ప్రమాదకర లక్షణం
Published Mon, Oct 7 2013 12:07 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
సాక్షి, న్యూఢిల్లీ : ‘తెలుగు సాహిత్యంలో ప్రశంసలపాళ్లు ఎక్కువగా ఉంటాయని, అయితే పొగడ్త అనేది మనుషులను చెడగొట్టే ప్రమాదకరమైన లక్షణమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. కర్రపెత్తనం చేసినవారిని సైతం గొప్పగా కీర్తిస్తూ రాయడం కనిపిస్తుందన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ (డీటీఏ) 26వ వార్షిక సాంస్కృతిక, 100 ఏళ్ల సినిమా అవార్డుల ప్రదానం-2013 పేరిట ఆదివారం మధ్యాహ్నం 4 గంటల నుంచి మావలంకర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు మాట్లాడిన అతిథి నాగఫణిశర్మ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఆయనపై విధంగా స్పందించారు. అనంతరం హాస్యనటుడు శివాజీ మాట్లాడుతూ.. గొప్పనటులతో కలసి వేదికను పంచుకోవడం గర్వంగా ఉందన్నారు.
తెలుగుభాష గొప్పదనాన్ని వివరిస్తూ ప్రముఖ గేయరచయిత చంద్రబోస్ పాడిన ‘తెలుగుభాష గొప్పదనం’పాటకు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు తోడయ్యాయి. 23 ఏళ్లుగా నటుడిగా ఉన్న తాను పురస్కారం అందుకోవడం సంతోషం కలిగించిందని టీవీ నటుడు కృష్ణ కౌశిక్ పేర్కొన్నారు. అంతకముందు ఢిల్లీ హైకోర్టుప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ ప్రసంగించారు. ఉన్నత స్థానంలో ఉన్నవారిని పొగడ్త మంచి పనులు చేసేవిధంగా ప్రోత్సహిస్తుందన్నారు. అవార్డుల ప్రదానోత్సవం అనంతరం సంగీత దర్శకులు మాధవపెద్ది సురేశ్, కె.రమణచారి ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి అందరినీ అలరించింది. గాయకులు గోపికా పూర్ణిమ, మల్లికార్జునరావు, విజయలక్ష్మి, బాలకామేశ్వరరావు, వీకే.దుర్గ, రమణ భరద్వాజ్ కొత్త పాత పాటల కలయికతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో డీటీఏ పాలకవర్గ సభ్యులతోపాటు స్థానిక ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
మొహం చాటేసిన ప్రజాప్రతినిధులు
ఢిల్లీ తెలుగు అకాడమీ కార్యక్రమానికి ఆహ్వానితుల్లో కేంద్ర మంత్రులు సుశీల్‌కుమార్ షిండే, కపిల్ సిబల్, కావూరి సాంబశివరావు, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణి, కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, జేడీ. శీలం, ప్రత్యేక ఆహ్వానితులుగా టీడీపీ ఎంపీలు సీఎం.రమేశ్, ఎం.వేణుగోపాల్‌రెడ్డి హాజరవుతారంటూ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నా రు. సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నందున కొత్త తలనొప్పులు వస్తాయనే ఉద్దేశంతోనే ప్రజాప్రతినిధులు మొహం చాటేశారని పలువురు అనుకున్నారు. అయితే ముందస్తుగా ప్రకటించినట్టుగా ఢిల్లీ సమైక్యాంధ్ర జేఏసీ నేతలు కార్యక్రమం జరుగుతున్న సమయంలో మావలంకర్ ఆడిటోరియం బయట కొద్దిసేపు నినాదాలు చేసి ఆ తర్వాత వెనుదిరిగారు.
Advertisement
Advertisement