ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం? | Karan Thapar Article on Bjp Demand to Change Mughal-Era Delhi Name | Sakshi
Sakshi News home page

ఇలా ఎన్ని పేర్లు మారుద్దాం?

Published Mon, May 9 2022 12:39 AM | Last Updated on Mon, May 9 2022 7:50 AM

Karan Thapar Article on Bjp Demand to Change Mughal-Era Delhi Name - Sakshi

ఢిల్లీ దగ్గర మొఘల్‌ పాలకుల పేర్లతో చలామణీ అవుతున్న కొన్ని ఊళ్ళ పేర్లను వ్యతిరేకిస్తున్నారంటే కారణం... మొఘలులు హిందువులను అవమానించారనీ, వధించారనీ బలంగా నమ్మడమే! ఈ దేశంలో ఎన్నో రహదారులకూ, హోటళ్లకూ అశోక అని పేరు పెట్టడం తెలిసిందే కదా! అశోకుడే స్వయంగా అంగీకరించినట్లు, తన పాలనా కాలంలో లక్ష మంది కళింగ ప్రజలను యుద్ధంలో చంపేశాడు. గుప్తా అభిప్రాయం ప్రకారం అశోకుడి పేరును దేశ జ్ఞాపకాల్లోంచే తుడిచేయాల్సి ఉంటుంది. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఢిల్లీని పరిరక్షించడానికి నజఫ్‌ఖాన్‌ నిర్మించిన కోట పేరే నజఫ్‌గఢ్‌. బీజేపీ భావజాలం ప్రకారం ఇది నజఫ్‌ఖాన్‌ను స్వాతంత్య్ర సమరయోధుడిని చేస్తుంది. ఒక నగరం పేరు లేదా రహదారి పేరు మార్చిపడేయడం ద్వారా చరిత్రను తిరగ రాయలేరు. నగరం అనేది ఒక సజీవ వస్తువు. అదొక దయ్యాల కొంప కాదు. తొలగించాల్సిన శిథిల ప్రాంతం అంతకంటే కాదు.

భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఒక ఉత్తరం రాశారు. మొఘల్‌ యుగం నాటి నలభై గ్రామాల పేర్లు మార్చి వేయాలనేది ఆ ఉత్తరం సారాంశం. అయితే ఆ ఉత్తరం తప్పనిసరిగా పాటించి తీరవలసిన ఒక ఆదేశంగా కేజ్రీవాల్‌ స్వీకరించి ఉండరని నేను నమ్ముతున్నాను. పైగా ఆదేశ్‌ గుప్తా తన ఉత్తరంలో కోరిన విషయం తర్కబద్ధంగానూ లేదు, చిత్తశుద్ధితోనూ లేదు. కచ్చితంగా అది వాంఛనీయమైన ఉత్తరం అయితే కాదు. కాబట్టి ఆ ఉత్తరానికి స్పందన గుప్తంగా ఉంచదగినది కాదు. దానికి స్పందన చాలా గట్టిగా ఉండాలి. స్పష్టంగా ఉండాలి. కొట్టిపడేసేదిగా ఉండాలి.

‘ఢిల్లీ ఇక ఏమాత్రం మొఘలాయీ రాజ్యం కాదు. ఇది దేశ రాజధాని. బానిసత్వానికి చెందిన ఏ చిహ్నం కూడా ఇక్కడ ఉండ కూడదు. ప్రత్యేకించి మనం 75వ స్వాతంత్య్రోత్సవాలను జరుపు కొంటున్నప్పుడు...’ అంటూ గుప్తా తన ఉత్తరంలో రాశారు. తాను పొందుపరిచిన గ్రామాల జాబితాలోని సరాయ్, జమ్‌రోద్‌ పూర్, తాజ్‌పుర్, నజఫ్‌గఢ్, నెబ్‌ సరాయ్, లాడో సరాయి, హౌజ్‌ ఖాస్‌ వంటి పేర్లు ఆయనకు చీకాకు తెప్పించి ఉంటాయి. కానీ ఆ పేర్లు కూడా బానిసత్వ చిహ్నాలేనా? అవి బానిసత్వ సంకేతాలా?

నిజానికి అవి బానిస చిహ్నాలు ఎంతమాత్రం కావు. ‘ఆనాటి పాలకులు నజరానాగా ఇచ్చిన భూములను సంబంధిత వ్యక్తుల పేర్లతో పిలుస్తూ వచ్చారనీ, కాబట్టే బాబర్‌పుర్, తిమార్‌పుర్, హుమయూన్‌పుర్‌ వంటి ఊళ్ళు లబ్ధిదారుల పేర్లను సూచిస్తాయి తప్ప అవి పాలకుల పేర్లు కాదు’ అని చరిత్రకారిణి నారాయణి గుప్తా చెప్పారు. గుప్తా అభిప్రాయం ప్రకారం ముస్లిం పేర్లను సూచించే ఊళ్ళ పేర్లు మొఘలులు లేదా వారి పూర్వీకుల పేర్లను సూచిస్తాయని ఆరోపించడం తప్పు అని దీన్ని బట్టి బోధపడుతుంది.

చాందినీ చౌక్‌పై రాసిన రచనకు లాగానే (చాందినీ చౌక్‌: ద మొఘల్‌ సిటీ ఆఫ్‌ ఓల్డ్‌ ఢిల్లీ), ఢిల్లీపై స్వప్నా లిడిల్‌ రాసిన పుస్తకం కూడా (కన్నాట్‌ప్లేస్‌ అండ్‌ ద మేకింగ్‌ ఆఫ్‌ న్యూఢిల్లీ) చాలా పేరుపొందింది. గుప్తాకు సరాయ్‌లతో వచ్చిన సమస్య ఏమిటి అంటూ ఈ పుస్తకంలో ఆమె ప్రశ్న సంధించారు. నజఫ్‌గఢ్‌ లాగా అది ఒక ఉర్దూ పేరు కావడమే సమస్యా లేక తూర్పు ఇండియా కంపెనీపై దాడిచేసిన మీర్‌ కాశీం సైన్యానికి నాయకత్వం వహించిన మొఘల్‌ జనరల్‌ పేరు కావడమే సమస్యా అని ఆమె ప్రశ్నించారు. బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా ఢిల్లీని పరిరక్షించడానికి నజఫ్‌ఖాన్‌ నిర్మించిన కోట పేరే నజఫ్‌గఢ్‌. భారతీయ జనతా పార్టీ భావజాలం ప్రకారం ఇది నజఫ్‌ఖాన్‌ను స్వాతంత్య్ర సమరయోధుడిగా చేస్తుందనుకుం టాను మరి!

అశోకుడి మాటేమిటి?
ఏదేమైనా, మరింత విస్తృతమైన, అదే సమయంలో ఆలంకారికమైన విషయాన్ని చెప్పనివ్వండి. మొఘల్‌ పాలకుల పేర్లతో చలామణీ అవుతున్న ఊళ్ళ పేర్లను బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా వ్యతిరే కిస్తున్నారంటే కారణం... మొఘల్‌ పాలకులు హిందువులను అవమా నించారనీ, వధించారనీ! ఆ తర్కం ప్రకారం చూస్తే అశోక్‌ అనే పేరు కూడా మనకు బాగానే గుర్తుండాలి. ఈ దేశంలో ఎన్నో రహదా రులకు, హోటళ్లకు అశోకా అని పేరు పెట్టడం తెలిసిందే కదా! అయితే ఇప్పుడు ఈ పేరును మన దేశ జ్ఞాపకాల్లోంచే తుడిచేయాల్సి ఉంటుంది మరి. ఎందుకంటే అశోకుడే స్వయంగా అంగీకరించినట్లు తన పాలనా కాలంలో లక్ష మంది కళింగ ప్రజలను యుద్ధంలో చంపే శాడు. ఈ రోజయితే దాన్ని ‘జాతి హత్యాకాండ’ అని పిలుస్తారు. 

చరిత్రను తిరగరాయడమా?
ఆదేశ్‌ గుప్తా గుర్తించని మరొక విషయం ఉంది. ఒక నగరం పేరు లేదా రహదారి పేరు మార్చిపడేయడం ద్వారా మీరు చరిత్రను తిరగ రాయలేరు. ఇది చాలా ప్రాధాన్యం కలిగిన విషయం. దీనికి సంబం ధించి లండన్‌ నుంచి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తాను. బ్రిటిష్‌ రాజ ధాని లండన్‌లోని సుప్రసిద్ధ ప్రాంతాల్లో హానోవర్‌ స్క్వేర్‌ ఒకటి. క్రీస్తు శకం 1714 నుంచి 1901 వరకు పాలించిన జర్మన్‌ రాజవంశం పేరును దీనికి పెట్టారు. అయితే జర్మనీతో రెండు ప్రపంచ యుద్ధాల్లో పోరాడి నప్పటికీ, జర్మన్ల చేతుల్లో వేలాది మంది బ్రిటన్‌ సైనికులు, ప్రజలు మరణించినప్పటికీ జర్మన్‌ రాజవంశం పేరు పెట్టుకున్న హానోవర్‌ స్క్వేర్‌ పేరును మార్చలేదు.

అందుకే మొఘలులు లేదా సుల్తాన్లు మన దేశ చరిత్రలో ఎంత విడదీయరాని విధంగా నిలిచిపోయారో... అలాగే హానోవరియన్స్‌ కూడా బ్రిటిష్‌ చరిత్రలో తొలగించలేని భాగంగా నిలిచిపోయారు. ఇప్పుడు ముస్లింల పేర్లతో ఉన్న ఆ నలభై గ్రామాల పేర్లను తొలగించి రఫీ, లతా, మిల్ఖా సింగ్, యశ్పాల్‌ శర్మ, వాల్మీకి అని కొత్త పేర్లు పెట్టాలని బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా కోరుకుంటున్నారు. కానీ ఢిల్లీలో జన్మించి ఉండని, ఇక్కడ అసలు నివసించి ఉండని, ఢిల్లీతో ఏ సంబంధమూ ఉండనివారి పేర్లు పెడితే వారి పేర్లకూ, ఢిల్లీకీ ఏ అనుసంధానం ఉన్నట్లో గుప్తానే చెప్పాలి.

పేరునే కాదు... కేరక్టర్‌నే మార్చేస్తున్నారు
ఈ ఆలోచన నాకు మరొక విషయాన్ని గుర్తు చేస్తోంది. స్థలాలు అనేవి కేవలం గుర్తు కోసం మాత్రమే కాదు. ఆ పేర్లతో ఉద్వేగపూరితమైన అనుబంధం కూడా అవి కలిగి ఉంటాయి. ఇతర లక్షణాలతోపాటు ఒక స్థలానికి సంబంధించిన కేరక్టర్‌ కూడా ఆ పేరులో ఒక భాగమే. మీరు నిర్బంధంగా ఒక పేరును మార్చదల్చుకున్నప్పుడు దాని వెనక ఉన్న కేరక్టర్‌ని కూడా మారుస్తున్నారని అర్థం చేసుకోవాలి.

పేర్లు అనేవి ప్రజలు అనుబంధం పెంచుకుంటూ పెరిగిన అసోసియేషన్లు అని మర్చిపోరాదు. ఆ పేర్లతోనే ప్రజలు తమ నగరాలను లేదా తమ స్థలాలను గురించి ఆలోచించుకుంటారు. కాబట్టే కన్నాట్‌ప్లేస్‌ని ప్రజలు ఇష్టంగా సీపీ అనే పిలుచుకుంటారు తప్పితే రాజీవ్‌ చౌక్‌ అని కాదు. నిజానికి బీజేపీ నాయకుడైన ఆదేశ్‌ గుప్తా సైతం దాని ప్రస్తుత అధికారిక పేరును ఉపయోగిస్తారా అంటే నాకు సందేహమే!

ఈ సందర్భంగా మీకు ఒక అద్భుతమైన ఉదాహరణ చెబుతాను. వేలాదిమంది భారతీయ పురుషులకు నాథూరాం అనే పేరు ఉండి తీరాలి. కానీ 1948 తర్వాత అంటే నాథూరాం గాడ్సే,  జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన అనంతరం, తల్లిదండ్రులు తమ పిల్లలకు అప్పటికే పెట్టి ఉన్న నాథూరాం పేరును మార్చేయాలని నిర్ణయించుకుంటే అది వారికి ఎంత హృదయ వేదనను కలిగిస్తుందో ఆలోచించండి. మరి శతాబ్దాలుగా ఒక నగరానికి కొనసాగుతూ వచ్చిన పాత పేరును మార్చడంలో కూడా ఇదే అనుభూతి ఉంటుంది కదా! నగరం అనేది ఒక సజీవ వస్తువు. అంతే తప్ప అదొక దయ్యాల కొంప కాదు. తొలగించాల్సిన శిథిల ప్రాంతం అంతకంటే కాదు. నారాయణీ గుప్తా చెప్పిన మాటలతో  ఈ కథనాన్ని ముగించదలిచాను. ‘మనం ఒక సామూహిక మానసిక వైకల్యంలోకి దిగజారి పోతున్నాం’ అని ఆమె అన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ పరిస్థితికి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్‌ గుప్తా లాంటి వాళ్లనే చాలావరకు తప్పుబట్టాల్సి ఉంటుంది. 

వ్యాసకర్త: కరణ్‌ థాపర్‌
సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement