ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజరాత్ ముఖ్యమంత్రి ప్రకటించడంపై తాజాగా చర్చ మొదలైంది. ఇంకా విచిత్రం ఏంటంటే, పలువురు విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా దీన్ని సమర్థించడం!
ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం! నిజమైన ప్రజాస్వామ్యం... తల్లితండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.
మన రాజకీయ నాయకుల నుండి, అంత కంటే ఎక్కువగా మన ప్రభుత్వాధినేతల నుండి నేను ఆశించే ఒక విషయం... కొద్ది మోతాదులోనైనా వారు జ్ఞానం కలిగి ఉండటం, మన రాజ్యాంగం ప్రకారం మనకు సిద్ధించిన హక్కుల గురించి వారు తెలుసుకోవడం, ఆ హక్కులను అతిక్రమించినప్పుడు అతిక్రమించామని తెలుసుకోగలిగిన తెలివిడి వారికి ఉండటం! ఇప్పుడీ దుర్భరమైన నైతిక ఉపన్యాసపు వెలుగులో నేను చెప్పబోతున్న కథను మీరు వినాలి.
ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను తమ ప్రభుత్వం పరిశీలిస్తోందని గుజ రాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ అన్నట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ నివేదించింది. ఈ పరిశీలన రాజ్యాంగ పరిమితులకు లోబడే జరుగుతుందని ఆయన అన్నప్పటికీ అదే రాజ్యాంగంలోని నిబంధన ఆయన సంకల్పించిన ఆ పనిని కచ్చితంగా అసాధ్యం చేస్తుంది. ఎందుకంటే అలా చేయడం అన్నది రాజ్యాంగం మనకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించడం అవదా?
రాజ్యాంగం అనే ఆ అమూల్య పత్రంలో రాసివున్న దానిని బట్టి 18 ఏళ్లకు మనం పెద్దవాళ్లం అయినట్లు! అక్కణ్ణుంచి ఒక స్త్రీకి తను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే, చట్ట ప్రకారం విడాకులు తీసుకుంటే కనుక, ఎన్నిసార్లు పెళ్లి చేసుకోవచ్చన్న స్వేచ్ఛ కూడా! విచిత్రంగా పురుషులకు మాత్రం 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ హక్కును రాజ్యాంగం అందించదు. వారు 18 సంవత్సరాల వయసులో ఓటు వేయవచ్చు కానీ, పెళ్లి మాత్రం చేసుకోవడానికి లేదు. ఈ సమ రాహిత్యం గురించి ఇంకో రోజు చూద్దాం.
రాజ్యాంగాన్ని మార్చితే తప్ప ప్రేమ వివాహాలలో తల్లితండ్రుల సమ్మతిని తప్పనిసరి చేయలేమని ముఖ్యమంత్రికి తెలియదా? చూస్తుంటే ఆయనకు మన రాజ్యాంగం గురించి తెలియదని అనిపి స్తోంది. లేదా రాజ్యాంగాన్ని ఏకపక్షంగా మార్చే అధికారం తనకు ఉందని ఆయన చెబుతున్నట్లుగా ఉంది. లేదంటే, బహుశా...చెప్పింది చేయాలనేం ఉంది అనే ఉద్దేశం ఆయనలో ఉన్నట్లుంది.
ఉన్నవి ఉన్నట్లుగా ఆయన మాటలు ఇవీ: ‘‘రుషికేశ్‌భాయ్ పటేల్ (ఆరోగ్య మంత్రి) నాతో ఏం అన్నారంటే – నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఇల్లు వదిలి పారిపోతున్న అమ్మాయిల కేసులపై ఒక అధ్యయనం జరగాలనీ, పునరాలోచన జరపాలనీ... అందువల్ల ప్రేమ వివాహాలకు తల్లితండ్రుల సమ్మ తిని తప్పనిసరి చేసేందుకు ఏదో ఒకటి చేయ వచ్చనీ... ఇందుకు రాజ్యాంగం అడ్డుపడకపోతే కనుక మనం ఈ అధ్యయనాన్ని చేపట్టవచ్చు. ప్రయత్నం కూడా చేద్దాం. మంచి ఫలి తాలు రావచ్చు కదా!’’
ఇంకా విచిత్రం ఏంటంటే... పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూపేంద్ర పటేల్‌ను ఈ విషయంలో సమర్థించడం. ముఖ్యమంత్రికి తన మద్ధతునిస్తూ ఇమ్రాన్ ఖేడావాలా ఒక లేఖను కూడా రాశారు. ‘‘తల్లితండ్రులు తమ పిల్లల్ని పెంచి పోషిస్తారు. కనుక పిల్లల వివాహానికి వారి సమ్మతి తప్పనిసరి’’ అని ఖేడావాలా పేర్కొన్నారు. అంతేకాదు, గుజరాత్ శాసనసభ వర్షాకాల సమావేశాలలో దీనిపై ఒక బిల్లును ప్రవేశపెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఈ బిల్లును తీసుకురావడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు తమ తల్లితండ్రుల అదుపులో ఉండటం లేదు. మొద్దుబారి ఉంటున్నారు’’ అని ఖేడావాలా వ్యాఖ్యానించారు.
ఈ రకమైన మనస్తత్వంతో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడావాలా ఒక్కరే కాదు. జెనిబెన్ ఠాకూర్ కూడా! ఆమె మహిళా ఎమ్మెల్యే. జెనిబెన్, బీజేపీ ఎమ్మెల్యే ఫతేసిన్హ్ చౌహాన్ కలిసి, ‘‘అమ్మాయి నివసిస్తున్న తాలూకాలోనే, స్థానికుల సమక్షంలో, తల్లితండ్రుల సమ్మతితో వివాహం జరిగేలా గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ యాక్ట్, 2009ను మార్చాలి’’ అని డిమాండ్ చేసినట్లు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ రాసింది.
ఓటు కోసం 18 ఏళ్లు నిండిన బాలికలకు క్రమం తప్పకుండా విజ్ఞప్తి చేస్తుండే ఈ పద్ధతైన పురుషులు, పద్ధతైన స్త్రీలలో ఎవరైనా తమను ఎవరు పరిపాలించాలో నిర్ణయించుకునేంత పరిణతి ఆ వయసు వారిలో ఉండదన్న వాదనను తీవ్రంగా తోసిపుచ్చకుండా ఉండి ఉంటారా? అయినప్పటికీ వారు 18 ఏళ్ల బాలిక తన తండ్రి సమ్మతి లేకుండా తన ఇష్టానుసారం వివాహం చేసుకోరాదని విశ్వసి స్తున్నారు. ఇలాంటి విషయాల్లో తల్లుల సమ్మతి రెండవ ప్రాధాన్యంగా ఉంటుంది, వాళ్లనొకవేళ లెక్కలోకి తీసుకుంటే కనుక.
ప్రజాస్వామ్యాలకు మాతృమూర్తి అయినటువంటి దేశంలో ఇదొక విచిత్ర పరిణామం. మన హక్కుల్ని మనమే హరించుకోవడం. నిజమైన ప్రజాస్వామ్యం... తల్లిదండ్రులు, సమూహాల ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా వ్యక్తుల హక్కులను విస్తృతపరిచే మార్గాలను నిరంతరం అన్వేషిస్తుంటుంది. ఆ విధంగా పౌరుల కలలు, ఆశయాలు సాకారం అవుతాయి. అయితే మన రాజకీయ నాయకులు అందుకు విరుద్ధంగా చేయాలని నిర్ణయించుకున్నట్లుంది. మనం హక్కుల్ని పరిమితం చేస్తున్నాం. స్వేచ్ఛా పరిధులను తగ్గించేస్తున్నాం. వ్యక్తుల నిర్ణయాలపై అధికారంతో పెత్తనం చలాయిస్తున్నాం. తిరోగమనంలోకి వెళ్తున్నాం.
భారతదేశానికి ప్రజాస్వామ్యంతో ఉన్నది మాతృమూర్తి సంబంధం అని మన ప్రధాన మంత్రి అనడంలోని ఉద్దేశాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ప్రజాస్వామ్యానికి మన దేశాన్ని మారుతల్లిగా ఉంచేందుకు ఆయన సంకల్పించినట్లున్నారు. మార్మికంగా ఒక అద్భుతమైన మాతృమూర్తి అవతరించకుంటే మన యువరాణులు పర దృష్టికి చాటునే ఉండిపోతారు. బుగ్గపై చిన్న ముద్దుతో ఆ సౌందర్య రాశులను నిద్ర లేపే మహదావకాశాన్ని మన అందాల రాకుమారులు కోల్పోతారు.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment