మౌనం ఓ శక్తిమంతమైన సమాధానం | Silence Is The Most Powerful Answer | Sakshi
Sakshi News home page

మౌనం ఓ శక్తిమంతమైన సమాధానం

Published Sun, Apr 15 2018 12:49 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

Silence Is The Most Powerful Answer - Sakshi

అవును అనేది మూడక్షరాల సాదా పదం. చాలా తరచుగా అందరూ వాడే పదం. కానీ అది వాచ్యంగా గొంతులోనే చిక్కుకుపోయే సందర్భాలూ ఉంటాయి. మీరు అవును అని చెప్పదల్చుకున్న సందర్భంలోనే ఇది సంభవిస్తుంటుంది. కొన్నిసార్లయితే మీరు ‘అవును’కు బదులుగా ‘లేదు’ అని ముగిస్తారు. మీరు అమ్మాయిలలో ఎవరినైనా ఇష్టపడుతున్నారా అని చిన్న పిల్లలను అడిగితే అవును అని వారు చెప్పలేని అనేక సందర్భాల గురించి కాస్త ఆలోచిస్తారా? ఆ ప్రశ్నకు వారు సిగ్గుపడటంలోనే రహస్యం దాగి ఉంది. కానీ వారి పెదవులనుంచి ఆ పదం తప్పించుకోలేదు. లేదా మీరు అప్‌సెట్‌ అయ్యారా, ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించారా, అవును అని చెప్పలేకపోయారా అని పెద్దవాళ్లను అడిగితే వారి ముఖాలు కోపంతో ఎర్రబడటం గురించి ఆలోచించారా? ఈ ప్రశ్నకు పిల్లలు చాలావరకు సిగ్గుపడతారు, పెద్దలయితే తరచుగా గర్వపడతారు.

కర్మలు, వేడుకలు నిర్వహించే మన ఆచారం కారణంగా అవును అనేది మన సంస్కృతిలో నిర్దిష్టంగా సమస్యాత్మకంగా ఉంటుంది. ఆ పదాన్ని మీరు పలికేందుకు సాహసించినప్పుడు తరచుగా దాని బదులుగా లేదు అని చెబుతాం. మీరు మరొకరికి సహాయం చేయడానికి ఇష్టపడతారా అని నన్ను ఎవరైనా అడిగినప్పుడు నేను అవునని సమాధానం చెప్పాలనుకుంటాను కానీ ఏదో ఒక మూర్ఖపు అభ్యంతరం లేదా అసందర్భపు సౌజన్యం అనేవి అవును అని చెప్పనీయకుండా నన్ను అడ్డుకుంటాయి. భారత్‌లో ఈ విషయంపై తరచుగా మనల్ని రెండుసార్లు, మూడుసార్లు అడుగుతుంటారు కాబట్టి కాస్త ఆలోచించి బయటపడుతుంటాం. మిమ్మల్ని ఒక్కసారి మాత్రమే అడిగే బ్రిటన్‌ లేదా అమెరికాలో అయితే మీరు చాలా అసౌకర్యంగా ఫీలవుతారు.

గత శనివారం ఆ పదాన్ని ఉచ్చరించకుండానే ‘అవును’ అని నేర్పుగా చెప్పగలిగే మార్గాలున్నాయని నేను తెలుసుకున్నాను. సుప్రీంకోర్టులో రెండోస్థానంలో ఉన్న అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌తో హార్వర్డ్‌ క్లబ్‌ ఇండియా తరపున గంటసేపు ఇంటర్వూ్య చేసినప్పుడు ఇది తెలిసింది. న్యాయవ్యవస్థను చుట్టిముట్టిన పలు సమస్యలు, వివాదాల గురించి, ప్రభుత్వంతో న్యాయవ్యవస్థ సంబంధాల గురించి మేం మాట్లాడుకున్నాం. వీటిని బహిరంగంగా చర్చించడానికి జడ్జీలకు చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. నిజానికి చాలామంది న్యాయమూర్తులు అలా చర్చించకూడదని నమ్ముతుంటారు. కానీ జస్టిస్‌ చలమేశ్వర్‌ దీనిపై చర్చించడానికి సిద్ధపడ్డారు. అందుచేత ఆయన ఎదుర్కొన్న ప్రశ్న వివేచన, పారదర్శకత్వానికి మధ్య సమతూకాన్ని చిత్రించింది. లేదా, మరోలా చెప్పాలంటే.. వాస్తవాన్ని వెల్ల డించడానికి, వాస్తవంగా నమ్ముతున్నదాన్ని దాచిపెట్టడానికి మధ్య బ్యాలెన్స్‌ చేయడం అన్నమాట.

జస్టిస్‌ చలమేశ్వర్‌ రెండు తెలివైన ఎత్తుగడలను ఉపయోగించడం ద్వారా తన సమస్యను పరిష్కరించుకున్నారు. మొదటిది ఏమిటంటే పెద్దగా నవ్వడం. దీంతో ఆయన కళ్లు వెలిగిపోయాయి. ఆయన ఏమీ మాట్లాడకున్నప్పటికీ అంగీకరిస్తున్నట్లుగా ఆది స్పష్టమైన సందేశమిచ్చింది. ఆ సందర్భంలో ఆయన పాటించిన సుదీర్ఘ మౌనం విషయాన్ని శక్తివంతంగా ముందుకు నెట్టింది. బయటకు చెప్పనప్పటికీ ఆయన ఉద్దేశాన్ని చాలామంది శ్రోతలు అర్థం చేసుకున్నారు. మరొక ఎత్తుగడ చాలా వినూత్నమైనది. అవును అని చెప్పడానికి బదులుగా చలమేశ్వర్‌ సింపుల్‌గా ‘హుమ్‌’ అన్నారు. చాలాసందర్భాల్లో ఈ ధ్వన్యనుకరణ శబ్దం అనిశ్చితిని లేదా సుదీర్ఘ ఆలోచనను సూచిస్తుంది కానీ జస్టిస్‌ చలమేశ్వర్‌ అలా పలికినప్పుడు అది ‘అవును’ పర్యాయపదంలాగే కనిపిస్తుంది.

వాస్తవం ఏమిటంటే పదాన్ని వాడకుండానే, ప్రశ్నను తప్పిం చుకోకుంటున్నారు అనే ఆరోపణకు దొరకకుండానే అవును అని చెప్పే కళ, అంత సులభం ఏమీ కాదు. రాజకీయనేతలకు ఇది చాలా సందర్భాల్లో అవసరం. కానీ చాలా తరచుగా వారికి అలా చెప్పే నైపుణ్యం ఉండదు. వారిని ఇంటర్వూ్యలలో చూడండి. ఆ భయంకరమైన పదాన్ని ప్రస్తావించకుండానే అవును అని చెప్పడానికి వారు మార్గాన్ని వెతుకుతున్నట్లు మీరు స్పష్టంగా చూడవచ్చు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వారు గింజులాడుకుంటారు. తమకుతాము ఇబ్బందికలిగించుకుంటారు.దీనికి భిన్నంగా, జస్టిస్‌ చలమేశ్వర్‌ ఈ మౌఖికపరమైన గొయ్యిలతో వ్యవహరించడంలో అత్యంత నేర్పుతో వ్యవహరించడమే కాదు.. అద్భుత విజయంతో బయటపడ్డారు కూడా. పైగా ఆయనను అనుకరించే నిగ్రహం నాకు లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సాధారణంగా చాలా వేగంగా సమాధానాలిస్తుం టాను. తర్వాత పశ్చాత్తాప పడుతుంటాను. మిమ్మల్ని మీరు చైతన్యవంతంగా అదుపు చేసుకున్న సందర్భాల్లో మాత్రమే మీకు కాస్త నవ్వే అవకాశం లేదా అలా ‘హుమ్‌’ అని చెప్పే అవకాశం వస్తుంది. ‘తెలివైన వారు సైతం తప్పించుకునే పరిస్థితిని ఎదుర్కోవడానికి మూర్ఖులు ఏమాత్రం తటపటాయించరు’ అనే సామెతకు అర్థం ఇదే కావచ్చని నేను ఆశ్చర్యపడుతుంటాను.


వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
కరణ్‌ థాపర్‌ 
ఈ–మెయిల్‌ : karanthapar@itvindia.ne

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement