద పండిన పంటలపై ఇటీవలే మూడో ముందస్తు అంచనాలు వెలువడ్డాయి. తిండిగింజల దిగుబడులు రికార్డు స్థాయిలో 31.45 కోట్ల టన్నులని ఈ గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 3.77 మిలియన్ టన్నులు ఎక్కువ. బియ్యం దిగుబడి గత ఏడాది కంటే 52 లక్షల టన్నులు ఎక్కువ కాగా... గోధుమ పంట కూడా సుమారు 31 లక్షల టన్నుల వరకూ ఎక్కువ చేతికొచ్చింది. భారత దేశపు తిండిగింజలు అవసరానికి మించి రిజర్వులో ఉన్నాయి. గోధుమలు దాదాపు కోటీ తొంభై లక్షల టన్నులు నిల్వ ఉండగా, బియ్యం 5.5 కోట్ల టన్నులు గోదాముల్లో ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం 74 లక్షల టన్నుల గోధుమలు, కోటీ 35 లక్షల టన్నుల బియ్యం బఫర్ స్టాక్‌గా ఉంటే సరిపోతుంది.
గోధుమ ఎగుమతులను పెంచేందుకు పది దేశాలకు వ్యాపార బృందాలను పంపుతున్నట్లు ప్రకటించిన 48 గంటల్లోనే ప్రభుత్వం గోధుమ ఎగుమతులపై నిషేధం ఎందుకు విధించింది? పైగా ఈ ఏడాది కోటి టన్నుల గోధుమలు ఎగుమతి చేస్తామని గొప్పగా ప్రకటించిన తరువాత నిషేధం విధించాల్సిన పరిస్థితులు ఏమిటో ప్రభుత్వమే చెప్పాలి. ఎగుమతుల ద్వారా కొన్ని డబ్బులు సంపాదించుకోవచ్చునన్న రైతుల ఆశలకు గండి పడింది. భారత్‌తో పోలిస్తే బయటి దేశాల్లో గోధుమల ధర ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎగుమతులపై నిషేధం విధించడం వారికి నష్టం చేకూర్చడంతో సమానమని చెప్పాలి. నిషేధం విధించకపోయి ఉంటే, భారత దేశపు గోధుమ వ్యాపారాన్ని తాము కూడా సమర్థంగా నిర్వహిం చగలమని చాటి చెప్పేందుకు వ్యాపారులకూ ఓ మంచి అవకాశం దక్కినట్లు అయ్యేది.
భారతదేశం గోధుమ ఉత్పత్తిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కార ణంగా గోధుమల సరఫరాకు సంబంధించి ప్రపంచం చిక్కులు ఎదుర్కొంటున్నట్లు వార్తలొస్తున్న సమయంలో తగినన్ని అందించడం ద్వారా మనం ఆ పని చేసిన ఘనతను తీసుకునే అవకాశం ఉండేది. విలువైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే అవకాశం సరేసరి. ఇప్పటి వరకూ ఎగుమతి చేయని దేశాలు, ప్రాంతాలకు గోధుమ లను పంపడం ద్వారా భవిష్యత్తులో మన సరుకులకు కొత్త మార్కెట్లు అందుబాటులోకి వచ్చేవి.
దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగిపోతూండటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసి ఉంటుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ అంత గాభరా అవసరం లేదు. వినియోగదారుల ధరల సూచీ తాలూకూ ఆహార ద్రవ్యోల్బణంలో తిండి గింజలు భాగస్వామ్యం పది శాతం కంటే తక్కువ. తయారు చేసిన ఆహార పదార్థాలు, వంట నూనెలు రెండూ దాదాపు 41 శాతం ఉంటాయి. పండ్లు, కాయగూరల భాగం 27.5 శాతం కాగా, ఆహార ద్రవ్యో ల్బణంలో పాలు, మాంసం, చేపల వంటి ఉత్పత్తుల భాగం 17 శాతం ఉంటుంది. అంటే తిండిగింజల ఎగుమ తులపై నిషేధం విధించడం వల్ల ఆహార ద్రవ్యోల్బణంలో కేవలం పది శాతం మాత్రమే ప్రభావితమవుతుందన్న మాట.
ఇప్పుడు చెప్పండి... ఎగుమతుల నిషేధం బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా? వారి అసలు ఉద్దేశా లేమిటో నాకు అర్థమవుతూనే ఉంది. ఈ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తోందనీ, చాలా వేగంగా ఆలోచించి నిర్ణ యాలు తీసుకుంటోందనీ ఒక సందేశం పంపడం మాత్రమే బీజేపీ ఏలుబడిలోని ప్రభుత్వం ఉద్దేశంగా కనిపిస్తోంది. ‘చూశారా, మీకు సాయపడేందుకు మేమె ప్పుడూ సిద్ధంగానే ఉంటా’మని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే ఈ మాట కాకుండా... ‘ఎగుమ తుల గురించి మీరేమీ చింత పడాల్సిన అవసరం లేదు. దేశ అవసరాలకు మించి నిల్వలు ఉన్నాయి మన దగ్గర. అవసరమైనప్పుడు ప్రపంచాన్ని కూడా ఆదుకుంటామని చెప్పేందుకు ఇదో మంచి అవకాశం’ అని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే... జీ–7 దేశాల వ్యవసాయ మంత్రులు భారత్ నిర్ణయంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జియోర్జివా కూడా భారత్ తన వైఖరిని మార్చుకుని గోధుమ ఎగుమతులపై తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.
మొత్తమ్మీద చూస్తే... భారతదేశం ప్రపంచంలో ఓ పెద్ద శక్తిగా ఎదగాలన్న కాంక్షనైతే చూపుతోంది గానీ, మనకు అందుబాటులో ఉన్న చిన్న శక్తిని కూడా ఇతరులకు పంచడంలో విఫలమవుతున్నట్లు అనిపిస్తోంది. ప్రపంచం మన నుంచి ఇలాంటి చిన్న చర్యలను ఆశిస్తున్న సమయం లోనే మనం ఇలాంటి చర్యలకు దిగుతున్నాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మనం భాగస్వాములు కావచ్చు గాక; అలాగే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో కలిసి క్వాడ్ గ్రూపును ఏర్పాటు చేయవచ్చు గాక; మనల్ని మనం విశ్వ గురువులుగా ప్రకటించుకోనూవచ్చు గాక. కానీ అవసరమైన సందర్భాల్లో మనకు చేతనైన చిన్న పనులు కూడా చేయడంలో మాత్రం విఫలమవుతున్నాం. మరి ప్రపంచం మన సామర్థ్యాన్ని గుర్తించేదెలా? మనకు ఆ గుర్తింపు అవసరం లేదా? లేక ఆ మాత్రం తెలివిడి మనకు లేకుండా పోతోందా?
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
కరణ్ థాపర్
Comments
Please login to add a commentAdd a comment