సాక్షి, న్యూఢిల్లీ: 1984 సిక్కు అల్లర్లపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిక్కు అల్లర్లు జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ సలహామేరకు వ్యవహరించి ఉన్నట్లయితే ఆ అల్లర్లే జరిగి ఉండేవి కావని అన్నారు. గుజ్రాల్ సూచనలపై పీవీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అభిప్రాయపడ్డారు. ఆ అల్లర్లు జరిగే ముందు రోజు ఐకే గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీ నరసింహారావు ఇంటికి వెళ్లారని ఆయన తెలిపారు. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని, ఆర్మీని వెంటనే రంగంలోకి దించాలని గుజ్రాల్ అప్పటి హోంమంత్రి పీవీకి సూచించారని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు.
ఆ సలహాను పీవీ ఆచరించి ఉన్నట్లయితే సిక్కు అల్లర్లు జరిగి ఉండేవే కావని అన్నారు. కాగా ఐకే గుజ్రాల్ శత జయంతిని పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మన్మోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐకే గుజ్రాల్, తానూ ఒకే గ్రామంలో జన్మించామని, రాజకీయాల్లోనూ చాలా ఏళ్లు కలిసి పనిచేశామని మన్మోహన్ గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ఉప రాష్ట్రపతి అన్సారీ, కేంద్రమంత్రులు పీయూశ్ గోయల్, జైశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment