Jasti Chelameswar
-
రాజ్యాంగం వేదమంత్రమా, కరదీపికా?
పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ద్రవ్యబిల్లును పొరపాటున తన ఆమోదం కోసం తీసుకువచ్చినప్పుడు రాష్ట్రపతిగా వ్యవహరిస్తున్న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎమ్. హిదయతుల్లా దాన్ని తిరస్కరించారు. ఆయన రాజ్యాంగాన్ని సంప్రదాయంగా కాకుండా, కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలోని సూక్ష్మభేదాలను పట్టించుకోవడం లేదు. రాబర్ట్ బొర్క్ ప్రకారం, మనం రాజ్యాంగాన్ని చదవడం కాదు.. అసలు చదవాలా అన్నదే ప్రశ్న. నేడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మ శాస్త్రాన్ని సీల్ట్ కవర్లో ఉంచేసిన యుగంలోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక..! అత్యంత శ్రద్ధాశక్తులతో, శ్రమకోర్చి రూపొం దించిన భారత రాజ్యాంగం.. రాజకీయ పవి త్రత కలిగిన శాసన పత్రం. నూతన గణతంత్ర వ్యవస్థ నిర్మాతలు పొందుపర్చిన ఆదర్శాలతో అది ప్రతిష్టితమైనది. కానీ దేశంలో 70 ఏళ్లుగా సాగుతున్న క్రమబద్ధ పాలనలో అది దాని ప్రాసంగికతను, ప్రగతిశీల స్వభావాన్ని కోల్పోయిందా అని నేను భీతిల్లుతున్నాను. ఏడు దశాబ్దాలలోపే మన రాజ్యాంగం సారాంశాన్ని లేక స్ఫూర్తిని కొనసాగించకుండా, దాన్ని కేవలం ఒక పూజనీయమైన పవిత్రగ్రంథం స్థాయికి కుదించివేశారు. నిజానికి అది రాజ్యాంగ పరిధిలో స్థాపించిన ప్రభుత్వానికి చెందిన మూడు విశిష్ట విభాగాల దుష్పరిపాలనకు వీలుకల్పించే అధికార వనరుగా మారిపోయింది. వివిధ రాజ్యాంగ సంబంధ కార్యాలయాలు తమ అసమర్థత కారణంగా రాజ్యాంగ ప్రతిని చదవటం కానీ లేక దాని సంవిధానాన్ని అర్థం చేసుకోవడం కాని చేయలేకపోతున్నాయి. తన మహోన్నతమైన ప్రయోజనాన్ని గుర్తించడానికి బదులుగా భారత ప్రజ లపై అధికారాన్ని చలాయించే వనరుగా మాత్రమే మన రాజ్యాంగం మారిపోయింది. వేదమంత్రాల స్థాయిలో రాజ్యాంగ అధికరణలను మతిహీనంగా జపిస్తున్నారు. రాజ్యాంగ న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులే భారత రాజ్యాంగం అత్యున్నత పూజారులు. చాలాకాలం క్రితమే మృతిచెందిన ఇతర దేశాలకు చెందిన న్యాయవాదులు, న్యాయమూర్తులు ప్రయోగించిన సామెతలు, నిగూఢ పదబంధాలు, ఉల్లేఖనల ప్రస్తావనలతో వీరు సంతోష పడుతున్నారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త హైకోర్టు ఏర్పాటు అంశం దీనికి సంబంధించిన తాజా అభాసగా నిలుస్తోంది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (1956 నుంచి 2014 వరకు మనుగడలో ఉండింది) ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 పేరిట పార్లమెంటు చేసిన చట్టం ద్వారా విభజనకు గురైంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలను రూపొందించింది. రెండు కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు అవసరమైన వివిధ అంశాలను ఈ చట్టంలో పొందుపర్చారు. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకించి విడిగా హైకోర్టు ఉండాలని రాజ్యాంగంలోని 214 అధికరణ ఆదేశించి ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా హైకోర్టును ‘ఏర్పాటు చేయాల్సిన’ అవసరముందని, హైదరాబాద్ పరిధిలోని హైకోర్టును, తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా మార్చాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 30, 31 ప్రకటించాయి. అయితే హైదరాబాద్ పరిధిలోని హైకోర్టు మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టే తప్ప మరొకటి కాదు. దాని ప్రాదేశిక అధికార పరిధి రెండు కొత్త రాష్ట్రాల సారాంశంగా ఉండేది. కానీ రెండు రాష్ట్రాల అధికార పరిధిని కలిగి ఉండిన ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఇప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాదేశిక అధికార పరిధిని మాత్రమే కలిగి ఉంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ‘ఏర్పర్చాల్సిన’ తేదీ గురించి పునర్వ్యవస్థీకరణ చట్టం మౌనం వహించింది. అలాగే ప్రత్యేక హైకోర్టును ఏర్పర్చాల్సిన విధివిధానం గురించి కూడా ఈ చట్టం మౌనం పాటిస్తోంది. దీన్ని వివరించడానికి మనం ఆంధ్రప్రదేశ్ చట్టం 1953, సెక్షన్ 28ని ప్రస్తావించాలి. 1956 జనవరి ఒకటవ తేదీన లేక రాష్ట్రపతి ప్రకటన ద్వారా నిర్దేశించిన అంతకు మునుపటి తేదీన కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలని ఇది నిర్దేశించింది. హైకోర్టు ప్రధాన పీఠం నెలకొల్పాల్సిన స్థలాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నిర్ణయించవచ్చని సెక్షన్ 28(3) ప్రకటించింది. జార్ఖండ్, చత్తీస్‌గఢ్, గుజ రాత్ రాష్ట్రాలను ఏర్పర్చిన బిహార్, మధ్యప్రదేశ్, బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టాల్లో కూడా ఇదే విధమైన అంశాలను మనం చూడవచ్చు. పైన పేర్కొన్న చట్టాలన్నింటిలోనూ నూతనంగా ఏర్పర్చిన హైకోర్టు ఉనికిలోకి వచ్చే తేదీని నిర్ధారించే నిబంధనలను, హైకోర్టు ప్రధాన పీఠం ఎక్కడ ఉండాలో నిర్ణయించే రాజ్యాంగబద్ధ అధికారి గురించి నిర్దిష్టంగా సూచించడమైనది. నూతన హైకోర్టుకు చెందిన రాజ్యాంగబద్ధ ప్రాథమిక శాసనాధికారాన్ని పార్లమెంటు అత్యంత స్పష్టంగా నిర్దేశించింది. దురదృష్టవశాత్తూ, నూతన హైకోర్టు ఉనికిలోకి రావలసిన తేదీకి సంబంధించి 2014 చట్టంలో అలాంటి శాసనసంబంధమైన నిబంధనను మనం చూడలేం. లేక అలాంటి నిర్దిష్ట తేదీని ప్రకటించే అధికారాన్ని భారత రాష్ట్రపతి లేక మరెవరైనా రాజ్యాంగబద్ధ అధికారికి కట్టబెట్టిందీ లేదు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన హైకోర్టు ఏర్పాటు, భారత రాష్ట్రపతి సంతకం చేసిన 2018 డిసెంబర్ 26 నాటి భారత ప్రభుత్వ గెజెట్‌లో ప్రచురించిన ప్రకటన ద్వారా ఉనికిలోకి వచ్చింది. భారత ప్రభుత్వం వర్సెస్ బి. ధనపాల్ ఎస్ఎల్పి 298902018 మరియు రాష్ట్రాలకు చెందిన కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఈ ప్రకటన ప్రస్తావిస్తూ, ఆ తీర్పు స్ఫూర్తితో హైదరాబాద్ అధికార పరిధిలోని హైకోర్టును తెలం గాణ హైకోర్టుగా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా విభజించే ప్రకటనను సంబంధిత సమర్థ అధికారి చేయగలరని పేర్కొంది. అయితే న్యాయపాలనా పవిత్ర సూత్రం పరిధిలో అలాంటి సమర్థ అధికారి ఎవరు, స్వయంగా రాజ్యాంగం ద్వారా లేక రాజ్యాంగం పరి ధిలో రూపొందించిన ఏదైనా చట్టం ద్వారా రాజ్యాంగ పాలన కలిగిన దేశంలో ఏదైనా ప్రభుత్వ చట్టం ద్వారా అలాంటి అధికారాన్ని చలాయిస్తారా అన్నదే ప్రశ్న. నేను ముందే చెప్పినట్లుగా హైకోర్టు ఏర్పాటు తేదీని ఎవరు నిర్ణయించాలి అనే అంశానికి సంబంధించి పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పూర్తిగా మౌనం పాటిస్తోంది. కానీ రాష్ట్రపతి పేరుతో జారీ చేసే ప్రకటన ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చని ప్రభుత్వం లేక దేశ పాలకులు విశ్వసిస్తున్నారు. అయితే ఒరిజనల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ఉండి ఇప్పుడు మారిన తెలంగాణ హైకోర్టులో కుదించిన ప్రాదేశిక న్యాయాధికార పరిధితో కొనసాగనున్న జడ్జీలుకూడా తాజాగా ప్రమాణ స్వీకారం చేయడమే ఈ మొత్తం ఉదంతంలో ఉల్లాసం కలిగించే అంశం. అయితే తాజాగా ఎలాంటి నియమకాలకు చెందిన వారంట్లనూ జారీచేయలేదు. నా అభిప్రాయంలో ఇది సరైనదే. కానీ అదేసమయంలో, రాజ్యాంగ సంవిధా నాన్ని లేక రాష్ట్రపతి అధికారాలను విశ్లేషించి చూస్తే ఇలా కొత్తగా ప్రమాణం చేయవలసిన అవసరం లేదు. మాతృసంస్థ అయిన మద్రాసు హైకోర్టు నుంచి ప్రాదేశిక న్యాయాధికార పరిధిలో ఆంధ్ర హైకోర్టు 1953లో ఏర్పాటైన సందర్భంగా మదరాసు హైకోర్టులోనే ఉండిపోయిన న్యాయమూర్తులు కొత్తగా ప్రమాణం చేయలేదు. అలాగే గుజరాత్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నూతన హైకోర్టులను ఏర్పర్చిన సందర్భం లోనూ బాంబే, పాట్నా, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు కొత్తగా ఎలాంటి ప్రమాణం చేయలేదు. చెప్పుకుంటే ఇలాంటివి చాలా ఉదాహరణలు ఉంటాయి. అయితే ఇప్పుడు తెలంగాణ హైకోర్టుగా పిలుస్తున్న హైదరాబాద్ అధికార పరిధిలో కొనసాగుతున్న జడ్జీలు మాత్రం తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ, తెలంగాణ హైకోర్టుల్లో ఇలాంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినప్పుడు సుప్రీంకోర్టు మాజీ జడ్జీలు, ప్రస్తుత సిట్టింగ్ జడ్జీలు కూడా వాటికి హాజరవటం గమనార్హం. 1969లో నాటి రాష్ట్రపతి జకీర్ హుస్సేన్ పదవిలో ఉండగానే మరణించినప్పుడు, రాష్ట్రపతిగా వ్యవహరించిన ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో భారత ప్రధాన న్యాయమూర్తి దేశ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడానికి రాజ్యాంగం రీత్యా పరిస్థితి డిమాండ్ చేసిన నేపథ్యంలో నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎమ్ హిదయతుల్లా మరొకరి బదులుగా రాష్ట్రపతిగా అయ్యారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మనీ బిల్లును ఆయన పరిశీలనకు పంపించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(1) ప్రకారం, రాష్ట్రపతి ‘సిపార్సు’తో మాత్రమే పార్లమెంటులో మనీ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంది. పార్లమెంటు ఉభయసభల్లో ఈ బిల్లు నెగ్గినట్లయితే, దాన్ని మళ్లీ రాష్ట్రపతి ఆమోదానికి పంపాలి. ఇక్కడ సంక్లిష్ట పరిస్థితి ఏర్పడింది. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడానికే రాష్ట్రపతి సిఫార్సు చేస్తారు. రాష్ట్రపతి ఆమోదం ఆ బిల్లును శాసనంగా మారుస్తుంది. అయితే పార్లమెంటులో ఆ బిల్లు ప్రవేశపెట్టడానికి ముందుగా నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హిదయతుల్లా ముందుకు పొరపాటున ఆ ద్రవ్య బిల్లును తీసుకెళ్లారు. హిదయతుల్లా రాజ్యాంగం గురించి మరిచిపోయి ఉంటే, లేక రాజ్యాంగం గురించి తెలియకుండా ఉంటే, లేక అహంభావంతో ప్రవర్తించి ఉంటే ఆ బిల్లుకు ఆమోదం తెలుపుతూ సంతకం పెట్టేవారు. దీంతో పార్లమెంటులో దాన్ని ప్రవేశపెట్టకుండానే ఆ బిల్లు భారత ప్రామాణిక శాసనంగా మారిపోయి ఉండేది. హిదయతుల్లా రాజ్యాంగానికి సేవ చేసిన విశిష్ట న్యాయవేత్త. ఆయన రాజ్యాంగాన్ని కార్యనిర్వాహక కరదీపికలాగా చూశారు. ఆయన కేవలం సంప్రదాయాలను గుడ్డిగా పాటించే అత్యున్నత పూజారి కాదు. అందుకే పార్లమెంటులో ప్రవేశపెట్టకుండానే తన వద్దకు వచ్చిన ఆ ద్రవ్యబిల్లును ఆమోదించడానికి ఆయన తిరస్కరించారు. దాంతో ఆయన కింది అధికారులు న్యాయమీమాంసకు సంబంధించిన ఒక పెను సంక్షోభాన్ని తప్పిస్తూ తమ తప్పును సరిదిద్దుకోవలసి వచ్చింది. హిదయతుల్లా ఇప్పుడు లేరు. కానీ నేటి రాజకీయ నాయకత్వం రాజ్యాంగంలో పొందుపర్చి ఉన్న సూక్ష్మభేదాల గురించి పెద్దగా విచారించడం లేదు. వారితోపాటు ప్రధాన పూజారులు కూడా వాటిని లెక్కబెట్టడం లేదు. ఈ సందర్భంగా నేను రాబర్ట్ బొర్క్ ప్రకటనను గుర్తు చేస్తాను– ఈరోజుల్లో రాజ్యాంగాన్ని ఎలా చదవాలన్నది కాదు.. చదవాలా వద్దా అన్నదే ప్రశ్న. ఇప్పుడు మనం ‘రాజ్యాంగ నైతికత’ యుగంలోనూ, న్యాయ ధర్మశాస్త్రాన్ని సీల్ట్‌కవర్‌లో ఉంచేసిన యుగం లోనూ జీవిస్తున్నాం. భారత ప్రజాస్వామ్యాన్ని ఆ దేవుడే రక్షించుగాక! జాస్తి చలమేశ్వర్ వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి -
మౌనం ఓ శక్తిమంతమైన సమాధానం
అవును అనేది మూడక్షరాల సాదా పదం. చాలా తరచుగా అందరూ వాడే పదం. కానీ అది వాచ్యంగా గొంతులోనే చిక్కుకుపోయే సందర్భాలూ ఉంటాయి. మీరు అవును అని చెప్పదల్చుకున్న సందర్భంలోనే ఇది సంభవిస్తుంటుంది. కొన్నిసార్లయితే మీరు ‘అవును’కు బదులుగా ‘లేదు’ అని ముగిస్తారు. మీరు అమ్మాయిలలో ఎవరినైనా ఇష్టపడుతున్నారా అని చిన్న పిల్లలను అడిగితే అవును అని వారు చెప్పలేని అనేక సందర్భాల గురించి కాస్త ఆలోచిస్తారా? ఆ ప్రశ్నకు వారు సిగ్గుపడటంలోనే రహస్యం దాగి ఉంది. కానీ వారి పెదవులనుంచి ఆ పదం తప్పించుకోలేదు. లేదా మీరు అప్సెట్ అయ్యారా, ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించారా, అవును అని చెప్పలేకపోయారా అని పెద్దవాళ్లను అడిగితే వారి ముఖాలు కోపంతో ఎర్రబడటం గురించి ఆలోచించారా? ఈ ప్రశ్నకు పిల్లలు చాలావరకు సిగ్గుపడతారు, పెద్దలయితే తరచుగా గర్వపడతారు. కర్మలు, వేడుకలు నిర్వహించే మన ఆచారం కారణంగా అవును అనేది మన సంస్కృతిలో నిర్దిష్టంగా సమస్యాత్మకంగా ఉంటుంది. ఆ పదాన్ని మీరు పలికేందుకు సాహసించినప్పుడు తరచుగా దాని బదులుగా లేదు అని చెబుతాం. మీరు మరొకరికి సహాయం చేయడానికి ఇష్టపడతారా అని నన్ను ఎవరైనా అడిగినప్పుడు నేను అవునని సమాధానం చెప్పాలనుకుంటాను కానీ ఏదో ఒక మూర్ఖపు అభ్యంతరం లేదా అసందర్భపు సౌజన్యం అనేవి అవును అని చెప్పనీయకుండా నన్ను అడ్డుకుంటాయి. భారత్‌లో ఈ విషయంపై తరచుగా మనల్ని రెండుసార్లు, మూడుసార్లు అడుగుతుంటారు కాబట్టి కాస్త ఆలోచించి బయటపడుతుంటాం. మిమ్మల్ని ఒక్కసారి మాత్రమే అడిగే బ్రిటన్ లేదా అమెరికాలో అయితే మీరు చాలా అసౌకర్యంగా ఫీలవుతారు. గత శనివారం ఆ పదాన్ని ఉచ్చరించకుండానే ‘అవును’ అని నేర్పుగా చెప్పగలిగే మార్గాలున్నాయని నేను తెలుసుకున్నాను. సుప్రీంకోర్టులో రెండోస్థానంలో ఉన్న అత్యంత సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌తో హార్వర్డ్ క్లబ్ ఇండియా తరపున గంటసేపు ఇంటర్వూ్య చేసినప్పుడు ఇది తెలిసింది. న్యాయవ్యవస్థను చుట్టిముట్టిన పలు సమస్యలు, వివాదాల గురించి, ప్రభుత్వంతో న్యాయవ్యవస్థ సంబంధాల గురించి మేం మాట్లాడుకున్నాం. వీటిని బహిరంగంగా చర్చించడానికి జడ్జీలకు చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. నిజానికి చాలామంది న్యాయమూర్తులు అలా చర్చించకూడదని నమ్ముతుంటారు. కానీ జస్టిస్ చలమేశ్వర్ దీనిపై చర్చించడానికి సిద్ధపడ్డారు. అందుచేత ఆయన ఎదుర్కొన్న ప్రశ్న వివేచన, పారదర్శకత్వానికి మధ్య సమతూకాన్ని చిత్రించింది. లేదా, మరోలా చెప్పాలంటే.. వాస్తవాన్ని వెల్ల డించడానికి, వాస్తవంగా నమ్ముతున్నదాన్ని దాచిపెట్టడానికి మధ్య బ్యాలెన్స్ చేయడం అన్నమాట. జస్టిస్ చలమేశ్వర్ రెండు తెలివైన ఎత్తుగడలను ఉపయోగించడం ద్వారా తన సమస్యను పరిష్కరించుకున్నారు. మొదటిది ఏమిటంటే పెద్దగా నవ్వడం. దీంతో ఆయన కళ్లు వెలిగిపోయాయి. ఆయన ఏమీ మాట్లాడకున్నప్పటికీ అంగీకరిస్తున్నట్లుగా ఆది స్పష్టమైన సందేశమిచ్చింది. ఆ సందర్భంలో ఆయన పాటించిన సుదీర్ఘ మౌనం విషయాన్ని శక్తివంతంగా ముందుకు నెట్టింది. బయటకు చెప్పనప్పటికీ ఆయన ఉద్దేశాన్ని చాలామంది శ్రోతలు అర్థం చేసుకున్నారు. మరొక ఎత్తుగడ చాలా వినూత్నమైనది. అవును అని చెప్పడానికి బదులుగా చలమేశ్వర్ సింపుల్‌గా ‘హుమ్’ అన్నారు. చాలాసందర్భాల్లో ఈ ధ్వన్యనుకరణ శబ్దం అనిశ్చితిని లేదా సుదీర్ఘ ఆలోచనను సూచిస్తుంది కానీ జస్టిస్ చలమేశ్వర్ అలా పలికినప్పుడు అది ‘అవును’ పర్యాయపదంలాగే కనిపిస్తుంది. వాస్తవం ఏమిటంటే పదాన్ని వాడకుండానే, ప్రశ్నను తప్పిం చుకోకుంటున్నారు అనే ఆరోపణకు దొరకకుండానే అవును అని చెప్పే కళ, అంత సులభం ఏమీ కాదు. రాజకీయనేతలకు ఇది చాలా సందర్భాల్లో అవసరం. కానీ చాలా తరచుగా వారికి అలా చెప్పే నైపుణ్యం ఉండదు. వారిని ఇంటర్వూ్యలలో చూడండి. ఆ భయంకరమైన పదాన్ని ప్రస్తావించకుండానే అవును అని చెప్పడానికి వారు మార్గాన్ని వెతుకుతున్నట్లు మీరు స్పష్టంగా చూడవచ్చు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో వారు గింజులాడుకుంటారు. తమకుతాము ఇబ్బందికలిగించుకుంటారు.దీనికి భిన్నంగా, జస్టిస్ చలమేశ్వర్ ఈ మౌఖికపరమైన గొయ్యిలతో వ్యవహరించడంలో అత్యంత నేర్పుతో వ్యవహరించడమే కాదు.. అద్భుత విజయంతో బయటపడ్డారు కూడా. పైగా ఆయనను అనుకరించే నిగ్రహం నాకు లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను సాధారణంగా చాలా వేగంగా సమాధానాలిస్తుం టాను. తర్వాత పశ్చాత్తాప పడుతుంటాను. మిమ్మల్ని మీరు చైతన్యవంతంగా అదుపు చేసుకున్న సందర్భాల్లో మాత్రమే మీకు కాస్త నవ్వే అవకాశం లేదా అలా ‘హుమ్’ అని చెప్పే అవకాశం వస్తుంది. ‘తెలివైన వారు సైతం తప్పించుకునే పరిస్థితిని ఎదుర్కోవడానికి మూర్ఖులు ఏమాత్రం తటపటాయించరు’ అనే సామెతకు అర్థం ఇదే కావచ్చని నేను ఆశ్చర్యపడుతుంటాను. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు కరణ్ థాపర్ ఈ–మెయిల్ : karanthapar@itvindia.ne -
చట్టాల అమల్లోనే లోపం : జస్టిస్ చలమేశ్వర్
-
జస్టిస్ చలమేశ్వర్‌కు అరుదైన గౌరవం
-
ఉండవల్లి 'విభజన కథ' పుస్తకావిష్కరణ
హైదరాబాద్ : మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రచించిన 'విభజన కథ' పుస్తకాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తితో పాటు పలువురు మీడియా సంపాదకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో తెర వెనుక జరిగిన మంత్రాంగాలు, ముఖ్యమైన సంఘటనలను ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ పుస్తకంలో కూర్చినట్లు వక్తలు పేర్కొన్నారు. -
మరోసారి ‘కొలీజియం’
జాతీయ న్యాయ నియామకాల కమిషన్ (ఎన్‌జేఏసీ) చట్టం, అందుకు సంబంధిం చిన 99వ రాజ్యాంగ సవరణ చెల్లవంటూ సుప్రీంకోర్టు నిరుడు అక్టోబర్‌లో మెజారిటీ తీర్పు వెలువరించాక దాదాపు కనుమరుగవుతుందనుకున్న కొలీజియం చర్చ కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి, కొలీజియం సభ్యుడు అయిన జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కొలీజియం సమావేశంలో పాల్గొనడానికి నిరాకరిం చడం ప్రస్తుత చర్చకు ప్రధాన కారణం. న్యాయమూర్తుల నియామకం, బదిలీ ప్రక్రియల్లో పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్‌కు ఆయన లేఖ రాశారని వెలువడి కథనాలు సంచలనం కలిగిం చాయి. కొలీజియం సమావేశాల మినిట్స్‌ని నమోదు చేయాలని, అంతవరకూ తాను అందులో పాల్గొనలేనని కూడా ఆయన ఆ లేఖలో చెప్పారు. కొలీజియంకు సంబంధించి ఆయన అభిప్రాయమేమిటో నిరుడు మెజారిటీ తీర్పుతో విభేదిస్తూ జస్టిస్ చలమేశ్వర్ విడిగా ఇచ్చిన తీర్పులోనే వెల్లడైంది. అయితే ఇప్పుడాయన నిర్దిష్టంగా కొలీజియం సమావేశాల తీరును, అందులో పారదర్శకత లేకపోవడాన్ని ప్రశ్నించారు. అంతేకాదు... కొలీజియంలో జస్టిస్ ఠాకూర్‌తోసహా మిగిలిన నలు గురు న్యాయమూర్తుల అభిప్రాయాలు తన వద్దకు వస్తే తన అభిప్రాయాన్ని కూడా చేరుస్తానని తెలియజేశారు. ఇలా అనడం ద్వారా కొలీజియం సభ్యుల అభిప్రా యాలు లిఖితపూర్వకంగా ఉండాలన్న తన మనోగతాన్ని ఆయన విస్పష్టంగా చెప్పినట్టయింది. జస్టిస్ చలమేశ్వర్ లేవనెత్తిన అంశాలను పరిష్కరించుకుంటామని జస్టిస్ ఠాకూర్ చెప్పారుగానీ అదంత సులభమేమీ కాదు. కొలీజియం పని తీరుపై అసంతృప్తి కొత్తగాదు. న్యాయ వ్యవస్థలో పనిచేసిన వారినుంచే అలాంటి అభిప్రాయాలు లోగడ కూడా వ్యక్తమయ్యాయి. ఇరవైయ్యేళ్ల క్రితం కొలీజియం విధానం ఏర్పడటానికి ఆద్యుడైన జస్టిస్ జేఎస్ వర్మ అది సరిగా పని చేయడంలేదని అనంతరకాలంలో భావించారు. జస్టిస్ మార్కండేయ కట్జూ, జస్టిస్ కె జి బాలకృష్ణన్ వంటివారు కూడా అలానే అనుకుంటున్నారు. అయితే ప్రధాన న్యాయమూర్తులుగానో, న్యాయమూర్తులుగానో పని చేసి రిటైరయ్యాకే వీరంతా కొలీజియం గురించి విమర్శించారు. పదవుల్లో ఉండగా ఆ పని చేయలేదు. పైగా ఈ విధానంలో కొందరు అనర్హులు న్యాయమూర్తులు కాగలిగారని ఆరోపిం చారు తప్ప ఆ కొలీజియం పనితీరు ఎలా ఉంటున్నదో వెల్లడించలేదు. అందువల్లే జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాసిన లేఖ అంత సంచలనం కలిగించింది. వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండటం, కొన్నిచోట్ల ప్రధాన న్యాయమూర్తులు లేకపోవడం ఈ మధ్యకాలంలో బాగా చర్చనీయాంశమైంది. ఎన్‌జేఏసీ చట్టాన్ని, రాజ్యాంగ సవరణను కొట్టేసి పది నెలలు గడుస్తున్నా కొలీ జియం విధానానికి అనుగుణంగా న్యాయమూర్తుల నియామకం జరగకపోవడంపై ఇటీవల జస్టిస్ ఠాకూర్ ఒకటి రెండు సందర్భాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మార్చిలో రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల జాతీయ సదస్సు జరిగినప్పుడు జడ్జీల నియామకంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రస్తావించి ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలోనే ఆయన కంటతడి పెట్టారు. న్యాయమూర్తుల కొరతపై దాఖలైన ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ విషయంలో న్యాయపరంగా జోక్యం చేసుకునే స్థితి కల్పించవద్దని కూడా హెచ్చ రించారు. మొన్న స్వాతంత్య్ర దినోత్సవం రోజున మోదీ ప్రసంగం పూర్తయ్యాక అందులో జడ్జీల నియామకం ప్రస్తావన లేకపోవడాన్ని జస్టిస్ ఠాకూర్ ఎత్తి చూపారు. నియామకాలు పూర్తయి కేసుల పెండింగ్ సమస్య తీరాలన్న ఆయన ఆత్రుతను ఇవన్నీ తెలియజేస్తున్నాయి. కొలీజియం విధానానికి అనుగుణంగా కేంద్రం విధాన పత్రం(ఎంఓపీ) విడుదల చేయకపోవడమే నియామకాలకు ఇప్పు డున్న అడ్డంకి. ఇలాంటి దశలో జస్టిస్ చలమేశ్వర్ లేఖ రాశారు. కొందరంటున్నట్టు ఈ లేఖ వల్ల జడ్జీల నియామకం అంశం మరింత జటిలం అయి ఉండొచ్చు. న్యాయవ్యవస్థ వైపు వినవస్తున్న వాదన బలహీనపడి ఉండొచ్చు. అయితే ఆయన ఎత్తి చూపిన అంశాలు సాధారణమైనవేమీ కాదు. కొలీజియం వ్యవస్థే అన్నివిధాలా అత్యుత్తమైనదని భావించినప్పుడు అది అందుకు తగ్గట్టుగా ఉండాలి. ఎంఓపీ విషయంలో కేంద్రానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య ప్రధానంగా రెండు అంశాలపై తీవ్ర విభేదాలున్నాయి. కొలీజియం సమావేశాల మినిట్స్ నమోదు చేయాలన్నది అందులో మొదటిది కాగా, అసమ్మతి వ్యక్తంచేసిన న్యాయ మూర్తి అభిప్రాయాన్ని కూడా అందులో చేర్చాలని కేంద్రం పట్టుబడుతోంది. ఒకరకంగా జస్టిస్ చలమేశ్వర్ లేఖ సైతం దాన్నే సూచిస్తున్నది. ఈ రెండు అంశాలూ న్యాయమూర్తుల ఎంపిక ప్రక్రియ మరింత ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా ఉండేందుకు దోహదం చేస్తాయి తప్ప దానికి విఘాతం కలిగించవు. న్యాయవ్యవస్థ స్వాతంత్య్రాన్ని దెబ్బతీయవు. అలాంటప్పుడు న్యాయ వ్యవస్థకు అభ్యంతరం ఉండవలసిన అవసరమేమిటో సామాన్యులకు బోధ పడదు. ఇంతకు ముందు సంగతేమోగానీ... న్యాయమూర్తుల నియామకాలు, బది లీల ప్రక్రియకు సంబంధించిన రికార్డు ఉండదని జస్టిస్ చలమేశ్వర్ లేఖ తర్వాత స్పష్టమైంది. జడ్జీల నియామకంలో వివిధ దేశాల్లో వేర్వేరు విధానాలున్నాయి. బ్రిటన్‌లో స్వతంత్రంగా పనిచేసే న్యాయ నియామకాల కమిషన్ ఉంటుంది. దాని సిఫార్సులను పునఃపరిశీలించమని కోరవచ్చు. లేదా తిరస్కరించవచ్చు. అమె రికాలో అయితే సెనేట్‌లో చర్చిస్తారు. జాబితాలోని వారిని పిలుస్తారు. లోతుగా ప్రశ్నిస్తారు. అభ్యర్థుల మంచి చెడ్డల గురించి బహిరంగ చర్చ జరుగుతుంది. ఇవన్నీ అయ్యాకే తుది నిర్ణయం ఉంటుంది. చాలా తక్కువ సందర్భాల్లోనే కావొచ్చుగానీ మన దేశంలో న్యాయమూర్తులపై ఆరోపణలు రావడం, అవి అభి శంసన వరకూ వెళ్లడం గతంలో చోటుచేసుకున్నాయి. ఇప్పుడు ఎటూ కొలీజియం వ్యవస్థే అమల్లో ఉంటుంది. జస్టిస్ చలమేశ్వర్ లేఖ నేపథ్యంలో దాన్ని మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా రూపొందించాల్సిన అవసరం ఉన్నదని గుర్తిం చడం మంచిది. -
ధైర్యంగా చెప్పలేనివారు న్యాయమూర్తిగా పనికిరారు
సాక్షి, హైదరాబాద్: తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పలేనివారు న్యాయమూర్తి స్థానానికి అర్హులు కారని, కష్టమో.. నిష్టూరమో న్యాయమూర్తి తమ అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కానీ ఇటీవలి కాలంలో జూనియర్ జడ్జీలు యాదృచ్ఛికంగా సీనియర్ జడ్జీల అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎంపికైన జస్టిస్ ఆశపు రామలింగేశ్వరరావును కౌండిన్య సేవా సమితి ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీ సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జస్టిస్ చలమేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఇతర వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి న్యాయవ్యవస్థ వైపు చూస్తున్నది నిజమే అయినా... అటువంటి పరిస్థితి సమాజానికి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాధాన్యతా పోస్టులకోసం సివిల్ సర్వీసు అధికారులు ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఈ పరిస్థితి న్యాయవ్యవస్థలోనూ ఉందని జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. 1980 దశకంలో తనకు రాజకీయాలతో కొంత అనుబంధం ఉం దని... అధికారం ఉన్నప్పుడు పొర్లుదండాలు పెట్టినవారే అధికారానికి దూరమైన తర్వాత వారితో ప్రవర్తించే తీరు ను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండాలని, పదవులు శాశ్వతం కాదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యరిపై దాఖలైన పిటిషన్ విషయంలో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనంలో జస్టిస్ చలమేశ్వర్ ఉన్నారని... జూనియర్ జడ్జిగా ఉన్నా ప్రధాన న్యాయమూర్తి తీర్పుతో విభేదించారని, చట్టాలపై లోతైన అవగాహన ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఖండవల్లి చంద్రభాను చెప్పారు. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం చలమేశ్వర్దని, న్యాయవాది నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా ఎదిగినా ఆయన ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పూ రాలేదని చెప్పారు. చట్టాలపై లోతైన అవగాహన ఉన్న జస్టిస్ రామలింగేశ్వరరావు ప్రతిభతోనే న్యాయమూర్తిగా ఎంపికయ్యారని ప్రశంసించారు. కార్యక్రమంలో అదనపు అడ్వొకేట్ జనరల్ కేజీ కృష్ణమూర్తి, ఐటీ కమిషనర్ బాల గాని గోపీనాథ్, వాణిజ్యపన్నుల శాఖ అదనపు కమిషనర్ జి.వెంకటేశ్వర్లు, కౌండిన్య సేవా సమితి ప్రతినిధులు నాగేశ్వరరావు, ఉయ్యూరు కృష్ణమూర్తి పాల్గొన్నారు. -
ప్రమాదకర లక్షణం
సాక్షి, న్యూఢిల్లీ : ‘తెలుగు సాహిత్యంలో ప్రశంసలపాళ్లు ఎక్కువగా ఉంటాయని, అయితే పొగడ్త అనేది మనుషులను చెడగొట్టే ప్రమాదకరమైన లక్షణమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. కర్రపెత్తనం చేసినవారిని సైతం గొప్పగా కీర్తిస్తూ రాయడం కనిపిస్తుందన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ (డీటీఏ) 26వ వార్షిక సాంస్కృతిక, 100 ఏళ్ల సినిమా అవార్డుల ప్రదానం-2013 పేరిట ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి మావలంకర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు మాట్లాడిన అతిథి నాగఫణిశర్మ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఆయనపై విధంగా స్పందించారు. అనంతరం హాస్యనటుడు శివాజీ మాట్లాడుతూ.. గొప్పనటులతో కలసి వేదికను పంచుకోవడం గర్వంగా ఉందన్నారు. తెలుగుభాష గొప్పదనాన్ని వివరిస్తూ ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ పాడిన ‘తెలుగుభాష గొప్పదనం’పాటకు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు తోడయ్యాయి. 23 ఏళ్లుగా నటుడిగా ఉన్న తాను పురస్కారం అందుకోవడం సంతోషం కలిగించిందని టీవీ నటుడు కృష్ణ కౌశిక్ పేర్కొన్నారు. అంతకముందు ఢిల్లీ హైకోర్టుప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ప్రసంగించారు. ఉన్నత స్థానంలో ఉన్నవారిని పొగడ్త మంచి పనులు చేసేవిధంగా ప్రోత్సహిస్తుందన్నారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్, కె.రమణచారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జునరావు, విజయలక్ష్మి, బాలకామేశ్వరరావు, వీకే.దుర్గ, రమణ భరద్వాజ్ కొత్త పాత పాటల కలయికతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డీటీఏ పాలకవర్గ సభ్యులతోపాటు స్థానిక ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు ఢిల్లీ తెలుగు అకాడమీ కార్యక్రమానికి ఆహ్వానితుల్లో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, కపిల్ సిబల్, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, జేడీ. శీలం, ప్రత్యేక ఆహ్వానితులుగా టీడీపీ ఎంపీలు సీఎం.రమేశ్, ఎం.వేణుగోపాల్‌రెడ్డి హాజరవుతారంటూ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నా రు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నందున కొత్త తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రజాప్రతినిధులు మొహం చాటేశారని పలువురు అనుకున్నారు. అయితే ముందస్తుగా ప్రకటించినట్టుగా ఢిల్లీ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు కార్యక్రమం జరుగుతున్న సమయంలో మావలంకర్ ఆడిటోరియం బయట కొద్దిసేపు నినాదాలు చేసి ఆ తర్వాత వెనుదిరిగారు.