సాక్షి, న్యూఢిల్లీ : షేక్స్‌పియర్ నవల ‘మ్యాక్‌బెత్’లో బాంక్యోస్ భూతం వెంటాడినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇంటా బయట 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు వెంటాడుతున్నాయి. ఆయన శుక్రవారం నాడు లండన్‌లో బ్రిటీష్ పార్లమెంటేరియన్లను ఉద్దేశించి ముచ్చటించినప్పుడు కూడా ఈ అల్లర్లు వెంటాడక తప్పలేదు. అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్లు మీరు అంగీకరిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురుకాగానే రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే బేల మొఖం వేసి ‘నేను అంగీకరించను. అయితే హింసాకాండ చెలరేగిన మాట వాస్తవమే. అదొక విషాధ ఘటన. 1984 అల్లర్లను ప్రతీకారా భూతంగా పిలవచ్చు’ అని వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ సమాధానాన్ని అల్లర్లలో పార్టీ పాత్రను అంగీకరించినట్లుగానే స్వీకరించాలని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అంతకుమించి ఆయన నుంచి సమాధానాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడమంటే అది అహేతుకం, కఠనం అవుతుందన్నది వారి వాదన. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ వయసులో జరిగిన అల్లర్ల గురించి ఆయన్ని ప్రశ్నించడం అహేతకమని, ఆ అల్లర్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారు కనక ఆ ప్రశ్న కొడుకును అడగడం కఠినమన్నది రాహుల్ మద్దతుదారుల భావన. 2005, ఆగస్టు 11వ తేదీన అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సిక్కు అల్లర్లకు బేషరుతుగా క్షమాణలు చెప్పారు. ఆయన ఒక్క సిక్కు సామాజిక వర్గానికే కాకుండా మొత్తం దేశానికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ నాటి అల్లర్ల గురించి ప్రశ్నించడం ఎందుకన్నది ఆయన మద్దతుదారుల వాదన. నాటి అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర ఉందన్న విషయాన్ని అంగీకరించినదీ, లేనిదీ మన్మోహన్ క్షమాపణలు స్పష్టం చేయడం లేదు కనుక పార్టీ నాయకత్వంలో ఉన్నంత కాలం రాహుల్ ఈ ప్రశ్నను ఎదుర్కోవాల్సిందేనన్నది వ్యతిరేకుల వాదన.
గుచ్చి గుచ్చి ప్రశ్నించిన అర్నాబ్ గోస్వామి
2014లో టీవీ యాంకర్ అర్నాబ్ గోస్వామి రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన 1984 అల్లర్లకు సంబంధించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. నాడు అల్లర్లను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నదని రాహుల్ సమాధానమిచ్చి తప్పుకునేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా నాటి అల్లర్లలో కమల్ నాథ్ లాంటి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉందన్నది ప్రజలందరికి తెల్సిందే. నాటి అల్లర్లను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన కమల్ నాథ్ నేడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుతున్నందున, ఏడాదిలోగా సార్వత్రిక ఎన్నికలు రానున్నందున రాహుల్ గాంధీని అల్లర్ల భూతం వెంటాడక తప్పదు.
నాటి అల్లర్లకు సంబంధించి రాజీవ్ గాంధీనే ప్రశ్నించినప్పుడు ‘ఓ మహావృక్షం కూలినప్పుడు భూమి కంపించడం’ సహజమని చెప్పారు. పరోక్షంగాన్నైనా అల్లర్లలో పార్టీ పాత్ర ఉందన్న విషయాన్ని రాజీవ్ గాంధీ అంగీకరించారు. తండ్రి తప్పులకు తనయుడిని బాధ్యుడిని చేయడం ఎంత అసమంజసమో, ఒకతరంలో పార్టీ చేసిన తప్పులకు మరో తరం నాయకుడిని బాధ్యుడిని చేసి ప్రశ్నించడం అంతే అహేతుకం. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూల నాయకత్వానికి వారసుడే కాకుండా, స్వాంతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పుకుంటున్నందున, అది తనకు గర్వకారణం అంటున్నందున ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందే. ప్రధాని మోదీ లాగా తాను ఓ జాతి విద్వేషిని కానను, తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని చెప్పుకుంటున్నందున కాంగ్రెస్ తప్పిదాన్ని అంగీకరించాల్సిందే. మోదీలో లేని నిజాయితీ తనలో ఉందని నిరూపించుకోవడానికైనా రాహుల్ నిజాయితీగా వ్యవహరించాల్సిందే.
2002 అల్లర్లు: అలాగే వ్యవహరించిన మోదీ ప్రభుత్వం
సిక్కు అల్లర్లప్పుడు రాజీవ్ ప్రభుత్వం ఎలా చూసి చూడనట్లు వ్యవహరించిందో 2002లో గుజరాత్‌లో మత మారణహోమం జరిగినప్పుడు అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం అలాగే వ్యవహరించిందని భారతీయులకే కాకుండా యావత్ ప్రపంచానికి తెలుసు. అయినా మోదీ ఎక్కడికెళ్లినా 2002 అల్లర్లకు సంబంధించిన ప్రశ్న తలెత్తదు. కారణం ప్రశ్నలను ఆయనే ఎంపిక చేసుకుంటారు. అనుకోకుండా ఈ ప్రశ్న అడగాల్సిన అవకాశం అప్పుడప్పుడు జర్నలిస్టులకు వచ్చినా వారు వదులుకుంటారు. అందుకు కారణం ఆయనంటే గుడ్డి భక్తి లేదా భయం కావచ్చు. సిక్కు అల్లర్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు గుజరాత్ అల్లర్ల ప్రస్తావనే తీసుకరాలేదు.
పారిపోయిన మోదీ
మరో టీవీ యాంకర్ కరణ్ థాపర్ తన ‘డెవిల్స్ అడ్వకేట్’ టాక్ షోలో నరేంద్ర మోదీని ఇరికించేందుకు ప్రయత్నించినప్పుడు మోదీ పారిపోయారు. ‘2002లో అల్లర్లు జరిగి ఐదేళ్లు అవుతున్నా (2007) మిమ్మల్ని ఆ భూతం ఎందుకు విడిచి పెట్టడం లేదు. ఆ అల్లర్లను నిరోధించేందుకు మీరెందుకు ప్రయత్నించలేదు’ అని ప్రశ్నించినప్పుడు ‘ఆ.. కరణ్ థాపర్ లాంటి జర్నలిస్టులకు ఆ బాధ్యత అప్పగించాను’ అని చమత్కారంగా మాట్లాడి తప్పించుకోవాలని మోదీ చూశారు. ‘నాటి మారణకాండకు విచారిస్తున్నానని మీరెందుకు అంగీకరించరు?’ అని కరణ్ థాపర్ మళ్లీ ప్రశ్నించగా, ‘నేనేమీ చెప్పాలో అది అప్పుడే చెప్పాను. కావాలంటే నాటి డాక్యుమెంట్లు తిరగేసి చూసుకో!’ అని చిర చిరలాడుతూ సమాధానం ఇచ్చిన మోదీ, అంతటితో ఇంటర్వ్యూను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి టాక్ షో నుంచి అర్ధంతరంగా నడిచి వెళ్లిపోయారు.
సైప్రస్ హైకమిషనర్ రాఘవన్ ఎలా అయ్యారు!
2002 అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి క్లీన్‌చిట్ ఇచ్చిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)’ చైర్మన్ రాఘవన్, మోదీ ప్రధాన మంత్రి అయ్యాక సిప్రస్ దేశానికి హైకమిషనర్ అవడం కాకతాళీయమేమీ కాదు. మోదీ ప్రధాని అయినప్పుడు, ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ ఆయన్ని గుజరాత్ అల్లర్ల గురించి ఎవరు ప్రశ్నించలేదు. రాయిటర్స్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఉపమానంతో సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. రాయిటర్స్ ప్రతినిధి రెట్టించి ప్రశ్నించలేక పోయారు. గుజరాత్ అల్లర్ల గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించినందునే మోదీతో తన స్నేహం దెబ్బతిన్నదని, అంతకుముందు మోదీ తనకు మంచి మిత్రుడని, అందుకనే ప్రధాని అయ్యాక మోదీ తనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించారని ‘2014 : భారత్‌ను మార్చి ఆ ఎన్నికలు’ అనే పుస్తకంలో సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఎప్పటికైనా మంచి మిత్రులవుతారా!?!
Comments
Please login to add a commentAdd a comment