
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దుకు హైకోర్టు నిరాకరించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ.. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌ను గతంలో సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. వైఎస్ జగన్ బెయిల్ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నారన్న సీబీఐ వాదనతో కోర్టు ఏకీభవించింది.
అయితే సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. రఘురామకృష్ణంరాజు హైకోర్టును ఆశ్రయించారు. జగన్‌పై ఉన్న చార్జిషీట్లపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని, ఆయన బెయిల్ రద్దు చేసి సీబీఐ విచారణ త్వరితగతిన జరిగేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం విచారణ చేపట్టారు. వైఎస్ జగన్ అధికార పదవిని దుర్వినియోగం చేస్తున్నారనడానికి ఎలాంటి సాక్ష్యాలను పిటిషనర్ చూపలేదని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు.
ఆయన బెయిల్ షరతులను ఉల్లంఘించిన ఒక్క సందర్భం కూడా లేదన్నారు. వాదనలు విన్న సీజే.. సీబీఐ న్యాయవాది వాదనలతో ఏకీభవిస్తూ, బెయిల్ రద్దు చేయాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించారు. రఘురామకృష్ణంరాజు పిటిషన్‌ను కొట్టివేశారు.