‘అరబిందో’ నిత్యానందరెడ్డికి మినహాయింపు
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి అరబిందో ఎండీ కె.నిత్యానందరెడ్డికి హైకోర్టు మినహాయింపునిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. జడ్చర్ల సెజ్‌లో భూకేటాయింపులకు సంబంధించి అరబిందో కంపెనీలు, ఆ సంస్థ ఎండీ నిత్యానందరెడ్డిపై సీబీఐ కేసు నమోదు చేయడం తెలిసిందే. దీనిపై ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ప్రతీ శుక్రవారం జరిగే విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి వస్తోంది.
ఈ నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ అరబిందో కంపెనీలు, నిత్యానందరెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం విచారణ సందర్భంగా న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాపార కార్యకలాపాల నిమిత్తం దేశవిదేశాలు తిరిగాల్సి వస్తోందని, ప్రతీ శుక్రవారం విచారణకు హాజరవ్వాల్సి ఉన్న నేపథ్యంలో కీలక సమావేశాల్ని అర్ధాంతరంగా ముగించుకోవాల్సి వస్తోందని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో.. వ్యక్తిగత హాజరు నుంచి నిత్యానందరెడ్డికి మినహాయింపునిచ్చారు.
కోటేశ్వరరావు, రాజగోపాల్‌లకు కూడా...
ఇందూటెక్ జోన్‌కు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న ఆడిటర్ సి.వి.కోటేశ్వరరావుకూ సీబీఐ ప్రత్యేక కోర్టులో జరుగుతున్న విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించింది. సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలన్న కోటేశ్వరరావు పిటిషన్‌పై శుక్రవారం వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో.. వ్యక్తిగత హాజరు నుంచి ఆయనకు మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. మరోవైపు జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో దాల్మియా సిమెంట్స్‌కు చేసిన భూకేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న అప్పటి గనులశాఖ అధికారి వి.డి.రాజగోపాల్‌కు సైతం సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి వ్యక్తిగత హాజరు నుంచి న్యాయమూర్తి మినహాయింపునిచ్చారు.