తీర్పు విన్నాక హర్షం వ్యక్తంచేస్తున్న బాధితుల కుటుంబసభ్యులు
న్యూఢిల్లీ: 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో మొదటిసారిగా న్యాయస్థానం ఒకరికి మరణశిక్ష విధించింది. 34 ఏళ్ల క్రితం ఇద్దరు సిక్కు యువకుల మృతికి కారణమైన యశ్‌పాల్ సింగ్(55)కు మరణ శిక్షను, నరేశ్ షెరావత్(68)కు యావజ్జీవ కారాగారాన్ని విధిస్తూ అదనపుసెషన్స్ జడ్జి అజయ్ పాండే మంగళవారం తీర్పు వెలువరించారు.
దోషులు ఉన్న తీహార్ జైలులోనే కట్టుదిట్టమైన భద్రత మధ్య జడ్జి మంగళవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. ఇద్దరు యువకుల హత్య అత్యంత అరుదైందిగా పేర్కొన్న జడ్జి.. యశ్‌పాల్ సింగ్‌కు మరణశిక్ష విధించారు. నరేశ్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని జీవితకాల జైలు శిక్షతో సరిపెట్టారు. దీంతోపాటు దోషులిద్దరికీ చెరో రూ.35 లక్షల జరిమానా విధించారు.
ఈ మొత్తాన్ని మృతుల కుటుంబాలకు అందజేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరణశిక్షకు సంబంధించిన తమ తీర్పు అసలు రికార్డులను ఢిల్లీ హైకోర్టుకు అందజేయాలని ఉత్తర్వులిచ్చారు. హైకోర్టు ధ్రువీకరించిన తర్వాత మాత్రమే మరణశిక్ష అమలు చేయాలనే నిబంధన ఉంది. సిట్ తన చార్జిషీటులో.. ‘ఒక మతానికి చెందిన వారే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారం సంఘ విద్రోహ మూకలు కిరోసిన్, కర్రలు తీసుకుని కొందరి ఇళ్లపై దాడులు చేశారు.
అంతర్జాతీయంగా ప్రభావం చూపిన మారణకాండ ఇది. మరణశిక్ష విధించదగ్గ నేరమిది’ అంటూ పేర్కొంది. 1984లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన సిక్కు అంగరక్షకుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన అనంతరం రాజధాని ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే సిక్కులే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 3 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనలకు సంబంధించి 650 కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ఆధారాలు లేవంటూ 267 కేసులను మూసివేశారు. మూసివేసిన కేసుల్లో 60 కేసుల విచారణ చేపట్టిన సిట్.. 52 కేసుల్లో ఆధారాలు లేవని పేర్కొంది. సరైన ఆధారాలున్న మిగతా 8 కేసులో ఐదింటికి సంబంధించి చార్జిషీటు దాఖలు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్‌కుమార్ నిందితుడిగా ఉన్న మిగతా కేసుల విచారణ మాత్రం పెండింగ్‌లో ఉంది. చార్జిషీటు దాఖలు చేసిన కేసుల్లో మరణ శిక్ష తీర్పు వెలువడిన మొట్టమొదటి కేసు ఇదే కావడం గమనార్హం.
తీర్పును స్వాగతించిన సిక్కు నేతలు
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కోర్టు మరణశిక్ష విధించడంపై పలువురు సిక్కు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఏమన్నారంటే: హేయమైన నేరానికి ఒడిగట్టిన దోషులను ఎట్టకేలకు న్యాయస్థానం శిక్షించింది. ఇలాంటి మిగతా కేసుల్లో కూడా న్యాయస్థానాలు త్వరలో తీర్పు వెలువరిస్తాయని ఆశిస్తున్నా.
అకాలీదళ్‌నేత మజీందర్ సింగ్ సిర్సా: 34 సంవత్సరాల తర్వాత వెలువడిన ఈ తీర్పు సంతృప్తికరంగా ఉంది. షెరావత్‌కు యావజ్జీవం విధించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అతడికి కూడా ఉరి పడాల్సిందే.
కాంగ్రెస్: న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేసింది. ఎటువంటి ఒత్తిడులకు గురికాకుండా, తీర్పు వెలువరించడం గర్వించదగ్గ అంశం.
ఈ కేసులో ఘటనల క్రమమిదీ..
1984 నవంబర్ 1: సిక్కు వ్యతిరేక అల్లర్ల సమయంలో సుమారు 300 మందితో కూడిన గుంపు దక్షిణ ఢిల్లీలోని మహిపాల్‌పూర్‌లో హర్‌దేవ్ సింగ్, అవ్‌తార్ సింగ్ అనే వారిని కొట్టి చంపింది.
1985 ఫిబ్రవరి 23: ఈ ఘటనకు సంబంధించి జైపాల్ సింగ్ అనే వ్యక్తిపై చార్జిషీట్ దాఖలైంది.
1985 మే: ఈ దాడులపై దర్యాప్తు చేసేందుకు జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ ఏర్పాటయింది.
1985 సెప్టెంబర్ 9: దీనిపై ఢిల్లీ పోలీసుల అల్లర్ల వ్యతిరేక విభాగం దర్యాప్తు చేపట్టింది.
1986 డిసెంబర్ 20: జైపాల్ సింగ్‌ను నిర్దోషిగా పేర్కొంది. ∙1994 ఫిబ్రవరి 9: హర్‌దేవ్ సింగ్ మృతిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎటువంటి ఆధారాలను సేకరించలేకపోయారు. అనుమానితులెవరినీ ప్రశ్నించకుండానే కేసు మూసివేశారు. ∙2015 ఫిబ్రవరి: అల్లర్లపై దర్యాప్తునకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ∙2016 ఆగస్టు: సిక్కు వ్యతిరేక అల్లర్లపై ఆధారాలుంటే తెలియజేయాలని ప్రజలను కోరుతూ పంజాబ్, ఢిల్లీల్లోని ప్రముఖ వార్తా పత్రికల్లో సిట్ ప్రకటనలు ఇచ్చింది.
2017 జనవరి 31: హర్‌దేవ్ సింగ్, అవ్‌తార్‌సింగ్ హత్యా సంఘటనకు సంబంధించి 18 మంది సాక్షులను విచారించిన సిట్.. నరేశ్ షెరావత్, యశ్‌పాల్ సింగ్ అనే వారిని దోషులుగా పేర్కొంటూ న్యాయస్థానంలో చార్జిషీటు వేసింది.
2018 నవంబర్ 14: ఆ ఇద్దరూ దోషులేనని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
2018 నవంబర్ 15: ఈ కేసులో తీర్పును నిలుపుదల చేసింది. పాటియాలా కోర్టు ఆవరణలోనే దోషులపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు.
నవంబర్ 20: యశ్‌పాల్‌కు మరణశిక్ష, షెరావత్‌కు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment