తీర్పు అనంతరం పటియాల కోర్టు వద్ద బాధిత కుటుంబాల ఆనందోత్సాహాలు
ముప్ఫయ్‌నాలుగేళ్లక్రితం దేశ రాజధాని నగరంలో పట్టపగలు ఉన్మాదంతో మూకలు చెలరేగి సాగించిన హత్యాకాండలో మొట్టమొదటిసారి ఒకరికి ఉరిశిక్ష పడింది. 1984 మొదలుకొని ఇన్నేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నవారికి సుదీర్ఘకాలం తర్వాత దక్కిన తొలి విజయమిది. దక్షిణ ఢిల్లీలోని మహీపాల్‌పూర్‌లో 1984 నవంబర్ 1న ఇద్దరు సిక్కు యువకులను పొట్టనబెట్టుకున్న నేరగాడు యశ్‌పాల్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించగా, మరో నేరగాడు నరేష్ షెరావత్‌కు యావజ్జీవ శిక్ష విధించారు.
అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కు అంగరక్షకులు హతమార్చారని తెలియగానే ఢిల్లీలోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉన్మాదులు వీరంగం వేశారు. విచ్చుకత్తులు, పెట్రోల్ డబ్బాలు, ఇనుపరాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. మగవాళ్ల ప్రాణాలు తీశారు. ఆడవాళ్లపై అత్యాచారాలకు ఒడిగట్టి చంపేశారు. ఇల్లిల్లూ దోచుకున్నారు. ఈ దాడులు ఏవో చెదురుమదురుగా, ఆవేశంలో జరిగినవి కాదు. కొందరు కాంగ్రెస్ నాయకులు బస్తీల్లో ఉండే లంపెన్ ముఠాలకు డబ్బు, మద్యం సరఫరా చేసి ఒక పథకం ప్రకారం వీటిని నడిపించారు. అధికారం చేతుల్లో ఉంది గనుక ఎవరూ ఏమీ చేయలేరని భరోసా ఇచ్చారు. వారి హస్తమే లేకుంటే వరసగా నాలుగురోజులపాటు ఈ మార ణకాండ ఇంత యధేచ్ఛగా సాగేది కాదు. పోలీసులు చేష్టలుడిగి ఉండిపోయేవారు కాదు. కేసుల దర్యాప్తులో ఇంతచేటు జాప్యం చోటుచేసుకునేది కాదు. దశాబ్దాలు గడుస్తున్నా నేరగాళ్లు తప్పిం చుకునేవారు కాదు. అధికారిక గణాంకాల ప్రకారం 3,350 మంది పౌరులు ఈ నరమేథంలో బలైపోయారు.
ఇందులో ఒక్క ఢిల్లీలోనే 2,733మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే అన ధికార అంచనాల ప్రకారం మృతుల సంఖ్య 7,000కు పైనే. దేశం సిగ్గుతో తలవంచుకునేవిధంగా సాగిన ఈ దుర్మార్గం విషయంలో నేరగాళ్లెవరో వెలికితీయడానికి పీయూడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర హక్కుల సంఘాలు పడిన శ్రమ అసాధారణమైనది. ఆ సంఘాల కార్యకర్తలు రాజ ధాని నగరంలో అన్ని ప్రాంతాలకూ వెళ్లి ప్రత్యక్ష సాక్షులను కలిసి వివరాలు సేకరించి చాలా స్వల్ప వ్యవధిలోనే ‘హూ ఆర్ ద గిల్టీ?’ అనే శీర్షికతో సమగ్రమైన నివేదిక విడుదల చేశారు. మారణకాండ వెనకున్న నాయకుల పేర్లతోసహా ఆ నివేదిక అన్నిటినీ బయటపెట్టింది. ఆ సంఘాలు కొన్ని రోజుల్లోనే పూర్తి చేసిన పనిని అధికార యంత్రాంగం ఏళ్లూ పూళ్లూ గడిచినా సక్రమంగా చేయలేకపోయింది. వందల కేసుల్ని సరైన సాక్ష్యాధారాలు లేవన్న సాకుతో మూసి వేశారు. ఇప్పుడు తీర్పు వెలువడిన కేసు ఎన్ని మలుపులు తిరిగిందో తెలుసుకుంటే దిగ్భ్రాంతి కలుగుతుంది. కేసు నమోదు చేయమంటూ ప్రాధేయపడినా బాధిత కుటుంబాల గోడు పట్టిం చుకున్నవారెవరూ లేరు.
ఘటన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత... అంటే 1993లో ఎన్నో ఒత్తిళ్ల తర్వాత, కోర్టు ఆదేశాలు తర్వాత కేసు నమోదు చేశారు. చివరకు ఏడాదిపాటు దర్యాప్తు పేరుతో సాగదీసి సరైన సాక్ష్యాలు లేవని పోలీసులు తేల్చారు. అయితే 2015లో సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) మూసేసిన 293 కేసుల్ని మళ్లీ ఆరా తీసి అందులో 60 కేసుల్లో గట్టి సాక్ష్యాధారాలున్నాయని తేల్చింది. ఆ 60 కేసుల్లోనూ ప్రస్తుత కేసు ఒకటి.
మామూలుగా కనబడే మనిషి అధికార ఉన్మాదం ఆవహిస్తే ఎంతటి క్రూర మృగంగా మారగలడో చెప్పడానికి ఈ కేసు ఒక ఉదాహరణ. నేరగాళ్లు, బాధితులు ఇరుగుపొరుగువారే. బాగా తెలిసినవారే. కానీ ఆరోజు వందలమందితో వచ్చి బాధితులిద్దరినీ పై అంతస్తునుంచి కిందికి తోసి పెట్రోల్ చల్లి, మండే టైర్లు మీదకు విసిరి సజీవదహనం చేశారు. మరణించే ముందు వారు ఆర్తనాదాలు చేస్తుంటే ఈ మూక కేరింతలు కొట్టింది. ఇలాంటి కేసుల్ని పట్టించు కోనట్టయితే, దోషులెవరో కూపీ లాగనట్టయితే ఆ బాధిత కుటుంబాలు మాత్రమే కాదు... మొత్తం సమాజమే ఎంతో నష్టపోతుంది. ఎందుకంటే–ఇక్కడ బలవంతులదే రాజ్యమని, వారికి తోచినదే న్యాయమని సాధారణ పౌరుల్లో నిరాశ అలుముకుంటే వారు తమకు తోచిన పద్ధతుల్లో న్యాయాన్ని వెదుక్కుంటారు. అప్పుడు రాజ్యమేలేది అరాచకమే. సిక్కుల ఊచకోతపై మొదట్లో వేద్‌మార్వా ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిషన్ కొన్నాళ్లకే మూతబడింది. ఆ తర్వాత అప్పుటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంగనాథ్ మిశ్రా నేతృత్వంలో మరో కమిషన్ వచ్చింది.
రెండేళ్ల తర్వాత ఈ మారణకాండకు కర్తంటూ ఎవరూ లేరని, ఇదంతా యాదృచ్ఛికంగా మొదలై ఆ తర్వాత గూండాల చేతుల్లోకి పోయిందని ఆ కమిషన్ తేల్చింది. ఆ తర్వాత రెండు దశాబ్దాల్లో తొమ్మిది విచారణ కమిషన్లు వచ్చాయి. వాటివల్ల బాధిత కుటుంబాలకు ఒరిగిందేమీ లేదు. కొన్నిటిలో హెచ్‌కేఎల్ భగత్, సజ్జన్‌కుమార్, జగదీష్ టైట్లర్, కమలనాథ్ వంటి కొందరి పేర్లు ప్రస్తావనకొచ్చాయి. అయితే క్రియకొచ్చేసరికి జరిగిందేమీ లేదు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఏమైనా చెప్పవచ్చు. కానీ కేంద్రంలో ఎవరున్నా బాధిత సిక్కు కుటుంబాలకు ఒరిగింది శూన్యం.
ఆలస్యంగా లభించిన న్యాయం అన్యాయంతో సమానమంటారు. ఇప్పుడు నేరగాళ్లిద్దరికీ శిక్షపడిందిగానీ, ఆప్తులను కోల్పోయిన ఆ కుటుంబాలు ఇన్ని దశాబ్దాలపాటు ఎంత వేదననూ, బాధనూ, కష్టనష్టాల్ని అనుభవించి ఉంటాయో ఊహించుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. ఒక అధికారి మంచితనం వల్లనో, ఇంకొక న్యాయమూర్తి చొరవ ప్రదర్శించడం వల్లనో, అధికారంలో ఉన్నవారు తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందనుకుంటేనో మాత్రమే కేసుల్లో కదలిక ఉండే స్థితి మంచిదికాదు. నేరగాళ్లు ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా, వారెంత పలుకుబడి కలిగినవారైనా సత్వర చర్యలుండే సమర్ధవంతమైన చట్టబద్ధ వ్యవస్థ నెలకొల్పినప్పుడే మనది నిజమైన ప్రజా తంత్ర రిపబ్లిక్ అనిపించుకుంటుంది. అన్ని పార్టీలూ దీన్ని గుర్తెరగాలి.
Comments
Please login to add a commentAdd a comment