పరకాల ప్రభాకర్ – కొత్తపుస్తకం
‘క్రూకెడ్ టింబర్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే పాశ్చాత్య భావన ఒకటి ఉంది. అందులోని ‘హ్యుమానిటీ’ స్థానంలో ‘న్యూ ఇండియా’ను చేర్చి రాసిన పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’. ‘క్రూకెడ్ టింబర్ (వంకర వృక్షం) ఆఫ్ హ్యుమానిటీ’ అంటే మానవ జన్మలోని అపరిపక్వత. అదే విధంగా మోదీ భారత్‌లో ‘హిందూత్వ’ ఒక అపరిపక్వత అని ఈ పుస్తకం సంకేతపరచడం ఆసక్తికరం.
యాదృచ్ఛికాలు అన్నవి వట్టి అర్థరహిత మైన సంభవాలేనా లేక వాటి వెనుక గొప్ప అంతరార్థం ఏదైనా ఉండి ఉంటుందా అని నేను తరచూ ఆలోచిస్తూ ఉంటాను. ఒకటేదైనా మనం అర్థం చేసుకోలేనిది, లేదా కనీసం గ్రహించలేనిది దీర్ఘకాలానంతరం దానికై అదే బహిర్గతం అవుతుంది. గతవారం జరిగింది అటువంటిదే అయివుండే అవకాశం ఉంది. చూద్దాం, ఈ మాటను మీరు ఒప్పుకుంటారేమో!
ఇటీవల నేను పరకాల ప్రభాకర్‌ను ఆయన తాజా పుస్తకం ‘ది క్రూకెడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా: ఎస్సేస్ ఆన్ ఎ రిపబ్లిక్ ఇన్ క్రైసిస్’పై ఇంటర్వ్యూ చేశాను. ప్రధానమంత్రి మీద, భారతీయ జనతాపార్టీని ఆయన రూపాంతర పరచిన వైనం మీద చురుక్కుమనిపించే విమర్శ ఆ పుస్తకం. ప్రభాకర్ ఏమిటన్నది మీరు కనుగొన్నప్పుడు ఆ చురక మరింత స్పష్టంగా దృగ్గోచరం అవుతుంది.
ఇంటర్వ్యూ చేసిన మరునాడే బీజేపీకి కర్ణాటకలో పరాభవం ఎదురైంది. దక్షిణాదిన ఆ పార్టీకి ఉన్న ఏకైక రాష్ట్రం హిందుత్వ ముఖం మీదే తలుపులు వేసేసింది. పోయిన ఆదివారం ‘విముక్త’ బెంగళూరులో ప్రభాకర్ పుస్తకానికి ఆవిష్కరణ జరిగింది.
ప్రభాకర్ అనే వ్యక్తి ఇదీ అని చెప్పాలన్నది నా ఉద్దేశం కాదు. ఒక వ్యక్తిగా ఆయన గురించి ఆయననే మాట్లాడనివ్వడం మంచిది. మన ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన ఇలా అంటారు: ‘‘దేశ ఆర్థిక యాతనలు మోదీ పాలనలోని విస్మయకరమైన అసమర్థతల వల్ల తలెత్తినవి. ఆయన పాలన చక్కటి ఆలోచనాపరత్వాన్ని, పొందిక గుణం కలిగిన ఆర్థిక తత్వాన్ని జతపరచలేకపోయింది.’’
‘‘ఇష్టానుసారం అధికారాన్ని అపరిమితంగా ఉపయోగించడానికి అలవాటు పడింది. ప్రజాస్వా మ్యాన్ని సమస్యాత్మకం చేసింది.’’ ఫలితంగా, ‘‘1975–77 ఎమర్జెన్సీ తర్వాతెన్నడూ లేని భయం సమాజంలో నేడొక కఠినమైన ప్రత్యక్ష వాస్తవం అయింది’’ అని ప్రభాకర్ ఈ పుస్తకంలో రాశారు.
ప్రభాకర్ నిక్కచ్చిగా, నిర్దయగా విషయాన్ని తేల్చేస్తారు. ‘‘మన ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉంది. మన సామాజిక నిర్మాణం బల హీనం అయింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో ఉంది. మనం చీకటి యుగాలకు తిరోముఖం పడుతున్నాం’’ అంటారు.
కర్ణాటక ఎన్నికల ఫలితాలలో హిందూత్వ – అలాగే హిందూత్వపై ప్రతిస్పందించడంలో విపక్షాల అసమర్థత, ప్రాసంగికతను కలిసి ఉన్నా యని ఆయన చెప్పారు. ‘‘దేశ రాజకీయ అగ్రగణ్యతల దిగు వన దాగి ఉన్నమూల ప్రవృత్తులు; సామాజిక, సాంస్కృతిక అభద్రతలను తారుమారు చేయగల నైపుణ్యంపై హిందూత్వ అభివృద్ధి చెందుతుందని అన్నారు.
మన గుణగణాలలోని చీకటి కోణాలకు ఇది ఒక విజ్ఞప్తి అని ప్రభాకర్ ఈ పుస్తకం గురించి నాతో అన్నారు. మొన్నటి ఎన్నికల ప్రచారం ముగింపు రోజుల్లో ప్రధాని జై బజరంగబలీ అంటూ ఓటింగ్ మీటను నొక్కమని కర్ణాటక ప్రజల్ని కోరడం వెనుక ఆయన నేర్పు, నర్మగర్భత ఉన్నాయని అనేకమంది విశ్వసిస్తున్నారు.
పనితీరులోని వైఫల్యం, అవినీతిలో గడించిన ఖ్యాతి కారణంగా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన ఘోర పరాజయం మీద ప్రభాకర్ తీర్మానాలు స్పష్టతను కలిగి ఉన్నాయి. ‘‘బీజేపీ ప్రస్తుత ఓటమి, తిరిగి అధికారాన్ని సాధించుకోలేక పోవడం అన్నవి పనితీరు వల్ల కాదు. హిందూత్వ గుర్తింపునకు ఆ పార్టీ దృఢ వైఖరిని కలిగి ఉండటం వల్ల, హిందూయేతరులను వేరుగా చూడటం వల్ల’’ అని ఆయన అన్నారు. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ జై బజరంగ బలీ అన్నదే తప్ప, మంచి పాలనను ఇస్తానని అనలేదు.
మనమిప్పుడు ప్రతిపక్షాల గురించి ప్రభాకర్ రాసిన చోటుకు వద్దాం. ‘‘బీజేపీయేతర రాజకీయ వర్గ వైఫల్యమే నేడు మన దేశం సూత్రరహితమైన సౌధంగా మారడానికి ప్రధాన కారణం. బీజేపీనీ, ఆ పార్టీ పరివారాన్నీ సైద్ధాంతికంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలే అత్యంత ప్రభావవంతమైన ఈ సవాలును ఎదుర్కొని ఉండాల్సింది. కానీ వారు తమ దృష్టి, వ్యూహం, శక్తికి సంబంధించిన స్థిరమైన వైఫల్యాలతో మనల్ని ఓడిపోయేలా చేశారు’’ అన్నారాయన.
ఆ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎలా అధిగమిస్తున్నాయనే దానికి కర్ణాటకలో మొన్నటి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారమే మొదటి నిదర్శ నమని నేను భావిస్తున్నాను. దృష్టిపరంగా ఆ పార్టీ... ఓటర్ల నిజమైన సమస్యలకు సంక్షేమాన్ని హామీని, సానుభూతితో కూడిన ప్రతిస్పంద నను అందించింది. వ్యూహాత్మకంగా... హిందూ వ్యతిరేకి అని ఆ పార్టీపై ప్రధాని చేసిన ఆరోపణలను తిప్పికొట్టకుండా దాట వేసింది. శక్తి పరంగా అక్షరాలా ఉత్తేజాన్ని నింపింది. దీనిని ప్రభాకర్ అంగీ కరిస్తారని చెప్పగలను.
ప్రచారం చరమాంకానికి చేరుకోగానే కాంగ్రెస్ గంభీరంగా, దృఢ నిశ్చయంతో చెవిని నేలకు ఆన్చి (సమగ్ర విషయ సేకరణ జరిపి), ప్రజలపై దృష్టి సారించింది. బీజేపీ ఇందుకు విరుద్ధంగా ఉత్కంఠంగా, నిరాశాపూరితంగా, కొన్నిసార్లు ఉన్మాదంగా కనిపించింది.
ఇందుకు కారణం హిందూత్వ వెనకంజ వేయడమేనా? ఉనికి కోసం పోరాడుతుండటమేనా? లేదంటే, ఓటర్లకు కావలసిందేమిటో కాంగ్రె స్‌కు తెలిసి ఉండటం వల్లనా?
ఇప్పుడు నేను పేర్కొన్న సంఘటనల క్రమం, వాటి ఆసక్తికరమైన కాలానుక్రమణిక కేవలం యాదృచ్ఛికం అని అనిపిస్తున్నాయా? లేదా విధివశాత్తూ జరిగినవిగా తోస్తున్నాయా? నిజాయతీగా ఒప్పుకుంటు న్నాను. నేను చెప్పలేను. అయితే ప్రధానమంత్రి, ప్రతిపక్షాలు... ప్రభా కర్ రాసిన ఈ పుస్తకాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్లకు ఈ పుస్తకం ఒక హెచ్చరిక... అలాగే పాఠం కూడా!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment