సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దివంగత ఫాలీ ఎస్. నారిమన్ (10 జనవరి 1929 – 21 ఫిబ్రవరి 2024)
కామెంట్
‘‘ప్రతిపక్షం అన్నది ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు’’ అని దృఢంగా నమ్మేవారు ఫాలీ శామ్ నారిమన్. ‘‘ప్రస్తుత పరిస్థితులతో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని అనేవారు. ‘‘దారికి ఒప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. పరిస్థితులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నది ఆయన అభిప్రాయం. ‘‘భారత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల పరిరక్షణకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి’’ అనేవారు.
ఆఫీసులో నా డెస్కుకు ఎదురుగా ఉన్న గోడకు ఫాలీ నారిమన్ ఫొటో వేలాడదీసి ఉంటుంది. అది ఆయన స్వాభావిక మృదుహాసాన్ని, మిలమిల మెరిసే కళ్లను పట్టివ్వదు కానీ, ఆయనలోని దృఢచిత్తాన్ని, ఒడుదొడు కులను తట్టుకోగలిగిన స్థితిస్థాపక గుణాన్ని మాత్రం ప్రతిఫలిస్తూ ఉంటుంది. కెమెరాలోకి గుచ్చి చూస్తూ, తన కుడి చేతితో కుర్చీ ఆన్పును దృఢంగా పట్టుకుని ఉన్న ఆయన తీరును గమనిస్తే... ఆయన – తనేమిటో తనకు తెలిసిన మనిషి అనీ, తనను తాను స్వీయ స్పృహ లేకుండా వ్యక్తపరచుకోగలరనీ మీరు పసిగట్టగలరు.
ఆ గోడపైన ఉన్నది – ఆయన చివరి పుస్తకం ‘యు మస్ట్ నో యువర్ కాన్‌స్టిట్యూషన్’ ఆవిష్కరణ సందర్భంగా ఆయనతో నా చివరి ఇంటర్వ్యూకు ముందరి ఇంటర్వ్యూలో తీసిన ఫొటో. ఆ ఇంట ర్వ్యూలో ఆయన మాట్లాడిన చాలా విషయాలు మన దేశానికి ఒక సందేశం అనే నేను నమ్ముతున్నాను.
ప్రసిద్ధ బ్రిటిష్ న్యాయ–విద్యావేత్త ఐవర్ జెన్నింగ్స్‌ను అంగీకా రంగా ఉటంకిస్తూ, నారిమన్ ఇలా అన్నారు: ‘‘పార్లమెంటులో అత్యంత ముఖ్యమైన వ్యవస్థ ప్రతిపక్షమే అని అనడంలో అవాస్తవ మేమీ లేదు. ప్రతిపక్షం అన్నది ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం. ప్రజల అసంతృప్తిని ప్రతిఫలించే దృష్టికేంద్రం. ప్రభుత్వం ఎంత ముఖ్య మైనదో, ప్రతిపక్షం పనితీరు కూడా దాదాపుగా అంతే ముఖ్యమైనది. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యమే ఉండదు.’’
అలా అని ప్రభుత్వాన్ని మనం ఎలా ఒప్పించగలమని ఇంటర్వ్యూ మధ్యలో నేను అడిగినప్పుడు, ఆయన నవ్వి ఊరుకున్నారు. అది నేను చేయగలిగిందైతే కాదు అన్నారు. ఏమైతేనేం, ఆయనే ఆ తర్వాత ‘‘నాకొచ్చిన సందేహాన్నే మీరు వ్యక్తం చేయటం నాకెంతగానో సంతోషంగా ఉంది’’ అన్నారు.
నారిమన్ మాట్లాడే ధోరణి సూటిగా, సందర్భశుద్ధితో ఉంటుంది తప్ప... ఎప్పుడూ కూడా బాధించేలా, అభ్యంతరకరంగా ఉండదు. కొన్నిసార్లు ఆయనే మిమ్మల్ని మెల్లగా నడిపిస్తున్నారని కూడా మీరు తెలుసుకోలేరు. ఉదాహరణకు, బహుశా మేము తొలిసారి కలుసు కోవటం రచయిత పత్వంత్ సింగ్ ఇంట్లోననుకుంటా... ఆయన నా భుజం చుట్టూ చేయి వేసి – మిగతావాళ్లంతా డైనింగ్ టైబుల్ దగ్గర్నుంచి డ్రాయింగ్ రూమ్‌కు కదులుతూ ఉండగా – నన్ను ఒక మూలకు తోడ్కొని వెళ్లారు.
‘‘గుర్తుంచుకో! పత్వంత్ ఎప్పుడూ కూడా చివరి మాట తనదే కావాలని కోరుకుంటాడు. అలా ఉండేందుకు మీరు ఆయన్ని అనుమతిస్తే ఎప్పటికీ మీ స్నేహితుడిగా ఉంటాడు’’ అన్నారు. బాగా గుర్తు... పత్వంత్‌ని నేను ప్రశ్న మీద ప్రశ్న అడుగుతూనే ఉన్నాను. సన్నటి గీతను దాటేస్తున్నానేమోనని నారిమన్ నన్ను నెమ్మదిగా హెచ్చరిస్తూనే ఉన్నారు.
ప్రభుత్వం అతి సమీపంగా ప్రస్తావనకు వచ్చిన అనేక అంశాలపై ఇంటర్వ్యూలో నారిమన్ ఇదే విధమైన సున్నిత శైలిని అవలంబించారు. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పటికీ మనం ఒక కొత్త రాజ్యాంగాన్ని రూపొందించుకోలేం’’ అని ఆయన అన్నారు. ‘‘దారికి రప్పించటం, కోరినది ఇవ్వటం, ఓరిమి వహించటం’’ అనే ఔదార్యాలు లేకుండా అద్భుతమైన, వినూత్నమైన ఆలోచనలు మాత్రమే మనకొక ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని ఏనాటికీ అందించలేవు. ‘‘పరిస్థి తులను బట్టి చూస్తే భారతదేశంలో ప్రస్తుతం ఇవి మూడూ క్షీణించి ఉన్నాయి’’ అన్నారాయన.
ఇటీవలి ఆయన మరణం తర్వాత నేను మళ్లీ ఆనాటి ఇంట ర్వ్యూను విన్నాను. నారిమన్ ఎంత బుద్ధిశాలిగా మాట్లాడారో వెంటనే గమనించాను. ‘‘రాజ్యాంగంలో ప్రవేశిక చాలా ముఖ్యమైన భాగం’’ అన్నారు. ప్రవేశికను ఆయన రాజ్యాంగం యొక్క మనస్సాక్షి అన్నారు. ప్రవేశికలోని ‘సౌభ్రాతృత్వం’ అనే భావన గురించే ఆనాడు ఆయన నొక్కి మాట్లాడారా? ప్రవేశికలో మాత్రమే ఉన్న మాట అది.
ఆ తర్వాత ‘సహనశీలత’ వైపుగా మా సంభాషణను నడిపించింది నేను కాదు, ఆయనే! ప్రస్తుతం సమస్యేమిటంటే మనకు ‘‘సహనం లేదు’’ అన్నారాయన. మళ్లీ ఆ తర్వాత కూడా ఈ మాట అనడం కోసం ఆయన తన పుస్తకం హద్దులను సైతం దాటేశారు.
ఆప్పుడు నేను పట్టుకోలేకపోయాను కానీ, ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఆలోచిస్తే ఆయన ఎంత జాగ్రత్తగా ఆ సందేశాలు ఇచ్చారో కదా అని ఆశ్చర్యం కలుగుతోంది. మరికొన్ని కూడా ఉన్నాయి. భారత పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్ని నిలబెట్టేందుకు మన న్యాయమూర్తులు మరింత సుముఖంగా ఉండాలి అన్నారు. అలా ఉండేందుకు వారు ఇష్టపడకపోవటం ఆయన్నెంతో నిరాశకు గురి చేసింది. అయితే వారిని తీవ్రంగా విమర్శించేందుకు సంకోచించి, ‘క్యురేట్స్ ఎగ్’తో పోల్చి సరిపెట్టుకున్నారు... మంచీ ఉందీ, చెడూ ఉందీ... అయితే మంచిని చెడు తినేస్తోంది అనే అర్థంలో!
నారిమన్‌తో నేను పలు ఇంటర్వ్యూలు చేశాను. తొలినాళ్లలో ఆయన స్పోర్టింగ్ బ్రేసెస్‌ని ధరించి ఉండేవారు. నాకు బౌ టై ఉండేది. మా మధ్య సంభాషణ గొప్ప శక్తితో, ఆసక్తితో సాగేది. మధ్యలో స్నేహ పూర్వకమైన అంతరాయాలను కలిగించుకునేవాళ్లం. ఉల్లాసం, ఉత్సాహం తరచూ మా ఇంటర్వ్యూలను నడిపించేవి. అవును, మా సంభాషణ గురించి ఇలాగే చెప్పాలి.
ఆయన భార్య బాప్సి ఓ వైపున కూర్చొని ఉండి మా సంభా షణను ఆలకిస్తూ ఉండేవారు. దాదాపు ప్రతిసారీ ఆమె నన్ను భోజనానికి ఉండమనేవారు. ఆమె అలా అనడమే ఆలస్యం నేను భోజనా నికి తయార్! ఆయన నాతో పాటుగా కారు వరకు బయటికి నడిచి వచ్చేవారు. నేను వారికి వీడ్కోలు చెబుతున్నప్పుడు... ‘‘ఆమెకు నువ్వంటే అభిమానం’’ అని నవ్వుతూ అనేవారు.
ఆ గుణం కూడా ఆయన గురించిన సముచితమైన విశేషణమే. ఆయన పట్ల నాకు గొప్ప గౌరవభావం. ఆయన మేధ నన్ను ముగ్ధుడిని చేసేది. మనసులో ఏదీ దాచుకోలేని ఆయన స్వభావం, ఒక సరైన పని చేయటంలో ఆయనకు ఉండే నిస్సంశయ నిబద్ధత నన్ను ఆశ్చర్యచకితుడిని చేసేవి. నేను కూడా ఆయనపై అభిమానం పెంచు కున్నాను. పెద్దగా పరిచయం లేకుండానే ఏర్పడే ఆప్యాయత వంటిది ఆ అభిమానం.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment