- ఆశీలు వసూలులో కాంట్రాక్టర్ నిర్వాకం
- రాజాం నగర పంచాయతీలో దందా
- నిత్య దోపిడీకి గురవుతున్న వ్యాపారులు, వాహనదారులు
- కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం
- దాంతో కలెక్టర్‌ను ఆశ్రయించిన స్థానికులు
రాజాం : కాంట్రాక్టర్ అత్యాశకు పోతున్నాడు. కమిషనర్ స్పందించడం లేదు. ఇంకేముంది.. వ్యాపారులు, వాహనాల యజమానులు నిత్యం దోపిడీకి గురవుతున్నారు. ఇదంతా రాజాం నగర పంచాయతీ పరిధిలో ఆశీలు వసూళ్లలో జరుగుతున్న తంతు. ఆశీలు కాంట్రాక్టర్ నకిలీ బిల్లులు ముద్రించి వాహనాలు, షాపుల నుంచి నిర్ణీత రేట్ల కంటే 100 నుంచి 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై నగర పంచాయతీ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు.
నగర పంచాయతీ మార్కెట్లలో షాపులు, వాహనాలు, వ్యాపారుల నుంచి రోజువారీ ఆశీలు వసూలుకు ప్రతి ఏటా వేలం పాట నిర్వహిస్తుంటారు. నగర పంచాయతీ ఏర్పాటైనప్పటి నుంచి రూ.6 లక్షల వరకు పాట వెళ్లేది. అయితే ఆదాయం పెంచుకోవాలన్న ఉద్దేశంతో అధికారులు పార్కింగ్, షాపుల ఫీజులను 100 నుంచి 150 శాతం వరకు పెంచి 2015-16 ఆర్థిక సంవత్సరానికి ఆశీలు వేలం నిర్వహించారు. పట్టణానికి చెందిన ముతికి వెంకట్రావు అనే వ్యక్తి రూ.15 లక్షలకు ఆశీలు కాంట్రాక్టు చేజిక్కించుకున్నారు.
ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి వర్తక, వ్యాపార సముదాయాలు, వాహనదారుల నుంచి ఆశీలు వసూలు ప్రారంభించారు. అయితే నగర పంచాయతీ గెజిట్‌లో పేర్కొన్న రేట్ల ప్రకారమే వసూలు చేయాల్సి ఉండగా.. నిబంధనలకు విరుద్ధంగా అంతకు రెండుమూడు రెట్లు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇందుకోసం నకిలీ రసీదులు ముద్రించారు. రసీదులపై నగర పంచాయతీ సీలు తప్పనిసరిగా ఉండాలి. కానీ ఈయన ఇస్తున్న రసీదులపై దొంగ ముద్రలు కనిపిస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఒక లారీకి గెజిట్ ప్రకారం రూ.83 ఆశీలు వసూలు చేయాల్సి ఉండగా.. కాంట్రాక్టర్ రూ.200 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు డ్రైవర్లు రసీదులు కూడా చూపించారు. అదేవిధంగా షాపులు, ఇతర తోపుడు బళ్లు, చిరువ్యాపారుల నుంచి నిర్ణీత ఫీజు కంటే 200 శాతం అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
తమ సంపాదనే తక్కువని.. అందులోనూ దోపిడీకి పాల్పడితే తామెలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తీరుకు నిరసనగా పారంకోటి సుధ, ఆశపు సూర్యం, పల్ల అప్పలనాయుడు, వంజరాపు రాము తదితరులు ఇటీవల నగర పంచాయతీ కమిషనర్ సింహాచలాన్ని కలిసి పిర్యాదు చేశారు. దీన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని కమిషనర్ వారికి చెప్పారు. అయినా వసూళ్లు ఆగకపోవడంతో బాధితులు మంగళవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
నకిలీ రసీదులు.. రెట్టింపు వసూళ్లు!
Published Thu, Apr 23 2015 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement
Advertisement