న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మరోసారి ఇరకాటంలో పడింది. మొన్నటికిమొన్న కశ్మీర్ ను 'భారత్ ఆక్రమిత కశ్మీర్'గా అభివర్ణించి కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ దుమారం రేపగా.. తాజాగా దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 72వ జయంతి సందర్భంగా వివాదాస్పద ట్వీట్ చేసింది.
ఇందిరాగాంధీ హత్య సందర్భంలో రాజీవ్ గాంధీ చేసిన ఓ వ్యాఖ్య దుమారం రేపింది. 'ఓ మహావృక్షం కూలినప్పుడు నేల సహజంగానే అదురుతుంది' అంటూ రాజీవ్ అప్పట్లో పేర్కొన్నారు. 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీ తన సిక్కు బాడీగార్డుల చేతిలో హత్యకు గురవ్వగా.. ఆ వెంటనే పెద్ద ఎత్తున సిక్కులపై అలర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో 2,700 మంది సిక్కులు చనిపోయారు. ఈ మరణాలను ఉద్దేశించి రాజీవ్ ఈ వ్యాఖ్య చేసినట్టు భావించడంతో అప్పట్లో దుమారం రేపింది.
తాజాగా రాజీవ్ జయంతి సందర్బంగా బెంగాల్ పీసీసీ విభాగం ట్విట్టర్ లో ఈ వ్యాఖ్యను పోస్టు చేసింది. దీనిపై దుమారం రేగడంతో వెంటనే ఆ వ్యాఖ్యను పీసీపీ ట్విట్టర్ నుంచి తొలగించింది. అయినా నెటిజన్లు ఆ ట్వీట్ ప్రింట్ స్క్రీన్లతో హోరెత్తిస్తున్నారు. సిక్కులపై జరిగిన అమానుష గాయాలను మళ్లీ గుర్తుచేసేందుకే కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యను పెట్టిందా? అంటూ వారు కామెంట్ చేస్తున్నారు. అయితే, బెంగాల్ పీసీసీ మాత్రం తాము ఆ ట్వీట్ చేయలేదని పేర్కొంటున్నది.
ట్వీట్ చేసి ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్!
Published Sat, Aug 20 2016 1:59 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
Advertisement
Advertisement