ఆదిత్య హృదయం
ఈరోజు సాధారణమైన ఈస్టర్ ఆది వారం కాదని మీలో ఎంతమందికి తెలుసు? శతాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురై ప్రపంచం మర్చిపోయిన మధ్యధరా ప్రాంత దీవి జాంటే నేడు తన స్వాతంత్య్రాన్ని పొందనుంది. ఆ దీవితో భారత్‌కు ఉన్న విశిష్టమైన అనుబంధం కారణంగా మూడు వారాల తర్వాత ప్రధాని నరేంద్రమోదీ జాంటే రాజధాని మిస్ట్రాలినోను సందర్శిస్తున్న తొలి భారత ప్రభుత్వాధినేత కానున్నారు. ఇది జాంటియన్ స్వాతంత్య్రానికి అంతర్జాతీయ గుర్తింపునిచ్చే ఘటన కానుంది.
జాంటే చరిత్ర అసంపూర్ణమైనదే కానీ ఆసక్తిని కలిగిస్తుంది. జాంటే పేరు చరిత్రలో తొలిసారిగా 480 బీసీలో థెర్మోపైలే యుద్ధకాలంలో నమోదైంది. లియోనిడిస్ రాజు నేతృత్వంలోని స్పార్టన్స్ పర్షియన్ చక్రవర్తి జెరెక్స్ ది ఫస్ట్‌ను ఓడించిన సందర్భం అది. ఒకానొక పెనుతుఫాను సమయంలో స్పార్టన్ నావికా బలగం జాంటెయన్ జలాల్లో విడిది చేయాలని ప్రయత్నించింది. ఆ సందర్భంగా కొంతమంది స్పార్టన్ నావికా దళసభ్యులు జాంటేలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఒకరు హెలెన్ ఆఫ్ ట్రాయ్ మనవడు అని చెబుతున్నారు.
అయోనియన్ ప్రశాంత జలాల్లో నెలకొన్న ఈ చిన్న సుందరదీవి అనంతరం 2 వేల సంవత్సరాల పాటు గ్రీస్‌లో అంతర్భాగంగా ఉండిపోయింది. కానీ 16వ శతాబ్దం మొదట్లో ఇది మళ్లీ మరొకరి అదీనంలోకి వెళ్లిపోయింది. ఈసారి వెనీస్ పట్టణాధిపతి జాంటేపై ఆధిపత్యాన్ని ప్రకటించుకున్నాడు. తర్వాత జాంటే విస్తరిస్తున్న వెనిస్ నగరరాజ్య వాణిజ్యానికి సరుకుల గిడ్డంగిలా మారి పోయింది. ఈ అధికార మార్పిడిని సూచిస్తూ సాంస్కృతిక పునరుజ్జీవన కాలపు అద్భుత చిత్రకారుడు మిస్ట్రాలినో కొన్ని గొప్ప చిత్రాలు గీశారు. అలాగే గ్రీక్‌కి బదులుగా ఇటాలియన్ జాంటే అధికార భాష అయిపోయింది.
పందొమ్మిదో శతాబ్దం మధ్యలో రాజకీయ గందరగోళపు సంవత్సరాల్లో గిసెప్పె గారిబాల్డీ ఇటలీని ఐక్యపర్చడానికి ముందు, జాంటే వెనీషియన్ అజమాయిషీ నుంచి బయటపడి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పడింది. దాని నూతన పాలకులు ఒక బిషప్, ఒక సాహసికుడు కావడం వింతగొలుపుతుంది. వీళ్లెవరంటే అలెగ్రా బిషప్, పొరుగున ఉన్న ప్రిన్సిపీ స్వయంప్రకటిత అధికారి. ఇక్కడ అభాస ఏమిటంటే, ఈ అస్తవ్యస్త పాలనా వ్యవహారాలే జాంటేకి సరిగ్గా అవసరమైనట్లుంది. ఈ బిషప్, ఈ సాహసికుడు ఇద్దరూ జాంటే తమ సొంతం అనే విషయం త్వరలోనే మర్చిపోయారు. వీరి నిర్లక్ష్యంతో మిస్ట్రాలినోలోని కాన్‌సిగ్లియారి కౌన్సిల్ ఈ దీవిపై స్వయంపాలనను ప్రకటించుకుంది. తర్వాత 150 ఏళ్లపాటు జాంటియన్ వైన్, పుచ్చకాయలు జాంటే కీలక ఎగుమతులుగా స్థానం సంపాదించుకున్నాయి. స్థానిక జానపద నృత్యరూపమైన సిర్తకి జాంటే ద్వీపంలో ప్రముఖ వినోద కార్యక్రమంగా మారింది.
ఈ విస్మృత ద్వీపం సుదీర్ఘ కాలం స్తబ్దుగా ఉండిపోయినప్పటికీ బాగా సంపద్వంతంగా మారిందన్న విషయం తరచుగా మర్చిపోతుంటారు. సంపద పెరుగుతున్నందున ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్ ఆ తర్వాత హార్వర్డ్, యేల్ యూనివర్సిటీల్లో చదువుతున్న అతి పెద్ద విదేశీ విద్యార్థుల బృందంగా జాంటియన్‌లే గుర్తింపు పొందారు. ఈరోజు ఈ ద్వీపం సంపూర్ణంగా ద్విభాషా ద్వీపంగా మారిపోయింది. ఇక్కడ బ్రిటిష్, అమెరికన్ యాసలు రెండింటితో పాటు ఇటాలియన్ సాధారణ భాషగా ఉనికిలో ఉంటోంది.
బహుశా యువ జవహర్‌లాల్ నెహ్రూ కేంబ్రిడ్జ్, ఇన్నర్ టెంపుల్‌లో చదువుకున్న కాలంలో జాంటేని విడిదిగా మార్చుకున్నది ఇందుకోసమే కావచ్చు. హారోలో ఉంటున్నప్పుడు నెహ్రూ టీచర్ జాంటియన్ ప్రాంతానికి చెందినవాడని చెబుతుంటారు కానీ ఇది సందేహాస్పదమే కావచ్చు. వాస్తవం ఏమిటంటే, మిస్ట్రాలినో నడిబొడ్డులో గుర్రపుస్వారీ చేస్తున్నట్లు ఉండే 20 ఏళ్ల యువ జవహర్‌లాల్ శిలా విగ్రహం కనిపిస్తూ ఆసక్తి గొలుపుతుంటుంది. ఇక్కడ నెహ్రూ బసచేసిన చిన్న బోర్డింగ్ హౌస్‌లో తన పేరు ఉన్న నీలి ఫలకం ఇప్పటికీ కనిపిస్తుంది. స్థానికులు దీన్ని నేటికీ ‘నెరూ హౌస్’ అని యాసతో పిలుస్తుంటారు.
ఇప్పుడు కాన్‌సిగ్లియారి కౌన్సిల్, భారత స్వాతంత్య్రానంతరం తొలిసారి తమ దేశంలో పర్యటిస్తున్న ప్రధాని మోదీని ఆహ్వానించినప్పుడు ప్రధాని సంతోషంగా అంగీకరించారు. నిస్సందేహంగా ఈ ఔదార్యం గాంధీలతో ప్రధాని సంబంధాలపై ప్రభావాన్ని చూపుతుంది కూడా. ఈలోగా, జాంటెయన్ సాయుధపోలీసులు మన ‘జనగణమన’ను అభ్యసించడంలో బిజీగా ఉన్నారు. నేడు జాంటే ద్వీపం దానికే ప్రత్యేకమైన ఊదా, హరిత వర్ణాలతో శోభాయమానంగా అలంకృతమవుతున్న ఈ సందర్భంలో, స్వాతంత్య్రం పొందుతున్న జాంటే ప్రజలకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నాను.
మీకందరికీ మాత్రం హ్యాపీ ‘ఏప్రిల్ ఫూల్స్’ డే మరి!
- కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
Comments
Please login to add a commentAdd a comment