సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ సర్వర్లు సోమవారం నిలిచిపోయాయి. పౌరసేవలు స్తంభించాయి. ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనూ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రవాణాశాఖ వెబ్‌సైట్ కూడా పనిచేయలేదు. వివిధ రకాల పౌరసేవల కోసం స్లాట్‌లు నమోదు చేసుకొని ఆర్టీఏ కార్యాలయాలకు వచ్చిన 5 వేలమందికిపైగా వినియోగదారులు గంటల తరబడి పడిగాపులు కాసి తిరిగి వెళ్లిపోయారు. సోమవారం కోసం స్లాట్‌లు నమోదు చేసుకున్నవాళ్లు మంగళవారం తిరిగి అదేవేళల్లో ఆర్టీఏ కార్యాలయాల్లో సంప్రదించాలని కోరారు. కేవలం వారంరోజుల వ్యవధిలో రెండుసార్లు రవాణా కార్యకలాపాలు ఆగిపోవడం గమనార్హం. రవాణాశాఖలో విస్తరించిన పౌరసేవలకు అనుగుణంగా హార్ట్‌వేర్, సాఫ్ట్‌వేర్ వ్యవస్థల్లో మార్పు చేయకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం ఆధునీకరణకు, అభివృద్ధికి నోచుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తాయి.
లక్ష్యం గొప్పదే...
రవాణాశాఖ పౌరసేవలన్నింటినీ కేంద్రీకృతం చేస్తూ టూటైర్ నుంచి త్రీటైర్‌కు సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశారు. అప్పటివరకు ఎక్కడికక్కడ ఆర్టీఏ కార్యాలయాల్లో అందజేసే పౌరసేవలన్నింటినీ ఖైరతాబాద్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి అందజేసేవిధంగా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్, చిరునామా మార్పు, యాజమాన్య మార్పు, పర్మిట్ల జారీ, పన్నువసూళ్లు వంటి అన్ని రకాల కార్యకలాపాల డేటా ప్రధాన కార్యాలయం నుంచి ప్రాంతీయ కార్యాలయాలకు అందుతుంది. పౌరసేవల అమలును ఏకీకృతం చేసేవిధంగా తెచ్చిన ఈ సాంకేతిక పరిజ్ఞానం రవాణాశాఖలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోలేని రోజుల్లోనే ఆర్టీఏలో ఆన్‌సేవలు అందుబాటులోకి వచ్చాయి. దళారులను నియంత్రించేందుకు ఇది కొంతవరకు దోహదం చేస్తుందని అధికారులు భావించారు. ఈ లక్ష్యం గొప్పదే అయినా ఆచరణలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయకపోవడమే అందుకు కారణం.
సర్వీసులు 63.. సర్వర్‌లు 2
మొదట్లో లెర్నింగ్, డ్రైవింగ్ లైసెన్సులు, తాత్కాలిక, పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు వంటి కొన్ని పరిమితమైన సర్వీసుల కోసం ఏకీకృతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టారు. కానీ 2010 నుంచి ఇప్పటి వరకు సుమారు 63 రకాల పౌరసేవలను ఆన్‌లైన్ ద్వారా అందజేస్తున్నారు. ఆర్టీఏ నుంచి ఎలాంటి సర్వీసు కావాలన్నా ఇప్పుడు ఆన్‌లైన్‌లో స్లాట్ నమోదు చేసుకోవలసిందే. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా 60 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు వాహనాల సంఖ్య కోటి దాటింది. రవాణాశాఖ ప్రధాన కార్యాలయంలో కేవలం 2 సర్వర్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 40 టెర్రాబైట్(టీబీ)ల సామర్థ్యంతో పనిచేస్తోంది. వాటిపైన పడుతున్న భారం అంతకు రెట్టింపుగానే ఉంది. ఈ సర్వర్ల సామర్థ్యాన్ని 80 టీబీ నుంచి 150 టీబీకి పెంచాలని అధికారులు ప్రతిపాదించారు, సర్వర్ల సామర్థ్యం పెంపుతోపాటు సాంకేతిక సేవలను మరింత పటిష్టం చేయడం, పాత కంఫ్యూటర్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయడం తదితర అన్ని రకాల సాంకేతిక అవసరాల కోసం రూ.26 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ, రవాణాశాఖలో సాంకేతిక, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment