rta services
-
మరోసారి ‘రవాణా’ సర్వర్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ సర్వర్లు సోమవారం నిలిచిపోయాయి. పౌరసేవలు స్తంభించాయి. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రవాణాశాఖ వెబ్సైట్ కూడా పనిచేయలేదు. వివిధ రకాల పౌరసేవల కోసం స్లాట్లు నమోదు చేసుకొని ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన 5 వేలమందికిపైగా వినియోగదారులు గంటల తరబడి పడిగాపులు కాసి తిరిగి వెళ్లిపోయారు. సోమవారం కోసం స్లాట్లు నమోదు చేసుకున్నవాళ్లు మంగళవారం తిరిగి అదేవేళల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. కేవలం వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు రవాణా కార్యకలాపాలు ఆగిపోవడం గమనార్హం. రవాణాశాఖలో విస్తరించిన పౌరసేవలకు అనుగుణంగా హార్ట్‌వేర్, సాఫ్ట్వేర్ వ్యవస్థల్లో మార్పు చేయకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణకు, అభివృద్ధికి నోచుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయి. లక్ష్యం గొప్పదే... రవాణాశాఖ పౌరసేవలన్నింటినీ కేంద్రీకృతం చేస్తూ టూటైర్ నుంచి త్రీటైర్‌కు సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. అప్పటివరకు ఎక్కడికక్కడ ఆర్టీఏ కార్యాలయాల్లో అందజేసే పౌరసేవలన్నింటినీ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి అందజేసేవిధంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, చిరునామా మార్పు, యాజమాన్య మార్పు, పర్మిట్ల జారీ, పన్నువసూళ్లు వంటి అన్ని రకాల కార్యకలాపాల డేటా ప్రధాన కార్యాలయం నుంచి ప్రాంతీయ కార్యాలయాలకు అందుతుంది. పౌరసేవల అమలును ఏకీకృతం చేసేవిధంగా తెచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం రవాణాశాఖలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని రోజుల్లోనే ఆర్టీఏలో ఆన్‌సేవలు అందుబాటులోకి వచ్చాయి. దళారులను నియంత్రించేందుకు ఇది కొంతవరకు దోహదం చేస్తుందని అధికారులు భావించారు. ఈ లక్ష్యం గొప్పదే అయినా ఆచరణలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయకపోవడమే అందుకు కారణం. సర్వీసులు 63.. సర్వర్లు 2 మొదట్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని పరిమితమైన సర్వీసుల కోసం ఏకీకృతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. కానీ 2010 నుంచి ఇప్పటి వరకు సుమారు 63 రకాల పౌరసేవలను ఆన్లైన్ ద్వారా అందజేస్తున్నారు. ఆర్టీఏ నుంచి ఎలాంటి సర్వీసు కావాలన్నా ఇప్పుడు ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవలసిందే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు వాహనాల సంఖ్య కోటి దాటింది. రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో కేవలం 2 సర్వర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 40 టెర్రాబైట్(టీబీ)ల సామర్థ్యంతో పనిచేస్తోంది. వాటిపైన పడుతున్న భారం అంతకు రెట్టింపుగానే ఉంది. ఈ సర్వర్ల సామర్థ్యాన్ని 80 టీబీ నుంచి 150 టీబీకి పెంచాలని అధికారులు ప్రతిపాదించారు, సర్వర్ల సామర్థ్యం పెంపుతోపాటు సాంకేతిక సేవలను మరింత పటిష్టం చేయడం, పాత కంఫ్యూటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం తదితర అన్ని రకాల సాంకేతిక అవసరాల కోసం రూ.26 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, రవాణాశాఖలో సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు. -
హైటెక్ నంబర్ ప్లేట్ ఉండాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ (హెచ్ఎస్ఆర్పీ) లేకుండా తిరిగే వాహనాలపై కొరడా ఝళిపించేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. ఆర్టీఏలో కొత్తగా వాహనం నమోదైనప్పటికీ చాలామంది వాహనదారులు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లకు బదులు సాధారణ నంబర్ ప్లేట్లనే వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 10 వేల వాహనాల హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 2013 డిసెంబర్ తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలు తప్పకుండా హైటెక్ నంబర్ ప్లేట్లు ఏర్పాటు చేసుకోవాలని.. లేకుంటే ఆయా వాహనాలకు సేవలన్నింటినీ నిలిపి వేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. శనివారం రవాణా కమిషనర్ ప్రధాన కార్యాలయంలో సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్ నాయక్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ మేర కు నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచే ఇది అమల్లోకి రానుంది. దీంతో హైటెక్ నంబర్ ప్లేట్లు లేని వాహనాల యాజమాన్య బదిలీ, చిరునామా బదిలీ, హైపతికేషన్, పన్ను చెల్లింపులు, పర్మిట్లు వంటి అన్ని రకాల పౌరసేవలు నిలిచిపోనున్నాయి. 2013లో అమల్లోకి.. వాహనాల భద్రత దృష్ట్యా సుప్రీంకోర్టు హెచ్‌ఎస్‌ఆర్‌పీని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 2013 డిసెంబర్లో ఉమ్మడి రాష్ట్రంలో ఇది అమల్లోకి వచ్చింది. అప్పట్లో రవాణా కార్యాలయంలో నమోదైన ప్రతి వాహనం విధిగా హెచ్ఎస్ఆర్పీ బిగించుకోవాలని నిబంధన విధించారు. అయితే హెచ్ఎస్ఆర్పీ ప్లేట్ల కొరత వల్ల ఈ నిబంధన సరిగా అమలు కాలేదు. దీంతో ఈ స్కీమ్‌ను మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రవాణా శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం మేరకు వాహనం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారం, పది రోజుల్లో హెచ్ఎస్ఆర్పీ బిగించుకోవాలి. అలా ఉన్న వాటికే అన్నిరకాల పౌరసేవలు వర్తిస్తాయి. లేకుంటే బ్యాంకు రుణాలపై కొనుగోలు చేసిన వాహనాల హైపతికేషన్ రద్దు, రవాణా రంగానికి చెందిన వాహనాలకు ప్రతి సంవత్సరం ఇచ్చే పర్మిట్లు, త్రైమాసిక పన్ను చెల్లింపులు, వాహనం ఒక చోట నుంచి మరో చోటకు బదిలీ చేయడం, చిరునామా, యాజమాన్య బదిలీ వంటి సేవలు నిలిచిపోనున్నాయి. ఆదివారం సైతం సేవలు... హెచ్ఎస్ఆర్పీ అమలులోని జాప్యాన్ని నివారించేందుకు ఇకనుంచి ఆదివారం కూడా నంబర్ ప్లేట్లను బిగించనున్నట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సదుపాయం ఉంటుందన్నారు. హెచ్ఎస్ఆర్పీ ఏజెన్సీ నుంచి ఎస్సెమ్మెస్ అందుకున్న వాహనదారులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. మొదట ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని, ఆ తరువాత హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చి దశలవారీగా రాష్ట్రమంతటా ఆదివారం సేవలను విస్తరిస్తామని ఆయన వివరించారు. హెచ్ఎస్ఆర్పీ నిబంధనను ఉల్లంఘించే వాహనాలపై భవిష్యత్తులో దాడులు చేసి కేసులు నమోదు చేసేందుకు కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. -
స్లాట్.. రెడీ..
► నేటి నుంచి ఆర్టీఏ ఆన్లైన్ సేవలు ► 57 రకాల పౌరసేవలు ఇక ఆన్లైన్లోనే ► పూర్తిగా కాగిత రహిత, నగదు రహిత సేవలు ► ఈ సేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లలో నమోదు సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ సేవలు ఇక పూర్తిగా ‘ఆన్లైన్లో’కి వచ్చేశాయి. రవాణాశాఖ అందజేసే సుమారు 58 రకాల పౌరసేవలు మంగళవారం నుంచి ఆన్లైన్లోనే లభించనున్నాయి. ఇందుకోసం నేటి నుంచి స్లాట్ (సమయం, తేదీ) ప్రకారమే పౌరసేవలను అందజేస్తారు. నేరుగా ఆర్టీఏ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకొనేందుకు, అక్కడిక్కడే ఫీజు చెల్లించేందుకు ఇక ఏ మాత్రం అవకాశం ఉండదు. నగదు రహిత, కాగిత రహిత సేవలు పూర్తిస్థాయిలో అమలు కానున్నాయి. వినియోగదారులు తమకు కావలసిన సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకున్న 24 గంటలలోపు నెట్ బ్యాంకింగ్ లేదా ఈ సేవా కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించాలి. తమకు లభించిన స్లాట్ ప్రకారం ఒరిజినల్ డాక్యుమెంట్లతో వెళ్లి అధికారులను సంప్రదించాలి. వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం అధికారులు సంతృప్తి చెందితే వినియోగదారుల నుంచి డిజిటల్ సంతకం, ఫొటో, బొటన వేలి ముద్ర తీసుకొని పంపేస్తారు. ఆ తరువాత స్పీడ్ పోస్టు ద్వారా వినియోగదారులు ఆశించిన పౌరసేవలు ఇంటికి చేరుతాయి. వినియోగదారులు అందజేసే డాక్యుమెంట్లలో ఏవైనా తక్కువ ఉంటే ఆ పనిని పెండింగ్‌లో ఉంచుతారు. సరైన ధృవపత్రాలతో వచ్చినప్పుడే పెండింగ్ పని పూర్తవుతుంది. ఏ రకమైన పౌర సేవ కోసం ఏయే డాక్యుమెంట్లు అందజేయాలనే సమాచారం స్లాట్ బుకింగ్ సమయంలోనే వినియోగదారుల మొబైల్ ఫోన్‌కు అందుతుంది. రవాణాశాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ ఆటోమేటెడ్ ఆన్లైన్ సేవలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు వివిధ రూపాల్లో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. 1400 ఈ సేవా కేంద్రాల్లో నమోదు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 1400 ఈ సేవ, మీ సేవ కేంద్రాల ద్వారా రవాణాశాఖ సేవల కోసం స్లాట్ నమోదు చేసుకొని, అక్కడే ఫీజు చెల్లించవచ్చు. స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకోలేని వాళ్లు, ఇళ్లల్లో ఇంటర్నెట్ సదుపాయం లేని వాళ్లకు ఇది చక్కటి అవకాశం. తెలంగాణ అంతటా 4 వేల ఈ సేవా కేంద్రాల ద్వారా ఈ సదుపాయం లభిస్తుందని హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ టి.రఘునాథ్ ‘సాక్షి’తో చెప్పారు. డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్లు, బదిలీలు, పలు ధృవపత్రాల రెన్యూవల్స్, పన్నులు, అపరాధ రుసుముల చెల్లింపులు వంటి అన్ని రకాల పౌరసేవల కోసం వినియోగదారులు ఇక నుంచి స్లాట్ (సమయం, తేదీ) ప్రకారమే సంప్రదించవలసి ఉంటుంది. అన్ని సేవలకు కేరాఫ్ ఆన్లైన్... లెర్నింగ్ లైసెన్సు (ఎల్ఎల్ఆర్) కోసం స్లాట్ నమోదు చేసుకోవడంతో పాటు, కాలపరిమితి ముగిసిన ఎల్ఎల్ఆర్ కోసం కూడా స్లాట్ నమోదు చేసుకోవలసి ఉంటుంది. డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్సు, ఫెయిల్ అయిన వారు మరోసారి టెస్ట్‌కు హాజరుకావాలన్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కాలపరిమితి ముగిసిన డ్రైవింగ్ లైసెన్సుల రెన్యూవల్, రవాణా వాహనాలు నడిపేందుకు అనుమతించే బ్యాడ్జ్, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్, డ్రైవింగ్ లైసెన్సులో చిరునామా మార్పు, కొత్త ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డూప్లికేట్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు, త్రైమాసిక పన్ను, గ్రీన్‌ట్యాక్స్ వంటి పన్నులు, వాహనాలపై విధించే అపరాధ రుసుములు సైతం ఆన్లైన్ ద్వారానే చెల్లించవలసి ఉంటుంది. వాహనం నమోదు, హైర్ పర్చేస్ అగ్రిమెంట్, హైర్ పర్చేస్ టర్మినేషన్, యాజమాన్య బదిలీ, డూప్లికేట్ ఆర్సీ, ఆర్సీ రెన్యూవల్ చేసుకోవడం, చిరునామా మార్పు, వాహనానికి అదనపు హంగులు సమకూర్చుకోవడం, ఎన్ఓసీ తీసుకోవడం వంటి అన్ని రకాల సేవల కోసం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ ఇలా.... ► ఇంటర్నెట్లో ‘తెలంగాణ రవాణాశాఖ వెబ్సైట్’ ఓపెన్ చేయగానే ఎడమ వైపున ‘ఆన్లైన్ సర్వీసెస్’ అని ఎరుపు రంగులో కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మొత్తం సేవల వివరాలు డిస్ప్లే అవుతాయి. ► కావలసిన సేవలపైన ‘క్లిక్’ చేస్తే ఒక కేలండర్ డిస్ప్లే అవుతుంది. అందులో వినియోగదారులు తమకు అనువైన తేదీ, సమయం బుక్ చేసుకోవాలి. ఆ తరువాత వివరాలను నమోదు చేయాలి. వెంటనే మొబైల్ నెంబర్‌కు ఒక ట్రాన్సాక్షన్ నెంబర్, ఆర్టీఏలో అందజేయవలసిన డాక్యుమెంట్ల వివరాలు ఎస్సెమ్మెస్ ద్వారా అందుతాయి. ► పేమెంట్ ఆప్షన్లో అభ్యర్ధులు నెట్‌బ్యాంకింగ్ లేదా ఈసేవా, మీ సేవా, క్రెడిట్, డెబిట్ కార్డులను ఎంపిక చేసుకొని ఫీజు చెల్లించవచ్చు, ► ఆన్లైన్ సేవలను నమోదు చేసుకున్న 24 గంటల వ్యవధిలో ఫీజు చెల్లించాలి. -
ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు
సబ్ కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ మీసేవ, ఈ సేవ నిర్వాహకులకు అవగాహన ఆసిఫాబాద్ : మోటారు వాహనదారుల సౌలభ్యం కోసం ఇక నుంచి రవాణా శాఖ సేవలు పూర్తి స్థాయిలో ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు సబ్ కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆసిఫాబాద్ ఎంవీఐ పరిధిలోని 12 మండలాలకు చెందిన మీసేవ, ఈ సేవ నిర్వాహకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 2 నుంచి ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎంవీఐ శ్యాంనాయక్ మాట్లాడుతూ రవాణా శాఖ ద్వారా 56 రకాల సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వాహనదారులు మీసేవ, ఈ సేవల ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్లు, బదిలీ, లైసెన్స్‌లు, అంతర్జాతీయ డ్రై వింగ్ లైసెన్స్‌లు, డూప్లికేట్ లైసెన్స్‌లు, రెన్యూవల్ తదితర సేవలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. లైసెన్స్‌ల జారీ సమయంలో వాహనాల డ్రై వింగ్ పరీక్ష కార్యాలయంలో నిర్వహిస్తామని తెలిపారు. టెక్నికల్ సపోర్టింగ్ ఇంజినీర్(టీఎస్ఈ) ఎండీ రఫి ఆన్లైన్ సేవలపై ప్రొజెక్టర్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది సంతోశ్, మీసేవ, ఈ సేవ నిర్వాహకులు పాల్గొన్నారు.