
ఒక గొంతు వినిపించిన స్వరం లేదా నేను కృతజ్ఞతలు తెలిపినప్పుడు అతడి ముఖంలో కనిపించిన ఆశ్చర్యం దాదాపు ముప్ఫై ఏళ్ల క్రితంనాటి జ్ఞాపకాల్లోకి నన్ను తీసుకెళ్లింది. ఏ రకంగా చూసినా అది నేనెన్నడూ మర్చిపోని గుణపాఠం. ఇటీవలే నేను ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా తనిఖీ ప్రాంతం గుండా వెళుతున్నప్పుడు పోలీ సుల విధినిర్వహణ తీరులో వచ్చిన మార్పును నేను గమనిం చాను. వారి ప్రవర్తన దర్శనీయమైనదే కాదు.. మర్యాదతో కూడి ఉండటం విశేషం.
నేను తీసుకెళుతున్న ఒక నల్ల సూట్‌కేస్‌ని తెరవమని సెక్యూరిటీ చెక్ వద్ద కోరారు. అది రుచించని నేను నా సూట్‌కేస్‌ని సీఆర్‌పీఎఫ్ అధికారివైపు నెట్టాను. సూట్‌కేస్ తెరిచే పని అతడే చేయాలన్నది నా ఉద్దేశం.
నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తూ, ఆ అధికారి అసాధారణమైన జాగ్రత్తతో ఆ పనిచేశారు. అదెంత సమగ్రంగా, గుర్తించదగినదిగా ఉందంటే, సూట్‌కేస్ లోపలి దుస్తులు ఏమాత్రం నలగని విధంగా తనిఖీ చేశారు. తన విధి ముగించిన తర్వాత సూట్‌కేస్‌లోని దుస్తులను పొందికగా సర్ది, జాగ్రత్తగా జిప్ పెట్టి నవ్వుతూ నాకు అందించారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో నౌఖరు కూడా అంతకంటే బాగా చేసి ఉండేవాడు కాదు. ఆ అధికారికి కృతజ్ఞత తెలిపాను. నా గొంతులో స్పష్టంగా ఆశ్చర్యం ధ్వనించింది. ‘నమ్మశక్యం కానివిధంగా మీరు పని చేశారు’ అన్నాను.
ఎందుకు చేయకూడదు సర్ అని ఆ అధికారి సమాధానమిచ్చారు. ఈ సారి అతడి గొంతులో ఆశ్చర్యం ధ్వనించింది. ‘నా సొంత దుస్తులను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాను. మీ దుస్తులను నేను ఎందుకు జాగ్రత్తగా చూడను?’ ఆ అధికారి చాలా సాదాసీదాగా, ముక్కుసూటిగా సమాధానమిచ్చారు కానీ నేను మూగపోయాను. నేను ఊహించని మాట లవి. పోలీసులను కూడా సాధారణ ప్రజల్లో భాగమని మనలో ఎవరూ పరిగణించరు. కానీ వారూ మనుషులే. ఆ సీఆర్‌పీఎఫ్ అధికారి సున్నితంగా ఆ విషయాన్నే చెప్పారు. తర్వాత నేను విమానాశ్రయం నుంచి వెళుతున్నప్పుడు 1985లో లండన్‌లో జరిగిన ఇదేరకమైన ఘటనను గుర్తు తెచ్చుకున్నాను. నిషా, నేను అప్పుడే ఒక కొత్త ఇంటిని కొనుక్కున్నాం. ఆ ఇల్లు మాకెంతో గర్వకారణం. ఎంతో జాగ్రత్తగా దాన్ని అలంకరించాము. అలాంటిది, ఒక సాయంత్రం పొద్దు గుంకిన తర్వాత పైన ఉన్న బాత్ రూమ్ వెలుపల తివాచీపై తడి ఉండటం చూశాను. స్నానాల గదిని తెరిచినప్పుడు దాని పై కప్పులో చీలిక నుంచి సన్నగా నీళ్ల ధార కిందికి కారటం చూశాను.
అగ్ని మాపక దళానికి కాల్ చేయమని నిషా సూచించింది. కాల్ చేసిన నిమిషంలో వారు వచ్చారు. పరిస్థితి వివరించడానికి నాకు పది నిమిషాలు పట్టింది. వెంటనే సిబ్బంది పనిలోకి దిగిపోయారు. బాత్ రూమ్ పై భాగం నుంచి లీక్ అవుతున్నట్లు వారు కనిపెట్టారు. పై ఇంటిలో ఉన్నవారు ఆ సమయంలో ఇంట్లో లేరు. ముందు గదికి తాళం వేశారు. ఫైర్ బ్రిగేడ్ సభ్యుడొకరు మా వంట గది బాల్కనీ నుంచి పైకి ఎక్కారు. నీళ్ల పైపును పట్టుకుని ఎవరైనా పైకి ఎక్కగలరని నేను ఎన్నడూ చూసి ఉండలేదు. అందులోనూ చీకటిలో ఆ పనిచేయడం నన్ను మెప్పించింది, ఆ దృశ్యాన్ని చూడటానికి కాస్త భయమేసింది కూడా. పై అంతస్తు లోని సరిగా మూయని టాప్‌ను నిలిపివేయడంతో మా ఇంటిలో కారుతున్న నీరు ఆగిపోయింది. కానీ బాత్ రూమ్ ఇంకా చిందరవందరగా ఉండిపోయింది. నాకు ఆశ్చర్యం కలిగిస్తూ ఫైర్‌మెన్ దీని పని పట్టడానికి సిద్ధమయ్యారు. కచ్చితమైన పని విధానంతో వారు బాత్‌రూమ్‌ని శుభ్రపర్చారు, నేలను తుడిచారు, గోడలపై తడి లేకుండా చేసి, పోగుపడిన చెత్తను నల్ల సంచీలలో పోసి తమతో తీసుకెళ్లారు. ‘మీకెలా కృతజ్ఞత చెప్పాలి’ అని నిషా వారితో అన్నది.
‘కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు’ అంటూ ఫైర్ బ్రిగేడ్ చీఫ్ సంతృప్తితో నవ్వుతూ అన్నారు. ‘గుర్తుంచుకోండి, మేం కూడా ఇళ్లలో నివసిస్తున్నాం. తన బాత్ రూమ్ లీక్ అవడం చూడటాన్ని నా భార్య కూడా ఇష్టపడదు’ అన్నాడాయన. మొట్టమొదటిసారిగా ఫైర్‌మెన్లు కూడా మనుషులే అని నాకు అనిపించింది. సాధారణంగా వాళ్లు మనుషులే కాదన్న రీతిలో వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తూ పట్టీ పట్టించుకోకుండా ఉండటం చాలామందికి అలవాటు. నిజానికి ఇలాంటి వందలాది ఘటనల్లో మన వైఖరి చాలావరకు ఇలాగే ఉంటుంది. ఒకసారి సాన్నిహిత్యం ఏర్పడగానే ఇతరులను అర్థం చేసుకోవడం అలవడుతుంది. అలాంటి సాన్నిహిత్యం లేనప్పుడే దురభిప్రాయాలు మనలో ఆవహిస్తాయి.
కరణ్ థాపర్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : karanthapar@itvindia.net
Comments
Please login to add a commentAdd a comment