ఐదేళ్లలో రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర
రోడ్ల నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకొన్న ప్రభుత్వం
పీపీపీ విధానంలో 27 రోడ్ల నిర్మాణానికి ఆమోదం
టోల్ ఫీజుల రూపంలో దోచేందుకు రంగం సిద్ధం
అస్మదీయులకే కాంట్రాక్టులు.. ఐదేళ్ల పాటు వసూళ్లు
రూ. 4 వేల కోట్లతో నిర్మాణం.. రూ.12,500 కోట్ల ఆర్జన
వాహనదారులపై భారీగా టోల్ భారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ ‘దారి దోపిడీ’కి టీడీపీ కూటమి ముఖ్యనేత పన్నాగం పన్నారు. రాబోయే ఐదేళ్లలో ఏకంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. ప్రతిపక్షంలో ఉన్నన్నాళ్లూ రోడ్లు అధ్వానంగా ఉన్నాయంటూ గగ్గోలుపెట్టిన ఆయన అధికారంలోకి రాగానే రోడ్ల నిర్మాణం ముసుగులో అడ్డగోలు దోపిడీకి తెరతీశారు. దోపిడీ కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) విధానాన్ని తెరపైకి తెచ్చారు. తొలుత 27 రాష్ట్ర ప్రధాన రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను పీపీపీ విధానంలో నిర్మించేందుకు ఆమోదించారు.
తమ బినామీల నిర్మాణ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి.. రూ. 4 వేల కోట్లతో రోడ్లను నిర్మించి, ఆపై ఐదేళ్లలో రూ.12,500 కోట్లు టోల్ ఫీజుల వసూలు చేయనున్నారు. నికరంగా రూ. 8,500 కోట్లు కొల్లగొట్టేందుకు కుట్ర పన్నారు. రాష్ట్రంలో వాహనదారులపై భారీగా ఆర్థిక భారం మోపుతూ.. బినామీ కాంట్రాక్టర్ల రూపంలో వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు ముఖ్యనేత పన్నాగం ఇది.
రోడ్ల నిర్మాణ బాధ్యత నుంచి తప్పుకున్న ప్రభుత్వం
జాతీయ రహదారులను నిర్మించే కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇప్పటివరకు టోల్ ఫీజులను వసూలు చేస్తోంది. రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులను అన్ని రాష్ట్రాలు తమ ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్నాయి. ఇప్పుడు ఈ విధానానికి టీడీపీ కూటమి ప్రభుత్వం స్వస్తి పలికింది. పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమేరకు నిర్ణయించారు. అందుకోసం రాష్ట్రంలోని 27 రహదారులను ఎంపిక చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలోనూ చంద్రబాబు ఆ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మొదటగా 14 రోడ్లను నిర్మిస్తామన్నారు. అనంతరం మిగిలిన రోడ్ల నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఆరోడ్లపై వాహనదారుల నుంచి టోల్ వసూలు చేస్తామన్నారు. దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రహదారులను పీపీపీ విధానంలోనే నిర్మించాలన్నది టీడీపీ కూటమి ప్రభుత్వ ఉద్దేశం.
టోలుతో భారీ దోపిడీకి కుట్ర..
పీపీపీ విధానంలో 1,778 కి.మీ. ఉన్న 27 రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నామమాత్రంగా టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఆ రోడ్ల నిర్మాణ కాంట్రాక్టులను ముఖ్య నేత బినామీ, సన్నిహిత సంస్థలకే కట్టబెడతారన్నది బహిరంగ రహస్యం. గతేడాది ఆర్ అండ్ బి శాఖ కి.మీ.కు గరిష్టంగా రూ. 2 కోట్లు చొప్పున టెండర్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఆ రేట్ల ప్రకారం చూస్తే మొత్తం 1,778 కి.మీ.కు రూ. 3,556 కోట్లు ఖర్చవుతుంది. ఈ ఏడాదిలో మెటీరియల్ ధరలు కాస్త పెరిగాయని భావించినా మొత్తం మీద రూ. 4 వేల కోట్లకు మించదు.
జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) 2023–24లో వసూలు చేసిన టోల్ ఫీజుల నిష్పత్తిలో లెక్కిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న 1,778 కి.మీ. రోడ్ల నుంచి ఏడాదికి రూ. 2,500 కోట్ల వరకు టోల్ ఫీజుల రూపంలో వసూలు అవుతుంది. ఆ ప్రకారం ఐదేళ్లకు రూ. 12,500 కోట్లు టోల్ ఫీజుల రూపంలో వసూలు చేస్తారన్నది సుస్పష్టం. అంటే ముఖ్యనేత బినామీ సంస్థలు కేవలం రూ. 4 వేల కోట్లు వెచ్చించి.. ఐదేళ్ల పాటు టోల్ ద్వారా రూ. 12,500 కోట్లు వాహనదారుల నుంచి కొల్లగొట్టనున్నారు. నికరంగా ఐదేళ్లలో ముఖ్య నేత జేబులోకి రూ. 8,500 కోట్లు చేరనుంది.
వాహనదారులపై భారీ ఆర్థికభారం
పీపీపీ విధానంలో నిర్మించనున్న ఆ 27 రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై భారీ ఆర్థికభారం పడనుంది. ఆ మార్గంలో ప్రయాణించే ఆర్టీసీ బస్సుల నుంచి కూడా టోల్ ఫీజు వసూలు చేస్తారు. దాంతో ఆర్టీసీ చార్జీలు కూడా పెంచుతారు. వాహనదారులు ఆ విధంగా ఐదేళ్లలో ఏకంగా రూ.12,500 కోట్లు భరించాల్సి ఉంటుంది. అదే ఆ 27 రోడ్లను ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే ప్రజలపై టోల్ ఫీజుల భారం పడదు. నాబార్డ్ తదితర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని రోడ్లు నిర్మించవచ్చు. ప్రభుత్వం దశలవారీగా బ్యాంకు రుణాలను తీర్చవచ్చు. అలా చేస్తే ముఖ్యనేతకు ఏం ప్రయోజనం..? పీపీపీ విధానంలో తమ బినామీ కాంట్రాక్టు సంస్థల ద్వారా రోడ్లను నిర్మిస్తేనే కదా ఆయన జేబులు నిండేది.
పీపీపీ విధానంలో నిర్మించాలని నిర్ణయించిన రోడ్లు
1) కళింగపట్నం నుంచి శ్రీకాకుళం మీదుగా పార్వతీపురం
2) గార నుంచి ఆమదాలవలస మీదుగా బత్తిలి
3) చిలకపాలెం నుంచి రాజాం మీదుగా అంతర్రాష్ట్ర రాయగడ రోడ్
4) భీమునిపట్నం నుంచి చోడవరం మీదుగా తుని
5) విశాఖపట్నం నుంచి ఎస్.కోట మీదుగా అరకు
6) కాకినాడ – జొన్నాడ
7) రాజమహేంద్రవరం నుంచి మారేడుమిల్లి మీదుగా భద్రాచలం
8) అమలాపురం – బొబ్బర్లంక 9) రాజవరం – పొదలాడ
10) ఏలూరు – కైకలూరు
11) ఏలూరు నుంచి చింతలపూడి మీదుగా మేడిశెట్టివారిపాలెం
12) భీమవరం నుంచి కైకలూరు మీదుగా గుడివాడ
13) గుడివాడ – కంకిపాడు (విజయవాడ)
14) విజయవాడ నుంచి ఆగిరిపల్లి మీదుగా నూజివీడు
15) గుంటూరు – పర్చూరు,
16) నరసరావుపేట – సత్తెనపల్లి
17) వాడరేవు నుంచి నరసరావుపేట మీదుగా పిడుగురాళ్ల రోడ్
18) కావలి నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం రోడ్
19) నెల్లూరు – సైదాపురం రోడ్
20) గూడూరు నుంచి రాపూరు మీదుగా రాజంపేట రోడ్
21) మైదుకూరు – తాటిచెర్ల రోడ్
22) పులివెందుల నుంచి ధర్మవరం మీదుగా దమజిపల్లి రోడ్
23) చాగలమర్రి నుంచి వేంపల్లి మీదుగా రాయచోటి రోడ్
24) అనంతపురం నగరంలో రింగ్ రోడ్
25) సోమందేపల్లి నుంచి హిందూపూర్ బైపాస్ మీదుగా తుమకుంట
26) అనంతపురం – చెన్నై రహదారిలో కదిరి రింగ్ రోడ్
27) కాలవగుంట – పెనుమూరు నెండ్రగుంట రోడ్
Comments
Please login to add a commentAdd a comment