న్యూఢిల్లీ: ‘నిర్భయ’పై పాశవికంగా హత్యాచారం జరిపిన దోషులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని కేంద్రం కోరింది. వారికి ఇంక ఎంతమాత్రం సమయం ఇవ్వడం సరికాదని, అందుకు వారు అర్హులు కారని స్పష్టం చేసింది. నిర్భయ హత్యాచారం కేసు దోషుల ఉరిశిక్ష అమలుపై విధించిన స్టేను సవాలు చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ముందు ఆదివారం కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా, గత సంవత్సరం డిసెంబర్‌లో హైదరాబాద్‌లో చోటు చేసుకున్న ‘దిశ’ సామూహిక అత్యాచారం, హత్య ఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని, ఆ ఎన్‌కౌంటర్ షాకింగ్ ఘటనే అయినా, ప్రజలు సంబరాలు చేసుకున్నారని గుర్తు చేశారు. ‘ఆ ఘటన తీవ్రమైన తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరిచింది. న్యాయవ్యవస్థ విశ్వసనీయత, సొంత తీర్పును అమలు చేసే అధికారం ప్రశ్నార్థకంగా మారాయి’ అని మెహతా వ్యాఖ్యానించారు.
ఉరిశిక్ష పదేపదే వాయిదా పడేలా నిర్భయ దోషులు వ్యవహరిస్తున్న తీరు దేశ ప్రజల ఓపికను పరీక్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘ఆ నలుగురు దోషులు ఉద్దేశపూర్వకంగా, ముందస్తు ప్రణాళికతో వ్యవహరిస్తూ చట్టం ఇచ్చిన తీర్పును అవహేళన చేస్తున్నారు’ అన్నారు. పవన్ గుప్తా ఇన్నాళ్లు క్యురేటివ్ పిటిషన్ కానీ, క్షమాభిక్ష పిటిషన్ కానీ దాఖలు చేయకపోవడం ఈ ఉద్దేశపూర్వక ప్రణాళికలో భాగమేనన్నారు. సాధ్యమైన అన్ని మార్గాలను ఉపయోగించుకుని ఉరి శిక్ష అమలును వాయిదా వేయడం లక్ష్యంగా వారు ప్రయత్నిస్తున్నారన్నారు.
న్యాయవ్యవస్థతో ఆ దోషులు ఆడుకుంటున్నారని మెహతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులు అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, పవన్ గుప్తాల తరఫున న్యాయవాది ఏపీ సింగ్, మరో దోషి ముకేశ్ కుమార్ తరఫున న్యాయవాది రెబెకా జాన్ వాదనలు వినిపించారు. ఉరిశిక్ష అమలుపై స్టే విధించడాన్ని కేంద్రం సవాలు చేయకూడదని రెబెకా అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టులో జరిగిన ఈ కేసు విచారణలో కేంద్రం ఎన్నడూ భాగస్వామి కాలేదన్నారు. ఉరిశిక్ష అమలు జరిగేలా డెత్ వారెంట్లను జారీ చేయాలని ట్రయల్ కోర్టును ఆశ్రయించింది బాధితురాలి తల్లిదండ్రులే కానీ కేంద్రం కాదని ఆమె కోర్టుకు గుర్తు చేశారు.
దోషులను ఒకే రోజు కాకుండా, వేర్వేరు రోజుల్లో ఉరి తీసే అవకాశంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని హైకోర్టుకు రెబెకా తెలిపారు. అంతేకాకుండా, ఒకే తీర్పు ద్వారా ఆ నలుగురు దోషులకు ఉరి శిక్ష పడినందువల్ల.. వారిని వేర్వేరు రోజుల్లో ఉరి తీయడం చట్టబద్ధంగా సమ్మతం కాదన్నారు. ‘నేనొక దుర్మార్గుడిని. దారుణ నేరానికి పాల్పడ్డాను. ఉరి ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాను. ఇవన్నీ నేను ఒప్పుకుంటున్నాను.
అయినా, ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును కోరుకునే హక్కు నాకుంది’ అని దోషుల తరఫున రెబెకా వాదించారు. చట్టబద్ధంగా తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునే హక్కు దోషులకు ఉందని తేల్చిచెప్పారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన వాదనల అనంతరం.. తీర్పును రిజర్వ్‌లో ఉంచుతూ న్యాయమూర్తి సురేశ్ కాయిట్ నిర్ణయం తీసుకున్నారు. నలుగురు దోషుల్లో ముకేశ్, వినయ్‌ల క్షమాభిక్ష పిటిషన్‌లను రాష్ట్రపతి తిరస్కరించారు. అక్షయ్ సింగ్ శనివారం క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్‌లో ఉంది. పవన్ ఇంకా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించలేదు.
Comments
Please login to add a commentAdd a comment