సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): గ్రేటర్ వాహనదారులు సెల్‌ఫోన్ డ్రైవింగే కాదు.. ఇయర్ ఫోన్స్, బ్లూ టూత్‌లలో లేదా హెల్మెట్ లోపల మొబైల్‌లో మాట్లాడుతూ (హ్యాండ్స్ ఫ్రీ) వాహనాలను నడుపుతున్నారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీహెచ్), కరుణ ట్రస్ట్, యాక్షన్ ఇన్ డిస్‌ట్రెస్ ఎన్‌జీఓలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. 11,787 డ్రైవర్లపై అధ్యయనం చేయగా.. 16.5 శాతం మంది సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నారని, ఇందులో 71.7 శాతం మంది హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ చేస్తున్నారని వెల్లడించింది.
♦మాదాపూర్ ఐటీ కారిడార్, అమీర్‌పేట బిజినెస్ ఏరియా, మేడ్చల్ హైవే ఇండ్రస్టియల్ ప్రాంతాలలో ఈ అధ్యయనం నిర్వహించాయి. 15 నిమిషాల పాటు వాహనాల రాకపోకలు, వాహనదారుల వీడియోను రికార్డ్ చేశారు. కరుణ ట్రస్ట్‌కు చెందిన సంధ్య, యాక్షన్ ఇన్ డిస్‌ట్రెస్‌కు చెందిన లక్ష్మి అర్చన, ఐఐపీహెచ్ నుంచి మెలిస్సా గ్లెండా లూయిస్, తేటాలి శైలజలు ఈ సర్వే నిర్వహించారు. ఈ అధ్యయాన్ని క్లినికల్ ఎపిడిమియాలజీ, గ్లోబల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురించారు.
♦రోజు, సమయంతో పాటూ రోడ్డు పరిస్థితిని బట్టి సెల్‌ఫోన్ డ్రైవింగ్‌లో తేడాలను అధ్యయన బృందం విశ్లేషించింది. సాధారణ రోజులలో కంటే వారాంతాలలో, రద్దీ ఉన్న రోడ్ల మీద కంటే లేని రహదారులలో హ్యాండ్స్ ఫ్రీ మోడ్‌లో డ్రైవింగ్ ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది.
♦డ్రైవింగ్‌లో హ్యాండ్స్ ఫ్రీ కమ్యూనికేషన్ పరికరాలను వినియోగించడం ప్రమాదకరని జాబితాలో ఉన్నప్పటికీ.. జరిమానాలు విధించడం లేదు. అందుకే ఈ తరహా డ్రైవింగ్‌లను కూడా ఎంవీ యాక్ట్‌లో చేర్చాలని పరిశోధకలు సూచించారు. మోటారు వాహనాల చట్టం సెక్షన్–184 ప్రకారం ప్రమాదకరమైన రీతిలో వాహనాలను డ్రైవింగ్ చేసే వారికి రూ.5 వేల జరిమానా, 6– 12 నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు.
♦గతేడాది హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 35,425, అంతకు క్రితం ఏడాది 26,984 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి. 2021లో రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,788 సెల్‌ఫోన్ డ్రైవింగ్ కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment