న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు తిరిగి కష్టాలు మొదలైనట్లు కనిపిస్తున్నాయి.1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం చెలరేగిన సిక్కు అల్లర్ల కేసును తిరిగి విచారించడానికి కేంద్ర హోంశాఖ తాజాగా ఆమోద ముద్రవేసింది. ఆ కేసుకు సంబంధించి ఆయనపై ఉన్న ఆరోపణలను విచారించేందుకు హోంశాఖ అనుమతిచ్చింది. దీనిపై ఢిల్లీ గురుద్వారా కమిటీ అధ్యక్షుడు మజీందర్ సింగ్ మాట్లాడుతూ.. కమల్‌నాథ్‌పై వచ్చిన ఆరోపణలపై 601/84 నెంబరుతో నమోదై ఉన్న కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం తిరిగి విచారణ ప్రారంభిస్తుందన్నారు.
కమలనాథ్‌కు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కూడా వారు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే రెండు సాక్ష్యాలను తాము దర్యాప్తు బృందానికి సమర్పించినట్లు మజీందర్ వెల్లడించారు. సాక్ష్యం చెప్పేందుకు దైర్యంగా ముందుకొచ్చే వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పించాలని కోరారు. ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా విచారణ నిమిత్తం మజీందర్ హోంశాఖను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
దర్యాప్తు బృందంతో తాము చర్చించామని, వారు తమకు ఒక ప్రత్యేక తేదీని కేటాయిస్తామన్నారని మజీందర్ తెలిపారు. సిక్కు అల్లర్లతో సంబంధం కలిగి ఉన్న కమల్‌నాథ్‌ను మధ్యప్రదేశ్ సీఎంను చేసి సిక్కుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని ఆరోపించారు. వెంటనే కమల్‌నాథ్‌చే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి సిక్కులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీని మజీందర్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment