ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో దోషి, మాజీ ఎమ్మెల్యే మహేందర్ యాదవ్(70) కరోనా వైరస్ బారిన పడి ఆదివారం మృతి చెందారు. ఈ విషయాన్ని ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ వెల్లడించారు. 1984 సిక్కు అల్లర్ల కేసులో 10 ఏళ్లు శిక్ష పడడంతో ఆయన 2018 డిసెంబర్ నుంచి మండోలి జైలులోని 14వ నెంబర్ బ్యారక్‌లో ఉంటున్నాడు. ఇదే బ్యారక్‌లో ఉంటున్న కన్వర్ సింగ్ అనే ఖైదీ జూన్ 15న మృతి చెందడంతో శవపరీక్ష నిర్వహించగా కరోనా నిర్ధారణ అయ్యింది.
(చదవండి : కోవిడ్-19 : కేరళ కీలక నిర్ణయం )
దీంతో ఆ బ్యారక్‌లో ఉంటున్న 29మంది వృద్ధ ఖైదీలకు పరీక్షలు నిర్వహించగా మహేందర్ యాదవ్‌తో సహా అందరికీ పాజిటివ్ వచ్చింది. జూన్ 26న మహేందర్ యాదవ్‌ను ఢిల్లీలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ(డీడీయూ) ఆస్సత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం లోక్‌నాయక్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ద్వారకలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఢిల్లీలోని పాలమ్ నియోజకవర్గం నుంచి యాదవ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. (చదవండి : ఒక్కరోజులో 24వేలకు పైగా కరోనా కేసులు)
కాగా, ఢిల్లీలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. శనివారం రాత్రి నాటికి కరోనా బాధితుల సంఖ్య 97,200కు చేరింది. 3,004 మంది కరోనా బారినపడి మృతి చెందారు. ఢిల్లీ వ్యాప్తంగా ప్రస్తుతం 25,940 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment