
బంగారు బాటలు
సాక్షి, మహబూబ్‌నగర్
జిల్లాలో రహదారులకు మహర్దశ పట్టనుంది. వాహనదారులు ఇక హాయిగా ప్రయాణం చేసుకునే వీలు కలగనుంది. గుంతలతో నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు కూడా అడ్డుకట్టపడినట్టే. రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం వెయ్యికోట్లు కేటాయిస్తున్నట్టు సీఎం ప్రకటించడంతో జిల్లావాసుల్లో ఆనందం వ్యక్తమైంది. సీఎం ప్రకటన రావడంతోనే రోడ్ల పరిస్థితిపై జిల్లా పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌శాఖల ఆధ్వర్యంలో 13,558 కి.మీ పొడువు రహదారులున్నాయి.
ఆర్ అండ్‌బీ పరిధిలో మహబూబ్‌నగర్, వనపర్తి, కల్వకుర్తి డివిజన్లు ఉన్నాయి. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్,నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలో 1154.76 కి.మీలను ఆర్‌అండ్‌బీ పర్యవేక్షిస్తోంది. అలాగే వనపర్తి డివి జన్‌లోని నాగర్‌కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, అలంపూ ర్, గద్వాల నియోజకవర్గాల పరిధిలో 1225.809 కి.మీ, కల్వకుర్తి డివిజన్‌లోని కల్వకుర్తి, షాద్‌నగర్, అచ్చంపేట నియోజకవర్గాల పరిధిలో 779. 951 కి.మీ పొడవున్నా యి. అదే మాది రిగా పంచాయతీరాజ్ పరిధిలో అన్ని డివి జన్లలోకలిపి 10,500 కి.మీ మేర మార్గాలున్నాయి.
అయితే గత పాల కుల వైఫల్యం, స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధుల పాలన లేకపోవడం చేత రహదారులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ఏళ్ల తరబడి వీటిని పట్టించుకోకపోవడంతో చిన్న పాటి వర్షానికి చెరువులను తలపిస్తున్నాయి. గ్రామాల లింక్ రోడ్లు, మండల కేంద్రాల నుం చి జిల్లా కేంద్రానికి ఉన్న దారులన్నీ దారుణంగా తయారయ్యాయి. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి నాలుగులేన్ల రహదారులు లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండడంతో పాటు తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎమ్మెల్యేల ప్రతిపాదనలకే పెద్దపీట
ఇటీవల రహదారుల పరిస్థితిపై సమీక్షించిన సీఎం కేసీఆర్ ప్రతి జిల్లాకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు నియమనిబంధనలు రూపొందించి, 15 రోజుల్లోగా టెండర్లు పిలవాలని ఆదేశించారు. అయితే జిల్లాలోని రహదారులకు సంబంధించి గతంలో నిర్వహించిన ‘మన ఊరు-మన ప్రణాళిక’లో వచ్చిన పనులకు ప్రాధాన్యం ఇచ్చేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ప్రభుత్వం కూడా ప్రజాప్రతినిధులకు పెద్దపీట వేసి, వారిచ్చే పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో మన ప్రణాళికలో భాగంగా గ్రామ, మండల, జిల్లాస్థాయిలో మొత్తం దాదాపు 3,500 కి.మీ పొడువుకు సంబంధించి వచ్చాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు పెద్దఎత్తున రానున్న నిధులను ప్రణాళిక పనులకు ప్రాధాన్యత క్రమంలో త్వరతగతిన చేపట్టేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది.