అమలాపురం టౌన్ : శిరస్త్రాణం నిబంధన నుంచి ద్విచక్ర వాహనదారులకు కాస్త ఊరట లభించింది. హెల్మెట్ ధారణ తప్పనిసరంటూ నిబంధనలు విధించిన ప్రభుత్వం మూడు నెలలపాటు కాస్త చూసీచూడనట్టు వదిలేయాలని భావిస్తోంది. హెల్మెట్ ఆవశ్యకతపై వాహనచోదకులకు తొలుత కౌన్సెలింగ్ ఇవ్వాలని, ఆ తర్వాత జరిమానాలు విధించాలని రాష్ట్ర రవాణా శాఖ నిర్ణయించింది. హెల్మెట్ ధరించడంవల్ల వల్ల ప్రయోజనాలు తెలిసినప్పటికీ చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. హెల్మెట్ కొనుగోలు చేయటం, కాస్త బరువుతో ఉన్న దానిని వెంట తీసుకువెళ్లటం, హెల్మెట్ ధరిస్తే తల, ముఖానికి గాలి ఆడకపోవటంవంటి కొన్ని కారణాలతో వాహనదారులు దీనిపై అంతగా ఆసక్తి చూపడంలేదు. అయితే ఈ నిర్లక్ష్యమే రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు నిండు ప్రాణాలను బలి తీసుకుంటోంది.
వేచి చూసే ధోరణిలో..
వాస్తవానికి ఈ నెల ఒకటి నుంచి హెల్మెట్ తప్పనిసరి అని రవాణా అధికారులు, పోలీసులు చెప్పారు. వీటిని ధరించకపోతే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అయినప్పటికీ జిల్లాలోని దాదాపు 4 లక్షల మంది ద్విచక్ర వాహనదారుల్లో కేవలం 20 శాతం మంది మాత్రమే హెల్మెట్ సమకూర్చుకున్నారు. మిగిలిన 80 శాతం మందిలో ఇంకా కదలిక మొద లు కాలేదు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో హెల్మెట్ల దుకాణాలు అనేకం వెలిసినా అమ్మకాలు మాత్రం అంతగా లేవు. హెల్మెట్ల ధరలు తెలుసుకుని వెళుతున్నారే తప్ప కొనుగోలు చేయడం తక్కువగానే ఉంటోంది.
కౌన్సెలింగ్‌లతో చైతన్యం వచ్చేనా?
హెల్మెట్ల నిబంధన అమలుపై ఓ 15 రోజులపాటు చూసీ చూడనట్టు వదిలేయాలని, తరువాత కొరడా ఝుళిపించాలని జిల్లా పోలీసు యంత్రాగం భావించింది. ఈలోగా పలుచోట్ల పోలీసులు నిఘా వేసి మోటారు సైకిళ్లను ఆపి వాహనదారుల పేరు, వాహనం నంబరు నమోదు చేసుకుంటున్నారు. రెండు వారాల్లో హెల్మెట్ సమకూర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈసారి దొరికితే జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా మూడు నెలల పాటు జరిమానాల వంటి చర్యలు లేకుండా హెల్మెట్ ధారణ వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంచాలని రవాణా శాఖ సూచించింది. నవంబర్ ఒకటి నుంచి హెల్మెట్లు ధరించని వారికి జరిమానాలు విధించాలని ఆదేశాలు వచ్చాయి.
ఈ మూడు నెలల్లో ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్లు కొనుగోలు చేసుకునేలా అవగాహన కల్పించనున్నారు. ఇప్పటికే రెండు నెలల నుంచి హెల్మెట్లపై ప్రకటనలు, ప్రచారాలు చేస్తున్నా వాహనదారుల్లో కదలిక లేదు. ఇక మూడు నెలల గడువు, కౌన్సెలింగ్‌లతో వారిలో చైతన్యం తేవడం సాధ్యమవుతుందా అని కొందరు పోలీసులు ప్రశ్నిస్తున్నారు. జరిమానాలతో తరచూ వాహనాలు తనిఖీ చేస్తుంటే అందరిలో మార్పు రావటానికి కనీసం ఆరు నెలల సమయమైనా పడుతుందని ఓ పోలీసు అధికారి అన్నారు. ఏది ఏమైనా రవాణా, పోలీసు శాఖలు హెల్మెట్లపై ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గడువు 3 నెలలు
Published Tue, Aug 4 2015 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM
Advertisement
Advertisement