విశ్వాసాన్ని వమ్ముచేసిన విద్యామంత్రి | karan thapar write article on union minister | Sakshi
Sakshi News home page

విశ్వాసాన్ని వమ్ముచేసిన విద్యామంత్రి

Published Sun, Jan 28 2018 1:18 AM | Last Updated on Sun, Jan 28 2018 1:18 AM

karan thapar write article on union minister - Sakshi

ఆదిత్య హృదయం
సత్యపాల్‌ సింగ్‌ నన్ను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జూనియర్‌ మంత్రి (విద్య) మాత్రమే కాదు. ముంబై మాజీ పోలీస్‌ కమిషనర్‌ కూడా. ఇలాంటి వ్యక్తులు సాధారణంగా హేతుబద్ధంగా, అప్రమత్తంగా ఉంటారు, తాము చెప్పింది వాస్తవాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు కూడా. కానీ సత్యపాల్‌ సింగ్‌ ఇటీవల చార్లెస్‌ డార్విన్‌ పరిణామవాదాన్ని బహిరంగంగా ఖండించారు. ఆయన ఏమన్నారంటే, ‘డార్విన్‌ సిద్ధాంతం శాస్త్రీయంగా తప్పు... మన వారసులతో సహా ఏ ఒక్కరూ రాతపూర్వకంగా లేక మౌఖికంగా.. మనిషిగా మారిన వానరాన్ని తాము చూశామని చెప్పలేదు’. అంతేకాదు.. ‘మనం పాఠశాల, కళాశాలల కరిక్యులమ్‌ మార్చాల్సిన అవసరముందని’ మంత్రి పేర్కొంటూ, డార్విన్‌ సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మంత్రి ప్రకటనపై భారత్‌ లోని మూడు అగ్రశ్రేణి సైన్స్‌ అకాడమీలు ఆగ్రహం ప్రదర్శించాయి. ఇండియన్‌ నేషనల్‌ సైన్స్‌ అకాడమీ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్, ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ దీనిపై ఉమ్మడి ప్రకటన చేస్తూ, ‘మంత్రి ప్రకటనలో శాస్త్రీయ పునాది లేదు. పరిణామ వాదానికి డార్విన్‌ చేసిన ప్రభావవంతమైన దోహదం సర్వామోదం పొందింది. పరిణామ వాదానికి చెందిన ప్రాథమిక సత్యం పట్ల శాస్త్రీయ వివాదం ఏదీ లేదు. ఇది శాస్త్రీయ సిద్ధాంతం’ అని స్పష్టం చేశాయి.

సీనియర్‌ మంత్రులు తనను మందలించినప్పటికీ సింగ్‌ తన ప్రకటనకు కట్టుబడ్డారు. తాను శాస్త్రజ్ఞుడినని, రసాయన శాస్త్రంలో పీహెచ్‌డి చేశానని చెప్పిన మంత్రి ‘డార్విన్‌ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా సవాలు చేశారు. డార్వినిజం ఒక భ్రమ’ అనేశారు. మరోవైపున, రెండు వేలమంది శాస్త్రజ్ఞులు సంతకం చేసిన ఒక విడి ప్రకటన ఇంటర్నెట్‌లో ఉంది. ‘శాస్త్రీయ సమాజం పరి ణామ సిద్ధాంతాన్ని తిరస్కరించిందని ప్రకటించడం సత్యదూరం. తద్భిన్నంగా, వెలుగులోకి వస్తున్న ప్రతి కొత్త ఆవిష్కరణా డార్విన్‌ సూత్రీకరణలకు మద్దతు తెలుపుతూనే ఉంది.‘ 

డార్విన్‌ సిద్ధాంతంపై సత్యపాల్‌ సింగ్‌ చేసిన ప్రకటన గురించి నేను అయిదు ముఖ్య విషయాలు చెబుతాను. మొదటిది, ఆయన సైన్స్‌ చదువుకుని ఉండవచ్చు కానీ, కెమిస్ట్రీలో పీహెచ్‌.డి పట్టా.. డార్విన్‌ వాదంపై వివాదం రేపే అర్హతను ఆయనకు కలి గించదు. ఆయన హోదా.. జన్యుశాస్త్రం అంటే వేదాంత అధ్యయన శాస్త్రం అని భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు చేసే ప్రకటనతో సమానం. కనీస శాస్త్ర విశ్వసనీయత కూడా తనకు లేదు.
రెండోది, డార్విన్‌ సిద్ధాంతాన్ని మంత్రి స్పష్టంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. మనిషిగా మారిన వానరాన్ని తాము చూసినట్లు.. ఎవరూ చెప్పలేదని మంత్రి తెలిపినప్పుడు, కోట్లాది సంవత్సరాల క్రమంలో సాగిన పరిణామ ప్రక్రియ గురించి కాకుండా, ఆకస్మికంగా జరిగిన సంపూర్ణ పరిణామం గురించి డార్విన్‌ మాట్లాడినట్లుగా అర్థం చేసుకున్నారు. ‘మన తాతముత్తాతలు’ ఎన్నడూ పేర్కొనలేదు అని మంత్రి చెప్పినప్పుడు, ఒకవేళ వారు చూసి ఉంటే అది అద్భుతమయ్యేదన్న వాస్తవాన్ని మంత్రి గుర్తించడం లేదు. 

మూడు, డార్విన్‌ సిద్ధాంతం గురించి లేవనెత్తిన ప్రశ్నలను కూడా మంత్రి తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రశ్నలు డార్విన్‌ వాదాన్ని ఖండించడం కాకుండా, జీవానికి సంబంధించిన అన్ని సంక్లిష్టతలను పరిణామ వాదం పూర్తిగా వివరించలేదని మాత్రమే చెబుతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, పరిణామ వాదం వివాదాస్పదం కాలేదు. కానీ అది అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. నాలుగు, ఒక విద్యాశాఖ మంత్రి ఇలా మాట్లాడటమే వైపరీత్యం. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే, ‘శాస్త్రీయ ఆలోచనలు, హేతుబద్ధతను ప్రచారం చేయడానికి శాస్త్రీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన దెబ్బతీస్తుంది.. పైగా ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇది పలుచన చేయడమే కాకుండా, భారతీయ పరిశోధకుల నిజమైన పరిశోధనపై విశ్వాసాన్ని ఇది తగ్గిస్తుంది’. చివరగా, మంత్రి తన రాజ్యాంగపరమైన విధిని ఉల్లంఘించారు. ‘శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం ప్రతి ఒక్క పౌరుడి విధి’ అని ఆర్టికల్‌ 51 ఎ (హెచ్‌) ప్రకటిస్తోంది. విద్యామంత్రిగా, ఎంపీగానే కాకుండా పౌరుడిగా కూడా ఈ విషయంలో డాక్టర్‌ సత్యపాల్‌ సింగ్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. 

కాబట్టి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ప్రభుత్వంలో కొనసాగవచ్చా? కనీసం అతడిని విద్యా శాఖ నుంచి మరో పోర్ట్‌ఫోలియోకు తక్షణం మార్చవలసిన అవసరం లేదా? ఏ ఇతర విశిష్ట ప్రజాస్వామిక దేశంలో అయినా సరే, డార్విన్‌ పరిణామవాదాన్ని భ్రమ అని పేర్కొనే వ్యక్తిని చూసి నవ్విపోతారని నేను నమ్మకంగా చెప్పగలను. భారత్‌లో ఇది జరగనట్లయితే మన ప్రజాస్వామ్యాన్ని, విజ్ఞానశాస్త్రం పట్ల మన గౌరవాన్ని, మనల్ని పాలిస్తున్న వారి విశ్వసనీయతను గురించి ఏమని చెప్పాలి?


-కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
ఈ–మెయిల్‌ :  karanthapar@itvindia.net

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement