‘నా తండ్రి హంతకులను క్షమిస్తున్నా’
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఉదంతంపై ఆయన తనయుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వారిని పూర్తిగా క్షమించేస్తున్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్.. ఇందిర, రాజీవ్ హత్య ఉదంతాలపై స్పందించారు.
‘నా తండ్రి హత్య తర్వాత మా కుటుంబం ఆ బాధ నుంచి కోలుకోవటానికి చాలా సమయం పట్టింది. ఏది ఏమైనా నేనూ, నా సోదరి(ప్రియాంక వాద్రా) హంతకులను క్షమించేస్తున్నాం’ అని రాహుల్ పేర్కొన్నారు. ఇక ఇందిర, రాజీవ్ హత్యలపై రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో దుష్ట శక్తులతో పోరాడే సమయంలో.. మీరు ఓ వైపు నిలిచినప్పుడు ఖచ్ఛితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇక్కడా అదే జరిగింది. మా నాన్నమ్మ, తండ్రి ఆ క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. అప్పటి పరిస్థితులను బట్టి వాళ్లు చనిపోతారని మా కుటుంబం ముందే ఊహించింది. తాను చనిపోతానని నాన్నమ్మ(ఇందిర) నాతో తరచూ అనేవారు. ఆమె చెప్పినట్లే ఆమెను హతమార్చారు. అది చూశాక మీరు కూడా చనిపోతారని నా తండ్రి(రాజీవ్)తో నేను అన్నాను. ఊహించినట్లే జరిగింది. విధి బలీయమైంది’ అని రాహుల్ ఉద్వేగంగా ప్రసంగించారు.
కాగా, గతంలో జయలలిత సీఎంగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు నిందితులను విడుదల చేసేందుకు ప్రతిపాదన చేశారు. అయితే దానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ సమయంలో ఈ వ్యవహారంపై స్పందించేందుకు రాహుల్ విముఖత వ్యక్తం చేశారు.