పరిమితికి మించి ట్రాక్టర్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు
బాపట్లటౌన్: రవాణాశాఖాధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు వాహన చోదకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాహనాలను ఉరుకులు పరుగులు పెట్టిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తత్ఫలితంగా ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమయ్యాయి. మైనర్లు, లైసెన్స్ లేని వారు వాహనాలు నడుపుతున్నా నియంత్రించడంలో రవాణా, పోలీస్ శాఖలు విఫలమయ్యాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆటోలు, ట్రాక్టర్లలో పరిమితికి మించి మరీ ప్రయాణికులను ఎక్కిస్తూ వాహనాలను నడుపుతున్నారు. ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సివస్తోంది. దీంతో అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే ఎంతో విలువైన ప్రాణాలు కోల్పోవడం ఖాయం. పరిమితిని మించిన ప్రయాణాలు అరికడితే ప్రమాదాలను చాలావరకు నియంత్రించవచ్చు.
అవగాహన సదస్సులు సరే...ఆచరణేది?
ఇటీవల నిర్వహించిన రహదారి భద్రతా వారోత్సవాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా లైసెన్స్‌లు పొందిన తర్వాతే వాహనాలు నడపాలని, పాఠశాల బస్సులు నడిపే డ్రైవర్లు నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అధికలోడుతో వాహనాలు నడిపితే సీజ్ చేస్తాం అని చెప్పిన అధికారులు ఆ తర్వాత వాటి గురించి పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడిపే వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. డ్రైవింగ్ పూర్తిగా రాని వారికి కూడా అధికారులు లైసెన్స్‌లు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు అక్కడకు చేరుకుని హడావుడి చేయటం తప్ప తగు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మైనార్టీ తీరని వారు కూడా వాయువేగంగా బైక్‌లపై దూసుకెళ్తున్నారు. ట్రిపుల్ రైడింగ్ కూడా రోడ్లపై కనిపిస్తూనే ఉంది. చర్యలు తీసుకోవాల్సిన మోటారు వాహనాల తనిఖీ అధికారులు, పోలీస్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆటోవాలాలు, ట్రాక్టర్ల వాళ్లు సామారŠాధ్యనికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఆటోలో వెనుక డోర్‌పై నిలబడి ప్రయాణిస్తున్నప్రజలు
గజిబిజిగా నంబర్ ప్లేట్లు
ద్విచక్ర వాహనాలపై నంబర్ ప్లేట్లు ఎవరికిష్టమొచ్చినట్లు వారు వేయించడం వలన ఆ బండి నంబర్ చూసేవారికి అర్ధం కావడం లేదు. మరికొంత మంది నంబర్‌పై ఉన్న మోజుతో కొన్ని నంబర్లు పెద్దవిగానూ, మరికొన్ని నంబర్లు చిన్నవిగా వేస్తున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు చూసే వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీని వలన రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాల వారు నంబర్‌ను సరిగా గుర్తించని కారణంగా బీమా రాని సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇంకొందరు నంబర్‌ప్లేట్లపై సినీహీరోల బొమ్మలు వేసి, నంబర్‌ను చిన్నగా రాయిస్తున్నారు. ఈ విషయాలు రవాణా, పోలీస్ శాఖాధికారులకు తెలియంది కాదు. అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోవడం వలనే అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
త్వరలో స్పెషల్ డ్రైవ్
నిర్వహిస్తాం నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్న వాహన చోదకులపై చర్యలు తీసుకుంటూనే ఉన్నాం. గత 20 రోజుల వ్యవధిలో సుమారు 70 వాహనాలను సీజ్ చేశాం. త్వరలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించి వాహనచోదకులపై చర్యలు తీసుకుంటాం.
– జి.రామచంద్రరావు, ఎంవీఐ
కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం
లైసెన్స్ లేకుండా, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుం టున్న వాహనచోదకులపై కేసులు నమోదుచేసి కోర్టుకు పెడుతున్నాం. ఆటోడ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి ప్రమాదాలను నివారించేందుకు కృషిచేస్తాం.
– జి.రవికృష్ణ, ఎస్‌ఐ
Comments
Please login to add a commentAdd a comment