కామెంట్
జమిలి ఎన్నికల వల్ల దేశానికీ, ప్రజాస్వామ్యానికీ ఎంతవరకు ఉపయుక్తం అనే దానిపై చర్చ జరుగుతోంది. లోక్‌సభ నుంచి అన్ని రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు అనుకూలంగా ఎన్ని వాదనలున్నాయో, వ్యతిరేకంగా అన్ని వాదనలున్నాయి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికల ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది. కానీ అలా పొదుపు చేసే మొత్తం భారత్ లాంటి పెద్ద దేశానికి ఒక లెక్కలోకే వస్తుందా? అలాంటి ఎన్నికల వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించదా? బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు.
నాకు తెలిసిన చాలామంది లాగే మీరు కూడా ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ను అర్థం చేసుకోవటానికి తన్నుకులాడుతుంటే కనుక మీకు సహాయం చేయటానికి నన్ను ప్రయత్నించనివ్వండి. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అనే భావనను ప్రతిపాదించినవారు, దానిని వ్యతిరేకిస్తున్నవారు తమ అనుకూల, ప్రతికూల వాదనలతో మనల్ని ముంచెత్తారు. కానీ లాభ నష్టాల నడుమ దీనిపై మనమెలా ఒక తీర్పుకు రాగలం? ఈ వాదోపవాదాలన్నీ సముచితమైనవేనా? లేదా కొన్ని మాత్రమే మిగతా వాటి కంటే ప్రాముఖ్యమైనవా?
ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే ఈ భావనకు మద్దతు లభించటానికి గల కారణాలతో విషయాన్ని ప్రారంభిద్దాం. మొదటిది – డబ్బు ఖర్చు. ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఎన్నికలకు అయ్యే ఖర్చు, వేర్వేరు సమయాల్లో జరిగే అనేక ఎన్నికలకు అయ్యే ఖర్చు కంటే తక్కువగా ఉంటుందనటంలో సందేహం లేదు. అయితే అలా పొదుపు చేసే మొత్తం ఏడాదికి రూ. 5000 కోట్ల కన్నా తక్కువేనన్నది శశి థరూర్, ప్రవీణ్ చక్రవర్తిల వాదన. ఇండియా వంటి భారీ ఆర్థిక వ్యవస్థకు ఇదేమంత తేడా చూపే మొత్తం అవుతుందని?
రెండవ కారణం – ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆంక్షలు పరిమిత కాలానికి మాత్రమే వర్తింపులో ఉంటాయి కనుక రాజకీయ నాయకులు తమను తాము పాలనా వ్యవహారాలలో నిమగ్నం చేసు కోవచ్చు. అయితే ప్రవర్తనా నియమావళి అన్నది జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే అమలులో ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అదొక పెద్ద విషయమే అవదు. మళ్లీ ప్రశ్న, ఇదేమంత ముఖ్యమైన కారణం అవుతుందని?
నిజమేమిటంటే, పై రెండూ కూడా చెప్పుకోదగిన కారణాలు కావు. ప్రజాస్వామ్యపు అత్యంత ముఖ్యమైన వ్యక్తీకరణ... ఎన్నికలు. వాటి నిర్వహణకు అయ్యే వ్యయాన్ని బట్టి, లేదా అవి సజావుగా జరిగేందుకు అవసరమైన నియమావళిని బట్టి ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని లాభనష్టాలను చర్చించకూడదు.
ఇప్పుడు మనం వ్యతిరేక వాదనల్లోకి వద్దాం. మొదటిది – ఇది మన దేశ విలక్షణతకు విరుద్ధం అవుతుందా? మనది ఒకే దేశం–ఒకే మతం కాదు. ఒకే దేశం–ఒకే భాష కాదు. ఒకే దేశం–ఒకే సంస్కృతి కాదు. ఒకే దేశం–ఒకే విధమైన మరేదీ కాదు. మన వ్యత్యాసాలనే మన సంపదలుగా మలుచుకున్న రాష్ట్రాల సమాఖ్య మన దేశం. ఆ వ్యత్యాసాలు, సంపదలే మనల్ని ప్రత్యేకంగా ఉంచుతాయి. మనకు ప్రాముఖ్యం కల్పిస్తాయి. మరి ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ప్రత్యేకతలు, ప్రాముఖ్యాల నుంచి మన దేశాన్ని దూరం చేయదా? దీని గురించి జాగ్రత్తగా ఆలోచించండి.
రెండవది – ఒకే దేశం–ఒకే ఎన్నిక వల్ల స్థానిక సమస్యల కంటే జాతీయ సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యం లభించే ప్రమాదం
ఉంటుందా? అలా జరిగితే – జరుగుతుందనే నా అనుమానం – అది దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఏకీకృత వ్యవస్థగా మార్చే ధోరణి కలిగి ఉండదా? వెంటనే కాకపోయినా, కాలక్రమేణా అలా జరిగే అవకాశం అయితే ఉంటుంది.
దీనివల్ల చిన్న రాష్ట్రాల ప్రాంతీయ ఆందోళనలు కేంద్రస్థాయి జాతీయ డిమాండ్లలో కొట్టుకుని పోతాయి. గోవా, సిక్కిం, ఉత్తరాఖండ్, హిమాచల్, పుదుచ్చేరి, ఈశాన్య రాష్ట్రాల నిరసన గళాలు ఢిల్లీ రణగొణ ధ్వనుల్లో తేలిపోతాయి.
మూడవది – పార్లమెంటరీ ఎన్నికలు క్రమంగా అధ్యక్ష తరహా ఎన్నికలుగా మారినప్పుడు ఒకే దేశం–ఒకే ఎన్నిక అన్నది ఆ ధోరణిని మరింత తీవ్రతరం చేసే ప్రమాదం లేదా? అదే జరిగితే, అది మన బహుళ పార్టీ వ్యవస్థను ఒకే పార్టీ గల దేశం వైపు నెట్టదా? ఇది అర్థవంతమైన భయమే అయితే దీనిని తేలిగ్గా తీసుకోవలసిన అవసరం లేదు.
ఇదంతా కూడా మన రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణాన్ని ఉల్లంఘనకు గురి చేయగలిగినదే. ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది ఒకే దేశం–ఒకే ఎన్నిక అనే భావనలోని పర్యవసానాలపై ఆధారపడి ఉంది.
అయితే మరొక విషయం కూడా ఉంది. మనం మన ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతంగా, వేళ్లూను కునేలా చేసుకోవలసిన అవసరం అది. నిజానికి 50 ఏళ్ల క్రితమే అటల్ బిహారి వాజ్‌పేయి ‘రైట్ టు రీకాల్’ (పదవుల్లో ఉన్నవారిని తొలగించే హక్కు)ను కోరు కున్నారు. దానికి పూర్తి భిన్నమైనది ఈ ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’. ఓటు వేసే అవకాశాన్ని పరిమితం చేయటం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని ఇది కురచబారుస్తుంది. ఇంకోలా చెప్పాలంటే, వెళ్లవలసిన మార్గాన్ని వెనక్కి తిప్పుతుంది.
ఇంకొక సమస్య ఉంది. వాస్తవంలో ఎదురుకాగల సమస్య అది. ఒకవేళ ప్రభుత్వం ఐదేళ్ల కాల పరిమితి కంటే ముందు గానే తన మెజారిటీని కోల్పోతే ఏం జరుగుతుంది? మిగిలిన కాలానికి మాత్రమే ఎన్నికలను నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచిస్తోంది. కానీ అది ఐదేళ్ల కాలానికి ఓటరు ఇచ్చిన తీర్పును పలుచబార్చదా? కొన్నిసార్లు వాళ్లు ఐదేళ్ల ప్రభుత్వానికి ఓటు వేస్తారు. మరికొన్ని సార్లు ఒకటీ లేదా రెండేళ్ల ప్రభుత్వానికి ఓటేస్తారు. ఈ విధంగా మనం ఓటు విలువను యథేచ్ఛగా తగ్గించటం లేదా?
ఉప ఎన్నిక అవసరమైన ప్రతిసారీ నిస్సందేహంగా ఇలాగే జరుగుతుంది కానీ... వ్యక్తికి ఓటేయటానికి, మొత్తం అసెంబ్లీకో, పార్లమెంటుకో ఓటేయటానికి తేడా లేదా? ఆలోచించదగిన ప్రశ్నే ఇది.
నిజానికి, మధ్యంతర ఎన్నికలకు కారణమయ్యేవి ఏవీ లేకుండా పోవు. ఇంకా అనేక కారణాల వల్ల కూడా ముందస్తు ఎన్నికలు రావచ్చు. ఈ విధంగా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరిగే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు వీలుగా తక్కువ కాల పరిమితిని కలిగి ఉంటాయి. ఈ కోణంలోంచి చూస్తే ‘ఒకే దేశం–ఒకే’ ఎన్నిక వల్ల ఏం తేడా కనిపిస్తున్నట్లు? చెప్పాలంటే మనం మరిన్ని ఎన్నికలకు వెళ్లటం అవుతుంది తప్ప, తక్కువ ఎన్నికలకేం కాదు.
కనుక, అంతిమంగా నేను చెబుతున్నదేమిటి? అది మీతో చెప్ప టానికి సంకోచిస్తున్నాను. ఏమైనా, నా అభ్యంతరాలన్నీ ఇక్కడ స్పష్టంగానే వ్యక్తం అయ్యాయి. మీరు నా మార్గదర్శకత్వాన్ని కోరుకుంటే కనుక అందుకు చాలినంతగానే రాసేశాను.
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment