Automobile showroom
-
పండక్కి కొత్త బండి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే కష్టమే. నచ్చిన బండి కోసం మరి కొద్ది నెలల పాటు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాయాల్సిందే. గ్రేటర్లో కొత్త వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ అందుకు తగినవిధంగా వాహనాల లభ్యత లేకపోవడంతో వేలాది మంది కొనుగోలుదార్లు ఇప్పటికే తమకు కావలసిన కార్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఇప్పటికిప్పుడు కొత్త కారు కొనుగోలు చేయడం కష్టమేనని ఆటోమొబైల్ షోరూమ్ డీలర్లు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో మధ్యతరగతి వేతన జీవులు కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగానూ, ఒక సంప్రదాయంగాను భావిస్తారు. ఈసారి కూడా అలాగే కొత్త వాహనాల కోసం ఆసక్తి చూపే వాళ్లకు నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్నా కనీసం ఐదారు నెలల పాటు ఆగాల్సిందేనని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లుగా వ్యక్తిగత వాహనాలకు గణనీయమైన డిమాండ్ నెలకొన్నది. కోవిడ్ దృష్ట్యా చిరుద్యోగులు మొదలుకొని మధ్యతరగతి వర్గాల వరకు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అందుకు తగిన విధంగా వాహనాలు మాత్రం దిగుమతి కావడం లేదు. దీంతో కొరత ఏర్పడింది. ఆగాల్సిందే... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. రవాణాశాఖలో ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కొత్త వాహనాలకు డిమాండ్‌కు పెరగడంతో నమోదయ్యే వాహనాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వ్యక్తిగత వాహనాల కేటగిరీలో అన్ని రకాల వాహనాలకు వెయిటింగ్ తప్పడం లేదు. హ్యూందాయ్, కియా, టయోటా, నెక్సాన్, మారుతి తదితర కంపెనీలకు చెందిన కార్ల కోసం 4 నుంచి 5 నెలల పాటు వెయిటింగ్ ఉంది. బాగా డిమాండ్ ఉన్న కొన్ని ప్రీమియం వాహనాలకు 6 నెలల వరకు కూడా డిమాండ్ నెలకొంది. ద్విచక్ర వాహనాలలో యూనికార్న్, హోండా యాక్టివా 125కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహనాలకు 3 నెలల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చునని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీపావళికి కూడా డిమాండ్ భారీగానే ఉండే అవకాశం ఉంది. చిప్స్ కొరతే కారణం... వాహనాల తయారీలో కీలకమైన సాఫ్ట్వేర్ చిప్స్ దిగుమతి తగ్గడం వల్లనే ఈ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. మలేసియా, తైవాన్, చైనాల నుంచి మన దేశానికి వాహనాల చిప్స్ దిగుమతి అవుతాయి. రెండేళ్లుగా కోవిడ్ వల్ల చైనా నుంచి చిప్స్ దిగుమతి తగ్గిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల డిమాండ్ పెరగడంతో మలేసియా, తైవాన్‌ల నుంచి సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో వాహనాల తయారీ కూడా మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘గత నెలతో పోలి్చతే ఈ నెలలో చిప్స్ కొరత కొంత వరకు తగ్గింది. దిగుమతి పెరిగింది. గతంలో 80 శాతం వరకు కొరత ఉండేది. ఇప్పుడు 40 శాతానికి తగ్గింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కావచ్చు’. అని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ తెలిపారు. (చదవండి: తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి) -
ఎక్స్ట్రా ‘ఫిట్టింగ్’
ఆటోమొబైల్ షోరూమ్‌లలో ‘హ్యాండ్లింగ్’ దోపిడీ తాత్కాలిక, పర్మినెంట్ రిజిస్ట్రేషన్లపై అదనపు వసూళ్లు ఒక్కో వాహనంపై రూ.5000 చొప్పున అ‘ధనం’ పలు షోరూమ్‌లలో ఆర్టీఏ తనిఖీలు సిటీబ్యూరో: వాహనదారులను ఆటోమొబైల్ షోరూమ్ నిర్వాహకులు అడ్డంగా దోచుకుంటున్నారు. రకరకాల పేర్లతో కొనుగోలుదారుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ‘హ్యాండ్లింగ్ చార్జీలు’, ‘ఎక్స్ట్రా ఫిట్టింగ్స్’ పేరుతో నిబంధనలకు విరుద్దంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. దీనికితోడు తాత్కాలిక రిజిస్ట్రేషన్లు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో భారీగా దండుకుంటున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కొనుగోలుదారులు ఫిర్యాదు చేయడంతో రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు ఆర్టీఏ నిఘా విభాగం పలు షోరూమ్‌లలో తనిఖీలు నిర్వహించగా, వివిధ రకాల చార్జీలు, సేవలు, అదనపు హంగుల పేరుతో ఒక్కో వాహనం నుంచి రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు వెల్లడయ్యింది. ఇదిలా ఉండగా ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించే అధికారులు ఆ తరువాత ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వాహన యజమానులు ఆరోపిస్తున్నారు. దోపిడీ పర్వం ఇలా.... కాచిగూడ ప్రాంతానికి చెందిన ఒక వినియోగదారుడు కొద్ది రోజుల క్రితం స్థానిక షోరూమ్‌లో బైక్ కొనుగోలు చేశాడు. వాహనం ఖరీదు రూ. 73 వేలు కాగా, హ్యాండ్లింగ్ చార్జీల పేరుతో, ప్రాసెసింగ్ పేరుతో మరో రూ.5000 కలిపి మొత్తం రూ.78 వేలు వసూలు చేశారు. అయితే అతనికి ఇచ్చిన ఇన్వాయీస్ కాపీలో హ్యాండ్లింగ్ చార్జీలు అనే పదం ఎక్కడా కనిపించకపోగా, రిజిస్ట్రేషన్ చార్జీలు తీసుకున్నట్లు రశీదు ఇచ్చారు. కానీ ఆర్టీఏ ఖాతాలో ఆ డబ్బులు జమ కాలేదు. దీంతో రిజిస్ట్రేషన్ కోసం మరోసారి ఫీజు చెల్లించవలసి వచ్చింది. దీనిపై బాధితుడు రవాణా కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. నగరంలోని పలు షోరూమ్‌లు ఈ తరహా దోపిడీకి పాల్పడుతున్నాయి. రూ.60 వేల బైక్ నుంచి రూ. లక్షల ఖరీదు చేసే కార్ల వరకు ‘ హ్యాండ్లింగ్’ దోపిడీ కొనసాగుతూనే ఉంది. మరోవైపు వాహనం తాత్కాలిక, శాశ్వత రిజిస్ట్రేషన్ల పేరుతో రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ చార్జీ రూ.వంద లోపే ఉండగా, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు మరో రూ.650 ఉంటుంది. అయితే వీటికిగాను రూ.1500లకు పైగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు. ఆర్టీఏ ప్రేక్షకపాత్ర.... గ్రేటర్‌లోని అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ప్రతి రోజు సగటున 600 కొత్త వాహనాలు నమోదవుతున్నాయి. వీటిలో 400 ద్విచక్ర వాహనాలు కాగా, మిగతా 200 కార్లు, ఇతర వాహనాలు. సుమారు 175 షోరూమ్‌ల ద్వారా ఈ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. మొదట వాహనం బుకింగ్ కోసం వెళ్లినప్పుడు వాహనం ఆన్‌రోడ్ ఖరీదు, జీవిత కాల పన్ను వివరాలను మాత్రమే వెల్లడిస్తారు. మాట వరుసకైనా హ్యాండ్లింగ్, ప్రాసెసింగ్ ఊసెత్తరు. వాహనం కొనుగోలు చేసేందుకు సిద్ధపడి డబ్బులు చెల్లించే సమయంలో ఈ చార్జీలు తెర పైకి వస్తాయి.దీంతో గత్యంతరం లేక వారు అడిగినంతా చెల్లించాల్సి వస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్ల పై సగటున రూ.5000 వసూలు చేస్తుండగా, లగ్జరీ కార్లపై ఇంకా ఎక్కువే ఉంటుంది. బాహటంగా ఈ దోపిడీ జరుగుతున్నా ఆర్టీ అధికారులు తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం.