Sikh riots of 1984
-
కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ వెల్లడించారు. 1984 సిక్కు అల్లర్ల కేసులో 10 ఏళ్లు శిక్ష పడడంతో ఆయన 2018 డిసెంబర్ నుంచి మండోలి జైలులోని 14వ నెంబర్ బ్యారక్‌లో ఉంటున్నాడు. ఇదే బ్యారక్‌లో ఉంటున్న కన్వర్ సింగ్ అనే ఖైదీ జూన్ 15న మృతి చెందడంతో శవపరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయ్యింది. (చదవండి : కోవిడ్-19 : కేరళ కీలక నిర్ణయం ) దీంతో ఆ బ్యారక్‌లో ఉంటున్న 29మంది వృద్ధ ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా మహేందర్ యాదవ్‌తో సహా అందరికీ పాజిటివ్ వచ్చింది. జూన్ 26న మహేందర్ యాదవ్‌ను ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ(డీడీయూ) ఆస్సత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఢిల్లీలోని పాలమ్ నియోజకవర్గం నుంచి యాదవ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. (చదవండి : ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు) కాగా, ఢిల్లీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం రాత్రి నాటికి కరోనా బాధితుల సంఖ్య 97,200కు చేరింది. 3,004 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఢిల్లీ వ్యాప్తంగా ప్రస్తుతం 25,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
‘పీవీపై మన్మోహన్ వ్యాఖ్యలు అవాస్తవం’
సాక్షి, హైదరాబాద్: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను పీవీ నరసింహారావు మనవడు ఎన్వీ సుభాష్ తీవ్రంగా ఖండించారు. పీవీపై మాజీ ప్రధాని చేసిన చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని అన్నారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీపై నిందలు రాకూడదనే ఇలాంటి నిందలు వేస్తున్నారని విమర్శించారు. సిక్కుల ఊచకోత విషయంలో హోంమంత్రిగా వాటిని నివారించుటకు చర్యలు తీసుకున్నారు కానీ వాటికి కారణం ఆయన కాదని సుభాష్ అభిప్రాయపడ్డారు. గురువారం మన్మోహన్ వ్యాఖ్యలపై స్పందించిన సుభాష్.. కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి పీవీపై నిందలు వేస్తూనే ఉందని అసహం వ్యక్తం చేశారు. పీవీపై మన్మోహన్ చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పలని డిమాండ్ చేశారు. కాగా సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గుజ్రాల్ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. -
పీవీ ఆ మాట వినివుంటే.. మరోలా వుండేది
సాక్షి, న్యూఢిల్లీ: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని అన్నారు. గుజ్రాల్ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఆ సలహాను పీవీ ఆచరించి ఉన్నట్లయితే సిక్కు అల్లర్లు జరిగి ఉండేవే కావని అన్నారు. కాగా ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐకే గుజ్రాల్, తానూ ఒకే గ్రామంలో జన్మించామని, రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేశామని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కమల్‌నాథ్‌కు తిరిగి కష్టాలు
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు తిరిగి కష్టాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి.1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు అల్లర్ల కేసును తిరిగి విచారించడానికి కేంద్ర హోంశాఖ తాజాగా ఆమోద ముద్రవేసింది. ఆ కేసుకు సంబంధించి ఆయనపై ఉన్న ఆరోపణలను విచారించేందుకు హోంశాఖ అనుమతిచ్చింది. దీనిపై ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మజీందర్ సింగ్ మాట్లాడుతూ.. కమల్‌నాథ్‌పై వచ్చిన ఆరోపణలపై 601/84 నెంబరుతో నమోదై ఉన్న కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం తిరిగి విచారణ ప్రారంభిస్తుందన్నారు. కమలనాథ్కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కూడా వారు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే రెండు సాక్ష్యాలను తాము దర్యాప్తు బృందానికి సమర్పించినట్లు మజీందర్ వెల్లడించారు. సాక్ష్యం చెప్పేందుకు దైర్యంగా ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా విచారణ నిమిత్తం మజీందర్ హోంశాఖను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దర్యాప్తు బృందంతో తాము చర్చించామని, వారు తమకు ఒక ప్రత్యేక తేదీని కేటాయిస్తామన్నారని మజీందర్ తెలిపారు. సిక్కు అల్లర్లతో సంబంధం కలిగి ఉన్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంను చేసి సిక్కుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే కమల్‌నాథ్‌చే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి సిక్కులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని మజీందర్ డిమాండ్ చేశారు. -
పిట్రోడా బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఖన్నా(పంజాబ్): 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లపై తప్పుడు వ్యాఖ్యలు చేసినందుకు తమ పార్టీ నేత అయిన శ్యామ్ పిట్రోడా సిగ్గుపడాలని, దేశ ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ పేర్కొన్నారు. సోమవారం పంజాబ్‌లోని ఖన్నాలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడారు. ‘పిట్రోడా జీ, మీరలా అనడం పూర్తిగా తప్పు. అందుకు మీరు సిగ్గుపడాలి. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయనకు ఫోన్లో చెప్పా. అదే విషయాన్ని ఇప్పుడు బహిరంగంగా మీకు వెల్లడిస్తున్నా’ అని రాహుల్ అన్నారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో నోట్లరద్దు, జీఎస్టీ కారణంగా ప్రజల కొనుగోలు శక్తిని పూర్తిగా హరించి వేశాయని, లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు, రైతులకు మద్దతు ధర, ప్రతి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షల జమ వంటి గత ఎన్నికల హామీలను బీజేపీ విస్మరించిందని మండిపడ్డారు. బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. రఫేల్ ఒప్పందంపై 15 నిమిషాల బహిరంగ చర్చకు వచ్చేందుకు కూడా ఆయన భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉపాధి హామీ పథకాన్ని ప్రధాని మోదీ విమర్శించడం అంటే దేశ ప్రజలను విమర్శించడమేనని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేదల కోసం న్యాయ్ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం కింద పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.72 వేలు చొప్పున జమ కావడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందన్నారు. 1984లో దేశరాజధానిలో సిక్కుల ఊచకోతపై కాంగ్రెస్ ఓవర్సీస్ విభాగం చీఫ్ శ్యామ్ పిట్రోడా ‘జరిగిందేదో జరిగిపోయింది’ అంటూ మాట్లాడటంపై తీవ్ర దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో చేసిన ఇలాంటి వ్యాఖ్యలను ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుండటంతో నష్ట నివారణకు రాహుల్ ప్రయత్నిస్తున్నారు. -
శ్యామ్ పిట్రోడా సిగ్గుపడాలి : రాహుల్ గాంధీ
చండీగఢ్ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడాపై ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు సిగ్గుపడాలని, జాతి మొత్తానికి క్షమాపణ చెప్పాలని సూచించారు. బీజేపీని విమర్శించే క్రమంలో శ్యామ్ పిట్రోడా మాట్లాడుతూ.. ‘1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి’ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో కాంగ్రెస్ లక్ష్యంగా బీజేపీ సహా ఇతర పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చదవండి : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు; అయితే ఇప్పుడేంటి? ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పంజాబ్‌లోని ఫతేగర్ సాహిబ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘ 1984 ఘటన గురించి శ్యామ్ పిట్రోడా అలా మాట్లాడటం పెద్ద తప్పు. జాతి మొత్తానికి బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి. ఈ విషయం గురించి ఆయనతో ఫోన్లో మాట్లాడాను. మీ వ్యాఖ్యలకు సిగ్గుపడాలని చెప్పాను’ అని పేర్కొన్నారు. కాగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనలో అనేక మంది సిక్కు సోదరులు అసువులు బాసారు. -
‘క్షమించండి.. భాష రాకపోవడం వల్లే ఇలా జరిగింది’
న్యూఢిల్లీ : నాకు హిందీ సరిగా రాదు. దాంతో వాళ్లు నా మాటల్ని వక్రీకరించారు అంటున్నారు కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ పిట్రోడా. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి పిట్రోడా అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. బీజేపీ నాయకులతో పాటు.. సిక్కు సంఘాల నాయకులు కూడా శ్యామ్ పిట్రోడా క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో దిగొచ్చిన శ్యామ్ పిట్రోడా క్షమాపణలు చెప్పడమే కాక.. ‘నాకు హిందీ సరిగా రాదు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి ‘జరిగింది చాలా దారుణం’ అని చెప్పాలనుకున్నాను. కానీ భాష సరిగా రాకపోవడంతో బురా(చెడ్డది) అనే పదాన్ని బయటకు అనలేకపోయాను. దాన్ని బీజేపీ వినియోగించుకుంది. నా మాటల్ని పూర్తిగా వక్రీకరించింది. సిక్కుల ఊచకోత దారుణం అని నా అభిప్రాయం. కానీ దాన్ని సరిగా వ్యక్తపర్చలేకపోయాను. ఇందుకు నన్ను క్షమించండి’ అన్నారు శ్యామ్ పిట్రోడా. Sam Pitroda, Congress: What I meant was move on. We have other issues to discuss as to what BJP govt did and what it delivered. I feel sorry that my remark was misrepresented, I apologise. This has been blown out of proportion. https://t.co/PV5Im5hzce — ANI (@ANI) May 10, 2019 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికలో.. భారతదేశంలో చెలరేగిన మారణహోమంలో ఇది ఒకటి. ప్రభుత్వమే తన సొంత పౌరులను పొట్టనబెట్టుకుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని రాజీవ్ గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయి. ఈ కర్మకు వాళ్లు ఫలితం అనుభవించే రోజును చూడాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ విషయంపై స్పందించిన శ్యామ్ పిట్రోడా.. ‘ అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అదే విధంగా రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారనేది అబద్ధం. బాధ్యత ఉన్న నేవీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించడంతో ఈ వివాదం ప్రారంభమయ్యింది. -
జరిగిందేదో జరిగింది.. అయితే ఇప్పుడేంటి?
న్యూఢిల్లీ : 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్యామ్ పిట్రోడా క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కులు మరణించారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ...‘ 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లలో నానావతి కమిషన్ ఇచ్చిన నివేదికలో.. భారతదేశంలో చెలరేగిన మారణహోమంలో ఇది ఒకటి. ప్రభుత్వమే తన సొంత పౌరులను పొట్టనబెట్టుకుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రధాని రాజీవ్ గాంధీ కార్యాలయం నుంచే ఆదేశాలు వచ్చాయి. ఈ కర్మకు వాళ్లు ఫలితం అనుభవించే రోజును చూడాలని దేశం మొత్తం ఎదురుచూస్తోంది’ అంటూ బీజేపీ ట్వీట్ చేసింది. ఈ విషయంపై స్పందించిన శ్యామ్ పిట్రోడా.. ‘ అప్పుడేం జరిగింది? ఆ విషయాన్ని పక్కనబెట్టి ఈ ఐదేళ్లలో ఏం జరిగిందో దాని గురించి మాట్లాడండి. 1984లో జరిగిందేదో జరిగిపోయింది. అయితే ఇప్పుడేంటి? అదే విధంగా రాజీవ్ గాంధీ ఐఎన్ఎస్ విరాట్‌ను సొంత ట్యాక్సీలా వాడుకున్నారనేది అబద్ధం. బాధ్యత ఉన్న నేవీ అధికారులు ఈ విషయంపై స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని వ్యాఖ్యానించారు. కాగా శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ, శిరోమణి అకాలీదళ్ నేతలు మండిపడుతున్నారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన పిట్రోడా వెంటనే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. ‘ సిక్కు సమాజం ఎంతో వేదన అనుభవించింది. 1984లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన వారి కుటుంబాలు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నాయి. ఢిల్లీలో జరిగిన ఈ దాడిపై శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు ఇవి.. జరిగిందేదో జరిగిపోయిందట. భారత్ ఇలాంటి పాపాలు చేసిన కాంగ్రెస్ హంతకులను ఎన్నటికీ క్షమించబోదు అంటూ బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ట్వీట్ చేశారు. ఇక మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. 34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ కేసులో ఢిల్లీ కోర్టు ఇటీవలే తీర్పు వెలువరించింది. ఈ కేసులోని నిందితుల్లో ఒకరికి మరణ శిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. Agony of the entire Sikh community. Suffering of all those Sikh families killed by Congress leaders in 1984. Attack on Delhi’s secular ethos. All Summed up in these three words by Sam Pitroda - Hua To Hua. India will never forgive #MurdererCongress for its sins. pic.twitter.com/ouYXeHJHlf — Chowkidar Amit Shah (@AmitShah) May 9, 2019 -
ఆలస్యంగా దక్కిన న్యాయం!
ముప్ఫయ్నాలుగేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో పట్టపగలు ఉన్మాదంతో మూకలు చెలరేగి సాగించిన హత్యాకాండలో మొట్టమొదటిసారి ఒకరికి ఉరిశిక్ష పడింది. 1984 మొదలుకొని ఇన్నేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారికి సుదీర్ఘకాలం తర్వాత దక్కిన తొలి విజయమిది. దక్షిణ ఢిల్లీలోని మహీపాల్పూర్లో 1984 నవంబర్ 1న ఇద్దరు సిక్కు యువకులను పొట్టనబెట్టుకున్న నేరగాడు యశ్‌పాల్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించగా, మరో నేరగాడు నరేష్ షెరావత్కు యావజ్జీవ శిక్ష విధించారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు అంగరక్షకులు హతమార్చారని తెలియగానే ఢిల్లీలోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉన్మాదులు వీరంగం వేశారు. విచ్చుకత్తులు, పెట్రోల్ డబ్బాలు, ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. మగవాళ్ల ప్రాణాలు తీశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు ఒడిగట్టి చంపేశారు. ఇల్లిల్లూ దోచుకున్నారు. ఈ దాడులు ఏవో చెదురుమదురుగా, ఆవేశంలో జరిగినవి కాదు. కొందరు కాంగ్రెస్ నాయకులు బస్తీల్లో ఉండే లంపెన్ ముఠాలకు డబ్బు, మద్యం సరఫరా చేసి ఒక పథకం ప్రకారం వీటిని నడిపించారు. అధికారం చేతుల్లో ఉంది గనుక ఎవరూ ఏమీ చేయలేరని భరోసా ఇచ్చారు. వారి హస్తమే లేకుంటే వరసగా నాలుగురోజులపాటు ఈ మార ణకాండ ఇంత యధేచ్ఛగా సాగేది కాదు. పోలీసులు చేష్టలుడిగి ఉండిపోయేవారు కాదు. కేసుల దర్యాప్తులో ఇంతచేటు జాప్యం చోటుచేసుకునేది కాదు. దశాబ్దాలు గడుస్తున్నా నేరగాళ్లు తప్పిం చుకునేవారు కాదు. అధికారిక గణాంకాల ప్రకారం 3,350 మంది పౌరులు ఈ నరమేథంలో బలైపోయారు. ఇందులో ఒక్క ఢిల్లీలోనే 2,733మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అన ధికార అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 7,000కు పైనే. దేశం సిగ్గుతో తలవంచుకునేవిధంగా సాగిన ఈ దుర్మార్గం విషయంలో నేరగాళ్లెవరో వెలికితీయడానికి పీయూడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర హక్కుల సంఘాలు పడిన శ్రమ అసాధారణమైనది. ఆ సంఘాల కార్యకర్తలు రాజ ధాని నగరంలో అన్ని ప్రాంతాలకూ వెళ్లి ప్రత్యక్ష సాక్షులను కలిసి వివరాలు సేకరించి చాలా స్వల్ప వ్యవధిలోనే ‘హూ ఆర్ ద గిల్టీ?’ అనే శీర్షికతో సమగ్రమైన నివేదిక విడుదల చేశారు. మారణకాండ వెనకున్న నాయకుల పేర్లతోసహా ఆ నివేదిక అన్నిటినీ బయటపెట్టింది. ఆ సంఘాలు కొన్ని రోజుల్లోనే పూర్తి చేసిన పనిని అధికార యంత్రాంగం ఏళ్లూ పూళ్లూ గడిచినా సక్రమంగా చేయలేకపోయింది. వందల కేసుల్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న సాకుతో మూసి వేశారు. ఇప్పుడు తీర్పు వెలువడిన కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. కేసు నమోదు చేయమంటూ ప్రాధేయపడినా బాధిత కుటుంబాల గోడు పట్టిం చుకున్నవారెవరూ లేరు. ఘటన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత... అంటే 1993లో ఎన్నో ఒత్తిళ్ల తర్వాత, కోర్టు ఆదేశాలు తర్వాత కేసు నమోదు చేశారు. చివరకు ఏడాదిపాటు దర్యాప్తు పేరుతో సాగదీసి సరైన సాక్ష్యాలు లేవని పోలీసులు తేల్చారు. అయితే 2015లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మూసేసిన 293 కేసుల్ని మళ్లీ ఆరా తీసి అందులో 60 కేసుల్లో గట్టి సాక్ష్యాధారాలున్నాయని తేల్చింది. ఆ 60 కేసుల్లోనూ ప్రస్తుత కేసు ఒకటి. మామూలుగా కనబడే మనిషి అధికార ఉన్మాదం ఆవహిస్తే ఎంతటి క్రూర మృగంగా మారగలడో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. నేరగాళ్లు, బాధితులు ఇరుగుపొరుగువారే. బాగా తెలిసినవారే. కానీ ఆరోజు వందలమందితో వచ్చి బాధితులిద్దరినీ పై అంతస్తునుంచి కిందికి తోసి పెట్రోల్ చల్లి, మండే టైర్లు మీదకు విసిరి సజీవదహనం చేశారు. మరణించే ముందు వారు ఆర్తనాదాలు చేస్తుంటే ఈ మూక కేరింతలు కొట్టింది. ఇలాంటి కేసుల్ని పట్టించు కోనట్టయితే, దోషులెవరో కూపీ లాగనట్టయితే ఆ బాధిత కుటుంబాలు మాత్రమే కాదు... మొత్తం సమాజమే ఎంతో నష్టపోతుంది. ఎందుకంటే–ఇక్కడ బలవంతులదే రాజ్యమని, వారికి తోచినదే న్యాయమని సాధారణ పౌరుల్లో నిరాశ అలుముకుంటే వారు తమకు తోచిన పద్ధతుల్లో న్యాయాన్ని వెదుక్కుంటారు. అప్పుడు రాజ్యమేలేది అరాచకమే. సిక్కుల ఊచకోతపై మొదట్లో వేద్మార్వా ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ కొన్నాళ్లకే మూతబడింది. ఆ తర్వాత అప్పుటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో మరో కమిషన్ వచ్చింది. రెండేళ్ల తర్వాత ఈ మారణకాండకు కర్తంటూ ఎవరూ లేరని, ఇదంతా యాదృచ్ఛికంగా మొదలై ఆ తర్వాత గూండాల చేతుల్లోకి పోయిందని ఆ కమిషన్ తేల్చింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో తొమ్మిది విచారణ కమిషన్లు వచ్చాయి. వాటివల్ల బాధిత కుటుంబాలకు ఒరిగిందేమీ లేదు. కొన్నిటిలో హెచ్‌కేఎల్ భగత్, సజ్జన్‌కుమార్, జగదీష్ టైట్లర్, కమలనాథ్ వంటి కొందరి పేర్లు ప్రస్తావనకొచ్చాయి. అయితే క్రియకొచ్చేసరికి జరిగిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఏమైనా చెప్పవచ్చు. కానీ కేంద్రంలో ఎవరున్నా బాధిత సిక్కు కుటుంబాలకు ఒరిగింది శూన్యం. ఆలస్యంగా లభించిన న్యాయం అన్యాయంతో సమానమంటారు. ఇప్పుడు నేరగాళ్లిద్దరికీ శిక్షపడిందిగానీ, ఆప్తులను కోల్పోయిన ఆ కుటుంబాలు ఇన్ని దశాబ్దాలపాటు ఎంత వేదననూ, బాధనూ, కష్టనష్టాల్ని అనుభవించి ఉంటాయో ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఒక అధికారి మంచితనం వల్లనో, ఇంకొక న్యాయమూర్తి చొరవ ప్రదర్శించడం వల్లనో, అధికారంలో ఉన్నవారు తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందనుకుంటేనో మాత్రమే కేసుల్లో కదలిక ఉండే స్థితి మంచిదికాదు. నేరగాళ్లు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా, వారెంత పలుకుబడి కలిగినవారైనా సత్వర చర్యలుండే సమర్ధవంతమైన చట్టబద్ధ వ్యవస్థ నెలకొల్పినప్పుడే మనది నిజమైన ప్రజా తంత్ర రిపబ్లిక్ అనిపించుకుంటుంది. అన్ని పార్టీలూ దీన్ని గుర్తెరగాలి. -
ఢిల్లీ అల్లర్ల కేసులో ఒకరికి మరణశిక్ష
న్యూఢిల్లీ: 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మొదటిసారిగా న్యాయస్థానం ఒకరికి మరణశిక్ష విధించింది. 34 ఏళ్ల క్రితం ఇద్దరు సిక్కు యువకుల మృతికి కారణమైన యశ్పాల్ సింగ్(55)కు మరణ శిక్షను, నరేశ్ షెరావత్(68)కు యావజ్జీవ కారాగారాన్ని విధిస్తూ అదనపుసెషన్స్ జడ్జి అజయ్ పాండే మంగళవారం తీర్పు వెలువరించారు. దోషులు ఉన్న తీహార్ జైలులోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య జడ్జి మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. ఇద్దరు యువకుల హత్య అత్యంత అరుదైందిగా పేర్కొన్న జడ్జి.. యశ్పాల్ సింగ్‌కు మరణశిక్ష విధించారు. నరేశ్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జీవితకాల జైలు శిక్షతో సరిపెట్టారు. దీంతోపాటు దోషులిద్దరికీ చెరో రూ.35 లక్షల జరిమానా విధించారు. ఈ మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరణశిక్షకు సంబంధించిన తమ తీర్పు అసలు రికార్డులను ఢిల్లీ హైకోర్టుకు అందజేయాలని ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే మరణశిక్ష అమలు చేయాలనే నిబంధన ఉంది. సిట్ తన చార్జిషీటులో.. ‘ఒక మతానికి చెందిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం సంఘ విద్రోహ మూకలు కిరోసిన్, కర్రలు తీసుకుని కొందరి ఇళ్లపై దాడులు చేశారు. అంతర్జాతీయంగా ప్రభావం చూపిన మారణకాండ ఇది. మరణశిక్ష విధించదగ్గ నేరమిది’ అంటూ పేర్కొంది. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాజధాని ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సిక్కులే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు సంబంధించి 650 కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆధారాలు లేవంటూ 267 కేసులను మూసివేశారు. మూసివేసిన కేసుల్లో 60 కేసుల విచారణ చేపట్టిన సిట్.. 52 కేసుల్లో ఆధారాలు లేవని పేర్కొంది. సరైన ఆధారాలున్న మిగతా 8 కేసులో ఐదింటికి సంబంధించి చార్జిషీటు దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్‌కుమార్ నిందితుడిగా ఉన్న మిగతా కేసుల విచారణ మాత్రం పెండింగ్‌లో ఉంది. చార్జిషీటు దాఖలు చేసిన కేసుల్లో మరణ శిక్ష తీర్పు వెలువడిన మొట్టమొదటి కేసు ఇదే కావడం గమనార్హం. తీర్పును స్వాగతించిన సిక్కు నేతలు సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కోర్టు మరణశిక్ష విధించడంపై పలువురు సిక్కు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏమన్నారంటే: హేయమైన నేరానికి ఒడిగట్టిన దోషులను ఎట్టకేలకు న్యాయస్థానం శిక్షించింది. ఇలాంటి మిగతా కేసుల్లో కూడా న్యాయస్థానాలు త్వరలో తీర్పు వెలువరిస్తాయని ఆశిస్తున్నా. అకాలీదళ్‌నేత మజీందర్ సింగ్ సిర్సా: 34 సంవత్సరాల తర్వాత వెలువడిన ఈ తీర్పు సంతృప్తికరంగా ఉంది. షెరావత్కు యావజ్జీవం విధించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అతడికి కూడా ఉరి పడాల్సిందే. కాంగ్రెస్: న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసింది. ఎటువంటి ఒత్తిడులకు గురికాకుండా, తీర్పు వెలువరించడం గర్వించదగ్గ అంశం. ఈ కేసులో ఘటనల క్రమమిదీ.. 1984 నవంబర్ 1: సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో సుమారు 300 మందితో కూడిన గుంపు దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో హర్దేవ్ సింగ్, అవ్తార్ సింగ్ అనే వారిని కొట్టి చంపింది. 1985 ఫిబ్రవరి 23: ఈ ఘటనకు సంబంధించి జైపాల్ సింగ్ అనే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలైంది. 1985 మే: ఈ దాడులపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటయింది. 1985 సెప్టెంబర్ 9: దీనిపై ఢిల్లీ పోలీసుల అల్లర్ల వ్యతిరేక విభాగం దర్యాప్తు చేపట్టింది. 1986 డిసెంబర్ 20: జైపాల్ సింగ్‌ను నిర్దోషిగా పేర్కొంది. ∙1994 ఫిబ్రవరి 9: హర్దేవ్ సింగ్ మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు. అనుమానితులెవరినీ ప్రశ్నించకుండానే కేసు మూసివేశారు. ∙2015 ఫిబ్రవరి: అల్లర్లపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ∙2016 ఆగస్టు: సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఆధారాలుంటే తెలియజేయాలని ప్రజలను కోరుతూ పంజాబ్, ఢిల్లీల్లోని ప్రముఖ వార్తా పత్రికల్లో సిట్ ప్రకటనలు ఇచ్చింది. 2017 జనవరి 31: హర్దేవ్ సింగ్, అవ్తార్సింగ్ హత్యా సంఘటనకు సంబంధించి 18 మంది సాక్షులను విచారించిన సిట్.. నరేశ్ షెరావత్, యశ్పాల్ సింగ్ అనే వారిని దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో చార్జిషీటు వేసింది. 2018 నవంబర్ 14: ఆ ఇద్దరూ దోషులేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది. 2018 నవంబర్ 15: ఈ కేసులో తీర్పును నిలుపుదల చేసింది. పాటియాలా కోర్టు ఆవరణలోనే దోషులపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు. నవంబర్ 20: యశ్‌పాల్‌కు మరణశిక్ష, షెరావత్కు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. -
1984 నాటి అల్లర్ల కేసులో కీలక తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత చెలరేగిన అల్లర్ల కేసులో ఢిల్లీ కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. 1984 నాటి ఈ కేసులోని నిందితుల్లో ఒకరికి మరణ శిక్ష, మరొకరికి యావజ్జీవ శిక్షను విధించింది. ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్ అనే వ్యక్తికి ఉరిశిక్ష, నరేష్ అనే వ్యక్తికి జీవిత ఖైదు ఖరారు చేస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది. కాగా 34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ తీర్పు వెలువడింది. 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు... మాజీ ప్రధాని ఇందిరా గాంధీని 1984లో ఆమె అంగరక్షకులైన సత్వంత్ సింగ్, బియాత్‌సింగ్‌లు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఇందిరా గాంధీని హత్య చేసింది సిక్కు మతస్తులు కావడంతో సిక్కులకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. కాగా ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదనే కారణంతో 1994లో ఢిల్లీ పోలీసులు ఈ కేసును మూసివేశారు. అయితే తమకు న్యాయం జరగాలంటూ సిక్కు నేతలు డిమాండ్ చేయడంతో ఈ కేసు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)చే విచారణ జరిపించారు. ఈ క్రమంలో ఇద్దరు సిక్కు యువకులు అత్యంత పాశవికంగా హత్య గావించబడ్డారని, ఇవి ప్రణాళిక ప్రకారం జరిగిన హత్యలేనని సిట్ నివేదిక సమర్పించింది. దీంతో ఈ కేసులో దోషులుగా తేలిన యశ్పాల్, నరేశ్‌లకు శిక్షలు ఖరారు చేస్తూ ఢిల్లీ పాటియాల కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. -
రాహుల్‌ను ప్రశ్నించే నోళ్లు మోదీని ప్రశ్నించవా?!
సాక్షి, న్యూఢిల్లీ : షేక్స్పియర్ నవల ‘మ్యాక్బెత్’లో బాంక్యోస్ భూతం వెంటాడినట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఇంటా బయట 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు వెంటాడుతున్నాయి. ఆయన శుక్రవారం నాడు లండన్‌లో బ్రిటీష్ పార్లమెంటేరియన్లను ఉద్దేశించి ముచ్చటించినప్పుడు కూడా ఈ అల్లర్లు వెంటాడక తప్పలేదు. అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఉన్నట్లు మీరు అంగీకరిస్తున్నారా? అన్న ప్రశ్న ఎదురుకాగానే రాహుల్ గాంధీ ఎప్పటిలాగానే బేల మొఖం వేసి ‘నేను అంగీకరించను. అయితే హింసాకాండ చెలరేగిన మాట వాస్తవమే. అదొక విషాధ ఘటన. 1984 అల్లర్లను ప్రతీకారా భూతంగా పిలవచ్చు’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ సమాధానాన్ని అల్లర్లలో పార్టీ పాత్రను అంగీకరించినట్లుగానే స్వీకరించాలని ఆయన మద్దతుదారులు అంటున్నారు. అంతకుమించి ఆయన నుంచి సమాధానాన్ని రాబట్టేందుకు ప్రయత్నించడమంటే అది అహేతుకం, కఠనం అవుతుందన్నది వారి వాదన. 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీకి 14 ఏళ్లు. ఆ వయసులో జరిగిన అల్లర్ల గురించి ఆయన్ని ప్రశ్నించడం అహేతకమని, ఆ అల్లర్లు జరిగినప్పుడు రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నారు కనక ఆ ప్రశ్న కొడుకును అడగడం కఠినమన్నది రాహుల్ మద్దతుదారుల భావన. 2005, ఆగస్టు 11వ తేదీన అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సిక్కు అల్లర్లకు బేషరుతుగా క్షమాణలు చెప్పారు. ఆయన ఒక్క సిక్కు సామాజిక వర్గానికే కాకుండా మొత్తం దేశానికి క్షమాపణలు చెప్పారు. అయినప్పటికీ ఇప్పటికీ నాటి అల్లర్ల గురించి ప్రశ్నించడం ఎందుకన్నది ఆయన మద్దతుదారుల వాదన. నాటి అల్లర్లలో కాంగ్రెస్ పాత్ర ఉందన్న విషయాన్ని అంగీకరించినదీ, లేనిదీ మన్మోహన్ క్షమాపణలు స్పష్టం చేయడం లేదు కనుక పార్టీ నాయకత్వంలో ఉన్నంత కాలం రాహుల్ ఈ ప్రశ్నను ఎదుర్కోవాల్సిందేనన్నది వ్యతిరేకుల వాదన. గుచ్చి గుచ్చి ప్రశ్నించిన అర్నాబ్ గోస్వామి 2014లో టీవీ యాంకర్ అర్నాబ్ గోస్వామి రాహుల్ గాంధీని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన 1984 అల్లర్లకు సంబంధించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. నాడు అల్లర్లను అరికట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నదని రాహుల్ సమాధానమిచ్చి తప్పుకునేందుకు ప్రయత్నించారు. రాహుల్ గాంధీ ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా నాటి అల్లర్లలో కమల్ నాథ్ లాంటి పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకుల పాత్ర ఉందన్నది ప్రజలందరికి తెల్సిందే. నాటి అల్లర్లను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టిన కమల్ నాథ్ నేడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎదుతున్నందున, ఏడాదిలోగా సార్వత్రిక ఎన్నికలు రానున్నందున రాహుల్ గాంధీని అల్లర్ల భూతం వెంటాడక తప్పదు. నాటి అల్లర్లకు సంబంధించి రాజీవ్ గాంధీనే ప్రశ్నించినప్పుడు ‘ఓ మహావృక్షం కూలినప్పుడు భూమి కంపించడం’ సహజమని చెప్పారు. పరోక్షంగాన్నైనా అల్లర్లలో పార్టీ పాత్ర ఉందన్న విషయాన్ని రాజీవ్ గాంధీ అంగీకరించారు. తండ్రి తప్పులకు తనయుడిని బాధ్యుడిని చేయడం ఎంత అసమంజసమో, ఒకతరంలో పార్టీ చేసిన తప్పులకు మరో తరం నాయకుడిని బాధ్యుడిని చేసి ప్రశ్నించడం అంతే అహేతుకం. కానీ ఇక్కడ రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూల నాయకత్వానికి వారసుడే కాకుండా, స్వాంతంత్య్ర పోరాటంలో కాంగ్రెస్ పాత్ర ఉందని చెప్పుకుంటున్నందున, అది తనకు గర్వకారణం అంటున్నందున ఆయన ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిందే. ప్రధాని మోదీ లాగా తాను ఓ జాతి విద్వేషిని కానను, తనకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని చెప్పుకుంటున్నందున కాంగ్రెస్ తప్పిదాన్ని అంగీకరించాల్సిందే. మోదీలో లేని నిజాయితీ తనలో ఉందని నిరూపించుకోవడానికైనా రాహుల్ నిజాయితీగా వ్యవహరించాల్సిందే. 2002 అల్లర్లు: అలాగే వ్యవహరించిన మోదీ ప్రభుత్వం సిక్కు అల్లర్లప్పుడు రాజీవ్ ప్రభుత్వం ఎలా చూసి చూడనట్లు వ్యవహరించిందో 2002లో గుజరాత్లో మత మారణహోమం జరిగినప్పుడు అప్పటి నరేంద్ర మోదీ ప్రభుత్వం అలాగే వ్యవహరించిందని భారతీయులకే కాకుండా యావత్ ప్రపంచానికి తెలుసు. అయినా మోదీ ఎక్కడికెళ్లినా 2002 అల్లర్లకు సంబంధించిన ప్రశ్న తలెత్తదు. కారణం ప్రశ్నలను ఆయనే ఎంపిక చేసుకుంటారు. అనుకోకుండా ఈ ప్రశ్న అడగాల్సిన అవకాశం అప్పుడప్పుడు జర్నలిస్టులకు వచ్చినా వారు వదులుకుంటారు. అందుకు కారణం ఆయనంటే గుడ్డి భక్తి లేదా భయం కావచ్చు. సిక్కు అల్లర్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన టీవీ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, ప్రధాని నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేసినప్పుడు గుజరాత్ అల్లర్ల ప్రస్తావనే తీసుకరాలేదు. పారిపోయిన మోదీ మరో టీవీ యాంకర్ కరణ్ థాపర్ తన ‘డెవిల్స్ అడ్వకేట్’ టాక్ షోలో నరేంద్ర మోదీని ఇరికించేందుకు ప్రయత్నించినప్పుడు మోదీ పారిపోయారు. ‘2002లో అల్లర్లు జరిగి ఐదేళ్లు అవుతున్నా (2007) మిమ్మల్ని ఆ భూతం ఎందుకు విడిచి పెట్టడం లేదు. ఆ అల్లర్లను నిరోధించేందుకు మీరెందుకు ప్రయత్నించలేదు’ అని ప్రశ్నించినప్పుడు ‘ఆ.. కరణ్ థాపర్ లాంటి జర్నలిస్టులకు ఆ బాధ్యత అప్పగించాను’ అని చమత్కారంగా మాట్లాడి తప్పించుకోవాలని మోదీ చూశారు. ‘నాటి మారణకాండకు విచారిస్తున్నానని మీరెందుకు అంగీకరించరు?’ అని కరణ్ థాపర్ మళ్లీ ప్రశ్నించగా, ‘నేనేమీ చెప్పాలో అది అప్పుడే చెప్పాను. కావాలంటే నాటి డాక్యుమెంట్లు తిరగేసి చూసుకో!’ అని చిర చిరలాడుతూ సమాధానం ఇచ్చిన మోదీ, అంతటితో ఇంటర్వ్యూను నిలిపివేస్తున్నట్లు ప్రకటించి టాక్ షో నుంచి అర్ధంతరంగా నడిచి వెళ్లిపోయారు. సైప్రస్ హైకమిషనర్ రాఘవన్ ఎలా అయ్యారు! 2002 అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీకి క్లీన్చిట్ ఇచ్చిన ‘ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)’ చైర్మన్ రాఘవన్, మోదీ ప్రధాన మంత్రి అయ్యాక సిప్రస్ దేశానికి హైకమిషనర్ అవడం కాకతాళీయమేమీ కాదు. మోదీ ప్రధాని అయినప్పుడు, ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ ఆయన్ని గుజరాత్ అల్లర్ల గురించి ఎవరు ప్రశ్నించలేదు. రాయిటర్స్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు ఉపమానంతో సరైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. రాయిటర్స్ ప్రతినిధి రెట్టించి ప్రశ్నించలేక పోయారు. గుజరాత్ అల్లర్ల గురించి గుచ్చి గుచ్చి ప్రశ్నించినందునే మోదీతో తన స్నేహం దెబ్బతిన్నదని, అంతకుముందు మోదీ తనకు మంచి మిత్రుడని, అందుకనే ప్రధాని అయ్యాక మోదీ తనకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించారని ‘2014 : భారత్‌ను మార్చి ఆ ఎన్నికలు’ అనే పుస్తకంలో సీనియర్ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఎప్పటికైనా మంచి మిత్రులవుతారా!?! -
పారిపోయిన మోదీ
-
ట్వీట్ చేసి ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇరకాటంలో పడింది. మొన్నటికిమొన్న కశ్మీర్ ను 'భారత్ ఆక్రమిత కశ్మీర్'గా అభివర్ణించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ దుమారం రేపగా.. తాజాగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా వివాదాస్పద ట్వీట్ చేసింది. ఇందిరాగాంధీ హత్య సందర్భంలో రాజీవ్ గాంధీ చేసిన ఓ వ్యాఖ్య దుమారం రేపింది. 'ఓ మహావృక్షం కూలినప్పుడు నేల సహజంగానే అదురుతుంది' అంటూ రాజీవ్ అప్పట్లో పేర్కొన్నారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురవ్వగా.. ఆ వెంటనే పెద్ద ఎత్తున సిక్కులపై అలర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,700 మంది సిక్కులు చనిపోయారు. ఈ మరణాలను ఉద్దేశించి రాజీవ్ ఈ వ్యాఖ్య చేసినట్టు భావించడంతో అప్పట్లో దుమారం రేపింది. తాజాగా రాజీవ్ జయంతి సందర్బంగా బెంగాల్ పీసీసీ విభాగం ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యను పోస్టు చేసింది. దీనిపై దుమారం రేగడంతో వెంటనే ఆ వ్యాఖ్యను పీసీపీ ట్విట్టర్ నుంచి తొలగించింది. అయినా నెటిజన్లు ఆ ట్వీట్ ప్రింట్ స్క్రీన్లతో హోరెత్తిస్తున్నారు. సిక్కులపై జరిగిన అమానుష గాయాలను మళ్లీ గుర్తుచేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యను పెట్టిందా? అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. అయితే, బెంగాల్ పీసీసీ మాత్రం తాము ఆ ట్వీట్ చేయలేదని పేర్కొంటున్నది.