పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా? | Can the old Modi be the new Modi | Sakshi
Sakshi News home page

పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?

Published Mon, Jun 10 2024 4:23 AM | Last Updated on Mon, Jun 10 2024 4:23 AM

Can the old Modi be the new Modi

నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరన్నదే! 

సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధతను కలిగి ఉంటారా? గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. అందుకు భిన్నంగా పాత మోదీ ఇప్పుడు కొత్త మోదీ కాగలరా?

మునుపు మీరీ నానుడిని నిస్సందేహంగా విని ఉంటారు. ఎంచేతనంటే ఇదొక కాదనలేని సత్యం. కొరుకుడు పడనివిగా కనిపించే పరిస్థితులను ఓటర్ల సమష్టి విజ్ఞత చక్కబెట్టగలగటమే ప్రజాస్వామ్యంలోని అద్భుతమైన విషయం. 1977లో ఇలా జరిగింది. మళ్లీ ఈ జూన్‌ 4న ఇది సంభవించింది. ఫలితాల్లో పై విధమైన అద్భుతాన్ని చాలామందే ఆశించినప్పటికీ, నిజానికి కొద్దిమందే అది కార్యరూపం దాల్చుతుందని భావించారు. 

నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాలను ఈ ఎన్నికల్లో బీజేపీ చవి చూసింది. మెజారిటీకి 30కి పైగా తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి, విశ్వసనీయత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమైన మిత్ర పక్షాల మద్దతు అవసరం. గతంలో వారు బీజేపీని విడిచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వారు మళ్లీ అలా చేస్తారనటాన్ని తోసిపుచ్చలేము. 

ఇది ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికైతే వాటికి మన దగ్గర సమాధానాలు లేవు. బహుశా మోదీకి కూడా అవి తెలియక పోవటానికే అవకాశం ఎక్కువ. కానీ ఆ ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే సవాలును సూచిస్తాయి. ఆ ప్రశ్నల సమాధానాలు ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. భారతదేశానికి ఎదురవనున్న ప్రమాదాలను, లేదంటే కనీసం సమస్యలను అవి బయటపెడతాయి. 

బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని మోదీ మొదటి నుంచి జోస్యం చెబుతూ వచ్చారు. ఐదో విడత పోలింగ్‌ అయ్యాక ‘ఎకనమిక్‌ టైమ్స్‌’తో మాట్లాడుతూ తమ పార్టీ అప్పటికే 272 మార్కును దాటేసిందని అన్నారు. కానీ, చివరికి అది 240 సీట్లతోనే ముగిసింది. మెజారిటీకి చాలా తక్కువ. కనుక, ఇవాళ ఆయన... కలవరపడే మనిషా లేక దులిపేసుకుని వెళ్లగలిగినంత మొద్దు చర్మం ఉన్నవారా?

వారణాసిలో ఆయనకు వచ్చిన ఓట్ల మాటేమిటి? 2019లో ఆయనకు 4 లక్షల 80 వేల మెజారిటీ వచ్చింది. అదిప్పుడు కేవలం లక్షా ఐదు వేలకు పరిమితం అయింది. ‘‘గంగా మేరీ మా హై, ముఝే గంగా నే గోద్‌ లియా హై’’ (గంగానది నా మాతృమూర్తి. గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుంది) అని గత నెలలో చెప్పుకున్న ఒక మనిషి.. పూర్తి వ్యక్తిగతమైన ఈ తిరోగమనాన్ని ఎలా తీసుకుంటారు?

ఏదేమైనా కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదా, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధంగా కలిగి ఉన్నారా?

గుర్తు చేసుకోండి. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. బదులుగా ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికీ ఆదేశం అయింది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని నడిపారు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటి అని అడిగే సాహసం చేయలేదు.

పార్లమెంటు, జ్యుడీషియరీ, మీడియా వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల పట్ల ఆయన వైఖరి గురించి ఏమిటి? శ్రీ ‘పాత మోదీ’ పార్లమెంటును పలుమార్లు విస్మరించారు. న్యాయశాఖలోని నియామకాలను నిలిపివేశారు. మీడియాను తీసిపడేశారు. కానీ ఇప్పుడు శ్రీ ‘బలహీన మోదీ’ మరింతగా ఏకాభిప్రాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉంటుంది. లేదంటే తన మిత్రపక్షాలకు ఆయన కోపం తెప్పించవచ్చు. తన సంకీర్ణాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకోవచ్చు. అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటారా? ఇక విమర్శలకు, అసమ్మతికి ఆయన స్పందించే ధోరణి ఒకటి ఉంటుంది. శ్రీ పాత మోదీకి ఆ రెండూ నచ్చవన్నది రహస్యమేం కాదు. కనుక శ్రీ కొత్త మోదీ సహించటాన్ని, సమ్మతించటాన్ని మాత్రమే కాదు... రెండింటితో కలిసి ముందుకు సాగటాన్ని కూడా నేర్చుకోవాలి. అది అంత సులభమేనా?

మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించినవి. వాటిని ప్రజలు మరిచిపోయి ఉంటారని ఆయన అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కాకపోవచ్చు కానీ, మొత్తానికైతే నేననుకోవటం అవి గుర్తుండే ఉంటాయని! మొదటిగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కనుక నవ్వటాన్ని, తేలిగ్గా తీసుకోవటాన్ని అలవరచుకోకపోతే అవి ఆయన్ని వెంటాడగలిగినవి. కానీ ఆయన అలా చేయగలరా? తనది దైవాంశ జననం అని ఆయన చెప్పుకోవడంపై అవహేళనలు ఎదురైతే ఆయన నవ్వుతూ, వాటిని పట్టించుకోకుండా ఉండగలరా? నా మాట గుర్తుపెట్టుకోండి. అవహేళనలు ఉంటాయి. అది జరిగినప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటారా?

మరీ ముఖ్యంగా, ముస్లింలను దయ్యాలుగా చూపించకుండా ఉండలేకపోవటాన్ని నిలువరించుకోగలరా? ముస్లింలను చొరబాటు దారులుగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్‌లను లాక్కుని లబ్ధి పొందేవారిగా చూపే తదుపరి సందర్భాలలో మిత్రపక్షాలు అందుకు అంగీకరించే అవకాశం లేదు. కానీ అలాంటి భాష తన నుంచి స్వభావసిద్ధంగా బయటికి రాకుండా తనను తాను సంబాళించుకోగలరా? ఇది 2001 నుండి ఆయన వాక్చాతుర్యంలోని ఒక భాగమని గుర్తుంచుకోండి. 

నిజానికి నేను లేవనెత్తిన ప్రతిదాన్నీ ఒకే ఒక సాధారణ ప్రశ్నగా కుదించవచ్చు: శ్రీ పాత మోదీ ఇప్పుడు శ్రీ కొత్త మోదీ కాగలరా? ఆయన ప్రభుత్వం దాని పైనే ఆధారపడి ఉంటుంది. మన పాలన దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా! కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? 

- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌
- కరణ్‌ థాపర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement