మహానగరపు మార్మిక గాథ | Sakshi Guest Column On Delhi City | Sakshi
Sakshi News home page

మహానగరపు మార్మిక గాథ

Published Mon, May 15 2023 3:42 AM | Last Updated on Mon, May 15 2023 3:42 AM

Sakshi Guest Column On Delhi City

ఢిల్లీకి ఆ పేరు ఎలా వచ్చిందో, దాని మూలాల వెనుక ఉన్న కథ ఏమిటో, ఈ మహానగరం ఎన్ని ‘నగరాల’తో కూడుకుని ఉన్నదో, ఇంకా ఇలాంటి ఎన్నో సంగతులు చాలా ఆసక్తికరం. ఈ ఢిల్లీ ప్రాంతాన్ని మన పూర్వీకులు దైవ నిలయంగా భావించారు. సరిగ్గా అక్కడే స్వర్గాధిపతి ఇంద్రుడి నివాసమైన ఇంద్రప్రస్థ ఆవిర్భవించింది. ఈ ఇంద్రప్రస్థ అనంతరం, అది న్యూఢిల్లీ అయ్యేంతవరకూ ఇక్కడ అనేక నగరాలు వెలిశాయి. ఎన్ని నగరాలు అనే సంఖ్య అనిశ్చితం. కొంతమంది ఏడు నగరాలు అని చెబుతూ ఢిల్లీని ఎనిమిదవదిగా పేర్కొంటుంటారు. ఇంకొందరయితే పదిహేను నగరాలు అంటారు. అలాగే విచిత్రంగా ధ్వనించే ఢిల్లీ పేరుకు సంబంధించి కూడా అనేక వివరణలు ఉన్నాయి. దేనికదే ప్రత్యేకం.

చాలా సంవత్సరాలుగా ఢిల్లీ గాథను తెలుసుకోవాలని నేను అనుకున్నాను. కానీ నిజంగా దాన్ని తెలుసుకోడానికి పెద్దగా ప్రయత్నించలేదు. మనం చరిత్ర మధ్యలో జీవిస్తున్నప్పుడు దానికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యంఇవ్వం. ఘోరమైన విషయం ఏమిటంటే, నేను ఢిల్లీని కాన్ బెర్రా, ఒట్టావా లేదా వాషింగ్‌టన్‌తో పోల్చడం ఉచితమేనని అనుకున్నందుకు చింతిస్తున్నాను.

నిస్సందేహంగా నేను అలా పోల్చిన ప్రతిసారీ, తప్పు చేస్తున్నానని నాకు తెలుసు కానీ అలా పోల్చడాన్ని అది ఆప లేదు. నా అజ్ఞానంలో ఉంటూ, నేను విలువైన అంశాన్ని ప్రతిపాది స్తున్నట్లు యోచించాను. బహుశా నేను ఒక సందర్భంలో ఘోరంగా దొరికిపోయేంతవరకూ ఇది అలాగే కొనసాగిందని చెప్పాలి.

లండన్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో వస్తున్నప్పుడు నా పక్కనే కూర్చున్న ఒక అందమైన యువతి ‘‘ఢిల్లీ గురించి చెప్పండి’’ అని నన్ను అడిగింది. అది 1980ల చివరలో అనుకుంటాను. సెలవుపై ఇంటికి తిరిగొస్తున్నప్పడు అది తటస్థించింది. ఆమె చాలా ఆకర్షణీ యంగా ఉంది. నేను సంభాషణ ఏదైనా మొదలెట్టాలని అనుకు న్నాను. ‘‘ఢిల్లీ అద్భుతమైన చరిత్ర కలిగిన ఒక పురాతన నగరం అని నేను నమ్ముతున్నాను’’ అని ఆమె అన్నది. 

‘‘అవును, అవును’’ అంటూ నేను ఉత్సాహంగా సమాధాన మిచ్చాను. కానీ దాని గురించి ఏమీ తెలియకపోవడంతో నేనుసంభాషణను కొనసాగించలేకపోయాను. అందుకే విషయాన్ని పక్క దోవ పట్టించడానికి ప్రయత్నించాను. ‘‘ఢిల్లీ చాలావరకు కాన్ బెర్రా, ఒట్టావా, వాషింగ్‌టన్‌ లాంటిదే’’ అన్నాను.

‘‘ఓ దేవుడా! కచ్చితంగా కాదు’’ ఆమె దెబ్బతిన్నట్టుగా అన్నది. ‘‘ఓ ఎస్‌’’ అని నేను రెట్టించాను. కానీ ఈ విషయంపై ఏం చెప్పాలో నాకు తోచలేదు. ‘‘వెల్, మీ మాట తప్పు కావాలని కోరుకుంటున్నా.’’ అక్కడే ఆ సంభాషణ ముగిసిపోయింది. తర్వాత ఎనిమిది గంటల పాటు ఆ విమాన ప్రయాణ కాలంలో మాట్లాడటానికి నేను వేసిన ప్రారంభ ఎత్తులన్నీ  సున్నితమైన తిరస్కరణను ఎదుర్కొ న్నాయి. నా ఉద్దేశపూర్వక ప్రయత్నాలకు ఢిల్లీ గురించి నాకు జ్ఞానం లేకపోవడం అనేది గట్టి అడ్డంకిగా నిలిచింది.

నేను ఎంత ఘోరమైన అభిప్రాయాలతో ఉన్నానో ఇటీవలే గుర్తించాను. ‘ద మిలీనియం బుక్‌ ఆన్‌ న్యూఢిల్లీ’ పుస్తకం రాసిన పవన్‌ వర్మ ఆ మధ్య ఆ ప్రతిని నాకు పంపారు. చూసీచూడగానే అది ఒక విలాస వంతమైన కాఫీ టేబుల్‌ అలంకృత పుస్తకంగా అనిపించింది. అలాగని అలాంటి వాటి పట్ల నాకు వ్యతిరేకత ఏమీలేదు. పేజీలు అలా తిరగేస్తూ, ఫొటోగ్రాఫులను మెచ్చుకుంటూ, నెమ్మదిగా వ్యాసాల్లోకి మునిగిపోతుండగా ఢిల్లీ గురించి అత్యంత పఠనీయ చరిత్రాంశాలను ఈ పుస్తకం కలిగి ఉన్నదని గుర్తించాను.

నగరానికి ఆ పేరు ఎలా వచ్చిందో, దాని మూలాల వెనుక ఉన్న కథ ఏమిటో, ఈ మహానగరం ఎన్ని ‘నగరాల’తో కూడుకుని ఉన్నదో, ఇంకా ఇలాంటి ఎన్నో సంగతులు ఇప్పుడు నాకు తెలుసు. దీనంతటికీ నేను ఖుశ్వంత్‌ సింగ్‌కు  రుణపడి ఉంటాను. నా కళ్లు మొట్టమొదట పడింది ఆయన వ్యాసం మీదే. చెప్పాలంటే దాన్ని ఆబగా చదివాను – కృతజ్ఞతతో, ఆనందంతో. కొంత గర్వ ప్రదర్శన చేసుకోవడానికి అనుమతివ్వండి.

ఢిల్లీ మూలం విసుగు తెప్పించే సత్యం కంటే ఎంతో చక్కగా ఉండే ఒక పౌరాణిక గాథపై ఆధారపడి ఉంది. ఒకానొకప్పుడు గంగా నది పొంగి పరవళ్లు తొక్కుతున్నప్పుడు (ఈరోజు అది అలా ప్రవహించలేనంతగా కలుషితమైపోయింది) అది శాస్త్రాలను కక్కింది. (యాదృచ్ఛికంగా ఈ ‘కక్కడం’ అనే మాట ఖుశ్వంత్‌ సింగ్‌దే. కానీ ఆయన దాన్నొక శ్లేషగా మాత్రమే వాడివుంటారా అని నా సందేహం.). ఆ ప్రాంతానికి గుర్తుగా అక్కడ నిగమ్‌బోధ్‌ అని పిలిచే ఆలయం నిర్మించారు.

అవును ఒకరోజు మీరు, నేను ఇదే ఘాట్‌ దగ్గర బహుశా స్వర్గాభిముఖంగా బట్వాడా అవుతాం. ‘‘ఇది ఢిల్లీని దైవ నిలయంగా ఎంచుకోవడానికి మన పూర్వీకులకు తగిన హేతువు అయివుండవచ్చు’’ అని ఖుశ్వంత్‌ సింగ్‌ కొనసాగిస్తారు. ‘‘అలా ఢిల్లీ మొదటి నగరం, స్వర్గాధిపతి అయిన ఇంద్రుడి నివాసం ఇంద్రప్రస్థ ఆవిర్భవించింది.’’ నేడు పురానా ఖిలా బహుశా అదే చోట ఉంది.

ఇంద్రప్రస్థ అనంతరం, అది మన ప్రియమైన న్యూఢిల్లీ అయ్యేంతవరకూ అనేక నగరాలు వెలిశాయి. ఎన్ని నగరాలు అనే సంఖ్య అనిశ్చితం. కొంతమంది ఏడు నగరాలు అని చెబుతూ ఢిల్లీని ఎనిమిద వదిగా పేర్కొంటుంటారు. ఇంకొందరయితే పదిహేను నగరాలు అంటారు. ఖుశ్వంత్‌ వ్యాసంలో నేను ఇట్టే పద్నాలుగు నగరాలను లెక్కించాను. అవి ఇంద్రప్రస్థ, యోగినిక్‌పుర, లాల్‌ కోట్, సిరి, కిలో ఖేరీ, చిరాగ్, జహాపనా, తుగ్లకాబాద్, ఫిరోజాబాద్, ఖిలా ఫిరోజ్‌ షా, ముబారకాబాద్, దీన్‌ పనాహ్, షాజహానాబాద్, తర్వాత ఇంకేంటి  న్యూఢిల్లీ. కానీ పదిహేనవ నగరం ఏది? నాకు ఇప్పటికీ తెలియనందుకు చిరాగ్గా ఉంది.

ఏదేమైనా, నాకు ఖుశ్వంత్‌ వ్యాసంలో మరీ ఎక్కువ నచ్చింది ఢిల్లీ ఉచ్చారణకు సంబంధించిన ఖండిక. ‘‘చదువుకున్నవాళ్లు డెహ్‌లీ అనీ, సాధారణ జనం దిలీ అని పిలిచే... విచిత్రంగా ధ్వనించే పేరు’’. దీనికి సంబంధించి అనేక వివరణలు ఉన్నాయి. పర్షియన్‌ పదమైన దెహ్లీజ్‌ నుంచి ఇది పుట్టుకొచ్చి ఉండవచ్చు. దెహ్లీజ్‌ అంటే ప్రవేశ ద్వారం అని అర్థం. ఎందుకంటే గంగామైదాన ప్రాంతానికి ఇది ఒక ప్రవేశద్వా రంగా ఉంటోంది. మరొక వివరణ ప్రకారం, డైడలస్‌ అనే పదం నుంచి ఢిల్లీ పేరు పుట్టి ఉండవచ్చు.

ఈజిప్టులోని అలెగ్జాండ్రియాకు చెందిన భౌగోళిక శాస్త్రవేత్త టాలెమీ ఈ నామకరణం చేశారు. ఏదేమైనా, ఈ నగరాన్ని ఒకప్పుడు పరిపాలించిన రాజన్‌ ధీలూ పేరుతో దీని జాడలు దొరుకుతున్నాయని 16వ శతాబ్ది పర్షియన్‌ చరిత్రకారుడు ఫెరిష్తా పేర్కొన్నాడు. కొంతమంది పండితులు ఈ పేరును కుతుబ్‌ మినార్‌ సమీపంలో ఉండే సుప్రసిద్ధ ఇనుప స్తంభంతో ముడిపెడుతున్నారు. అయితే ఈ సంబంధాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకున్నానని చెప్పలేను.

ఖుశ్వంత్‌ సింగ్‌ చెప్పినట్లుగా, ‘‘ఈ స్తంభాన్ని మహా విష్ణువు ప్రతీకగా రూపొందించారు. దీన్ని తన తలపై భూమిని మోస్తున్న త్రాచుపాము (వాసుకి) పడగలోకి లోతుగా పాతడానికి ఉద్దేశించారు.’’ ఈ స్తంభం జోలికి పోయేవారికి శాపం తగులుతుందని చెబుతుంటారు. అయితే ఒక మూర్ఖపు తోమర్‌ రాజ్‌పుత్‌ రాజు దీన్ని నిజంగానే త్రాచుపాము పడగ మీదే జొప్పించినట్టుగా ప్రతిష్ఠించారో లేదో రుజువు కావాలనుకుని, దాన్ని తవ్వించాడు.

స్తంభం బయటకు తీయగానే, దాని కిందిభాగం రక్తంతో తడిసివుండటం కనిపించింది. తర్వాత తోమర్‌ రాజు తన సింహా సనాన్ని కోల్పోయాడు. అతడి వంశం కూడా అతడితోనే అంతరించి పోయింది. ఇది అద్భుతమైన గాథ. కానీ నా వరకూ దీనికీ, ఢిల్లీ పేరుకూ ఉన్న సంబంధాన్ని గ్రహించలేకపోయాను. ఢిల్లీ ఒక నెత్తుటి నగరం అని ఇది సూచిస్తోందా? విషాదకరంగా, కొన్నిసార్లు ఢిల్లీ అలాగే ఉండింది.

విషాదమేమిటంటే, ఖుశ్వంత్‌ సింగ్‌ను వీటిపై వివరించమని అడిగే అవకాశాన్ని నేను ఎన్నడూ పొందలేదు. ఢిల్లీకి ఆ తప్పిపోయిన 15వ పేరు గురించి కూడా అడిగే అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ తర్వాత ఎప్పుడైనా ఎయిర్‌ ఇండియా విమానంలో ఒక అందమైన యువతి పక్కన కూర్చున్నప్పుడు, సంభాషణను నిలపడంలో నాకు తక్కువ సమస్యలు ఉంటాయి. నాకు ఆ అదృష్టం పట్టా లని కోరుకోండి మరి!
కరణ్‌ థాపర్‌ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement