గీత దాటితే.. మోతే!
సాక్షి, కర్నూలు: వాహన చోదకులూ.. జర జాగ్రత్త. ట్రాఫిక్ నిబంధనలు బేఖాతరు చేశారో ఇక అంతే సంగతులు. నిఘా కళ్లు మీమ్మల్ని వెంటాడబోతున్నాయి. కెమెరా కన్ను ప్రతిపక్షణం పహారా కాయబోతోంది. అసాంఘిక శక్తుల ఆటకట్టించడమే కాదు.. అక్రమాక్కుల ఆగడాలను కట్టడి చేయడమే ధ్యేయంగా కర్నూలు పోలీసు యంత్రాంగం సన్నద్ధమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే.. వాహనదారుని చిరునామాకే ఈ-చలాన్(జరిమానా) పంపేందుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. సో.. బీ కేర్ ఫుల్.
ఈ-నిఘా ఎలాగంటే!
కర్నూలు నగర పరిధిలో పోలీసులు ప్రారంభించిన ఈ-నిఘా వ్యవస్థ సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ అనుబంధ సమస్యలను పరిష్కరించేందుకు 30 ప్రాంతాల్లో 120 కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇకపై నిబంధనలు ఉల్లఘించిన వారిపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. సిగ్నల్స్ చూడకుండా రయ్.. రయ్‌మంటూ దూసుకెళ్లే వాహనాలకు ముకుతాడు వేయనున్నారు. నిర్విరామంగా పనిచేసే ఈ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ఉల్లంఘనులను గుర్తించనున్నారు.
ఇంటికే ఈ-చలాన్
ఇప్పటి వరకు ట్రాఫిక్ పోలీసులు రహదారులపై నిలబడి అనుమానం వచ్చిన వాహనాలను ఆపి రికార్డులను పరిశీలించి.. ఏవైనా పత్రాలు సరిగా లేకపోతే ఆ మేరకు జరిమానా విధించి డబ్బులు వసూలు చేసేవారు. అయితే కొందరు అధికారులకు ఈ విధులు వరంగా మారాయి. వాహనదారులకు రసీదులు ఇవ్వకుండా వారి నుంచి వసూలు చేసిన మొత్తాలను తమ జేబుల్లో నింపుకుంటున్నట్లు ఆరోపణలు అనేకం. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్ పోలీసుల కళ్లు గప్పి నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను.. కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ద్వారా గుర్తించి వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా వారి చిరునామాలకే ఈ-చలాన్లు పంపడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అధికారులను ఇకపై కేవలం చలాన్ రాయడానికే పరిమితం చేసి.. జరిమానాను ఆన్‌లైన్ చెల్లింపుల ద్వారా వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జిల్లాలో కీలకం కానున్న ఈ-నిఘా వ్యవస్థ
ఈ-నిఘాను సమర్థంగా అమలు చేసి కెమెరాల వ్యవస్థను పటిష్టం చేయడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. కర్నూలు జిల్లా పరిధిలో 6 పోలీసు సబ్ డివిజన్లు ఉన్నాయి. వీటి ద్వారా శాంతిభద్రతల పర్యవేక్షణ జరుగుతోంది. దీంతో పాటు ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులోని కర్నూలులో ఎప్పటికప్పుడు తనిఖీలు ముమ్మరం చేయడం ద్వారా నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉంది. లక్ష్యాలు ఎక్కువగా ఉండడం.. ఉన్న సిబ్బందితోనే అన్ని పనులు చేయాల్సి రావడంతో పోలీసు శాఖపై ఒత్తిడి అధికమవుతోంది.
ఇది నేరాల దర్యాప్తు, నియంత్రణపైనా తీవ్ర ప్రభావం చూపుతున్న దృష్ట్యా కర్నూలు పోలీసు ఉన్నత వర్గాలు ప్రత్యేక ప్రణాళికలకు శ్రీకారం చుట్టాయి. నేరాల్లో ఆధారాల సేకరణకు ఎక్కువ సమయం తీసుకుంటుండడం, ఇదే అదునుగా నేరాగాళ్లు తప్పించుకుంటున్నారన్న అపవాదు ఉండడంతో సులభంగా ఆధారాలను సేరకించేందుకు అవసరమైన మార్గాలను ఆన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోనే తొలిసారి జిల్లావ్యాప్తంగా ఈ-నిఘా వ్యవస్థను సంపూర్ణంగా అమలు చేసే దిశగా కసరత్తు ముమ్మరమైంది.