
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తి నివారణకు కట్టుదిట్టంగా ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిపై నగర పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించిన నేపథ్యంలో నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలనే ఆదేశాలను కొందరు బేఖాతరు చేస్తున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో నిబంధనలు పాటించకుండా బయటకు వచ్చిన వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు తమ లాఠీలకు పనిచెబుతున్నారు. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే లాఠీఛార్జ్ చేసైనా సరే లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశాల నేపథ్యంలో పోలీసు సిబ్బంది మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు.
(వైరస్ ఉగ్రరూపాన్ని చూస్తారు : డబ్ల్యూహెచ్‌ఓ)
రోడ్డెక్కిన వాహనాలు సీజ్..
తనిఖీలు చేస్తూ.. అనవసరంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేస్తూ వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. మహమ్మారి కరోనా వైరస్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో నివారణ కోసం రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ లేకుండా బయట తిరిగినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా కేసులు నమోదు చేయకతప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
(వారంలోనే వీరంగం)
పోలీసుల ఓవరాక్షన్
విధి నిర్వహణలో కొందరు పోలీసులు విచక్షణ కోల్పోయి.. ఓవరాక్షన్ చేస్తున్నారు. నగరంలోని చార్మినార్ మదీనా చౌరసా వద్ద జడ్జ్‌ఖాన నుంచి డెలివరీ అయిన మహిళను ఇంటి వద్ద దింపేందుకు వెళ్తున్న ‘102’ వాహనాన్ని చార్మినార్ ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు. వాహనంలో మహిళతో పాటు కుటుంబ సభ్యులు ఉండటంతో పోలీసులు అభ్యంతరం తెలిపారు. విషయం తెలిసి ఘటనాస్థలికి మీడియా ప్రతినిధులు చేరుకోవడంతో వెంటనే ‘102’ వాహనాన్ని అధికారులు పంపించివేశారు.