నూతన సంవత్సర తీర్మానాలు | Sakshi Guest Column New Year New Resolutions by Karan Thapar | Sakshi
Sakshi News home page

నూతన సంవత్సర తీర్మానాలు

Published Mon, Jan 2 2023 12:41 AM | Last Updated on Mon, Jan 2 2023 12:41 AM

Sakshi Guest Column New Year New Resolutions by Karan Thapar

జీవన చక్రం కొత్త మలుపు తిరిగినట్టు అనిపించే నూతన సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఏవో కొత్త తీర్మానాలు చేసుకునే సందర్భం ఇది. కొత్త పట్టుదలలు ప్రదర్శించే అవకాశం కూడా! కానీ ఏం తీర్మానం చేసుకోవాలి? ధూమపాన రాయుళ్లకు సిగరెట్లను వదిలిపెట్టాలని అనుకోవడం సులభమైన తీర్మానం. చాకొలేట్లు, పుడ్డింగులు వదిలేసుకునే వాళ్లు నాకు తెలుసు. కొందరయితే మద్యపానం వదులుకోవడాన్ని ఎంచుకుంటారు. అతి కొద్ది మంది మాంసాన్ని కూడా వదిలేసుకుంటారు.

మనం దేన్నయినా ప్రతిఘటిస్తున్నప్పుడు దృఢంగా ఉండాలని అనుకుంటాం. దానివల్ల మనది మనకు మెరుగైన భావన కలుగుతుంది. శుద్ధి అయినట్టు కూడా ఉంటుంది. అందుకే దేన్నయినా వదిలేసుకోవడం మంచి అనుభూతిని కలిగిస్తుంది. కానీ నిజమేమిటంటే, ఓటమిని అంగీకరించడం మరింత మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆస్కార్‌ వైల్డ్‌ చెప్పినట్లుగా, ఆశను లేదా ప్రలోభాన్ని అధిగమించడంలో ఉత్తమ మార్గం ఏమిటంటే, దానికి లొంగిపోవడమే!

పుట్టినరోజుల్లాగే నూతన సంవత్సరాది కూడా ప్రత్యేకమనిపిస్తుంది. ఈ రెండు సందర్భాల్లోనూ జీవనచక్రం కొత్త మలుపు తిరుగుతుంది. ఆశ, అంచనాలతో ముందుకు చూసే ఒక లిప్త పాటు అది. తాజా తీర్మానాలు చేసుకునే, కొత్త పట్టుదలలు ప్రదర్శించే అవకాశం అది. మనం మరింత ఉత్తమంగా ఉంటామనీ, లేదా కనీసం విభిన్నంగా ఉంటామనీ విశ్వాసం కలిగే సందర్భం ఇది.

నూతన సంవత్సర తీర్మానాలను ప్రజలు ఇందుకే చేసు కుంటారని నేను ఊహిస్తున్నాను. నేను కూడా తప్పనిసరిగా తీర్మా నాలు చేసుకున్న కాలం ఒకప్పుడు ఉండేది. సదాచార కట్టుబాట్లు విధించుకుని ఒక వారం పాటు గట్టిగా కట్టుబడి ఉండేవాడిని. తర్వాత మరో వారం దాన్ని బలహీనంగా కొనసాగించి, అటుపై దానిగురించి సంతోషంగా మర్చిపోయేవాడిని. తొలివారం బాగా అనిపించేది. 

రెండో వారం మాత్రం అపరాధ భావనను మిగిల్చేది. కానీ నా తీర్మానానికి తిలోదకాలు ఇచ్చి నా పాత చెడు మార్గాలకు తిరిగి వెళ్లిపోయినప్పుడే ఉత్తమంగా ఉందనిపించేది.
ఇప్పుడు తీర్మానం లక్ష్యం స్వీయ నిరాకరణే. దీంట్లో తర్కం సరళం. మీరు దేన్నయినా ప్రతిఘటిస్తున్నప్పుడు దృఢంగా ఉండాలని సాధారణంగా భావిస్తుంటారు. కొన్నిసార్లు మీరు శుద్ధి చేయబడినట్లు భావిస్తుంటారు. సాధారణంగా మీరు మెరుగైనట్లు భావిస్తుంటారు. అందుకే దేన్నయినా వదిలేసుకోవడం మంచి అనుభూతిని కలిగి స్తుంది. కానీ నిజమేమిటంటే, ఓటమిని అంగీకరించడం మరింత మంచి అనుభూతిని కలిగిస్తుంది.

ఆస్కార్‌ వైల్డ్‌ చెప్పినట్లుగా, ఆశను లేదా ప్రలోభాన్ని అధిగమించడంలో ఉత్తమ మార్గం ఏమిటంటే, దానికి లొంగిపోవడమే. అయితే ఆయన గుర్తించనిది ఏమిటంటే, కొంత కాలం ప్రతిఘటించిన తర్వాత దానికి లొంగిపోవడం మరింత ఉత్తమంగా ఉంటుందన్న సంగతి. తిరస్కరణకు సంబంధించిన ఒక మచ్చ ఆకలిని మరింత రెచ్చగొట్టి, ప్రలోభానికి పదునైన అంచును కల్పిస్తుంది. ఇక అతిక్రమణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఆ మొత్తం మరింత తియ్యగా ఉంటుంది.

సంక్లిష్టమైన ప్రశ్న ఏమిటంటే, అసలు ఒకరు వదులుకోవాల్సినది ఏమిటి? దీనికి ముందు షరతు ఏమిటంటే, అది అంత సులభ మైనదిగా ఉండకూడదు. లేకుంటే తొలి వారంలో మీరు అమరత్వం పొందిన సన్యాసత్వ ప్రభను ΄పొందలేరు. అలాగే ఆ వదులుకునేది మీకు ఏమంత మంచిది కాకుండా ఉండాలి. లేకపోతే మీరు చేసుకున్న తీర్మానం విఫలమైనప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోలేరు. కానీ అంతిమంగా, అది అంత పాధాన్యత లేని విషయంగా ఉండాలి. లేకుంటే మీరు చేతులు ఎత్తేసినప్పుడు మీకు ఉపశమనం కలగక పోగా, అపరాధ భావన కలుగుతుంది.

ఇది ఇక పరిధి లేదా పరిమితిని గణనీయంగా కుదించివేస్తుంది. ధూమపాన రాయుళ్లకు సులభమైన అవకాశం ఏమిటంటే, సిగరెట్లను వదిలిపెట్టడమేనని నేను అనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలో వారు విజయవంతమైనప్పుడు వారు మంచి అనుభూతి చెందుతారు. తాము సద్గుణవంతులుగా కూడా భావిస్తారు. అయితే వారు తొట్రు పడి పొరపాట్లు చేసి, తొలి పఫ్‌ పీల్చే ఆనందానికి లొంగిపోయి నప్పుడు అది మరింత బాగుంటుంది.

చాకొలేట్లు, పుడ్డింగులు (కేకుల్లాంటివి) వదిలేసుకునే వాళ్లు నాకు తెలుసు. కొందరయితే మద్యపానం వదులుకోవడాన్ని కూడా ఎంచు కుంటారు. అతి కొద్దిమంది మాంసాన్ని కూడా వదిలేసుకుంటారు. నిజాయితీగా చెప్పాలంటే, వీరిలో ఎవరూ నన్ను ప్రలోభ పెట్టలేదు. నా డిజెర్టులు (తీపి పదార్థాలు), తాగుళ్లు నాకు ఎంత ఇష్టమంటే
వీటిని వదులుకోవాలనే కనీస ఆలోచన కూడా నేను చేయలేను.

నేను కచ్చితమైన మాంసాహారిని. అంతకంటే ముఖ్యంగా, నేనేమీ సాధుత్వం కోసం ప్రయత్నించటం లేదు. వారం, పదిరోజుకోసారి స్వయంకృతాపరాధమే అయినా స్వల్పకాలిక ‘చిత్రహింస’ను భరిస్తాను.

నేను అబద్ధాలు చెప్పడం ఆపివేయాలనుకున్న సందర్భం కూడా ఒకటి ఉండేది. ఇప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఏదో సామెత చెప్పినట్టు, నేనేమీ అబద్ధాల కోరును కాదు. కానీ వింత అబద్ధాలను చెబుతుంటాను. కానీ చాలా తక్కువసార్లు మాత్రమే. దాన్ని గురించి మీరు ఆలోచించినట్లయితే, ఈ అబద్ధాలను వదులు కోవడం అనేది నూతన సంవత్సర తీర్మానాల్లోకి బ్రహ్మాండంగా సరిపోతుంది.

మీరు దాన్ని అమలు చేస్తున్నప్పుడు అది బాగుంద నిపిస్తుంది. కానీ మీరు పొరపాట్లు చేయడం మొదలైనప్పుడు మళ్లీ అపరాధ భావన కలుగుతుంది. ఇక మీరు తిరుగుబాటు చేసి, బొంకులు చెప్పడం తిరిగి మొదలుపెట్టినప్పుడు ఎంతో ఉపశమనం కలిగినట్లుగా ఉంటుంది.

నేను దాన్ని కనీసం రెండోరోజు వరకు కూడా పాటించ లేకపోయాను. నిజానికి, మొదటిరోజుకే సరిపోయింది. ప్రతి చిన్న అతిశయోక్తినీ తనిఖీ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఒక రకం అబద్ధమే. పర్యవసానంగా, సంభాషణ జరపడం అత్యంత అసా ధ్యంగా మారింది. నేను ఏం చెప్పాల్సి ఉంటుందనే విషయంపై ఆచితూచి, కచ్చితంగా వ్యవహరించాల్సి వచ్చింది.

ఆఖరికి నేను ఏమరుపాటుగా ఏదో చెప్పినదాన్ని కూడా దిద్దుకోవడానికి నన్ను మళ్లీ మళ్లీ ఎంత సవరించుకోవాల్సి వచ్చిందంటే, దాదాపుగా నేనిక మాట్లాడలేక పోయాను. మీకు నన్ను ఒకటి చెప్పనివ్వండి. మీకు గప్పాలు కొట్టడం రాకపోతే గనక, మీరు ఒక కథ చెప్పలేరు. కాబట్టి నా దగ్గర నిజంగానే చెప్పడానికి ఏమీ లేకుండాపోయింది.

2023 సంవత్సరం లోకి అడుగుపెడుతున్న వేళ ఏ ‘కొత్త సంవత్సరపు’  తీర్మానం చేసుకోవాలో నాకు కచ్చితంగా తెలీదు. నాకు ఇష్టమైనదాన్ని ఉద్దేశపూర్వకంగా నాకు నేనుగా తిరస్కరిస్తున్నప్పుడు ఒక పరమపావన గుణాన్ని నేను అనుభూతి చెందుతాను. కానీ అదేమిటో నేను ఆలోచించలేదు. బహుశా నా మనసును సిద్ధపర్చు కోవడానికి ఈ రోజంతా ఉంది.

కానీ అందులో విఫలమవుతానని నాకు ముందే అనిపిస్తోంది. అయితే ఒకటి, కనీసం వచ్చే సంవత్సరం కోసమైనా ఏదైనా ఎంపిక చేసుకోవడానికి నాకు 364 రోజులు ఉంటాయి. కాబట్టి ఏదైనా సరైనదాన్ని గురించి మీరు ఆలోచిస్తు న్నట్లయితే, అదేమిటో నన్ను కూడా తెలుసుకోనిస్తారా?
నూతన సంవత్సర శుభాకాంక్షలు!

కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement