పై ఫొటోలో కనిపిస్తున్న ఆటో టేకులపల్లిలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు ఫొటో తీసి, నంబర్ ఆధారంగా ఈ–చలాన్ పంపారు. కానీ అది ఖమ్మంలోని ఓ కారు ఓనర్‌కు వెళ్లింది. కారు నంబర్ ఆటోపై రాయడంతో ఈ మతలబు జరిగింది.
భద్రాచలానికి చెందిన ఓ వ్యక్తి స్కూటీ ఎప్పుడూ ఇతర ప్రాంతాలకు వెళ్లలేదు. అయితే చండ్రుగొండలో హెల్మెట్ పెట్టుకోలేదంటూ ఈ–చలాన్ వచ్చింది. ఫొటోలో మాత్రం ప్యాషన్ బైక్ ఉంది. జరిమానా స్కూటీ ఓనర్‌కు వచ్చింది. ట్రాఫిక్ జరిమానాలు తప్పించుకునేందుకు కొందరు తమ వాహనాలపై ఇతరుల వాహనాల నంబర్లు రాసుకుంటున్నారు.
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: పోలీసులు నిబంధనలు ఉల్లంఘించేవారి వాహనాల ఫొటోలు తీస్తున్నారు. వాటి ఆధారంగా వాహనం నంబర్ గుర్తించి జరిమానా విధిస్తున్నారు. అయితే కొందరు ఉల్లంఘనులు ఇతరుల వాహనాల నంబర్లను తమ వాహనాలపై రాయించుకుంటున్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ఈ–చలాన్లు మాత్రం ఇతరులకు వెళ్తున్నాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఒక వాహనం నంబరును మరో వాహనానికి చెందిన వ్యక్తులు ఉపయోగిస్తుండటంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్న వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వేరేవాళ్లు చేస్తున్న తప్పులకు తాము జరిమానా కట్టాల్సి వస్తోందని వాపోతున్నారు.
తమ వాహనాల నంబర్లు పెట్టుకుని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తమ పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదాయం కోసం పోలీసులకు భారీ లక్ష్యాలు విధించి ఒత్తిడి చేస్తోంది. దీంతో రోజూ అన్ని ఠాణాల పరిధిలోని కానిస్టేబుళ్లు వివిధ కూడళ్లలో నిలబడి ఫొటోలు తీయడమే పనిగా ఉంటున్నారు. ట్రాఫిక్ క్లియరెన్స్ సైతం గాలికి వదలాల్సిన పరిస్థితి నెలకొంది. వాహనాలు తనిఖీలు చేస్తేనే ఆర్‌సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు, వాహనం నడిపే వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయో లేవో తెలుసుకోవచ్చని పలువురు పేర్కొంటున్నారు.
ఏజెన్సీలోనే తనిఖీలు..
మావోయిస్టు పార్టీ కార్యకలాపాల నేపథ్యంలో జిల్లాలోని భద్రాచలం, పినపాక ఏజెన్సీల్లో మాత్రమే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణాదారులు పట్టుబడుతున్నారు. పోలీసులు పేలుడు పదార్థాలు, గంజాయి రవాణాపైనే దృష్టి పెడుతున్నారు తప్ప వాహనాలకు పత్రాలు ఉన్నాయా? లేవా? అనే విషయం పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇక ఇతర ప్రాంతాల్లో తనిఖీలు అంతగా చేపట్టడం లేదు. దీంతో ఏ వాహనంలో ఏం తరలిస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాలు, మండల కేంద్రాల్లో కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనుల ఫొటోలను తీసేందుకే కానిస్టేబుళ్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ సమస్యలపై ఎస్పీ సునీల్‌దత్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులో లేరు.
Comments
Please login to add a commentAdd a comment