
కాంగ్రెస్ పార్టీ తన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీల పరంగా ఇది నిస్సందేహంగా సానుకూలాంశం. మిగతాపార్టీల కన్నా ముందుచూపుతో వేస్తున్న అడుగు. కానీ ఇది ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్నది సందేహం. ఒకరి కంటే ఎక్కువమంది అభ్యర్థులు బరిలో ఉండి, అధ్యక్షుడి ఎన్నిక తప్పకపోతే, ఢిల్లీలోని అధిష్ఠానం ఫలానా వ్యక్తిని ఎంచుకోవాలంటూ తాను కోరుకుంటున్న అభ్యర్థిని సూచిస్తూ రాష్ట్రాలకు సందేశం పంపుతుందా?
ఇలా జరిగే అవకాశాన్ని నిరోధించే అధికారం తనకు లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెబుతున్నారు. మరి స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికను నిర్వహించడం ఇలాగేనా? ఇది విజేత విశ్వసనీయతను పలుచన చేయడం కాదా? కాబట్టి అధ్యక్ష ఎన్నిక భారతదేశానికి చెందిన పురాతన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందా అన్నదే ఇప్పుడు కీలకమైన ప్రశ్న. వాటిని బట్టే ఈ ఎన్నిక విషయంలో మనం తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్లు వేయడం మొదలైపోయింది. సెప్టెంబర్ 30 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఒకరికి మించి అభ్యర్థులు పోటీ పడినట్లయితే, అధ్యక్ష ఎన్నిక అక్టోబర్ 17న జరుగుతుంది. 19వ తేదీన ఫలితాన్ని ప్రకటి స్తారు.
ఈ అధ్యక్ష ఎన్నిక భారతదేశానికి చెందిన పురాతన పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందా అన్నదే కీలకమైన ప్రశ్న. వామపక్షాన్ని మినహాయిస్తే, కాంగ్రెస్ చేపట్టిన ఈ ప్రయత్నం నిస్సందేహంగా ఇతర రాజకీయ పార్టీల కంటే ఎంతో ముందుచూపుతో కూడిందనే చెప్పాలి. అయితే కాంగ్రెస్ పార్టీ తన సొంత రాజ్యాంగం అవసరాలను నెరవేర్చనుందా లేదా వాటినుంచి తప్పించుకుంటుందా?
పునాదిలోనే లోపం
మొదటగా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధ్య క్షుడిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకోవడమే. ఇందులో అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(పీసీసీ) ప్రతినిధులు ఉంటారు. పార్టీ రాజ్యాంగం నిర్దేశించినట్లుగా, ఈ ఎలక్టోరల్ కాలేజీని మండల (సమితి) స్థాయి కాంగ్రెస్ కమిటీలు (బ్లాక్ కాంగ్రెస్ కమిటీ–బీసీసీ) ఎన్నుకుని ఉండాలి. లేదా కాంగ్రెస్ శాసనసభా పక్ష ప్రతినిధులు ఎన్నుకుని ఉండాలి. ఇదే ఇప్పుడు సమస్య.
ఎందుకంటే పార్టీ రాజ్యాంగంలోని ఆర్టికల్–11 ఎ (ఎ) 1 చెప్పినట్లుగా, ప్రతి మండల స్థాయి కాంగ్రెస్ కూడా రహస్య బ్యాలెట్ ద్వారా ఒక పీసీసీ ప్రతినిధిని ఎన్నుకోవలసి ఉంటుంది. అలాంటి ప్రతినిధే పీసీసీలో సభ్యుడై ఉండాలి. అలాగే శాసనసభా పక్షం తప్పక తమ ప్రతినిధులను ఎన్నుకోవలసి ఉంటుందని ఆర్టికల్–11 ఎ (ఇ) నిర్దేశించింది. అయితే ఈ రెండు ప్రకరణలలో దేన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు.
ఏకాభిప్రాయం ఎంత నిజం?
ఒక అండమాన్ నికోబార్ దీవులు మినహా, ప్రతి ఇతర మండల స్థాయి కాంగ్రెస్ కమిటీ కూడా తన ప్రతినిధిని ఏకాభిప్రాయంతో, ఏకగ్రీవంగా ఎన్నుకుంటుందని కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రధాన కార్యదర్శులు వారిని నామినేట్ చేయడానికి ప్రయత్నించారు. అలాగే శాసనసభ పక్షాలు కూడా తమ ప్రతినిధిని అలాగే ఎన్నుకుంటాయని చెబుతూనే, పార్టీ సీనియర్ కార్యనిర్వా హకులు వారిని నియమిస్తారని కూడా మిస్త్రీ సూచిస్తున్నారు.
ఏకాభిప్రాయంతో, ఏకగ్రీవంగా ప్రతినిధులను ఎన్నుకుంటారు కాబట్టి వారి కోసం ఎన్నికలు నిర్వహించవలసిన అవసరం లేదనీ, కాబట్టే ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించమనీ మధుసూదన్ మిస్త్రీ స్పష్టపరిచారు. కానీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ఎన్నిక అవసరమని చెబుతున్నప్పుడు ఏకాభిప్రాయం అనేది ఆ ప్రమాణాన్ని పాటించడం లేదు. ఏకాభిప్రాయం అనేది బహిరంగంగా లేదా రహస్యంగా ఆదే శాల ద్వారా కిందిస్థాయి వరకూ చేరుతుంది. ఉదాహరణకు ‘ఢిల్లీ’ లోని నాయకత్వం ఒక నిర్దిష్ట వ్యక్తిని కావాలని కోరుకుంటే, ఏకాభిప్రాయాన్ని దానికి అనుగుణంగా మలుస్తారు.
పార్టీ రాజ్యాంగ ఉల్లంఘనే!
ఇప్పుడు, బీసీసీ స్థాయిలో ఏం జరుగుతుందో, అదే పీసీసీ స్థాయిలో కూడా పునరావృతమవుతుంది. అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) స్థాయిలోనూ జరుగుతుంది. పీసీసీ చీఫ్‌లను నియ మించేందుకు, ఏఐసీసీ ప్రతినిధులను నామినేట్ చేయడానికి నూతన కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం కల్పిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు తీర్మానాలు చేస్తాయి. మరోసారి ఇది పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించ డమే అవుతుంది. రాజ్యాంగంలో రూపొందించిన నియమాలు పీసీసీలు తమ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఏఐసీసీని ఎంచుకోవడంలో కూడా ఇదే నిజం కావాలి.
ఇక కీలకమైన వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సభ్యులను ఏఐసీసీ సభ్యులు ఎన్నుకుంటున్నందున మీకు ఆ వివరాలు కూడా చెప్ప నివ్వండి. ఇతర విభాగాల సభ్యులకు తోడుగా... ఆర్టికల్–13 ఎ (ఎ) ప్రకారం– ఒక్కసారి మాత్రమే ఓటు బదిలీ చేయగలిగే వ్యవస్థకు అనుగుణంగా దామాషా ప్రాతిపదికన... తమలోని సభ్యులను తామే ఎన్నుకున్న పీసీసీ సభ్యుల సంఖ్యలో ‘ఎనిమిదో వంతు’ సభ్యులు ఏఐసీసీలో ఉంటారు. కానీ ఈ ప్రక్రియ జరగనప్పుడు, ఏఐసీసీ సభ్యులను కాబోయే అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. అంటే వీరు కీలక వర్కింగ్ కమిటీకి చెందిన 12 మంది సభ్యు లను ఎన్నుకోవడం అనేది రిగ్గింగ్ జరిగినట్లుగా భావించాల్సి ఉంటుంది.
చేసింది సరిపోదు!
కాబట్టి ఇప్పుడు రాబోతున్న ఫలితం ఏమిటి? కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి స్వేచ్ఛాయుతమైన, న్యాయ బద్ధమైన ఎన్నిక జరగవచ్చు కానీ ఎలక్టోరల్ కాలేజీని సరిగా ఎన్నుకోకపోయి ఉండవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ఎన్నుకునే విభాగాన్ని నామినేట్ చేస్తారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం వీరిని ఎన్ను కోవాలి. కాబట్టి పార్టీ అంతర్గత ప్రజాస్వామికీకరణతో ముగియాల్సిన ప్రక్రియ బాధాకరంగా దాన్ని ఎంతమాత్రమూ పాటించకపోవడంతో ముగిసిపోతుంది. ఇతర పార్టీల ఆచరణ కంటే ఈ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ ఎక్కువే చేసివుండొచ్చు. అయినా కూడా ఆ పార్టీ రాజ్యాంగం కోరుకుంటున్న దానికంటే ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.
విశ్వసనీయత ఎంత?
ఇప్పుడు, కాంగ్రెస్ పార్టీ బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడని కొన్ని ప్రశ్నలను మీకు మీరే సంధించుకోండి. నిబంధనలకు అను గుణంగా మీరు వ్యవహరించకపోతే మీ రాజ్యాంగానికి అర్థం ఏమిటి? మండల, జిల్లా, ప్రదేశ్ కమిటీ స్థాయుల్లో ముందస్తుగా ఎన్నికలు నిర్వ హించవలసిన ప్రక్రియను పాటించకపోయినట్లయితే, కొత్త అధ్యక్షు డిని ఎన్నుకోవడంలో అర్థం ఏముంది?
ఇక్కడ ఆలోచించాల్సిన విషయం మరొకటి ఉంది. అక్టోబర్ 17న కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక తప్పకపోతే, ఢిల్లీలోని అధిష్ఠానం ఫలానా వ్యక్తిని ఎంచుకోవాలంటూ తాను కోరుకుంటున్న అభ్యర్థిని సూచిస్తూ సందేశం పంపుతుందా? ఇలా జరిగే అవకాశాన్ని నిరోధించే అధికారం తనకు లేదని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ చెబుతున్నారు. మరి స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా ఎన్నికను నిర్వ హించడం ఇలాగేనా? ఇది విజేత విశ్వసనీయతను పలుచన చేయడం లేదా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక జరగనున్నందున ఈ అంశాలను మదిలో ఉంచుకోండి. అధ్యక్ష ఎన్నిక ఎంత అర్థవంతంగా జరుగు తుందో చెప్పడానికి ఇదొక మార్గం మరి!
వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment