ఎక్స్‌ట్రా ‘ఫిట్టింగ్’ | Automobile showroom in the 'handling' exploitation | Sakshi
Sakshi News home page

ఎక్స్‌ట్రా ‘ఫిట్టింగ్’

Published Thu, Jul 7 2016 12:25 AM | Last Updated on Mon, Sep 4 2017 4:16 AM

ఎక్స్‌ట్రా ‘ఫిట్టింగ్’

ఎక్స్‌ట్రా ‘ఫిట్టింగ్’

ఆటోమొబైల్ షోరూమ్‌లలో ‘హ్యాండ్లింగ్’ దోపిడీ
తాత్కాలిక, పర్మినెంట్  రిజిస్ట్రేషన్‌లపై అదనపు వసూళ్లు
ఒక్కో వాహనంపై 
రూ.5000 చొప్పున అ‘ధనం’
పలు షోరూమ్‌లలో ఆర్టీఏ తనిఖీలు

సిటీబ్యూరో: వాహనదారులను ఆటోమొబైల్ షోరూమ్ నిర్వాహకులు అడ్డంగా దోచుకుంటున్నారు. రకరకాల  పేర్లతో  కొనుగోలుదారుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ‘హ్యాండ్లింగ్ చార్జీలు’,  ‘ఎక్స్‌ట్రా ఫిట్టింగ్స్’  పేరుతో  నిబంధనలకు విరుద్దంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికితోడు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్  ఫీజుల  రూపంలో భారీగా దండుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొనుగోలుదారులు ఫిర్యాదు చేయడంతో రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు  ఆర్టీఏ నిఘా  విభాగం  పలు  షోరూమ్‌లలో తనిఖీలు నిర్వహించగా, వివిధ రకాల చార్జీలు, సేవలు, అదనపు హంగుల పేరుతో ఒక్కో వాహనం నుంచి  రూ.5000  వరకు అదనంగా  వసూలు చేస్తున్నట్లు  వెల్లడయ్యింది. ఇదిలా ఉండగా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించే అధికారులు ఆ తరువాత  ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు.

 
దోపిడీ పర్వం ఇలా....

కాచిగూడ  ప్రాంతానికి చెందిన ఒక వినియోగదారుడు కొద్ది రోజుల క్రితం స్థానిక షోరూమ్‌లో  బైక్ కొనుగోలు చేశాడు. వాహనం ఖరీదు  రూ. 73 వేలు కాగా, హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో, ప్రాసెసింగ్ పేరుతో   మరో రూ.5000 కలిపి  మొత్తం  రూ.78 వేలు  వసూలు చేశారు. అయితే అతనికి ఇచ్చిన  ఇన్‌వాయీస్ కాపీలో  హ్యాండ్లింగ్ చార్జీలు  అనే పదం ఎక్కడా  కనిపించకపోగా, రిజిస్ట్రేషన్ చార్జీలు తీసుకున్నట్లు  రశీదు ఇచ్చారు. కానీ  ఆర్టీఏ ఖాతాలో ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో  రిజిస్ట్రేషన్ కోసం మరోసారి ఫీజు చెల్లించవలసి వచ్చింది.   దీనిపై బాధితుడు రవాణా కమిషనర్‌కు  ఫిర్యాదు చేశాడు.  నగరంలోని  పలు షోరూమ్‌లు ఈ తరహా దోపిడీకి పాల్పడుతున్నాయి.  రూ.60 వేల  బైక్ నుంచి  రూ. లక్షల ఖరీదు చేసే కార్ల వరకు ‘ హ్యాండ్లింగ్’ దోపిడీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు  వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ల పేరుతో రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ చార్జీ  రూ.వంద లోపే ఉండగా, పర్మినెంట్ రిజిస్ట్రేషన్  ఫీజు మరో రూ.650 ఉంటుంది. అయితే వీటికిగాను రూ.1500లకు పైగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.

 
ఆర్టీఏ  ప్రేక్షకపాత్ర....

గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ  కార్యాలయాల్లో  ప్రతి రోజు సగటున  600 కొత్త వాహనాలు నమోదవుతున్నాయి. వీటిలో   400 ద్విచక్ర వాహనాలు కాగా, మిగతా  200 కార్లు, ఇతర వాహనాలు. సుమారు 175  షోరూమ్‌ల  ద్వారా  ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట  వాహనం బుకింగ్ కోసం వెళ్లినప్పుడు   వాహనం  ఆన్‌రోడ్ ఖరీదు, జీవిత కాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. మాట వరుసకైనా  హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్ ఊసెత్తరు. వాహనం  కొనుగోలు    చేసేందుకు సిద్ధపడి   డబ్బులు  చెల్లించే  సమయంలో  ఈ చార్జీలు  తెర పైకి  వస్తాయి.దీంతో గత్యంతరం  లేక  వారు అడిగినంతా  చెల్లించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనాలు,  కార్ల పై  సగటున  రూ.5000 వసూలు చేస్తుండగా, లగ్జరీ కార్లపై ఇంకా ఎక్కువే ఉంటుంది. బాహటంగా ఈ దోపిడీ జరుగుతున్నా ఆర్టీ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement