అదృష్ట సంఖ్యలుగా భావించే వాహనాల ఫ్యాన్సీ నంబర్లపై సిటీలో క్రేజ్ పెరుగుతోంది. ఇటీవల సిక్స్ సిరీస్ నంబర్లకు మరింత డిమాండ్ ఎక్కువైంది. కోట్లాది రూపాయల విలువైన హైఎండ్ కార్లు కొనుగోలు చేయడంతోపాటు తమ హోదాను ప్రతిబింబించే విధంగా వాహనదారులు లక్కీ నంబర్లను ఎంపిక చేసుకుంటున్నారు. ఒక్క ఆల్‌నైన్స్, ఆల్ సిక్స్‌లే కాకుండా తమకు నచ్చిన ఇతర నంబర్ల కోసమూ రూ.లక్షలు చెల్లిస్తున్నారు. ఖరీదైన కార్లకే కాదు, బైక్‌ల నంబర్ల కోసం కూడా వాహనదారులు పోటీకి దిగుతున్నారు. కొందరు బర్త్‌డే గిఫ్ట్‌లుగా వీటిని బంధువులు, మిత్రులకు ఇస్తున్నారు. ఫ్యాన్సీ రూపంలో ఏటా రవాణాశాఖకు సుమారు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోందంటే పోటీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సాక్షి, సిటీబ్యూరో: ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 0999’ నెంబర్‌కు ఆర్టీఏ నిర్ణయించిన ఫీజు రూ.50 వేలు. వేలంలో ఈ నంబర్ కోసం పోటీపడిన ఓ వాహనదారుడు ఏకంగా రూ.9.30 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 6666’ నంబర్‌కు రూ.8.67 లక్షల ఆదాయం లభించింది. వాహనదారులు క్రేజ్‌గా భావించే మరో నంబర్ ‘టీఎస్ ఈడబ్ల్యూ 1234’ కోసం ఒక వాహనదారుడు రూ.4.50 లక్షలు వేలంలో చెల్లించాడు. టీఎస్ 09 ఈడబ్ల్యూ 5555’ నంబర్‌కు రూ.2.71 లక్షల డిమాండ్ వాహనదారులు ఎక్కువగా కోరుకొనే మరో నంబర్ ‘టీఎస్ 09 ఈడబ్ల్యూ 2345’ పైన రూ.2.15 లక్షల ఆదాయం లభించింది. గత నెల రోజుల్లోనే వాహనాల నంబర్ల పైన నిర్వహించిన వేలంపాటల్లో ఖైరతాబాద్ ఆర్టీఏకు ఏకంగా రూ.1.37 కోట్ల ఆదాయం లభించింది.
అదృష్టసంఖ్యలుగా భావించే వాహనాల ఫ్యాన్సీ నంబర్లపై నగరవాసులకు మోజు పెరుగుతోంది. తమకిష్టమైన నంబర్లకు ఎన్ని లక్షల రూపాయలైనా చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్క ఆల్‌నైన్స్, ఆల్ సిక్స్ వంటి నంబర్‌లే కాదు..ఇతరత్రా అదృష్ట సంఖ్యలకూ డిమాండ్ పెరుగుతోంది. ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఏటా రవాణా శాఖకు సుమారు రూ.50 కోట్ల ఆదాయం లభిస్తోంది. వాహనదారులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘9’ అంకెతో మొదలయ్యే ఖైరతాబాద్ కార్యాలయంలోనే గతేడాది రూ.15 కోట్లకు పైగా ఆదయం లభించగా, ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.20 కోట్ల వరకు ఉండవచ్చునని అంచనా. ఖైరతాబాద్‌తో పాటు మేడ్చల్, అత్తాపూర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మెహదీపట్నం వంటి అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లోనూ ప్రత్యేక నంబర్లకు క్రేజ్ పెరుగుతోంది.
‘ఆల్ సిక్స్’ ఆల్ టైమ్ రికార్డు...
ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఏలో నిర్వహించిన వేలం పాటల్లో ఆల్‌సిక్స్ నంబర్ కోసం ఓ వాహనదారుడు ఏకంగా రూ.8.67 లక్షలు వేలంలో చెల్లించాడు. దీని కోసం ఏడుగురు పోటీకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌కు ఇదే నంబర్ ఉండడం, ఆయనకు ఈ నంబర్ అంటే ఎంతో ఇష్టం కావడంతో సహజంగా నగరవాసుల్లోనూ సిక్స్‌పై మక్కువ ఏర్పడింది.
హోదా కోసం...
అదృష్ట సంఖ్యలుగా భావించి కొందరు పోటీకి దిగుతుండగా, హోదా, పేరు ప్రతిష్టల కోసం మరికొందరు ఫ్యాన్సీ నంబర్లను దక్కించుకుంటున్నారు. ఉద్యోగం, వ్యాపారం, సినిమాలు, రాజకీయాలు, పరిశ్రమలు వంటి విభిన్నరంగాలకు చెందిన వాహన యజమానులు ‘లక్కీ’ నంబర్ల కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆర్టీఏలో కొత్త సీరిస్ ప్రారంభమవుతుంది. మొత్తం నంబర్లలో 2500 వరకు ఫ్యాన్సీ నంబర్లు ఉంటాయి. వీటి కోసం వేలాది మంది పోటీపడుతున్నారు. ఒక్కో నంబర్‌కు సగటున 5 నుంచి 10 మంది వాహన యజమానులు పోటీకి వస్తుండగా, నచ్చినవి లభించని వాళ్లు నెలల తరబడి వేచి ఉంటున్నారు.
అదృష్టం కోసం...
కేవలం ఫ్యాన్సీ కోసం కాకుండా కొన్ని నంబర్ల వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుందనే నమ్మకం కూడా ఈ క్రేజ్‌కు కారణం. జ్యోతిష్యులు ఒక్కొక్క నంబర్‌ను ఒక గ్రహంతో, వాటి కదలికలతో అంచనా వేసి భవిష్యత్తును, మానసిక స్వభావాలను నిర్ధారిస్తారు. అలా తమ స్వభావానికి తగిన నంబర్లను వాహనదారులు ఎంపిక చేసుకుంటున్నారు. ఆ రకంగా 1,2,3,4,5,6,7,8,9 వంటి ప్రతి సింగిల్ నంబర్‌కు ఒక లక్షణం ఉంటుంది. ఉదాహరణకు ‘1’ నాయకత్వానికి, ‘2’ శాంతస్వభావానాకి నిదర్శనం. గురుగ్రహంతో పోల్చే ‘3’ వల్ల చక్కటి తెలివి తేటలు, జ్ఞానం లభిస్తాయని నమ్మకం. ‘5’ను బుధుడికి ప్రతిబింబంగా భావిస్తారు. ఈ నంబర్ వల్ల వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం. ఇక ప్రతి ఒక్కరు ఇష్టపడే నంబర్ ‘9’ కుజగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. జీవితంలో విజేతలుగా, తిరుగులేని నాయకులుగా ఎదగాలని కోరుకునేవాళ్లు, పోటీ మనస్తత్వం, పోరాడే తత్వం ఉన్నవాళ్లు ఈ నంబర్‌ను ఇష్టపడతారు.
1980 నుంచే....
సిటీలో 1980 నుంచే ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారుల్లో మక్కువ ఉంది. ‘9999’ వంటి నంబర్లు అప్పట్లో కేవలం రూ.500కు లభించేవి. ఎలాంటి పోటీ ఉండేది కాదు. రాజకీయరంగ ప్రవేశం చేసిన ఎన్టీరామారావు వంటి ప్రముఖులు తమ వాహనాలకు నచ్చిన నంబర్‌లను ఏర్పాటు చేసుకోవడంతో ఈ క్రేజ్ మొదలైంది. అప్పట్లో ఎన్టీరామారావు ‘ 27’, 999’, ‘9999’ వంటి నంబర్లకు ప్రాధాన్యతనిచ్చేవారు.
బర్త్‌డే గిఫ్టుల్లా ఇస్తున్నారు...
ఇటీవల కాలంలో చాలామంది వినియోగదారులు తమ కుటుంబ సభ్యులకు వాహనాలను బహుమానంగా అందజేయడమే కాదు...వారి పుట్టిన రోజు కలిసొచ్చేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్‌లను ఎంపిక చేసుకొని పోటీకి వస్తున్నారు. ‘1313’(తేరా తేరా) అంటే పంజాబీలకు ఎంతో ఇష్టం. దీనిని వాళ్లు అదృష్ట సంఖ్యగా భావిస్తారు. ‘5121’ అనే నంబర్‌ను ఆంగ్ల అక్షరాల్లో ‘సిరి’గా భావిస్తారు.‘143’, ‘214’, ‘8045’ వంటి నంబర్లకూ ఎంతో క్రేజ్ ఉంది.
ఏటా క్రేజ్ పెరుగుతోంది
గత రెండేళ్లుగా ఫ్యాన్సీ నంబర్లపై అనూహ్యమైన క్రేజ్ కనిపిస్తోంది. ఖైరతాబాద్ కార్యాలయంలో అత్యధిక డిమాండ్ ఉంటోంది. వేలంలో ఈ నెలలోనే ఇక్కడ రూ.కోటికి పైగా ఆదాయం లభించడం ఇందుకు నిదర్శనం. లగ్జరీ వాహనాల వినియోగం బాగా పెరగడం, ద్విచక్ర వాహనదారుల నుంచి కూడా గట్టి పోటీ ఉండడం వల్ల ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ బాగా పెరిగింది. – సి.రమేష్, ఆర్టీఓ, ఖైరతాబాద్
Comments
Please login to add a commentAdd a comment