
ఎలిజెబెత్ రాణి మృతి, వారసుడిగా కింగ్ ఛార్లెస్ ప్రవేశం అనేవి మరోసారి గ్రేట్ బ్రిటన్ గురించి మనం తప్పనిసరిగా గుర్తు చేసుకునేలా చేశాయి. యూరప్ తీర ప్రాంతంలోని ఒక చిన్న దీవి అయిన బ్రిటన్ రాజకీయాధికారం క్షీణిస్తూ, ఆర్థిక వ్యవస్థ కుంగిపోతూ ఉండ వచ్చుగాక... కానీ ఇప్పటికీ పెర్త్, ఫీనిక్స్, ముంబై, మాసే లేదా కేప్ టౌన్, కోపెన్‌హాగన్ వంటి సుదూర ప్రాంతాల్లోని ప్రజలను కూడా కట్టిపడేస్తూ ఈ రోజుకీ ఆకర్షిస్తూనే ఉంది. ఇది ఏకకాలంలో ప్రహస నంగానూ, బ్రిటన్ ప్రభావానికి తిరుగులేని సూచికగానూ ఉంటోందని చెప్పవచ్చు. రాణి తన సామ్రాజ్యాన్ని కోల్పోయారు. ఆమె అర్థవంతమైన శక్తిగా లేరు. కానీ ఆమె ప్రపంచం దృష్టిని ఇప్పటికీ తనవైపు తిప్పుకోగలరు.
కాబట్టి ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్న ఈ రాజదండాన్ని కలిగిన ద్వీపం లక్షణాలు ఏమిటి? మొట్టమొదటి లక్షణం నిస్సందేహంగా దాని రాచరికమే అని చెప్పాలి. ఈజిప్ట్ రాజు ఫారూఖ్‌ను పదవీచ్యుతుడిని చేసినప్పుడు, ఓ సుప్రసిద్ధమైన మాట చెప్పారు: ఏదో ఒక రోజు ప్రపంచంలో అయిదుగురు చక్రవర్తులు మాత్రమే ఉంటారనీ, వారు స్పేడ్, క్లబ్, హార్ట్స్, డైమండ్స్‌తోపాటు ఇంగ్లండ్ చక్రవర్తి అనీ అన్నారు. తొలి నాలుగు పేకాటలో ముఖ్యమైన ముక్కలు అని తెలిసిందే. ఈ ప్రపంచం బ్రిటిష్ రాచరికాన్ని విశిష్టమైనదిగా పరిగణి స్తుందనే సత్యాన్ని ఈజిప్టు రాజు పేర్కొన్నారు.
బ్రిటన్ రాచరికానికి ఎందుకంత ప్రాధాన్యం అంటే నా వద్ద కచ్చితమైన సమాధానం లేదు. కానీ ‘నెట్‌ఫ్లిక్స్’లో ‘ది క్రౌన్’ వెబ్ సిరీస్‌కి ఉన్న ప్రజాదరణే దానికి రుజువుగా నిలుస్తుంది. బహుశా బ్రిటన్ ప్రదర్శనా సామర్థ్యం, దాని పురాతన సంప్రదాయాలు, ఆచారాలను ఆ సిరీస్ చక్కగా చూపించింది కాబోలు. అవి మనం కోల్పోయిన, మర్చి పోయిన ప్రపంచాన్ని మనకు గుర్తు చేస్తాయి. లేదా బహుశా రాజులు, రాణులు ఆకర్షణీయంగా మనలో శృంగార భావనలను వెలిగించి ఉండవచ్చు. కానీ, డచ్, స్కాండినే వియన్ లేదా జపనీస్ రాచరికం మనల్ని ఉద్వేగపర్చని కాలంలో బ్రిటిష్ రాచరికం పట్ల మనం ఇంత ఆసక్తి ఎందుకు చూపుతున్నట్లు?
వాస్తవం ఏమిటంటే బ్రిటిష్ రాచరికాన్నే కాదు... ఎలిజెబెత్ రాణిని ప్రజలు ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తుండటమే. బ్రిటిష్ రాణి చనిపోయినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బ్రిటిష్ ప్రజలను ఉద్దేశించి ప్రసం గించారు. ‘‘మీకు ఆమె ‘మీ రాణి’గా ఉండేవారు. మాకు మాత్రం ఆమె ‘రాణి’గా(‘ద క్వీన్’– రాణి అంటే ఆమె మాత్రమే గుర్తొస్తుంది అన్న అర్థంలో) ఉండేవారు అన్నారాయన. బ్రిటిష్ రాణి గురించి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇలా మాట్లాడటమే అద్భుతమైన విషయం. మెక్రాన్ చాలా నిజాయతీగా ఆ మాటలన్నారు. దానికి ఫ్రాన్స్‌లో ఎవరూ ఆయన్ని తప్పుపట్టలేదు.
ఇక రెండో లక్షణం ఏమిటంటే, బ్రిటన్ తన భాష ద్వారా ప్రపంచంపై ఆధిపత్యం చలాయించింది. చాలామందికి ఇంగ్లిష్ అందరూ ఆకాంక్షించే ఒక భాష మాత్రమే కాదు, అది సెకండ్ లాంగ్వేజిగా అందరూ ప్రాధాన్యం ఇచ్చే భాషగా ఉంటోంది. అది బ్రిటిష్ సామ్రాజ్యం కారణంగానా? సరిగ్గా ఉచ్చరించకపోయినా అమెరికా ఆ భాషను పంచు కుంటున్నందునా? లేదా ఏ ఇతర భాషకూ లేని గుణాలు ఇంగ్లిష్‌కి ఉండటం మూలంగానా?
ఇది కూడా నాకు తెలీదు. కానీ షేక్‌స్పియర్‌ని ప్రపంచమంతా సుప్రసిద్ధుడైన రచయితగా ఎందుకు గుర్తి స్తోంది అనే అంశాన్ని ఇంగ్లిష్ భాషలోని పటుత్వం, దాని సమ్మోహన శక్తి స్పష్టంగా చెబుతాయి. డాంటే, హోమర్, పుష్కిన్, కాళిదాసు వంటి మహా రచయితలు, కవుల గురించి మీరు ఆలోచించవచ్చు. కానీ ‘గాయక కవి’ అని మనం పిలుచుకునే షేక్‌స్పియర్ ముందు వీరంతా తేలిపోతారు.
బ్రిటన్ ప్రభావం బీబీసీ అంత అతి విస్తృతమైన ప్రభావంతో ఎందుకుందో మూడో కారణం కూడా చెబుతాను. సీఎన్‌ఎన్ అంత వనరులు బీబీసీకి లేకపోవచ్చు. బ్రిటిష్ ప్రజలే దాన్ని విమర్శిస్తూ ఉండవచ్చు. బ్రిటిష్ ప్రభుత్వాలే బీబీసీని మూసివేయాలని తరచుగా ప్రయత్నించాయి. కానీ బయటి ప్రపంచంలో సమగ్రత, నిర్దిష్టత రీత్యా బీబీసీకి ఎనలేని గుర్తింపు ఉంది. 1984లో తన మాతృమూర్తి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారన్న విషయాన్ని ఆమె ప్రభుత్వమే రాజీవ్‌గాంధీకి తెలియ జేసినప్పటికీ, దాన్ని ధ్రువీకరించుకోవడానికి ఆయన బీబీసీని చూశారు. (క్లిక్ చేయండి: మన నిశ్శబ్దం చేసిన గాయం)
బ్రిటిష్ ఆకర్షణ శక్తిని వివరించడానికి నేను మరో కారణాన్ని జత చేస్తాను. అదేమిటంటే బ్రిటిష్ వారి హాస్య చతురత. అది కేవలం సున్నితమైంది మాత్రమే కాదు, దాన్ని తక్కువ చేసి చెప్పలేం. మరోలా చెప్పాలంటే బ్రిటిష్ హాస్యచతురత తనను చూసి తానే నవ్వుకుంటుంది. బ్రిటిష్ జోక్స్‌కి తరచుగా రాచకుటుంబమే బలవుతూ ఉంటుంది. ప్రత్యేకించి అందరికంటే ఎక్కువగా ప్రిన్స్ చార్లెస్ కూజా చెవులు, విపరీతమైన అభిరుచులు, చాదస్తపు పద్ధతులపై మరింత ఎక్కువగా జోకులు ఉండేవి. అదే భారతదేశంలో అయితే ప్రధానమంత్రిపై లేక రాష్ట్రపతిపై మీరు పేరడీలు కడితే మీ మీద రాజద్రోహ ఆరోపణలు తప్పవు. హాస్యం లోనే ప్రజాదరణ, దాంతోపాటు అభిమానం కూడా పుట్టుకొస్తాయని బ్రిటిష్ వారు గుర్తించారు మరి.
‘ఎస్, ప్రైమ్ మినిస్టర్’, ‘ది టూ రోనీస్’ వంటి కామెడీ షోలు, లేదా ఇంకా వెనక్కువెళ్లి ‘లారెల్ అండ్ హార్డీ’లను తల్చుకోండి. బ్రిటిష్ వారి హాస్య చతురత తక్కిన ప్రపం చాన్నే నవ్వించింది అంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండ లేరు. ఫ్రెంచ్ ప్రజలు, జర్మన్లు, ఆస్ట్రేలియన్లు లేదా అమెరికన్ల గురించి మీరు ఇలా చెప్పలేరు. (క్లిక్ చేయండి: ప్రజాస్వామ్యంలో రాజరికమా?)
విక్టోరియా మహారాణిని మననం చేసుకోవడం ద్వారా నన్ను ఇక సెలవు తీసుకోనివ్వండి. పైకి గంభీరంగా కనిపించే విక్టోరియా రాణికి హాస్యపు నరం లోపించింది. ఎప్పుడూ ఆమె ఉల్లాస రహితంగా, వినోదం అంటే పట్టని వ్యక్తిగా ఉండేవారు. ‘మేం నవ్వడం లేదు’ అనే జాలిగొలిపే పదబంధాన్ని ప్రపంచానికి బహుమతిగా ఇచ్చాను అనే విషయం కూడా విక్టోరియా బహుశా గుర్తించకపోయి ఉండ వచ్చు. ఈ పదబంధం ఇవాళ వ్యంగ్య ప్రధాన చతురతకు మారుపేరుగా ఉంటోది మరి!
- కరణ్ థాపర్
సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment