హైటెక్‌ నంబర్‌ ప్లేట్‌ ఉండాల్సిందే.. | There should be a high-tech number plate | Sakshi
Sakshi News home page

హైటెక్‌ నంబర్‌ ప్లేట్‌ ఉండాల్సిందే..

Published Sun, Jan 28 2018 3:17 AM | Last Updated on Sun, Jan 28 2018 3:17 AM

There should be a high-tech number plate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ ప్లేట్‌ (హెచ్‌ఎస్‌ఆర్‌పీ) లేకుండా తిరిగే వాహనాలపై కొరడా ఝళిపించేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. ఆర్టీఏలో కొత్తగా వాహనం నమోదైనప్పటికీ చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లకు బదులు సాధారణ నంబర్‌ ప్లేట్లనే వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల వాహనాల హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 2013 డిసెంబర్‌ తర్వాత రిజిస్టర్‌ అయిన వాహనాలు తప్పకుండా హైటెక్‌ నంబర్‌ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని.. లేకుంటే ఆయా వాహనాలకు సేవలన్నింటినీ నిలిపి వేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. శనివారం రవాణా కమిషనర్‌ ప్రధాన కార్యాలయంలో సంయుక్త రవాణా కమిషనర్‌ పాండురంగ్‌ నాయక్‌ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచే ఇది అమల్లోకి రానుంది. దీంతో హైటెక్‌ నంబర్‌ ప్లేట్లు లేని వాహనాల యాజమాన్య బదిలీ, చిరునామా బదిలీ, హైపతికేషన్, పన్ను చెల్లింపులు, పర్మిట్లు వంటి అన్ని రకాల పౌరసేవలు నిలిచిపోనున్నాయి.  

2013లో అమల్లోకి.. 
వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు హెచ్‌ఎస్‌ఆర్‌పీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2013 డిసెంబర్‌లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది అమల్లోకి వచ్చింది. అప్పట్లో రవాణా కార్యాలయంలో నమోదైన ప్రతి వాహనం విధిగా హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించుకోవాలని నిబంధన విధించారు. అయితే హెచ్‌ఎస్‌ఆర్‌పీ ప్లేట్ల కొరత వల్ల ఈ నిబంధన సరిగా అమలు కాలేదు. దీంతో ఈ స్కీమ్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రవాణా శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం మేరకు వాహనం రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారం, పది రోజుల్లో హెచ్‌ఎస్‌ఆర్‌పీ బిగించుకోవాలి. అలా ఉన్న వాటికే అన్నిరకాల పౌరసేవలు వర్తిస్తాయి. లేకుంటే బ్యాంకు రుణాలపై కొనుగోలు చేసిన వాహనాల హైపతికేషన్‌ రద్దు, రవాణా రంగానికి చెందిన వాహనాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు, వాహనం ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం, చిరునామా, యాజమాన్య బదిలీ వంటి సేవలు నిలిచిపోనున్నాయి.  

ఆదివారం సైతం సేవలు... 
హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమలులోని జాప్యాన్ని నివారించేందుకు ఇకనుంచి ఆదివారం కూడా నంబర్‌ ప్లేట్లను బిగించనున్నట్లు జేటీసీ పాండురంగ్‌ నాయక్‌ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఏజెన్సీ నుంచి ఎస్సెమ్మెస్‌ అందుకున్న వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. మొదట ఖైరతాబాద్‌ ఆర్టీఏలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ఆ తరువాత హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చి దశలవారీగా రాష్ట్రమంతటా ఆదివారం సేవలను విస్తరిస్తామని ఆయన వివరించారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ నిబంధనను ఉల్లంఘించే వాహనాలపై భవిష్యత్తులో దాడులు చేసి కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement