Satyapal Singh
-
కశ్మీర్లో త్రివర్ణ పతాకం రెపరెపలు
శ్రీనగర్/లెహ్: జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు కారణంగా రాష్ట్ర ప్రజల ప్రత్యేక గుర్తింపుపై ఎలాంటి ప్రభావం ఉండబోదని గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్పష్టం చేశారు. గురువారం షేర్–ఇ–కశ్మీర్ స్టేడియంలో నిర్వహించిన 73వ స్వాతంత్య్ర జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపుపై ఎలాంటి ప్రభావం చూపబోవని హామీ ఇస్తున్నాను. పైపెచ్చు, రాష్ట్రంలోని భిన్న ప్రాంతాల ప్రజల భాషా సాంస్కృతిక వికాసానికి అవి సాయపడతాయి. నవ కశ్మీర్ నిర్మాణంలో పాలుపంచుకోవాలని యువతను కోరుతున్నాను’అని పేర్కొన్నారు. కార్యక్రమానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. ముందు జాగ్రత్తగా ముఖ్య నేతలందరినీ నిర్బంధంలోకి తీసుకున్నందున వారెవరూ రాలేకపోయారు. నగరంలో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పాఠశాల విద్యార్థుల ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడనున్న లదాఖ్‌లో ప్రజలు మొట్టమొదటి స్వాతంత్య్ర వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. లదాఖ్‌లో జరిగిన వేడుకల్లో ప్రజలు తమ ఏకైక ఎంపీ జమ్యంగ్ త్సెరింగ్ నంగ్యా(24)తో కలిసి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. -
దక్షిణాదిలో హిందీని విస్తృతం చేయాలి
హైదరాబాద్: జాతీయ భాష హిందీని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నేర్చుకోవాలని కేంద్ర మానవ వనరుల సహాయమంత్రి సత్యపాల్ సింగ్ అన్నారు. బోయిన్‌పల్లిలో కేంద్రీయ హిందీ సంస్థాన్ నూతన భవన నిర్మాణానికి ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. హిందీ భాష నేర్చుకోవడానికి అత్యంత సులువుగా ఉండటంతోపాటు ఇతర భారతీయ, విదేశీ భాషలనూ నేర్చుకోవడంలోనూ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. హిందీ భాషను దక్షిణాదిలోనూ విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సంస్థాన్ భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేందుకు స్థానిక ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న చొరవ తీసుకోవాలన్నారు. కేంద్ర సంస్థలకు స్థలమిచ్చేందుకు సిద్ధం రాష్ట్రంలో నిర్మించనున్న కేంద్ర సంస్థల కార్యాలయాలు, ఇతర భవనాలకు స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. భాషాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన భాషలైన తెలుగు–ఉర్దూ పరస్పర తర్జుమాకు 66 మంది ట్రాన్స్‌లేటర్లను నియమించినట్లు చెప్పారు. అధికారిక కార్యకలాపాల నిర్వహణకు హిందీ–తెలుగు–ఉర్దూ తర్జుమాకు అవసరమైన సిబ్బంది ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని కేంద్ర మంత్రిని కోరారు. 1976లో ప్రారంభమైన కేంద్రీయ హిందీ సంస్థాన్ ఆధ్వర్యంలో 16వేల మంది టీచర్లకు హిందీలో శిక్షణ ఇచ్చినట్లు సంస్థాన్ వైస్ చైర్మన్ కమల్ కిషోర్ గోయెంకా తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, కేంద్రీయ హిందీ సంస్థాన్ డైరెక్టర్ నంద కిశోర్ పాండే, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
‘నేను కోతి పిల్లను కాను’ : కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ నేను కోతి పిల్లను కానంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘గతంలో ఛార్లెస్ డార్విన్ జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా సరైనది కాదంటూ తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను. ఇది నేను సరాదాకు చెప్పింది కాదు.. నేను సైన్స్ విద్యార్థిని కాబట్టే ఇది తప్పని చెప్పాను. నాకు వ్యతిరేకంగా మాట్లాడలనుకుంటే మాట్లాడొచ్చు.. కానీ నాకు మద్దతుగా ఉండేది.. వ్యతిరేకించగా నిలిచేది ఎందరో చూడాలి. ప్రస్తుతం ఉన్న పుస్తకాలు.. మన పూర్వీకులు కోతులని.. మనం కోతి పిల్లలనేలా ఉన్నాయి. కానీ దానిని నేను అంగీకరించను. చాలా మంది మీడియాకు భయపడి నిజాలు మాట్లాడలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు నిజాలనే మాట్లాడాలి. ప్రజలు నెమ్మదిగా నేను చెప్పిన దాన్ని అంగీకరిస్తారు. ఇంకో పదేళ్లలో నేను చెప్పింది నిజమని నమ్ముతారు. ప్రస్తుత పాఠ్యాంశాలు పిల్లలకు భారతీయ సంస్కృతిని తెలిపే విధంగా లేవు. కేంద్ర ప్రభుత్వం కూడా నూతన విద్యవిధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. నేను చదువుకున్న రాజకీయ నాయకుడిని.. అందుకు గర్వపడుతున్నాన’ని అన్నారు. గతంలో ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని సత్యపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయులు పిల్లలకు ఈ సిద్ధాంతాన్ని భోదించడం ఆపేయాలని కూడా ఆయన అన్నారు. సత్యపాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వివరణ కోరిన సంగతి తెలిసిందే. -
సెంట్రల్ వర్సిటీల్లో యోగా శాఖలు
న్యూఢిల్లీ: ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో కొత్తగా యోగా డిపార్టుమెంట్‌ను ఏర్పాటుచేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి(హెచ్ఆర్డీ) శాఖ నిర్ణయించింది. లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా హెచ్ఆర్డీ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మంగళవారం ఈ విషయం చెప్పారు. ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, హేమ్వతి నందన్ బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ, విశ్వభారతి, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, మణిపూర్ యూనివర్సిటీల్లో కొత్తగా యోగా శాఖలను ఏర్పాటుచేయనున్నారు. ఈ వర్సిటీల్లో యోగా శాఖల ఏర్పాటుకు యూజీసీ ఇప్పటికే అనుమతినిచ్చిందని సత్యపాల్ చెప్పారు. -
మంత్రాల్లోనే న్యూటన్ నియమాలు!
న్యూఢిల్లీ: డార్విన్ జీవపరిణామ సిద్ధాంతం తప్పని వాదించిన కేంద్ర మానవవనరులశాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్.. మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ ప్రతిపాదించిన గమన నియమాలు(లాస్ ఆఫ్ మోషన్) మన మంత్రాల్లో ఎప్పటినుంచో ఉన్నాయని సత్యపాల్ సింగ్ తెలిపారు. గత జనవరిలో హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన 65వ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(సీఏబీఈ) భేటీలో సత్యపాల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. కాబట్టి సంప్రదాయ జ్ఞానాన్ని కచ్చితంగా మన పాఠ్యాంశాల్లో చేర్చాలని సత్యపాల్ సూచించారు. అంతేకాకుండా పాఠశాల భవనాలు పూర్తి వాస్తుతో ఉండాలనీ.. అప్పుడే విద్యార్థులకు చదువు అబ్బుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా న్యూటన్ మంత్రాల విషయమై మీడియా ఆయన్ను బుధవారం ప్రశ్నించగా.. సత్యపాల్ జవాబు దాటవేశారు. అంతేకాకుండా డార్విన్ విషయంలో తాను చెప్పింది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేననీ, దానికి ప్రభుత్వం, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు. -
ప్రశ్నాపత్రంలో కేంద్ర మంత్రి ‘డార్విన్’ వ్యాఖ్యలు..
సాక్షి, పూణే : డార్విన్ జీవ పరిణామ సిద్ధాంతాన్ని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ విమర్శించడంలో తప్పేముందని ఐఐఎస్ఈఆర్ పరీక్షల్లో విద్యార్ధులకు ప్రశ్న ఎదురైంది. విద్యార్థుల తార్కిక ఆలోచనా విధానాన్ని పరిశీలించేందుకే ఈ ప్రశ్నను ప్రశ్నాపత్రంలో జోడించామని సంస్థ డీన్ వివరణ ఇచ్చారు. కేంద్ర మంత్రి వాదన ఎందుకు సరైంది కాదో వివరించాలని ప్రశ్నలో విద్యార్థులను కోరామని..ఈ ప్రశ్న మంత్రి ప్రకటనపై కాదని, దాని వెనుక ఉన్న తర్కంపైనే ప్రశ్నించామని ఐఐఎస్ఈఆర్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ డీన్ సంజీవ్ గలాండె తెలిపారు. ఐఐఎస్ఈఆర్లో తర్కబద్ధంగానే బోధన, సాధన ఉంటుందని చెప్పుకొచ్చారు. మంత్రి వ్యాఖ్యలపై తాము చర్చను చేపట్టలేదని..విద్యార్ధులు తర్కబద్ధంగా వాదించేలా..విభిన్నంగా జవాబులు ఇచ్చేలా ప్రశ్నలు ఉంటాయని అన్నారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం శాస్ర్తీయంగా తప్పు అని..ఇది స్కూల్, కాలేజ్ బోధనాంశాల్లో ఉండరాదని గత నెలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సింగ్ పేర్కొన్నారు. అయితే దీనిపై శాస్త్రవేత్తల నుంచి వ్యతిరేకత ఎదురైనా ఆయన తన వైఖరికి కట్టుబడ్డారు. డార్విన్ సిద్ధాంతం సరైంది కాదు...భూమిపై కనిపిస్తున్న మనిషి ఎప్పటికీ మానవుడిగానే ఉన్నాడని..పాఠ్యాంశాల్లో చెబుతున్నట్టు మన పూర్వీకులు ఎవరూ వానరం నుంచి నరుడిగా మారలేదని మంత్రి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. -
విశ్వాసాన్ని వమ్ముచేసిన విద్యామంత్రి
ఆదిత్య హృదయం సత్యపాల్ సింగ్ నన్ను దిగ్భ్రాంతికి గురిచేశారు. ఈయన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ జూనియర్ మంత్రి (విద్య) మాత్రమే కాదు. ముంబై మాజీ పోలీస్ కమిషనర్ కూడా. ఇలాంటి వ్యక్తులు సాధారణంగా హేతుబద్ధంగా, అప్రమత్తంగా ఉంటారు, తాము చెప్పింది వాస్తవాలకు అనుగుణంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటారు కూడా. కానీ సత్యపాల్ సింగ్ ఇటీవల చార్లెస్ డార్విన్ పరిణామవాదాన్ని బహిరంగంగా ఖండించారు. ఆయన ఏమన్నారంటే, ‘డార్విన్ సిద్ధాంతం శాస్త్రీయంగా తప్పు... మన వారసులతో సహా ఏ ఒక్కరూ రాతపూర్వకంగా లేక మౌఖికంగా.. మనిషిగా మారిన వానరాన్ని తాము చూశామని చెప్పలేదు’. అంతేకాదు.. ‘మనం పాఠశాల, కళాశాలల కరిక్యులమ్ మార్చాల్సిన అవసరముందని’ మంత్రి పేర్కొంటూ, డార్విన్ సిద్ధాంతం తప్పు అని నిరూపించడానికి అంతర్జాతీయ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మంత్రి ప్రకటనపై భారత్ లోని మూడు అగ్రశ్రేణి సైన్స్ అకాడమీలు ఆగ్రహం ప్రదర్శించాయి. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ దీనిపై ఉమ్మడి ప్రకటన చేస్తూ, ‘మంత్రి ప్రకటనలో శాస్త్రీయ పునాది లేదు. పరిణామ వాదానికి డార్విన్ చేసిన ప్రభావవంతమైన దోహదం సర్వామోదం పొందింది. పరిణామ వాదానికి చెందిన ప్రాథమిక సత్యం పట్ల శాస్త్రీయ వివాదం ఏదీ లేదు. ఇది శాస్త్రీయ సిద్ధాంతం’ అని స్పష్టం చేశాయి. సీనియర్ మంత్రులు తనను మందలించినప్పటికీ సింగ్ తన ప్రకటనకు కట్టుబడ్డారు. తాను శాస్త్రజ్ఞుడినని, రసాయన శాస్త్రంలో పీహెచ్‌డి చేశానని చెప్పిన మంత్రి ‘డార్విన్ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా సవాలు చేశారు. డార్వినిజం ఒక భ్రమ’ అనేశారు. మరోవైపున, రెండు వేలమంది శాస్త్రజ్ఞులు సంతకం చేసిన ఒక విడి ప్రకటన ఇంటర్నెట్లో ఉంది. ‘శాస్త్రీయ సమాజం పరి ణామ సిద్ధాంతాన్ని తిరస్కరించిందని ప్రకటించడం సత్యదూరం. తద్భిన్నంగా, వెలుగులోకి వస్తున్న ప్రతి కొత్త ఆవిష్కరణా డార్విన్ సూత్రీకరణలకు మద్దతు తెలుపుతూనే ఉంది.‘ డార్విన్ సిద్ధాంతంపై సత్యపాల్ సింగ్ చేసిన ప్రకటన గురించి నేను అయిదు ముఖ్య విషయాలు చెబుతాను. మొదటిది, ఆయన సైన్స్ చదువుకుని ఉండవచ్చు కానీ, కెమిస్ట్రీలో పీహెచ్.డి పట్టా.. డార్విన్ వాదంపై వివాదం రేపే అర్హతను ఆయనకు కలి గించదు. ఆయన హోదా.. జన్యుశాస్త్రం అంటే వేదాంత అధ్యయన శాస్త్రం అని భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు చేసే ప్రకటనతో సమానం. కనీస శాస్త్ర విశ్వసనీయత కూడా తనకు లేదు. రెండోది, డార్విన్ సిద్ధాంతాన్ని మంత్రి స్పష్టంగా తప్పుగా అర్థం చేసుకున్నారు. మనిషిగా మారిన వానరాన్ని తాము చూసినట్లు.. ఎవరూ చెప్పలేదని మంత్రి తెలిపినప్పుడు, కోట్లాది సంవత్సరాల క్రమంలో సాగిన పరిణామ ప్రక్రియ గురించి కాకుండా, ఆకస్మికంగా జరిగిన సంపూర్ణ పరిణామం గురించి డార్విన్ మాట్లాడినట్లుగా అర్థం చేసుకున్నారు. ‘మన తాతముత్తాతలు’ ఎన్నడూ పేర్కొనలేదు అని మంత్రి చెప్పినప్పుడు, ఒకవేళ వారు చూసి ఉంటే అది అద్భుతమయ్యేదన్న వాస్తవాన్ని మంత్రి గుర్తించడం లేదు. మూడు, డార్విన్ సిద్ధాంతం గురించి లేవనెత్తిన ప్రశ్నలను కూడా మంత్రి తప్పుగా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ ప్రశ్నలు డార్విన్ వాదాన్ని ఖండించడం కాకుండా, జీవానికి సంబంధించిన అన్ని సంక్లిష్టతలను పరిణామ వాదం పూర్తిగా వివరించలేదని మాత్రమే చెబుతున్నాయి. మరో మాటలో చెప్పాలంటే, పరిణామ వాదం వివాదాస్పదం కాలేదు. కానీ అది అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు. నాలుగు, ఒక విద్యాశాఖ మంత్రి ఇలా మాట్లాడటమే వైపరీత్యం. శాస్త్రవేత్తల మాటల్లో చెప్పాలంటే, ‘శాస్త్రీయ ఆలోచనలు, హేతుబద్ధతను ప్రచారం చేయడానికి శాస్త్రీయ సమాజం చేస్తున్న ప్రయత్నాలను ఈ ప్రకటన దెబ్బతీస్తుంది.. పైగా ప్రపంచ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇది పలుచన చేయడమే కాకుండా, భారతీయ పరిశోధకుల నిజమైన పరిశోధనపై విశ్వాసాన్ని ఇది తగ్గిస్తుంది’. చివరగా, మంత్రి తన రాజ్యాంగపరమైన విధిని ఉల్లంఘించారు. ‘శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవడం ప్రతి ఒక్క పౌరుడి విధి’ అని ఆర్టికల్ 51 ఎ (హెచ్) ప్రకటిస్తోంది. విద్యామంత్రిగా, ఎంపీగానే కాకుండా పౌరుడిగా కూడా ఈ విషయంలో డాక్టర్ సత్యపాల్ సింగ్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. కాబట్టి, కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి ప్రభుత్వంలో కొనసాగవచ్చా? కనీసం అతడిని విద్యా శాఖ నుంచి మరో పోర్ట్‌ఫోలియోకు తక్షణం మార్చవలసిన అవసరం లేదా? ఏ ఇతర విశిష్ట ప్రజాస్వామిక దేశంలో అయినా సరే, డార్విన్ పరిణామవాదాన్ని భ్రమ అని పేర్కొనే వ్యక్తిని చూసి నవ్విపోతారని నేను నమ్మకంగా చెప్పగలను. భారత్‌లో ఇది జరగనట్లయితే మన ప్రజాస్వామ్యాన్ని, విజ్ఞానశాస్త్రం పట్ల మన గౌరవాన్ని, మనల్ని పాలిస్తున్న వారి విశ్వసనీయతను గురించి ఏమని చెప్పాలి? -కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : karanthapar@itvindia.net -
కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, ఔరంగాబాద్ : ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. మానవజాతి భూమి మీద అలాగే ఉండేదని అన్నారు. ఈ నేపథ్యంలో డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని కళాశాలలు, పాఠశాలల్లో అధ్యాపకులు బోధించడం ఆపాలని పిలుపునిచ్చారు. డార్విన్ సిద్ధాంతం ప్రతిపాదించిన విధంగా మానవ పరిణామ క్రమం గురించి పురాతన భారతీయ గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన చెప్పారు. డార్విన్ పేర్కొన్న జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా కూడా నిరూపితం కాలేదని అన్నారు. భూమి ఏర్పడ్డనాటి నుంచి మనిషి.. మనిషిగానే సంచరించాడని, అలాగే ఎదిగాడని తెలిపారు. డార్విన్ సిద్ధాంతం తప్పని 35 ఏళ్ల కిందటే శాస్త్రవేత్తలు నిరూపించారని గుర్తు చేశారు. -
గంగా నది ప్రక్షాళనకు కొత్త మార్గం
సాక్షి, న్యూఢిల్లీ : గంగా నదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ సష్టం చేశారు. ఆ దిశగా పురోహితులు, అర్చకులు, హిందూ ఆధ్యాత్మిక నేతలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. గంగా నది కలుష్యానికి కారణమవుతున్న హిందువుల్లో చైతన్యాన్ని తీసుకు వచ్చేందుకు అందరూ కృషి చేయాలని ఆయన చెప్పారు. గంగా నదిలో అస్థికలు కలపడం అనేది ప్రతి హిందువు ఒక నమ్మకంగా భావిస్తారు. నది కాలుష్యానికి ఇదొక ప్రధాన కారణం. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు.. అస్థికలను నదీపరివాహక ప్రాంతంలో పూడ్చిపెట్టి.. దానిపై ఒక మొక్క నాటాలని ఆయన అన్నారు. ఈ పనిచేయడం వల్ల కాలష్యం తగ్గుతుందని ఆయన తెలిపారు. అస్థికలను గంగలో కలపడం అనేది ఒక అత్యున్నత విశ్వాసమే.. అయితే ప్రస్తుత పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. భవిష్యత తరాలకు గంగమ్మను పవిత్రంగా అందించాలంటే ఇలా చేయడం తప్పదని ఆయన అన్నారు. విశ్వాసాల మేరకు.. చాలా తక్కువ మోతాదులో అస్థికలను గంగలో కలిపి.. మిగిలిన దానిని పూడ్చి దానిపై మొక్క నాటితే మంచిదని ఆయన తెలిపారు. ఈ దిశగా అర్చకులు, పూజారులు, హిందూ ధార్మిక నేతలు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని చెప్పారు. -
జీన్స్ తొడిగిన అమ్మాయిని ఎవరైనా పెళ్లాడతారా?
గోరఖ్‌పూర్ : బీజేపీకి చెందిన మరో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్.. మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. ‘జీన్స్ తొడుక్కొని పెళ్లిమండపంలోకి వచ్చే ఏ అమ్మాయినైనా అబ్బాయిలు పెళ్లాడతారా?’ అని విద్యార్థులను ప్రశ్నించారు. గోరఖ్‌పూర్ మఠానికి అనుబంధంగా నూతనంగా ఏర్పాటుచేసిన విద్యా సంస్థ శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాంటు తొడిగినోడు మతగురువు అవుతాడా? కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి హోదాలో విద్యాసంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యపాల్.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జీన్స్ ప్యాంటు వేసుకునే ఒకడొచ్చి ‘నేను మతగురువుగా ఉంటాను’ అంటే మనం అంగీకరిస్తామా? ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. అదేవిధంగా వధువు జీన్స్ ధరించి పెళ్లి మండపంలోకి వస్తే ఏ అబ్బాయైనా చచ్చినా ఆమెను పెండ్లి చేసుకోడు’ అని సింగ్ వ్యాఖ్యానించారు. అదే వేదికపై సీఎం యోగి.. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ ప్రసంగించిన వేదికపైనే యూపీ సీఎం యోగి ఆదిత్యానథ్ ఆసీనులై ఉండటం గమనార్హం. యోగి.. ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్‌పూర్ మఠానికి అనుబంధంగా నడిచే మహారాణా ప్రతాప్ శిక్షా పరిషత్(ఎంపీఎస్పీ) విద్యాలయం శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
కొత్త మంత్రులు.. ఆ నలుగురు మాత్రం స్పెషల్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్లో కొత్తగా అడుగుపెట్టబోతున్న తొమ్మిది మందిలో నలుగురు వ్యక్తుల పేర్లు ప్రత్యేకంగా వినిపిస్తున్నాయి. సమర్థవంతమైన అధికారులుగా పేరున్న వీరి బయోడేటాను ఓసారి పరిశీలిస్తే... హర్దీప్ సింగ్ పూరి: ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి. ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు 1974 బ్యాచ్‌కు చెందిన హర్దీప్ ఐక్యరాజ్యసమితిలో ఇండియా తరపున శాశ్వత ప్రతినిధిగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ థింక్ థాంక్‌కు చైర్మన్‌గా, న్యూయార్క్‌లోని అంతర్జాతీయ శాంతి సంస్థకు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ ఇండియా తరపు ప్రతినిధిగా, కౌంటర్ టెర్రరిజం కమిటీకి చైర్మన్‌గా కూడా ఆయన పని చేశారు. కేజే అల్ఫోన్స్: ‘విధ్వంసకార అధికారి’గా ఆయనకు పేరుంది. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్‌గా విధులు నిర్వహించిన సమయంలో అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపటంతో ఆయనకు ఆ పేరు వచ్చిపడింది. అటుపై కేరళ కొట్టాయంలో పలు అభివృద్ధి పనులను చేయటం ఆయన ట్రాక్ రికార్డులో నమోదయ్యింది. కేరళ 1979 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆల్ఫోన్స్ 2006 లో సర్వీస్‌కు గుడ్ బై చెప్పి సీపీఐ(ఎం) మద్ధతుదారుడిగా కంజిరాపల్లి నుంచి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా నెగ్గారు. అయితే ఐదేళ్ల తర్వాత ఆయన బీజేపీలో చేరిపోయారు. ఆరెస్సెస్-క్రిస్టియన్ గ్రూపుల మధ్య సంధానకర్తగా ఆయన వ్యవహరించారు కూడా. రాజ్‌కుమార్ సింగ్(ఆర్కే సింగ్): 1975 ఐఏస్ బ్యాచ్‌కు చెందిన రాజ్‌కుమార్. హోం సెక్రటరీగా(2011-13) విధులు నిర్వహించారు. 2014 లో బీజేపీలో చేరిన ఆయన బిహార్‌లోని ఆర్రా నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, సిబ్బంది, పింఛన్లు, ప్రజా ఫిర్యాదులపై ఏర్పాటైన వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా పని చేశారు. మొదట్లో బీజేపీతో ఆయన సత్సంబంధాలు అంతగా లేవు. 1990లో సమస్తిపూర్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సమయంలో అప్పటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ఆదేశాలతో.. అయోధ్య రథయాత్రను అడ్డుకుని మరీ అద్వానీని సింగ్ అరెస్ట్ చేశారు. అంతేకాదు 2015 బిహార్ ఎన్నికల సమయంలో క్రిమినల్స్ కు సీట్లు కేటాయించటంపై బహిరంగంగానే అసంతృప్తిని వెల్లగక్కి అధిష్ఠానం దృష్టిలో్ నిజాయితీపరుడిగా ముద్ర పడిపోయారు. సత్యపాల్ సింగ్: మహారాష్ట్ర కేడర్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి. పెద్ద గుండాగా తనని తాను అభివర్ణించుకుంటూ కమిషనర్‌గా ఆయన ముంబైని గడగడలాడించారు. సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహన్ ఎన్కౌంటర్ కేసును 2011 జూన్‌లో ప్రభుత్వం సింగ్‌కు అప్పజెప్పింది. అయితే తోటి అధికారులతో విభేదాల మూలంగా ముందుకు సాగలేనని ముక్కుసూటిగా చెప్పేసి ఆయన విచార బృందం నుంచి బయటకు వచ్చేశారు. ఏపీ, మధ్యప్రదేశ్‌లలో నక్సలైట్ల నియంత్రణకు కృషిచేసినందుకు 1990లో ప్రత్యేక సేవా పతకాన్ని అందుకున్నారు. 2014లో బీజేపీలో చేరిన ఆయన ఉత్తర ప్రదేశ్ లోని బాగ్పత్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ పై ఆయన విజయం సాధించటం విశేషం. హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా, లాభదాయక పదవుల సంయుక్త కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ నలుగురికి ప్రమోషన్.. రక్షణశాఖ ఎవరికి? మోదీ కేబినెట్‌కు కొత్తరక్తం -
సరి-బేసి రూల్‌ను బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య నివారణ కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన సరి-బేసి నిబంధనను బీజేపీ ఎంపీ ఉల్లంఘించారు. సరి-బేసి రూల్ ప్రకారం ఢిల్లీలో శుక్రవారం బేసి సంఖ్య గల కార్లను మాత్రమే అనుమతించారు. అయితే ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ సరి నెంబర్ ప్లేట్ గల కారులో వెళుతూ ఇండియా గేట్ వద్ద కనిపించారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని ఈ రోజు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవుదినం కావడంతో ఢిల్లీలో రద్దీ తక్కువగా ఉంది. సరి-బేసి సంఖ్య గల వాహనాలను ఢిల్లీలో రోజు మార్చి రోజు అనుమతిస్తారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ విమర్శించింది. ప్రత్యామ్నాయ ప్రజా రవాణ ఏర్పాట్లు చేయకుండా ఈ నిబంధన అమలు చేయడాన్ని తప్పుపట్టింది. కాగా సరి-బేసి నిబంధన విజయవంతమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అయితే ఈ రూల్‌ను నిరంతరం అమలు చేయడం సాధ్యంకాదని చెప్పారు. -
'దాద్రి' ఆయనకు చిన్న ఘటనట!
న్యూఢిల్లీ: దాద్రి హత్య, బీఫ్ వివాదమై దేశమంతా అలజడి కొనసాగుతున్నప్పటికీ.. ఓ బీజేపీ ఎంపీ మాత్రం తేలిగ్గా కొట్టిపారేశారు. ఆవు మాంసం తిన్నారనే ఆరోపణలతో ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఓ ముస్లిం వ్యక్తిని మూకుమ్మడిగా దాడిచేసి చంపేసిన ఘటన చాలా చిన్నదని బాఘ్‌పాట్ బీజేపీ ఎంపీ సత్యపాల్ సింగ్ పేర్కొన్నారు. 'దాద్రి లాంటి చిన్న ఘటనను మన ప్రజాస్వామిక వాతావరణం, మన దేశం హ్యాండిల్ చేయగలదు. దీనిపై బయటివాళ్లు మనకు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన అవసరం లేదు' అని ఆయన మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. ముంబై మాజీ పోలీసు కమిషనర్ అయిన సత్యపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న బాఘ్పాట్కు దాద్రి రెండు గంటల ప్రయాణ దూరం మాత్రమే. దాద్రి ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని బీజేపీ తన ఎంపీలను హెచ్చరించింది. అయినప్పటికీ ఆ పార్టీ ఎంపీలు, నేతల నుంచి అడపాదడపా వివాదాస్పద వ్యాఖ్యలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని, తమ సొంతవారిపట్ల ఇలాంటి అమానుషం జరిగితే అప్పుడు కూడా ఆయన ఇలాగే స్పందిస్తారా? అని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ మండిపడ్డారు. -
నిష్పక్షపాత దర్యాప్తు జరపండి సత్యపాల్‌సింగ్ డిమాండ్
ముంబై: తనకు చెందిన ప్లాటులో వ్యభిచారం జరుగుతున్న వచ్చిన ఆరోపణలపై నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని బీజేపీ ఎంపీ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ డిమాండ్ చేశారు. వర్సోవాలోని పాటిలీపుత్ర హౌసింగ్ సొసైటీలో సింగ్‌కు సొంత ఫ్లాట్ ఉంది. దాన్ని మూడేళ్ల కిందట ఓ ప్రైవేటు కంపెనీకి అద్దెకు ఇచ్చారు. అందులో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత అకస్మాత్తుగా దాడులు చేశారు. ఫ్లాటులో ఇద్దరు యువతులు, ఒక బ్రోకర్ ఉండడంతో వారిని అరెస్టు చేశారు. ఈ ఫ్లాటు మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్‌కు చెందినదనే విషయం అప్పటికి పోలీసులకు తెలియదు. వారిని అదుపులోకి తీసుకుని బయటకు వెళ్తున్న సమయంలో భవనం ప్రవేశ ద్వారం వద్ద ఫ్లాటు యజమానుల పేర్లు రాసిన బోర్డుపై పోలీసుల దృష్టి పడింది. ఫ్లాటు నంబరు ఏ-1002 డాక్టర్ సత్యపాల్ సింగ్ పేరుతో ఉంది. అప్పుడు పోలీసులకు ఇది మాజీ నగర పోలీసు కమిషనర్ ఫ్లాట్ అని తెలిసి ఒక్కసారి అవాక్కయ్యారు. ఇంట్లో సోదా చేయగా విద్యుత్ బిల్లులు కూడా సింగ్ పేరిట ఉన్నాయి. నగరంలో ఉగ్రవాదుల దాడుల సంఘటనలు పెరిగిపోవడంతో వాహనాలు, ఇళ్లు, ఫ్లాట్లు గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించరాదని ప్రభుత్వం ఆదేశించింది. వాహనం కొనుగోలుచేసే వారి, ఇంట్లో అద్దెకు ఉండే వారి వివరాలు ముందుగా స్థానిక పోలీసు స్టేషన్లో అందజేయాలని స్వయంగా పోలీసుశాఖ ఆదేశించింది. కాని పోలీసుశాఖలో ఒక ఉన్నతాధికారి స్థాయిలో ఉన్న సింగ్ తన ఫ్లాట్ అద్దెకు ఇచ్చే ముందు ఆ ప్రైవేటు కంపెనీ గురించి ఆరా తీయలేదా..? అనే విషయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు అధికారులే ఇలా ఉంటే ఇక సాధారణ పౌరులు పోలీసులకు ఎలా సహకరిస్తారని ప్రశ్నిస్తున్నారు. -
మాజీ ముంబై పోలీస్ కమీషనర్ పై దాడి!
లక్నో: బోగస్ ఓట్లను అడ్డుకునేందుకు వెళ్లిన బీజేపీ అభ్యర్ధి, మాజీ ముంబై పోలీస్ కమీషనర్ సత్యపాల్ సింగ్ ను గుర్తు తెలియని వ్యక్తులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో భాగపట్ నియోజకవర్గంలోని మలక్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. మలక్ పూర్ గ్రామస్తులు సత్యపాల్ సింగ్ మోటార్ కాన్వాయ్ పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ, పౌర విమానయాన శాఖా మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) అభ్యర్థి అజిత్ సింగ్ పోటీలో ఉన్నారు. కాన్వాయ్ పై జరిగిన దాడిలో సత్యపాల్ సింగ్ కారు ధ్వంసమైందని, ఇద్దరికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దాడి తర్వాత సత్యపాల్ సింగ్ ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారని.. పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. దాడికి కారణమైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
ఆప్ ప్రభావం అంతంతే!
న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం అంతంతగానే ఉంటుందని ముంబై మాజీ పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ అన్నారు. బీజేపీ విజయావకాశాలపై ఆప్ ఎటువంటి ప్రభావం చూపబోదని జోస్యం చెప్పారు. జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్) మినహాయిస్తే ఆప్ ప్రభావం మరెక్కడా లేదన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ పట్ల ముస్లింలు కూడా సానుకూలత వ్యక్తం చేసేలా ఒప్పిస్తామని సింగ్ ధీమా వ్యక్తం చేశారు. 2002 గుజరాత్ అల్లర్లలో మోడీ ప్రమేయం లేదంటూ సుప్రీంకోర్టు ఇప్పటికే క్లీన్చిట్ ఇచ్చిందని ఆయన గురువారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఒక రాష్ట్రంలో అల్లర్లు జరిగితే దానికి ఒక్క సీఎంనే బాధ్యుడిని చేస్తామా? అధికారులు, మానవ హక్కుల సంస్థల సంగతి ఏంటి? వారికి బాధ్యత ఉండదా అని సింగ్ ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బీజేపీ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేశారు. జాతీయ రాజధాని ప్రాదేశిక ప్రాంతం(ఎన్సీఆర్)లో తప్ప ఆ పార్టీ ఇతర ప్రాంతాల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు ఉండయన్నారు. ప్రజలందరూ ఇప్పుడు మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ‘ఇప్పటికే 33 ఏళ్ల పాటు పోలీసు విభాగంలో పనిచేశాను. సాధ్యమైనంత మేర న్యాయం చేసేందుకు ప్రయత్నించా. జాతీయ సేవలో భాగస్వామ్యుడిని కావాలనే ఉద్ధేశంతో బీజేపీలో చేరాన’ని తెలిపారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన రాజకీయలతో ఇప్పటికీ తాను ఏకీభవించనని అన్నారు. ప్రాంతీయ రాజకీయాల్లో ఇష్టం లేదని, జాతీయ రాజకీయాలపైనే దృష్టి కేంద్రీకరిస్తానని వివరించారు. దేశంలో విద్యా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇటీవల విద్యా వ్యవస్థపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాలు విస్మయానికి గురి చేశాయన్నారు. దేశంలో కేవలం 18 శాతం మంది గ్రాడ్యుయేట్ ఇంజనీర్లు ఉద్యోగం పొందుతున్నారని తెలిపారు. మిగిలిన వారంతా నిరుద్యోగులుగా ఉండిపోతున్నారని విచారం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం విద్యాపై దృష్టి సారిస్తుందని తెలిపారు. ఎవరైనా రాజకీయాల్లో చేరి ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉంటుందని వివరించారు. -
ముంబై సీపీ రాజీనామా.. రాజకీయ ప్రవేశం!
ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆయన త్వరలోనే రాజకీయాల్లో చేరే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 59 ఏళ్ల సత్యపాల్ సింగ్ గురువారం పొద్దుపోయాక మీడియాను కలిసి తాను రాజీనామా చేయదలచుకున్న విషయాన్ని వెల్లడించారు. బీజేపీ లేదా ఆమ్మ ఆద్మీ పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ రాజకీయాల్లో చేరకపోతే మాత్రం ఏదైనా అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగం చేసే అవకాశం కూడా లేకపోలేదు. అయితే తాను ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. గతంలో పుణె, నాగ్‌పూర్ నగరాలకు పోలీసు కమిషనర్‌గా చేసిన సత్యపాల్ సింగ్ ఈసారి ఆరు రాష్ట్రాలలో ఏదో ఒకదానికి డీజీపీ అవుతారని అంతా భావించారు. కానీ గత కొన్ని నెలలుగా ఆయన పదోన్నతిపై రాజకీయ మేఘాలు అలముకున్నాయి. 1980 బ్యాచ్‌కి చెందిన ఐపీఎస్ అధికారి అయిన సత్యపాల్, 2012 ఆగస్టులో ముంబై సీపీగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఆయన సీబీఐలోనూ పనిచేశారు. తూర్పు మహారాష్ట్రలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే గడ్చిరోలి జిల్లాలోనూ ఆయన కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించారు. రిటైర్మెంటు ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణను ఎంచుకోవడం గమనార్హం. రసాయన శాస్త్రంలో పీజీ చేసిన ఆయన.. వేదాలు, ఆధ్యాత్మికత, యోగా, మేనేజ్మెంట్ నైపుణ్యాలపై పలు పుస్తకాలు కూడా రాశారు. -
లోక్‌సభ ఎన్నికల బరిలో పోలీసు కమిషనర్ !
ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తన పదవికి రాజీనామా చేయనున్నారా ? అంటే అవుననే అంటున్నాయి మహారాష్ట్ర పోలీసు వర్గాలు. రానున్న లోక్ సభ ఎన్నికలలో ముంబై లేదా ఉత్తరప్రదేశ్ నుంచి బరిలో దిగేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నారని ఆ రాష్ట్ర పోలీసు శాఖలో అంతర్గతంగా ప్రచారం జరుగుతుంది. సత్యాపాల్ సింగ్ తన రాజీనామా లేఖను ఇప్పటికే ఆ హోంశాఖకు పంపారని, ఆ శాఖ ఉన్నతాధికారులు ఆ లేఖను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపారు. అక్కడ సత్యపాల్ రాజీనామాను సీఎం కార్యాలయం పచ్చ జెండా ఊపిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా సత్యపాల్ తన రాజకీయ రంగ ప్రవేశంపై మాత్రం ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. అయితే సత్యపాల్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్గీలు తమ పార్టీలలో చేరాలని ఇప్పటికే ఆహ్వానించాయి. సత్యపాల్ సింగ్ 1980 బ్యాచ్ ఐపీఎస్ చెందిన అధికారి. -
అనూహ్య కేసు.. పోలీసుల అదుపులో నలుగురు
అనూహ్య కేసుపై ముంబై పోలీసు కమిషనర్ వెల్లడి సాక్షి, ముంబై: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో ముంబై పోలీసులు శనివారం నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించామని, వాటి ఫలితాలు రావాల్సి ఉందని ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారని, వారిలో కొందరికి నేర చరిత్ర ఉందన్నారు. ఆమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నామని, అయితే దీనిపై ఫోరెన్సిక్ నివేదిక వచ్చాకే స్పష్టత వస్తుందని ఓ పోలీసు అధికారి చెప్పినట్లు ఎన్డీటీవీ తెలిపింది. -
నరేంద్ర మోడీకి ఏడంచెల భద్రత
ముంబై: నగరంలో ఆదివారం జరగనున్న సభకు హాజరవుతున్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి పోలీసు శాఖ ఏడంచెల భద్రత కల్పించనుంది. ఈ విషయాన్ని నగర పోలీస్ కమిషనర్ సత్యపాల్ సింగ్ వెల్లడించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. మోడీకి పటిష్టమైన భద్రత కల్పించామన్నారు. సభ జరగనున్న ఎంఎంఆర్డీఏ మైదానంతోపాటు బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో మూడు వేలమంది పోలీసు సిబ్బందిని మోహరించామన్నారు. మోడీకి పెనుముప్పు పొంచిఉందనే హెచ్చరికల నేపథ్యంలో ఆయనకు ఏడంచెల భద్రత కల్పిస్తున్నామన్నారు. భద్రతా విధుల్లో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) కూడా పాలుపంచుకుంటుందన్నారు. 30 రోజుల కంటే ముందు నగరానికి వచ్చి, ఇక్కడ ఉంటున్నవారి వివరాలను సేకరిస్తున్నామన్నారు. వేదిక సమీపంలోని మార్గాల్లో నాకాబందీలు నిర్వహిస్తున్నామన్నారు. సభా ప్రాంగణంలో ప్రవేశించే ప్రతి ఒక్కరినీ రెండు పర్యాయాలు తమ సిబ్బంది తనిఖీ చేస్తారన్నారు. ఆత్మాహుతి దళాల ముప్పు అంశాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలోనే సత్వర స్పందన బృందాలను (క్యూఆర్టీ)లను రంగంలోకి దించామన్నారు. వీరితోపాటు బాంబు స్క్వాడ్ బృందాలు వేదిక సమీపంలో విస్తృతంగా తనిఖీలు చేస్తారన్నారు. కాగా మోడీ సభలో బీజేపీ నాయకులు రాజ్‌నాథ్ సింగ్, రాజీవ్ ప్రతాప్‌రూడీ, గోపీనాథ్ ముండే, నితిన్ గడ్కరీ తదితరులు పాల్గొంటారు. -
కొత్త బాస్ ఎవరు?
సాక్షి, ముంబై: వివిధ రాష్ట్ర ప్రభుత్వశాఖల డెరైక్టర్లు పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత నగర పోలీసు కమిషనర్‌గా కొనసాగుతున్న సత్యపాల్ సింగ్‌కుఏదో ఒక ఉన్నత పదవిని అప్పగించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. సింగ్ సీటును దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే అనేక మంది ఉన్నతాధికారులు పైరవీలు చేయడం ప్రారంభించారు. అవినీతి నిరోధకశాఖ డెరైక్టర్ రాజ్‌ప్రేమ్ ఖిల్నానీ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఎవరిని నియమించాలనే విషయాన్ని ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో తాత్కాలికంగా ఈ పదవి బాధ్యతలను పోలీసుశాఖ గృహనిర్మాణ మండలి డెరైక్టర్ ప్రదీప్ దీక్షిత్‌కు అదనంగా అప్పగించారు. గత మార్చిలో హోంశాఖ ఉన్నతాధికారి శ్రీదేవి గోయల్ పదవీ విరమణ చేశారు. ఆ స్థానం ఇప్పటికీ ఖాళీగానే ఉంది. అదేవిధంగా ఖిల్నానీ స్థానంలో ఇంతవరకు ఎవరినీ నియమించకపోవడంపై పోలీసుశాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. సాధారణ ఇన్స్పెక్టర్లతోపాటు అసిస్టెంట్ పోలీసు కమిషనర్లలో కొందరిని ఇటీవల బదిలీ చేశారు. అయితే సూపరింటెండెంట్లు, ఆపైస్థాయి అధికారులను ఇంతవరకు బదిలీ చేయలేదు. పదోన్నతులు కూడా కల్పించలేదు. వాస్తవానికి మార్చి లేదా ఏప్రిల్ ఆఖరులో పోలీసు అధికారులను బదిలీ చేయాలనే నియమాలు ఉన్నాయి. ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు సీనియర్ అధికారులను బదిలీ చేయలేదు. ముఖ్యంగా సూపరింటెండెంట్, డిప్యూటీ కమిషనర్‌స్థాయి అధికారుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గోయల్, ఖిల్నానీ పదవీ విరమణ పొందడంతో పోలీసుశాఖలో డెరైక్టర్‌స్థాయి పదవులు రెండు ఖాళీ అయ్యాయి. ఈ స్థానాల్లో సత్యపాల్‌సింగ్ లేదా జావెద్ అహ్మద్ ఇద్దరిలో ఒకరిని నియమించే అవకాశాలున్నాయి. వీరిలో సింగ్‌కే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా ఖాళీ అయ్యే నగర పోలీసు కమిషనర్ పదవిని దక్కించుకునేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు పోటీ పడుతున్నారు. వీరిలో విజయ్ కాంబ్లే, రాకేశ్ మారియా వంటి సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ మాట్లాడుతూ ముంబై పోలీసు కమిషనర్ పదవికి అనేక మంది అధికారులు పోటీపడుతున్న విషయం వాస్తవమేనని అన్నారు. జావెద్ అహ్మద్, కె.పి.రఘువంశి, విజయ్ కాంబ్లే, పి.కె.జైన్, మాథుర్, రాకేశ్ మారియా, మీరా బోర్వన్కర్ తదితర అధికారుల పేర్లు పరిశీలనలతో ఉన్నాయని వెల్లడించారు. కమిషనర్‌గా ఎవరిని నియమించాలనే విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, త్వరలో ఈ విషయమై ప్రకటన చేస్తామని మంత్రి పాటిల్ చెప్పారు. -
విగ్రహాలకు హాని జరిగితే బీఎంసీదే బాధ్యత!
సాక్షి, ముంబై: గణేశ్ ఉత్సవాల సమయంలో విగ్రహాలకు ఏదైనా హాని జరిగితే దాని బాధ్యత బీఎంసీ పరిపాలన విభాగానిదేనని బృహన్ ముంబై సార్వజనిక గణేశ్ ఉత్సవ సమన్వయ సమితి అధ్యక్షుడు నరేశ్ దహిబావ్కర్ హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో గణేశ్ ఉత్సవ మండళ్ల పదాధికారులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముందుగా ఉత్సవాల సమయంలో నాలుగు రోజులపాటు అర్ధరాత్రి వరకు లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతినిచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో నగర రహదారులపై పడిన గుంతలను పూడ్పించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు చవాన్ సంబంధిత అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేశారు. మరో పక్క బీఎంసీ కూడా ఉత్సవాలకు ముందే వాటిని పూడ్చివేయిస్తామని మండళ్లకు హామీ ఇచ్చింది. కాని వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గత ఏడాది నిమజ్జనాల సమయంలో ఊరేగింపులోని ఓ సార్వజనిక గణేశ్ మండలి భారీ విగ్రహం ట్రాలీ చ క్రం గుంతలో ఇరుక్కుని పక్కకు ఒరిగిపోయింది. దీంతో విగ్ర హానికి హాని జరిగింది. అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఇదిలా ఉండగా ఉత్సవాల సమయంలో వినాయకుని దర్శనం కోసం క్యూలో నిలబడిన మహిళలు, బాలికలపై ఆకతాయిలు ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మండళ్లదే అని నగర పోలీసు కమిషనర్ సత్యపాల్‌సింగ్ ప్రకటించడంపై కూడా మండళ్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అరెస్టులు ఆపండి!
సాక్షి, ముంబై: ఇటీవల శక్తి మిల్లులో ఆవరణలో మహిళా జర్నలిస్టు పై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనతో తేరుకున్న నగర పోలీసులు అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా అరెస్టు చేసి పారేస్తున్నారు. నిర్మానుష్య ప్రాంతాలు, బార్లపై తనిఖీలు,దాడులను ఉద్ధృతం చేశారు. మైదానాలు, ఫుట్‌పాత్‌లు, నిర్జన ప్రదేశాలు, రైలుపట్టాల వెంబడి తిష్టవేసిన మాదకద్రవ్యాల బానిసలు కనిపించిన వెంటనే బేడీలు వేస్తున్నారు. వీటితోపాటు ఆర్కెస్ట్రా బార్లపై దాడులు పెంచారు. అశ్లీల నృత్యాలు చేసే మహిళలను అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. దీంతో పోలీసు స్టేషన్లలో లాకప్‌లు, జైలు కిక్కిరిసిపోతున్నాయి. ఇక దాడులు చేయడం మానుకోవాలని కోరుతూ ముంబై పోలీసులకు జైలు అధికారులు లేఖలు రాసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే అన్ని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారు. దీనికి తోడు తాజాగా ప్రతినిత్యం వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్న ఆకతాయిలు, మాదకద్రవ్యాల బానిసలను జైళ్లకు పంపిస్తున్నారు. వీరందరికీ ఎక్కడ వసతి కల్పించాలో తెలియక జైలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. శక్తిమిల్లులో మహిళా ఫొటోగ్రాఫర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడింది ఆకతాయిలు, వ్యసనపరులే కావడంతో వీరిపైనే పోలీసులు అధికంగా దృష్టి సారించారు. అత్యాచారాలను అదుపు చేయడంలో పోలీసులు విఫలమవుతున్నారంటూ సామాజిక సంఘాలు, విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేయడంతో దొరికినవారిని దొరికినట్లే అదుపులోకి తీసుకుని కోర్టులకు తరలిస్తున్నారు. అందుకే ఏ స్టేషన్లో చూసినా లాకప్‌లు కిక్కిరిసి కనిపిస్తున్నాయి. డ్యాన్స్బార్లు ప్రారంభించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల అనుమతినిచ్చినప్పటికీ హోంశాఖ ఇంతవరకు అధికారికంగా ఏ ఒక్కరికీ లెసైన్సులు జారీచేయడం లేదు. ఇప్పటికే ఆర్కెస్ట్రా, లేడీస్ వెయిటర్స్ పేర్లతో మహిళా బార్టెండర్లను నియమించుకుంటున్నారు. అక్కడికి వచ్చే వారితో ఈ యువతులు అశ్లీలకృత్యాలు చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి. బార్లపై కూడా పోలీసులు దాడులు ఉద్ధృతం చేయడంతో పట్టుబడిన యువతలందరినీ మహిళల సంరక్షణ ఆలయాలకు పంపిస్తున్నారు. వీటిలో కూడా జైళ్ల మాదిరిగా సామర్థ్యానికి మించిన ఖైదీలున్నారు. ఆకస్మాత్తుగా పెరిగిన రద్దీతో జైలు సిబ్బంది, అధికారులు ఆందోళనలో పడిపోయారు. ఇక కొత్తగా వచ్చేవారికి బ్యారక్‌లలో చోటు లేదని జైలు అధికారులు అంటున్నారు. దీనిపై నగర పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ మాట్లాడుతూ జైళ్లు, మహిళ వసతిగృహాలు కిటకిటలాడుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించారు. రద్దీ గురించి ప్రశ్నించగా ‘అక్కడ ఉండేందుకు చోటులేదని నిందితులను గాలికి వదిలేస్తామా..? మా విధినిర్వహణలో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నాం. వీటి ని నిలిపివేయడం సాధ్యపడదు’ అని అన్నారు. ఈ దాడులు కొనసాగుతూనే ఉంటాయని, లేకుంటే నేరాలు మరింత పెరిగిపోతాయని సింగ్ స్పష్టీకరించారు. ఇదిలా ఉంటే నేరాల నియంత్రణలో భాగంగా ఇక నుంచి పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు ఇంటి నుంచి యూనిఫారాల్లోనే విధులకు బయల్దేరాలని, ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు కూడా యూనిఫారాన్ని వేసుకునే కనిపించాలని సింగ్ ఆదేశించడం తెలిసిందే. ఈ కొత్త ఆదేశాల ఫలితంగా ఇక నుంచి ఎక్కడ చూసినా పోలీసులే దర్శనమిస్తారు. దీంతో చిల్లరదొంగలు, నేరస్తుల్లో దడపుట్టి నేరాలకు పాల్పడేందుకు కొంతమేర జంకుతారని సింగ్ అభిప్రాయపడ్డారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం షిర్డీ: గుర్తుతెలియని నలుగురు 32 ఏళ్ల మానసిక వికలాంగురాలిపై అత్యాచారం జరిపారని స్థానిక పోలీసులు శుక్రవారం తెలిపారు. అహ్మద్‌నగర్ జిల్లా కోపర్గావ్ తాలుకాలోని జేవుర్ పటోటా గ్రామంలో గురువారం ఉదయం ఈ దారుణం జరిగింది. సోదరితోపాటు ఉంటున్న ఆమె బయటికి వెళ్లినసమయంలో దుండగులు పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం జరిపారు. మాటల ద్వారా వివరించడం ఆమెకు సాధ్యం కాకపోవడంతో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. చికిత్స కోసం బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపులు మొదలుపెట్టామని పోలీసులు తెలిపారు.